తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం కీలకమైన ‘Stand With Her’ క్యాంపెయిన్‌ను శనివారం (మార్చి 7, 2026) అధికారికంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. యువత మహిళల భద్రతకు బ్రాండ్ అంబాసిడర్లుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా అని స్పష్టం చేశారు.
మహిళల భద్రతపై అవగాహన
తెలంగాణ మహిళా పోలీస్ భద్రత విభాగం చేపట్టిన ఈ ‘Stand With Her’ క్యాంపెయిన్ ప్రధానంగా మహిళలపై జరిగే హింసను ముందుగానే అరికట్టడంపై దృష్టి సారిస్తుంది. మహిళలపై హింస అనేది.. ఒక్కసారిగా ప్రారంభం కాకుండా, చిన్న చిన్న అవమానకర చర్యలతో మొదలవుతుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
ఉదాహరణకు మహిళలను తిట్టడం, అసభ్యంగా చూడడం, లైంగిక వ్యాఖ్యలు చేయడం, వెంటాడటం, ఆన్‌లైన్‌లో వేధించడం, గోపింగ్ వంటి చర్యలు మొదట కనిపించినా అవే తర్వాత పెద్ద నేరాలకు దారి తీసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ‘Stand With Her’ క్యాంపెయిన్ ద్వారా మహిళలే తమను తాము కాపాడుకోవాలి అనే భావనను మార్చి, మహిళల భద్రత సమాజం మొత్తం బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మహిళలపై జరుగుతున్న వేధింపులను చూసి మౌనంగా ఉండకుండా సమాజం స్పందించాలని చెప్పారు. ఎక్కడైనా ఒక మహిళకు అన్యాయం జరిగితే అది మన కుటుంబ సభ్యురాలికి జరిగినట్లుగా భావించి స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
మహిళల భద్రత కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు రంగాల్లోనూ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
మహిళల విజయాలను ఒకే రోజుకే పరిమితం చేయకూడదని, సమాజంలో మహిళలకు నాయకత్వ అవకాశాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ఉందని ఆయన గుర్తు చేశారు. దేశంలో ప్రముఖ స్థానాల్లో పనిచేసిన మహిళలుగా ప్రతిభా పాటిల్, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, మీరా కుమార్ వంటి నేతలను ఉదాహరణగా పేర్కొన్నారు.
ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యం
మహిళల భద్రతతో పాటు ఆర్థికంగా బలపడే అవకాశాలు కల్పించడం కూడా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నామని, ఇందిరా మహిలా శక్తి స్టాల్స్ కోసం మూడు ఎకరాల స్థలం కేటాయించామని ఆయన వివరించారు. అక్కడ మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించి స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు.
తమకు నచ్చిన ఉద్యోగాలను ఎంచుకునే హక్కు మహిళలకు ఉండాలని, ప్రభుత్వం అందుకు అనుకూల వాతావరణం కల్పిస్తోందని తెలిపారు. ఇప్పటికే పాలన, పోలీస్ వ్యవస్థలో కీలక స్థానాల్లో అనేక మహిళా అధికారులు సేవలందిస్తున్నారని చెప్పారు.
ఏడాది పాటు అవగాహన కార్యక్రమం
తెలంగాణ మహిళల భద్రత విభాగం అదనపు డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ ‘Stand With Her’ క్యాంపెయిన్ ఏడాది పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఇంటి నుంచి విద్యాసంస్థలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు, కార్యాలయాలు వంటి ప్రతి స్థలంలో మహిళలపై జరుగుతున్న వివక్షను గుర్తించి ఎదుర్కోవడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు.
మహిళలను కాపాడడం మాత్రమే కాదు, వారికి గౌరవం కల్పించడమే ఈ క్యాంపెయిన్ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి నెల ఒక ప్రత్యేక అంశాన్ని తీసుకుని అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ క్యాంపెయిన్‌లు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు.
ఇంటి నుంచే లింగ సమానత్వం!
యునిసెఫ్ హైదరాబాద్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ జెలాలెం బిర్హాను టాఫెస్సే మాట్లాడుతూ.. మహిళలపై జరిగే నేరాల్లో ఎక్కువగా పురుషులే నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. అందువల్ల సమాజంలో ఉన్న లోతైన భావజాలాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఎందోమంది మహిళలు విద్యలో ప్రతిభ చూపుతున్నప్పటికీ.. ఉద్యోగ స్థలాల్లో ఉన్న వివక్ష కారణంగా తమ కెరీర్‌ను వదిలేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. కుటుంబాల్లో మహిళల గురించి మాట్లాడే తీరు కూడా పిల్లల ఆలోచనలను ప్రభావితం చేస్తుందని.. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకు లింగ సమానత్వం గురించి బోధించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్య మానవత్వం పెంచాలి
ఉన్నత, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగిత రామ మాట్లాడుతూ.. విద్య కేవలం ఉద్యోగం కోసం కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యాసంస్థలు కేవలం ప్రతిభను పెంచడం మాత్రమే చేస్తే సరిపోదు, విద్యార్థులలో విలువలు & బాధ్యతాభావం కూడా పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read: HDFC బ్యాంక్ గుడ్‌న్యూస్.. పెరిగిన FD వడ్డీ రేట్లు
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.