భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది నుంచి కాలేజీ విద్యార్థినులకు EV స్కూటీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. అంతే కాకుండా.. నగరంలో డీజిల్ బస్సులను తొలగించి 100 శాతం EV బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో.. పెరుగుతున్న కాలుష్యం ప్రభుత్వానికి నివారించలేని ప్రధాన సమస్యగా మారింది. సిటీలో వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల గాలి నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రెడ్, ఆరెంజ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలను ORR బయటకు తరలించే ప్రణాళికను సీఎం ప్రకటించారు.
కాలుష్య రహిత హైదరాబాద్ లక్ష్యం!
హైదరాబాద్ నగరాన్ని పర్యావరణానికి అనుకూలంగా మార్చడమే లక్ష్యమని.. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక ఉందని చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న డీజిల్ బస్సులను ఈ ఏడాది చివరి నాటికి, అంటే డిసెంబర్‌లోపు జిల్లాలకు తరలించి, వాటి స్థానంలో పూర్తిగా EV బస్సులను ప్రవేశపెడతామని వెల్లడించారు.
ఈ నిర్ణయం హైదరాబాద్‌లో గాలి కాలుష్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు EVలకు జీరో ట్యాక్స్ విధానాన్ని కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు
మహిళల భద్రత, సౌకర్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి కాలేజీ విద్యార్థినులకు EV స్కూటీలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థినులకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం చాలా మంది విద్యార్థినులు బస్సులపై ఆధారపడుతూ కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది. ట్రాఫిక్ సమస్యల వల్ల ఆలస్యం జరుగుతోంది. ఆలస్యానికి చెక్ పెట్టాలంటే.. ఈవీ స్కూటీలను అందిస్తే, ఎవరికివారు స్వతంత్రంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం భవిస్తూ.. ఈవీలను అందించడానికి పూనుకుంది. ప్రభుత్వం యోచిస్తున్న ఈ పథకం అమలులోకి వస్తే.. వేలాది కాలేజీ విద్యార్థినులకు నేరుగా లాభం చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి & గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి చదువుకోడానికి వచ్చే విద్యార్థినులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మరో నిర్ణయం ఏమిటంటే?
హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీలను ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా.. పరిశ్రమలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నగర పరిధిలో ఉన్న రెడ్, ఆరెంజ్ కేటగిరీలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఈ చర్య వల్ల నగరంలో గాలి కాలుష్యం తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే నగర అభివృద్ధికి కూడా కొత్త అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ప్రాంతాల్లో ఐటీ, సేవా రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
కొత్త మార్పులకు శ్రీకారం!
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే EV విధానాన్ని ప్రోత్సహించేందుకు.. కావలసిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. ఈవీల కొనుగోలుకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఇవ్వడం కూడా చేపడుతోంది. ఇప్పుడు కాలేజీ విద్యార్థినులకు EV స్కూటీలు ఇవ్వడం కూడా ఇందులో ఒక భాగమే అని తెలుస్తోంది.
మొత్తం మీద హైదరాబాద్‌ను భవిష్యత్తులో పూర్తిగా గ్రీన్ సిటీగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ చర్యలు అమలు అయితే.. నగరంలో కాలుష్యం తగ్గడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: హైదరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ డ్రైవ్ తనిఖీలు: ఎంతమంది పట్టుబడ్డారో తెలుసా?
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.