శతాబ్దాల చరిత్ర.. రాజులు మెచ్చిన నగరం: ఒక్కసారైన చూడాల్సిన ప్రదేశం!

టెంపుల్ సిటీ అంటే గుర్తొచ్చేది తమిళనాడు మాత్రమే. అలాంటి రాష్ట్రంలోని కాంచీపురం శతాబ్దాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శించడానికి ముఖ్య కారణం ఇక్కడి ప్రాచీన దేవాలయాలు. “సిటీ ఆఫ్ టెంపుల్స్”గా పేరొందిన కాంచీపురం, అద్భుతమైన దేవాలయ నిర్మాణాలు, సంప్రదాయాలు, పట్టు చీరల తయారీతో ప్రత్యేక గుర్తింపు పొందింది.

తమిళనాడులోని ఈ ప్రాచీన నగరం భారతదేశంలోని అత్యంత పురాతన పట్టణాల్లో ఒకటిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు వంటి శక్తివంతమైన వంశాలు ఇక్కడ రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసుకుని అనేక ఆలయాలను నిర్మించుకున్నారు. ఈ కారణంగా కాంచీపురం శతాబ్దాలుగా హిందూ సంస్కృతి, విద్య, భక్తి సంప్రదాయాలకు కేంద్రంగా కొనసాగుతోంది.

కాంచీపురం కేవలం దేవాలయాలకు మాత్రమే కాకుండా.. ప్రసిద్ధి చెందిన పట్టు చీరల తయారీకి కూడా నెలవు. కాబట్టి ఈ నగరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఏది ఎండిన.. కాంచీపురాన్ని ప్రత్యేకంగా చూపించేది మాత్రం ఇక్కడున్న వందలాది ప్రాచీన దేవాలయాలే. ప్రతి ఆలయం తన ప్రత్యేక శిల్పకళ, చరిత్ర, ఆధ్యాత్మికతతో భక్తులను ఆకర్షిస్తోంది.

“సిటీ ఆఫ్ టెంపుల్స్”గా కాంచీపురం ఎందుకు?

చరిత్రకారుల ప్రకారం.. ఒకప్పుడు కాంచీపురంలో 1000 కంటే ఎక్కువ ఆలయాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా పల్లవుల కాలంలో నిర్మించబడిన దేవాలయాలు ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. భారీ గోపురాలు, అద్భుతమైన శిల్పాలు, ప్రాచీన నిర్మాణ శైలులు ఈ ఆలయాల ప్రత్యేకత. హిందూమతంలో ఉన్న ఏడు పవిత్ర యాత్రా క్షేత్రాలలో కాంచీపురం ఒకటి. ఇక్కడ శివుడు, విష్ణువు, దేవీ రూపాల్లో ఉన్న అనేక ఆలయాలు ఉన్నాయి. అందుకే దేశ విదేశాల నుంచి భక్తులు నిరంతరం ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు.

కాంచీపురంలోని ప్రముఖ దేవాలయాలు

ఏకాంబరేశ్వర ఆలయం: శివుడికి అంకితమైన ఈ ఆలయం పంచభూతాల ఆలయాలలో ఒకటిగా.. భూమి తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయంలో ఉన్న పవిత్ర మామిడి చెట్టు సుమారు మూడు వేల సంవత్సరాల పాతదని స్థానికులు విశ్వసిస్తారు. భారీ గోపురం, విశాల ప్రాంగణం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.

కామాక్షి అమ్మవారి ఆలయం: పార్వతీ దేవి రూపమైన.. కామాక్షి అమ్మవారికి అంకితమైన ఈ ఆలయాన్ని శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. కాబట్టి దీనిని దేశంలో అత్యంత శక్తివంతమైన ఆలయంగా పరిగణిస్తారు.

వరదరాజ పెరుమాళ్ ఆలయం: విష్ణువుకు సంబంధించిన ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణం, శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఇది వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ ఆలయానికి కూడా లెక్కకు మించిన భక్తులు వస్తూ పోతుంటారు.

కైలాసనాథర్ ఆలయం: పల్లవ రాజు నరసింహవర్మన్ II నిర్మించిన ఈ ఆలయం నగరంలోని అత్యంత పాత ఆలయాల్లో ఒకటి. ఇసుకరాయి నిర్మాణం, సూక్ష్మమైన శిల్పాలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. అద్భుతమైన కట్టడానికి భక్తిని పెంచడమే కాకుండా, చూపరులను కట్టిపడేస్తాయి.

కాంచీపురంలో సందర్శించాల్సిన ఇతర ప్రదేశాలు

  • కాంచీపురం సిల్క్ సారీ వీవింగ్ సెంటర్స్
  • కాంచి కుడిల్ మ్యూజియం
  • ఉలగళంత పెరుమాళ్ ఆలయం
  • చిత్రగుప్త దేవాలయం

మొత్తం మీద కాంచీపురం నిజంగా సిటీ ఆఫ్ టెంపుల్స్ అనే పేరుకు తగ్గట్టే ఆధ్యాత్మిక సంపదను కలిగిన గొప్ప నగరం. శతాబ్దాల చరిత్ర గలిగిన ఈ నగరంలో.. అద్భుత దేవాలయ నిర్మాణాలు, సంప్రదాయాలు ఈ నగరాన్ని భారతదేశంలో ఒక ప్రముఖ యాత్రా కేంద్రంగా నిలబెడుతున్నాయి. ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన నగరం ఈ కాంచీపురం.

Also Read: మీకు తెలుసా: అప్పుడు రక్షణ దళాల కోసం వాహనాలు.. ఇప్పుడు ఇలా..