వెండితెరపై 2018 (గీత గోవిందం)లోనే పెళ్లిపీటలెక్కిన రష్మిక మందన్న & విజయ్ దేవరకొండ.. నిజ జీవితంలో భార్యాభర్తల భంధంలోకి అడుగుపెట్టారు. రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరి 26 (గురువారం) పెళ్లిపీటలెక్కనున్నారు. ఇప్పటికే ఇరుకుటుంబాల బంధువులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అయితే వీరి పెళ్లి రెండు పద్ధతుల్లో జరగనున్నట్లు సమాచారం.
రేపు ఉదయం తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగనుంది. సాయంత్రం కొడవ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుంది. తెలుగు సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి గురించి దాదాపు అందరికి తెలిసిందే. అయితే ఈ కొడవ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.
తెలుగు సాంప్రదాయం
సాధారణంగా భారతదేశంలో చాలామంది ఈ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకుంటారు. మొదట నిశ్చితార్థం (ఉంగరాలు మార్చుకోవడం), పెళ్లికి ముందు పసుపు రాసే కార్యక్రమం (హల్దీ), కన్యాదానం (వధువు తల్లిదండ్రులు అమ్మాయిని వరుడికి అప్పగించడం), జీలకర్ర బెల్లం ఘట్టం, మంగళసూత్ర ధారణ (తాళి కట్టడం), తలంబ్రాలు (ఒకరి తలపై మరొకరు బియ్యం పోసుకోవడం), సప్తపది (ఏడడుగులు వేయడం). ఇలా తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు జరుగుతుంది.
కొడవ సాంప్రదాయం
ఈ సాంప్రదాయం ప్రధానంగా కూర్గ్ ప్రాంతంలో కనిపిస్తుంది. రష్మిక మందన్న ఈ ప్రాంతానికి చెందిన మహిళ కావడం చేత.. కొడవ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు.
కొడవ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో వస్త్రధారణ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదే చాలా ముఖ్యమైంది కూడా. పెళ్లికొడుకు కుప్పియా అనే ప్రత్యేక దుస్తులు ధరిస్తాడు. ఇందులో భాగంగానే నడుముకు కత్తి ధరిస్తారు. వధువు కూడా కొడవ శైలి (స్టైల్)లోనే చీర కట్టుకుంటుంది. ఈ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో ఆయుధాలకు కూడా చాలా ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి వీటికి కూడా పూజలు చేయడం జరుగుతుంది. కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, సాంప్రదాయ స్టైల్ డ్యాన్స్, స్థానిక వంటకాలతో విందులు ఏర్పాటు చేయడం వంటివి ఈ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో కనిపిస్తాయి. డోలు వాయిద్యాలు ఇందులో చాలా ప్రత్యేకమనే చెప్పాలి.
రష్మిక మందన్న & విజయ్ దేవరకొండ
గీత గోవిందం సినిమాతో వెండి తెరపై జంటగా కనిపించిన ఈ జంట.. ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కనిపించారు. ప్రారంభం నుంచే మంచి స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం.. ఇప్పుడు పెళ్లిదాకా వచ్చింది. పెళ్లి తరువాత కూడా వీరు అన్యోన్యంగా జీవించాలని, ఓ నలుగురికి ఆదర్శం అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం.
నిజానికి రష్మిక & విజయ చాలా సార్లు కలిసి కనిపించినప్పటికీ.. వీరి మధ్య ఉన్న బంధం మాత్రం రహస్యంగా ఉంచారు. అయితే రష్మిక పండుగల సమయంలో విజయ్ కుటుంబానికి వెళ్లడం, ఆనంద్ దేవరకొండ సినిమా ఈవెంట్లలో కనిపించడం కూడా జరిగింది. ఇంతకు ముందే వీరి మధ్య ఉన్న బంధం గురించి చాలాసార్లు చెప్పకనే చెప్పేశారు. కానీ అధికారికంగా ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు తమ పెళ్ళికి కూడా చాలా తక్కువమంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. పెళ్లి తరువాత రిసెప్షన్ హైదరాబాద్‌లోనే జరగనుంది. ఈ కార్యక్రమానికి అటు సినీ వర్గాలు, ఇటు రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.