హైదరాబాద్ నగరంలో ప్రయాణ సౌకర్యాల మెరుగుదలకు మరో కీలక అడుగు పడుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మాణానికి సంబంధించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ ప్రాజెక్టు అమలు అయితే మెట్రో నుంచి దిగిన ప్రయాణికులు నేరుగా రైల్వే స్టేషన్‌లోకి చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు ఇది ఒక స్థిరమైన పరిష్కారంగా మారనుందని భావిస్తున్నారు.
అమృత్ భారత్ పథకం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించే పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా స్కైవాక్ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మల్టీమోడల్ కనెక్టివిటీ లక్ష్యంగా ఈ స్కైవాక్ రూపుదిద్దుకుంటోంది. మెట్రో, బస్సు, రైల్వే మధ్య సరళమైన అనుసంధానం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
ప్రయాణికులకు ఉపశమనం
ప్రస్తుతం సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలంటే ప్రయాణికులు సుమారు అర కిలోమీటర్ నడవాల్సి వస్తోంది. ఇది ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో ప్రయాణించే వారికి ఇబ్బందిగా మారుతోంది. స్కైవాక్ నిర్మాణం పూర్తయితే ఈ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. మెట్రో నుంచి దిగగానే నేరుగా స్కైవాక్ ద్వారా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లవచ్చు.
అలాగే రైల్వే స్టేషన్‌లో దిగిన ప్రయాణికులు కూడా బయటకు వచ్చాక ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా నేరుగా మెట్రో లేదా బస్టాండ్‌కు చేరుకోవచ్చు. దీంతో సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా మారింది.
నిర్మాణ వివరాలు..
సుమారు 120 మీటర్ల పొడవుతో ఈ స్కైవాక్ నిర్మాణం జరగనుంది. రేతిఫైల్ సిటీ బస్ స్టేషన్ వెనుక భాగంలో దీన్ని నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ (HMR) నుంచి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి ముందు ఆర్టీసీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అవసరం ఉంది.
ప్రస్తుతం ఈ అనుమతుల విషయంలో కొంత ఆలస్యం జరుగుతోంది. పలుమార్లు సమావేశాలు జరిగినప్పటికీ ఇంకా స్పష్టమైన నిర్ణయం రాలేదు. ఆర్టీసీ నుంచి అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కాచిగూడ ప్రాజెక్ట్ కూడా..
ఇక కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కూడా ఇదే విధంగా కొనసాగుతున్నాయి. అక్కడ అభివృద్ధి పనుల కోసం టీజీఎస్‌ఆర్టీసీకి చెందిన 2.77 ఎకరాల భూమిని రైల్వేశాఖ కోరుతోంది. బస్ డిపోను ఇతర ప్రాంతానికి తరలించి ఆ భూమిని ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టినా ఇప్పటివరకు ఆర్టీసీ నుంచి స్పందన రాలేదు.
దీంతో సికింద్రాబాద్, కాచిగూడ రెండు ప్రాజెక్టులు కూడా అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ లభిస్తే ఈ అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయి.
అనుకున్న విధంగా.. ఈ రెండు స్టేషన్లు పూర్తిగా ఆధునీకరణకు నోచుకుంటే.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనికి సంబందించిన చాలా సమాచారం తెలియాల్సి ఉంది.
Also read:BJPలోకి మల్లారెడ్డి కోడలు?: క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

మహేష్ – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో రెండు సంవత్సరాలుగా సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వార్తలు రాయడంలో అనుభవం ఉంది. జర్నలిజం రంగంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం కలిగిన నేను.. క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగి ఉన్నాను.
