ఇండక్షన్ స్టవ్ వినియోగిస్తున్నారా.. కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసా?

ఇటీవల గ్యాస్ సిలిండర్ సరఫరాపై వస్తున్న వార్తల నేపథ్యంలో.. చాలా కుటుంబాలు ప్రత్యామ్నాయ వంట పద్ధతులపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్‌లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వీటితో వంట చేయడం సులభం కావడంతో పాటు గ్యాస్‌పై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.

ఇండక్షన్ స్టవ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తే విద్యుత్ వినియోగం ఎంత పెరుగుతుందో తెలియక చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు విద్యుత్ వినియోగంపై కొన్ని అంచనాలను వెల్లడించారు. Indiaలో సాధారణంగా ఇంట్లో ఉపయోగించే ఇండక్షన్ స్టవ్‌లు 1200 వాట్స్ నుంచి 2200 వాట్స్ వరకు పవర్ సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటిని పూర్తి పవర్‌లో ఉపయోగించినప్పుడు విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇండక్షన్ స్టవ్‌లో విద్యుత్ వినియోగం ఎంత?

సాధారణంగా 1500 నుంచి 2000 వాట్స్ సామర్థ్యం ఉన్న ఇండక్షన్ స్టవ్‌ను ఒక గంట పాటు పూర్తి పవర్‌లో ఉపయోగిస్తే సుమారు 1.5 నుంచి 2 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం జరుగుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు గంటలపాటు వంట కోసం ఇండక్షన్ స్టవ్ వాడితే రోజుకు సుమారు 2 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం పెరగవచ్చు. దీని ఆధారంగా చూస్తే నెలలో సుమారు 60 యూనిట్ల వరకు అదనపు విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఇది కుటుంబం వంట అవసరాలపై ఆధారపడి మారవచ్చు.

కరెంట్ బిల్ ఎంత పెరగవచ్చు?

విద్యుత్ వినియోగం పెరగడం వల్ల కరెంట్ బిల్లుపై కూడా ప్రభావం పడుతుంది. ఒక యూనిట్ విద్యుత్ ధర సగటున రూ.5 నుంచి రూ.6 మధ్య ఉంటే 60 యూనిట్ల అదనపు వినియోగానికి సుమారు రూ.300 నుంచి రూ.360 వరకు అదనపు ఖర్చు రావచ్చు. అయితే కొన్ని రాష్ట్రాల్లో స్లాబ్ విధానం అమల్లో ఉంటుంది. విద్యుత్ వినియోగం ఒక కేటగిరీ దాటితే యూనిట్ ధర కూడా పెరుగుతుంది. దీంతో కేటగిరీ మారితే నెలవారీ కరెంట్ బిల్ రూ.500 నుంచి రూ.800 వరకు పెరగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇండక్షన్ స్టవ్‌ల ప్రయోజనాలు

  • గ్యాస్ అవసరం లేకుండా విద్యుత్తుతో వంట చేయవచ్చు
  • వేడి త్వరగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి వంట సమయం తగ్గుతుంది
  • అగ్ని ప్రమాదాల ప్రమాదం తక్కువగా ఉంటుంది
  • కిచెన్‌లో పొగ, గ్యాస్ వాసన ఉండదు

ఈ జాగ్రత్తలు అవసరం

  • అవసరం ఉన్నప్పుడు మాత్రమే పూర్తి పవర్‌లో ఉపయోగించాలి
  • సరైన ఇండక్షన్ పాత్రలు ఉపయోగించాలి
  • వంట పూర్తయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి
  • చిన్న వంటల కోసం తక్కువ పవర్ మోడ్ ఉపయోగించాలి

పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ వినియోగం తగ్గించుకోవడంతో పాటు కరెంట్ బిల్లును కూడా నియంత్రించుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఇండక్షన్ స్టవ్ వాడటం వల్ల కొంతవరకు విద్యుత్ వినియోగం పెరుగుతుందనేది నిజం. అయితే సరైన విధంగా ఉపయోగిస్తే ఖర్చును నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లు చాలా కుటుంబాలకు ఉపయోగకరంగా మారుతున్నాయి.

Also Read: గ్యాస్ సిలిండర్స్ కొరత: వీటికి ఫుల్ డిమాండ్.. ఎగబడి కొనేస్తున్న జనం!