కావ్య రెడ్డితో.. బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం – వీడియో

తెలుగు సినిమా పరిశ్రమలో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. రష్మిక & విజయ్ – అల్లు శిరీష్ & నయనికల పెళ్లి సజావుగా పూర్తయింది. ఇప్పుడు సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నేడు (ఆదివారం) నిశ్చితార్థం చేసుకున్నారు.

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కావ్య రెడ్డితో.. కొత్త జీవితం ప్రారంభించేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ సిద్ధమయ్యారు. నిశ్చితార్థం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రముఖ నిర్మాత Bellamkonda Suresh తనయుడైన బెల్లంకొండ శ్రీనివాస్.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు. Alludu Seenu సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మొదటి చిత్రంలోనే స్టార్ హీరోయిన్ Samantha Ruth Prabhuతో కలిసి నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించడంతో టాలీవుడ్‌లో ఆయనకు మంచి ఆరంభం దక్కింది.

సినీ ప్రముఖుల సమక్షంలో..

హైదరాబాద్‌లో జరిగిన ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా హీరోయిన్ Samyuktha Menon, దర్శకుడు Boyapati Srinu, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.

ప్రేమలో బెల్లంకొండ శ్రీనివాస్

నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. త్వరలోనే నిశ్చితార్థం జరగబోతుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తలు నిజమవుతూ హైదరాబాద్‌లో అధికారికంగా నిశ్చితార్థం జరిగింది.

ఎవరీ కావ్య రెడ్డి?

శ్రీనివాస్ కాబోయే భార్య కావ్య రెడ్డికి.. సినీ పరిశ్రమతో ప్రత్యక్ష సంబంధం లేదని తెలుస్తోంది. ఆమె కుటుంబం హైదరాబాద్‌కే చెందినదే అని సమాచారం. ఆమె తాత ఒకప్పుడు జడ్జిగా పనిచేసిన వ్యక్తి కాగా, తండ్రి లాయర్‌గా ఉన్నారని తెలుస్తోంది. బెల్లంకొండ కుటుంబంతో కావ్య కుటుంబానికి ముందే పరిచయం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే వీరిద్దరికీ ఎలా పరిచయం ఏర్పడింది?, ఆ పరిచయం ఎలా ప్రేమగా మారింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ విషయాలను త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ స్వయంగా వెల్లడించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ గురించి

టాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా గుర్తింపు పొందిన.. బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్‌లో చాలా సినిమాల్లో నటించారు. అయితే ఆయన కెరీర్‌లో పెద్ద హిట్‌గా ఇచ్చిన చిత్రం అంటే Rakshasudu అనే చెప్పుకోవాలి. ఈ సినిమా తమిళ హిట్ మూవీకి రీమేక్‌గా వచ్చినప్పటికీ తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ మధ్యకాలంలో ఆయన నటించిన Bhairavam, Kishkindhapuri సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి. అయినప్పటికీ ఆయన కొత్త ప్రాజెక్టులతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ ఏడాదిలోనే పెళ్లి!

నిశ్చితార్థంతో బెల్లంకొండ శ్రీనివాస్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. ఈ ఏడాదిలోనే పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీ, పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనే విషయాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also Read: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. సర్‌ప్రైజ్ అప్‌డేట్ రెడీ!