మహిళల జీవితకాలంపై రీసెర్చ్.. వెలుగులోకి సంచలన నిజాలు!

ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి & మినర్వా ఫౌండేషన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు మహిళల జీవితకాలం, సంతానం మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు చాలా సంవత్సరాలుగా ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఈ పరిశోధనలో దాదాపు 15,000 మంది మహిళల జీవితాలను దశాబ్దాల పాటు పరిశీలించారు.

1975లో ఒక ప్రశ్నతో మొదలైన ఈ రీసెర్చ్.. ఎంతోమంది మహిళల జీవనశైలులు, ఆరోగ్య పరిస్థితులు & వయస్సు పెరుగుదల ప్రక్రియను పరిశోధకులు నిరంతరం గమనిస్తూ వచ్చారు. ఈ విశ్లేషణలో మహిళల సంతానం సంఖ్య, గర్భధారణ వయస్సు, దీర్ఘాయుష్షు మధ్య ఆసక్తికరమైన సంబంధాలు బయటపడ్డాయి.

ముఖ్యంగా రెండు నుంచి మూడు మంది పిల్లలు కలిగిన మహిళలు ఎక్కువకాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం సూచించింది. అంతేకాకుండా.. గర్భధారణ జరిగే వయస్సు కూడా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి కీలక పాత్ర పోషించవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

గర్భధారణ వయస్సు గురించి

సంవత్సరాలపాటు జరిగిన అధ్యయనంలో.. 24 నుంచి 38 సంవత్సరాల మధ్య గర్భధారణ జరిగిన మహిళలు సాధారణంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని పొందినట్లు గుర్తించారు. ఈ వయస్సు మధ్య గర్భం దాల్చిన మహిళల్లో శరీర కణాల వృద్ధాప్యం నెమ్మదిగా జరిగే ధోరణి కనిపించిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇది జీవశాస్త్ర పరంగా కూడా నిజమని చెబుతున్న అంశమని వారు చెప్పారు. ఎందుకంటే ఈ వయస్సులో శరీర శక్తి, హార్మోన్ల సమతుల్యత & శారీరక సామర్థ్యం సమతులంగా ఉంటుంది. కాబట్టి తల్లి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

ఎక్కువ మంది పిల్లలు ఉంటే..

ఇకపోతే నాలుగు మందికి పైగా పిల్లలు ఉన్న మహిళల్లో సాధారణంగా జీవితకాలం కొంత తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. ఈ మహిళల్లో జీవకణాల వృద్ధాప్యం కొంచెం వేగంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. దీనికి ప్రధాన కారణంగా పరిణామ జీవశాస్త్ర సిద్ధాంతాలను పరిశోధకులు ప్రస్తావించారు. మన శరీరంలో పరిమిత శక్తి వనరులు మాత్రమే ఉంటాయి. ఆ శక్తి ఎక్కువగా సంతానం కోసం ఉపయోగిస్తే శరీర సంరక్షణకు సంబంధించిన శక్తి తగ్గుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. కాబట్టి అధిక సంతానం ఉన్న మహిళల్లో వృద్ధాప్యం వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

పిల్లలు లేని మహిళల్లో..

ఈ పరిశోధనలో.. మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. పిల్లలు లేని మహిళల్లో కూడా జీవకణాల వృద్ధాప్యం కొంత వేగంగా జరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే దీనికి కారణాలు ఎవనేవి స్పష్టంగా వెల్లడి కానప్పటికీ.. జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులు లేదా ఇతర సామాజిక కారణాలు దీనికి కారణమై ఉండవచ్చని వారు సూచించారు. ఈ అంశాలు పరిశోధనలో పూర్తిగా కొలవలేకపోయామని శాస్త్రవేత్తలు తెలిపారు.

వృద్ధాప్య విశ్లేషణ ఇలా..

ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు “ఎపిజెనెటిక్ క్లాక్స్” అనే ఆధునిక పద్ధతిని ఉపయోగించారు. ఇది రక్త నమూనాలను విశ్లేషించి ఒక వ్యక్తి కణాలు ఎంత వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నాయో అంచనా వేయగల టెక్నాలజీ. ఈ విశ్లేషణలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలు లేదా పిల్లలు లేని మహిళలు తమ వాస్తవ వయస్సుతో పోలిస్తే జీవశాస్త్ర పరంగా కొంత ఎక్కువ వయస్సు కలిగినట్లు కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు.

కుటుంబ ప్రణాళికపై ప్రభావం

ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ అధ్యయన ఫలితాలను కేవలం తెలుసుకోవడం లేదా అవగాహన మాత్రమే. దీనిని ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత కుటుంబ ప్రణాళిక నిర్ణయాలపై ప్రభావం చూపించేలా చూడకూడదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ ఫలితాలు ప్రధానంగా జనాభా స్థాయి ధోరణులను మాత్రమే సూచిస్తాయని వెల్లడించారు. మహిళల్లో వృద్ధాప్యం తొందరగా రావడానికి.. ఆరోగ్యం, జీవనశైలి, ఆర్థిక పరిస్థితులు & వ్యక్తిగత నిర్ణయాలు కూడా కారణంగా కావొచ్చు. కాబట్టి ఈ పరిశోధనను ఒక సాధారణ సూచనగా మాత్రమే చూడాలని నిపుణులు సూచించారు.

Also Read: మహిళల భద్రత.. సమాజం బాధ్యత: సీఎం పిలుపు