Preethi Reddy BJP Office Visit: తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేత మల్లారెడ్డి కుటుంబ సభ్యురాలు ప్రీతి రెడ్డి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆమె ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi)పై ప్రశంసలు కురిపించడం, బీజేపీ విధానాలపై సానుకూల వ్యాఖ్యలు చేయడం ఈ సందర్శనకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.
ప్రీతిరెడ్డి (preethi reddy)శుక్రవారం బీజేపీ కార్యాలయానికి వెళ్లి సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకోవడంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం వేగంగా వ్యాపించింది. అయితే ఈ ఊహాగానాలకు ప్రీతిరెడ్డి స్వయంగా చెక్ పెట్టారు.
ఇటీవలి కాలంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ప్రముఖ నేతల కుటుంబ సభ్యుల కదలికలు కూడా కీలకంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్(brs), కాంగ్రెస్(congress), బీజేపీ (bjp)మధ్య పోటీ పెరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి.
ఊహాగానాలకు చెక్.. ప్రీతి రెడ్డి క్లారిటీ!
ప్రీతి రెడ్డి తన భేటీపై స్పందిస్తూ అన్ని ప్రచారాలను ఖండించారు. “మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాం. అందుకే బీజేపీ నేతలను కలుస్తున్నాం” అని ఆమె తెలిపారు. అంతేకాకుండా, ఇది కేవలం బీజేపీకి మాత్రమే పరిమితం కాదని కూడా ఆమె స్పష్టం చేశారు. “మేము అన్ని పార్టీల నేతలను కలుస్తున్నాం. ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబును కూడా కలిశాం. ఇది పూర్తిగా విద్యా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం మాత్రమే” అని వివరించారు.
ప్రీతి రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో లేనని చెప్పారు. “నేను బీజేపీలో చేరడం లేదు. మల్లారెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. మాకు బీఆర్‌ఎస్‌పై గౌరవం ఉంది” అని స్పష్టం చేశారు.
ఏఐ క్యాంపస్ ప్రాజెక్ట్!
ఈ మొత్తం వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్‌లో ప్రారంభంకానున్న భారీ ఏఐ క్యాంపస్ ప్రాజెక్ట్. ఈ క్యాంపస్‌ను గూగుల్‌తో కలిసి ఏర్పాటు చేయాలని యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇది కేవలం ఒక విద్యా సంస్థ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, దేశంలోనే తొలి డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్‌గా రూపుదిద్దుకోనుంది. అంతేకాకుండా, ఆసియాలోనే అతిపెద్ద ఏఐ క్యాంపస్‌గా నిలవబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం సహజమేనని మల్లారెడ్డి కుటుంబం చెబుతోంది.
మల్లారెడ్డి స్పందన – రాజకీయాలపై క్లారిటీ
ఇటీవల మల్లారెడ్డి(Malla Reddy) కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలవడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామంతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే.. మల్లారెడ్డి ఈ వార్తలను ఖండిస్తూ, అది పూర్తిగా విద్యా కార్యక్రమానికి సంబంధించిన భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు. “ఏఐ క్యాంపస్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించాం” అని ఆయన మీడియాకు తెలిపారు.
రాజకీయ ప్రాధాన్యం!
ప్రీతిరెడ్డి(Preethi Reddy BJP Office Visit) బీజేపీ కార్యాలయ సందర్శన తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు నాంది పలికింది. ముఖ్యంగా ”బీఆర్‌ఎస్ నేతల కుటుంబ సభ్యులు ఇతర పార్టీలతో సంబంధాలు పెంచుకుంటున్నారా?, భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో మార్పులు వస్తాయా?, విద్యా రంగం పేరుతో రాజకీయ సంబంధాలు బలపడుతున్నాయా?, వంటివి ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల్లో చర్చకు దారితీస్తున్నాయి.
అయితే ప్రస్తుతానికి ఇది కేవలం విద్యా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం మాత్రమేనని స్పష్టమవుతోంది. ప్రీతిరెడ్డి వ్యాఖ్యలు కూడా అదే దిశగా ఉన్నాయి.
Also Read:
Tamil Nadu Elections 2026: తమిళనాట గెలిచేదెవరో.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం?

మహేష్ – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో రెండు సంవత్సరాలుగా సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వార్తలు రాయడంలో అనుభవం ఉంది. జర్నలిజం రంగంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం కలిగిన నేను.. క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగి ఉన్నాను.
