వైద్య విద్యకోసం ఇరాన్ వెళ్తున్న ఇండియన్స్.. ఎందుకో తెలుసా?

డాక్టర్ కోర్సు చదువుకోవాలనుకునే వాళ్లలో.. చాలామంది మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తారనే విషయం అందరికీ తెలిసిందే. జాబితాలో ఇరాన్ కూడా ఉంది. ఇరాన్‌కు వెళ్లి.. చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇండియన్ స్టూడెంట్స్.. ఇరాన్ వెళ్లి చదువుకోవడానికి కారణం ఏమిటి?, ఇతరత్రా సమాచారం ఈ కథనంలో వివరంగా..

కారణాలు

భారతీయ విద్యార్థులు ఇరాన్ వెళ్లి చదువుకోవడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా..
➤తక్కువ ఫీజులు
➤లివింగ్ కాస్ట్ కొంత తక్కువగా ఉండటం
➤డిగ్రీలకు మంచి గుర్తింపు
➤ఇంగ్లీష్ చెప్పే కార్యక్రమాలు ఎక్కువగా ఉండటం
➤బలమైన విద్య, వైద్య సదుపాయాలు
➤ఎక్కువ సేఫ్టీ
➤స్కాలర్‌షిప్‌లు, ఆర్ధిక సహాయం

మన దేశంలో డాక్టర్ కోర్సు చేయాలంటే నీట్ వంటి కఠినమైన పరీక్షల్లో ర్యాంక్ తెచ్చుకోవాలి. ఆ తరువాత మంచి కాలేజీలో సీటు తెచుకోవాలంటే.. ఫీజులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు సైత ఇరాన్ వెళ్లి చదువుకుంటున్నారు అంటే.. అక్కడ సదుపాయలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇరాన్ దేశానికి వెళ్లి చదువుకోవడానికి మరో కారణం భారత్ & ఇరాన్ మధ్య సంస్కృతిక, చారిత్రక సంబంధాలు బలంగా ఉండటమే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దేశంలో 1500 నుంచి 2000 మంది భారతీయులు వైద్య విద్య అభ్యసిస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా ఇతర దేశాల్లో చదువుకుంటే.. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ కారణం చేత కూడా భారతీయ విద్యార్థులు ఇరాన్ వంటి దేశాలకు తరలివెళ్తున్నారు.

సమస్యగా మారిన యుద్ధం

గత శనివారం నుంచి ఇజ్రాయెల్.. ఇరాన్ మధ్య యుద్ధం మొదలైపోయింది. పరిస్థితి ప్రస్తుతం చాలా తీవ్రమైపోయింది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. యుద్ధం చదువును మాత్రమే కాకుండా.. జీవితాలను సైతం ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది.

టెహ్రాన్ వంటి నగరాల్లో ఉంటున్న భారతీయ విద్యార్థులు భయం గుప్పెట్లో ఉన్నారు. వీరి భద్రత ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. యుద్ధం కారణంగా వీరు నగరంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. కనీస సెమిస్టర్ పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలకు సైతం హాజరుకాలేకపోతున్నారని సమాచారం. యుద్ధం తమ చదువుకు ఆటంకం కలిగిస్తోందని వాపోతున్నారు. పరీక్షలు ఆలస్యమైతే.. మొత్తం సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందేమో అని ఆందోళన చెందుతున్నారు.

భారత ప్రభుత్వం చర్యలు

ఇరాన్ దేశంలో కొన్ని మెడికల్ యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేయలేదని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థులు పరీక్షలకు ఎలా హాజరవ్వాలో ప్రశ్నార్ధకం అయిపోయింది. పరీక్ష రాయడానికి బయటకు వెళ్లాలా?, ప్రాణాలు కాపాడుకోవడానికి ఉన్న చోటే ఉండాలా? అనేది తెలియకుండా అయిపోతోంది. బహుశా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందని భావిస్తున్నాము. కాగా ఇలాంటి సమయంలో.. విద్యార్థులను, ప్రజలను మనదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.

యుద్దానికి తెర ఎప్పుడు

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దానికి తెరపడాలని.. ప్రపంచంలోని చాలా దేశాలు కోరుకుంటున్నాయి. యుద్ధాలవల్ల అపార నష్టం తప్ప ప్రయోజనం ఎక్కువగా కనిపించదు. కాబట్టి సమస్యలను ప్రశాంతంగా చర్చించుకుంటే పరిష్కారం లభిస్తుంది. భారతదేశంలో కూడా.. ఇరు దేశాలు సంయమనం పాటించాలని, శాంతిని కాంక్షించింది. మొత్తం మీద ఈ యుద్దానికి త్వరలోనే తెరపడే అవకాశం ఉందని సమాచారం.