వినాయక చవితి రోజు ఈ పనులు అస్సలు చేయకండి: తప్పకుండా పాటించాల్సిన నియమాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వినాయక చవితి వచ్చేసింది. అయితే ఇప్పుడు చాలామందిలో వినాయక చవితి ఆగస్టు 26న జరుపుకోవాలా?, లేక ఆగస్టు 27న జరుపుకోవాలా అనే అనుమానం పుట్టింది. అనుమానానికి.. ఓ మంచి సమాధానం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

వినాయక చవితి భాద్రపద మాసంలో చవితి రోజున జరుపుకుంటారు. శివ, పార్వతుల తనయుడు వినాయకుడి పుట్టినరోజునే.. హిందువులు పండుగగా (వినాయక చవితి) జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. చవితి లేదా చతుర్థి తిథి ఆగస్టు 26 (మంగళవారం) మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 27 (బుధవారం) మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది.

గణేష్ చతుర్థి పూజా సమయం

వినాయకుని పూజకు శుభముహూర్తం బుధవారం ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు అని పంచాంగాలు చెబుతున్నాయి. అంటే ఈ సారి గణేష్ మహారాజుకు పూజను బుధవారం మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత నిమజ్జనం.. ప్రాంతాలను బట్టి వేరువేరుగా ఉన్నప్పటికీ.. సంప్రదాయంగా 10 రోజులు ఉత్సవాలు జరిపి సెప్టెంబర్ 6 (శనివారం) నిమజ్జనం చేస్తారు.

ఇతర నగరాల్లో గణేష్ చతుర్థి పూజా ముహూర్తం

  • హైదరాబాద్: ఉదయం 11:02 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు
  • బెంగళూరు: ఉదయం 11:07 నుంచి మధ్యాహ్నం 1:36 వరకు
  • చెన్నై:ఉదయం 10:56 నుంచి మధ్యాహ్నం 1:25 వరకు
  • ఢిల్లీ: ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు

వినాయక చవితి నాడు చేయకూడని పనులు

చంద్రుణ్ణి చూడొద్దు: సాధారణంగా వినాయక చవితి రోజు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతాయి. అలాంటి పనులలో ఒకటి వినాయక చతుర్థి రోజు చంద్రుణ్ణి చూస్తే అశుభమని భావిస్తారు. చంద్రుణ్ణి చూడటం వల్ల అనవసరమైన నిందలు పడతాయి. ”ఒకసారి గజముఖుడైన వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడట, పార్వతీదేవికి కోపం వచ్చి.. శపించింది. అందుకే గణేష్ చతుర్థి రోజు చంద్రుణ్ణి చూడకూడదంటారు”.

విరిగిన వినాయకుడి ప్రతిమను తీసుకోవద్దు: వినాయక చవితిరోజు ఊరూ, వాడా, పల్లె, పట్టణాల్లో వినాయకుని విగ్రహాలు పెడతారు. అయితే విరిగిన వినాయకుడి ప్రతిమను తీసుకుని రాకూడదని శాస్త్రం చెబుతోంది. విరిగిన వినాయకుడిని పూజిస్తే అశుభమని చెబుతారు.

మద్యం, మాంసం ముట్టొద్దు: వినాయక చవితి రోజుగానీ.. ఆ తరువాత నిమజ్జనం చేసేవరకు కూడా మాంసాహారం తినకూడదు. పది రోజులు భక్తితో వినాయకుడిని పూజిస్తే.. అనుకున్న కోరికలు తీరుతాయని చెబుతారు. వినాయకుడికి కూడా స్వచ్ఛమైన పదార్థాలనే నైవేద్యంగా సమర్పించాలి.

పూజకు తులసి ఉపయోగించొద్దు: తులసి చాలా పవిత్రమైనదే అయినప్పటికీ.. వినాయకుడి పూజకు మాత్రం నిషిద్ధం. మత గ్రంధాల ప్రకారం.. తులసి వినాయకుడి పెళ్లి ప్రతిపాదన తిరస్కరించడమే కాకుండా.. ఆయనను శపించింది. దీంతో కోపగించుకున్న గణపతి.. నా పూజకు తులసి నిషిద్ధమని ప్రతిశాపమిస్తాడు. అందువల్ల.. వినాయకుడికి గడ్డితోనే పూజిస్తారు.

విగ్రహాల సంఖ్యలో జాగ్రత్త: వినాయకుడి విగ్రహం ఒకటి ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇతర దేవతా మూర్తుల విగ్రహాలు కూడా ఉంటే, వినాయకుడికి పక్కన ఉంచాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ.. ఎదురెదురుగా ఉంచకూడదు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

నలుపు దుస్తులు ధరించొద్దు: వినాయకుడిని పూజించే సమయంలో నలుపు, నీలం రంగు దుస్తులు ధరించకూడదు. ఈ రంగులు అశుభ సూచకం అని పెద్దలు విశ్వసిస్తారు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు శుభప్రదం. ఈ రంగులు సానుకూల ఫలితాలను ఇస్తాయని చెబుతారు.

పటించాల్సిన మంత్రం: వినాయక చవితి రోజు భక్తులు 21 దర్భలతో, పండ్లు, పూలతో సేవించాలి. కుడుములు, లడ్డులు వంటివి నైవేద్యంగా సమర్పించాలి. ”ఓం గం గణపతయే నమః” అనే మంత్రాన్ని పటించడం వల్ల.. సకల శుభాలు జరుగుతాయి. వినాయక చవితిని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే.. ఆ లంబోదరుడి కృప ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది.

Leave a Comment