చాలామంది సంక్రాంతికి కొత్తకారు కొనాలని చూస్తుంటారు. అయితే అలాంటి వాళ్లకు బహుశా ఇది బాధాకరమైన విషయమే. ఎందుకంటే.. జనవరి 1నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇన్‌పుట్ ఖర్చులు, లాజిస్టిక్ ఖర్చులు, కరెన్సీ ఒత్తిళ్ల కారణంగా.. కార్ల ధరలు పెరగనున్నట్లు తయారీదారులు స్పష్టం చేశారు. ఇంతకీ ఈ కార్ల ధరలు పెరగనున్నాయి?, ఎంత పెరగనున్నాయి?, అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
హోండా ఎలివేట్
2026 జనవరి నుంచి ఎలివేట్ కారు ధరలతో పాటు.. దాదాపు అన్ని మోడల్ రేట్లను హోండా కంపెనీ పెంచనున్నట్లు ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. ఏ కారు ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. కానీ కొత్త ఏడాది ప్రారంభంలో కొత్త ధరలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది. దీంతో.. కంపెనీ అమ్మకాలు పెరగడంలో దోహదపడుతున్న ఎలివేట్ ధరలు కొంత పెరగనున్నాయి. ధరలు పెరగడం వల్ల.. అమ్మకాలు ఏమైనా తగ్గుతాయా అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఎంజీ హెక్టర్
మోరిస్ గ్యారేజ్ (ఎంజీ) మోటార్స్ కంపెనీ కూడా తన పోర్ట్‌ఫోలియోలోని దాదాపు అన్ని వాహనాల (పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలకు) ధరలను 2 శాతం పెంచనుంది. ఈ ప్రభావం ఎంజీ హెక్టర్ కారుమీద కూడా పడుతుంది. కాబట్టి దీని ధర ఒకింత పెరిగే అవకాశం ఉంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల.. రేట్లు పెరుగుతున్నట్లు సంస్థ వెల్లడించింది.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ
జర్మనీ కార్ల తయారీ సంస్థ.. మెర్సిడెస్ బెంజ్ కూడా తన కార్ల ధరలను రెండు శాతం వరకు పెంచనుంది. పెరిగే ధరలు జనవరి 1నుంచే అమలులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. కొత్త ధరలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. కాబట్టి.. జనవరి 1నుంచి 2 శాతం ధరలు పెరిగినప్పటికీ.. కొనుగోలుదారులపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
బీఎండబ్ల్యు ఎక్స్1
ఈ కంపెనీ 2025 సెప్టెంబర్‌లోనే ఒకసారి ధరలను పెంచింది. ఇప్పుడు తాజాగా మరోసారి 2026 జనవరి 1నుంచే ధరల పెంపుకు శ్రీకారం చుట్టింది. కాబట్టి బ్రాండ్ యొక్క అన్ని మోడల్ ధరలు పెరగనున్నాయి. ధరల పెంపు ప్రభావం.. ఎక్స్ 1 కారు మీద కూడా పడుతుంది. అంటే.. దీని ధర కొంత పెరుగుతుంది. పెరిగిన మెటీరియల్ ఖర్చులు, ఇతర ఖర్చుల కారణంగా.. ధరలను పెంచడం జరిగిందని బీఎండబ్ల్యూ వెల్లడించింది.
నిస్సాన్ మాగ్నైట్
మాగ్నైట్ ధరలు కూడా 3 శాతం పెరగనునట్లు నిస్సాన్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుతం సంస్థ ఈ ఒక్క మోడల్ మాత్రమే విక్రయిస్తోంది. అంతే కాకుండా.. 2026లో కంపెనీ మరిన్ని కొత్త మోడల్స్ తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. సంస్థ ధరలను పెంచినప్పటికీ.. జీఎస్టీ మార్పుల కారణంగా, ఊహించని ప్రభావం ఉండదని తెలుస్తోంది.
రెనాల్ట్ కిగర్
2026 జనవరి మొదటి రోజు నుంచే.. రెనాల్ట్ కంపెనీ తన కిగర్ కారు ధరలను 2 శాతం పెంచనుంది. కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. అంతే కాకుండా పెరుగుతున్న ధరలు.. ఎంచుకునే వేరియంట్ లేదా మీరు కొనుగోలు చేసే మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే.. కంపెనీ భారతదేశంలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. కాబట్టి కొత్త కార్లను లాంచ్ చేసే అవకాశం ఉంది.
బీవైడీ సీలియన్ 7
బిల్డ్ యువర్ డ్రీమ్స్ (బీవైడీ) కంపెనీ తన కార్ల ధరలను.. 2026 ప్రారంభం నుంచే సవరించనున్నట్లు అధికారికంగా ఇప్పటికే వెల్లడించింది. ధరల పెరుగుదల సంస్థ లాంచ్ చేసిన అన్ని కార్లకు వరిస్తుంది. దీని ప్రభావం.. సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారుపై కూడా పడుతుంది. అంటే.. దీని ధర పెరుగుతుందన్నమాట. పాత ధర 2025 డిసెంబర్ 31వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అప్పటికి బుక్ చేసుకున్నవారికి పాత ధరలే వర్తిస్తాయి. ఆ తరువాత.. బుక్ చేసుకున్నావారు కొత్త ధరలకు కొనాల్సి ఉంటుంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.