డబ్బు విలువ: పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలా..

చిన్న పిల్లలకు అడిగింది తల్లిదండ్రులు వెంటనే కొనివ్వకుండా.., అది ఎందుకు?, దానివల్ల నీకు ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నలు వేయాలి. ఇవే వారికి డబ్బును ఎలా పొదుపు చేయాలో నేర్పిస్తాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో..

చిన్న పిల్లల పెంపకం విధానంలో.. క్రమక్రమంగా చాలా మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. చదువు, టెక్నాలజీ, స్కిల్స్‌ వంటి అంశాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా.. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో మాత్రం చాలామంది ఇంకా పెద్దగా దృష్టి పెట్టడం లేదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించడం మాత్రమే కాదు.. సంపాదించిన డబ్బును ఎలా వినియోగించాలి? ఎలా పొదుపు చేయాలి? అవసరం లేని ఖర్చులను ఎలా తగ్గించాలి? అనే విషయాలు కూడా చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

ఇప్పటి కాలంలో పిల్లలు చిన్న వయసులోనే ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ పేమెంట్స్‌, గాడ్జెట్స్‌ వంటి వాటికి అలవాటు పడుతున్నారు. అయితే డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, ఖర్చు చేయడంలో ఎంత బాధ్యత అవసరమో చాలా మందికి అర్థం కావడం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పేరెంట్స్‌ పిల్లలు అడిగిన ప్రతి వస్తువును వెంటనే కొనివ్వడం వల్ల డబ్బు విలువ తెలియకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పిల్లలకు చిన్నప్పటి నుంచే “ఇది నిజంగా అవసరమా? లేక కేవలం కోరిక మాత్రమేనా?” అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి అంటున్నారు నిపుణులు. చాలా మంది చిన్నారులు ఫ్యాషన్‌, గేమ్స్‌, గాడ్జెట్స్‌ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాలని చూస్తుంటారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు వారితో మాట్లాడి ఖర్చుల ప్రాధాన్యతను వివరించాలి.

ఉదాహరణకు.. పిల్లలు ఏదైనా వస్తువు కొనమని అడిగితే వెంటనే కొనివ్వకుండా.. “ఇది ఎందుకు కావాలి?”, “ఇది లేకపోతే ఏమవుతుంది?” వంటి ప్రశ్నలు అడగాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆలోచించే అలవాటు పెరుగుతుంది. డబ్బు ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉండటం ప్రారంభిస్తారు.

కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ఆనందం కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ అదే అలవాటు భవిష్యత్తులో అనవసర ఖర్చులకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవసరానికి మించి ఖర్చు చేసే అలవాటు పెరిగితే తర్వాత అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు.

చాలా ఇళ్లలో డబ్బు, ఖర్చులు, పొదుపు వంటి విషయాలను పిల్లల ముందు మాట్లాడటానికి పెద్దలు ఇష్టపడరు. అయితే అదే పెద్ద తప్పిదమని నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో జరిగే సాధారణ ఆర్థిక చర్చల్లో పిల్లలను కూడా భాగం చేయాలి అంటున్నారు.

ఇంటి ఖర్చులు ఎలా ప్లాన్‌ చేస్తారు? నెలసరి బడ్జెట్‌ ఎలా ఉంటుంది? విద్యుత్‌, కిరాణా, ఫీజులు వంటి ఖర్చులను ఎలా నిర్వహిస్తారు? వంటి విషయాలను సింపుల్‌గా వివరించాలి. ఇలా చేస్తే పిల్లలకు డబ్బు నిర్వహణపై అవగాహన పెరుగుతుంది.

ముఖ్యంగా అమ్మాయిలకు కూడా ఆర్థిక విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోవాలంటే చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ అవసరమని చెబుతున్నారు. పిల్లలకు చిన్న మొత్తంలో పాకెట్‌మనీ ఇవ్వడం కూడా మంచి అలవాటే అంటున్నారు. అయితే ఆ డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు? ఎంత సేవ్‌ చేస్తున్నారు? అనే విషయాలను కూడా గమనించాలి. ఇలా చేస్తే పొదుపు అలవాటు సహజంగా పెరుగుతుంది.

డబ్బు సులభంగా రాదనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చేయడం చాలా ముఖ్యం. ఇంట్లో వారు చేయగలిగే చిన్న చిన్న పనులను అప్పగించి.. సరిగా పూర్తి చేస్తే చిన్న మొత్తంలో రివార్డ్‌ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు గది సర్దుకోవడం, పుస్తకాలు అమర్చడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటి పనులకు చిన్న ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చు. దీంతో పని చేస్తేనే ఫలితం వస్తుందనే విషయం పిల్లలకు అర్థమవుతుంది. డబ్బు వెనుక ఉన్న కష్టం కూడా తెలిసి వస్తుంది.

ప్రస్తుతం చాలామంది యువత ఉద్యోగం వచ్చిన వెంటనే అధిక షాపింగ్‌, క్రెడిట్ కార్డుల వినియోగం వంటి అలవాట్లకు లోనవుతున్నారు. తర్వాత అదే ఆర్థిక ఒత్తిడికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పొదుపు, పెట్టుబడుల గురించి చిన్నప్పటి నుంచే పరిచయం చేయాలని సూచిస్తున్నారు.

పిల్లలు కొంత పెద్దవారయ్యాక చిన్న మొత్తాల్లో సేవింగ్స్‌, పెట్టుబడులపై అవగాహన కల్పించాలి. బ్యాంక్ అకౌంట్‌, సేవింగ్స్‌, డిజిటల్ పేమెంట్స్‌ వంటి విషయాలను ప్రాక్టికల్‌గా చూపిస్తే త్వరగా నేర్చుకుంటారని చెబుతున్నారు. చదువు ఎంత ముఖ్యమో.. డబ్బు విలువ తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్న వయసులోనే Financial Lessons for Childrens పై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులుగా ఎదుగుతారని అభిప్రాయపడుతున్నారు.

Also read: వేసవిలో కళ్ల మంటలకు ఉపశమనం: ఇవిగో చిట్కాలు!

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ - నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆటోమొబైల్, లైఫ్ స్టైల్ విభాగాల్లో అత్యంత ప్రావీణ్యం కలిగి ఉంది. ఈ విభాగాల్లో యూజర్లకు అవసరమైన అన్ని వార్తలను సమగ్రంగా అందిస్తాను. నాకు జర్నలిజం రంగంలో 8 సంవత్సరాల అనుభవం ఉంది.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles