రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్!.. నారా లోకేష్ సంచనల వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారమలో ఉన్న కాలంలో రూ. 3500 కోట్ల లిక్కర్ స్కాం జరిగిందనే ఆరోపణలపై.. టీడీపీ ఐటీ మినిష్టర్ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో ప్రతి నెలా సుమారు రూ.100 కోట్లు కిక్‌బ్యాక్స్ రూపంలో వసూలయ్యాయని ఆరోపిస్తూనే.. మరో రూ.1,000 కోట్లకు పైగా నగదు ట్రైల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించిందని పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

ఆరోపణలు ఏమిటంటే?

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానంపై.. ఇప్పటికే అనేక వివాదాలు నెలకొన్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించింది. కానీ ఆ సమయంలోనే రాష్ట్రంలో మద్యం విక్రయాల నిర్వహణలో అవకతవకలు జరిగాయని టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన దర్యాప్తులో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో భాగంగా రూ. 441 కోట్లకు పైగా ఆస్తులను ED అటాచ్ చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు కారణమైంది. ఈ పరిణామాల మధ్యే మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.

ప్రజలపై ప్రభావం ఉందా?

లిక్కర్ స్కాం ఆరోపణలు రాజకీయాలకు.. మాత్రమే పరిమితం కాదు. ఇది రాష్ట్ర ప్రజలపై కూడా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మద్యం విధానంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు నిజమైతే, ప్రభుత్వ ఆదాయ వ్యవస్థపై.. అలాగే సామాజిక పరిస్థితులపై దాని ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు. అంతే కాకుండా.. మద్యపాన నిషేధం పేరుతో ప్రభుత్వం ఒక వైపు హామీలు ఇచ్చి, మరోవైపు అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు వస్తే ప్రజల్లో పార్టీపై నమ్మకం తగ్గే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

రూ.వందల కోట్ల ఆస్తులు అటాచ్!

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో విషయంలో కీలక చర్యలు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా రూ. 441 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ప్రకటించింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు & ఇతర స్థిరాస్థులు ఉన్నాయి.

ఈ ఆస్తులు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కాసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు & సంబంధిత సంస్థలకు చెందినవిగా గుర్తించారు. అదే విధంగా బూనేటి చాణక్య, అతని అనుబంధ సంస్థలు, అలాగే దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డికు సంబంధించిన కొన్ని ఆస్తులను కూడా అధికారులు అటాచ్ చేసినట్లు సమాచారం.

నారా లోకేష్ ట్వీట్

ఈ వ్యవహారంపై నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం మద్యపాన నిషేధం గురించి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ, వాస్తవంగా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ”ప్రతి నెల రూ. 100 కోట్లు కిక్‌బ్యాక్స్, మొత్తం రూ. 3,500 కోట్ల మనీ లాండరింగ్, రూ.1,048 కోట్ల నగదు ట్రైల్‌ను ED గుర్తించింది. ఇది మీ 2019 మద్యపాన నిషేధ హామీ వెనుక ఉన్న అసలు కథేనా?” అని ప్రశ్నించారు.

మద్యం వ్యాపారం కారణంగా రాష్ట్రంలో వేలాది కుటుంబాలు నష్టపోయాయని లోకేష్ ఆరోపించారు. ”ప్రజలకు నిషేధం గురించి ఉపన్యాసాలు ఇస్తూ, మీ అనుచరులు వేల కోట్ల రూపాయలు సంపాదించారా?” అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.

వైఎస్ జగన్ స్పందిస్తారా?

ఈ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేదా వైఎస్సార్సీపీ నేతల నుంచి ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కానీ ఈ అంశం రాజకీయంగా చాలా వేగంగా వేడెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే ఉద్రిక్తత నెలకొన్న సమయంలో లిక్కర్ స్కాం ఆరోపణలు కొత్త రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: ఆస్ట్రేలియాలో మొదలై ఆంధ్రప్రదేశ్ వరకు.. అందుకేనా సోషల్ మీడియా బ్యాన్!