Night shift health tips: నేటి ఆధునిక జీవనశైలిలో నైట్ షిఫ్ట్‌లు సాధారణమైపోయాయి. ఐటీ, హెల్త్‌కేర్, సెక్యూరిటీ, కస్టమర్ సపోర్ట్ వంటి అనేక రంగాల్లో ఉద్యోగులు రాత్రి వేళల్లో పనిచేస్తున్నారు. అయితే నైట్ షిఫ్ట్ కారణంగా శరీర గడియారం (బయోలాజికల్ క్లాక్) ప్రభావితమవుతుంది. దీని వల్ల నిద్రలేమి, అలసట, జీర్ణ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు.
ఈ నేపథ్యంలో.. నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారం, నిద్ర, వ్యాయామం వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ముఖ్యంగా చిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఎక్కువగా కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ వంటి వాటిపై ఆధారపడుతుంటారు. అయితే ఇవి తాత్కాలికంగా ఉత్సాహాన్ని ఇచ్చినా, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే వీటిని తగ్గించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఆహారంలో మార్పులు తప్పనిసరి
నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవారు తమ ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డ్యూటీ సమయంలో కూల్ డ్రింక్స్, టీ, కాఫీ వంటివి తగ్గించడం మంచిది. వీటి స్థానంలో బ్రేక్ సమయంలో తాజా పళ్లరసాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో నిద్రపోవడం తప్పు. ఇది జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందేందుకు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. గుడ్లు, తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం కావాలి.
నిద్ర విస్జయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నైట్ షిఫ్ట్ తర్వాత సరైన నిద్ర చాలా ముఖ్యం. షిఫ్ట్ ముగిసిన వెంటనే గోరువెచ్చటి నీటితో స్నానం చేసి నిద్రపోవడం శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. నిద్రకు ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించడం మంచిది. నిద్రపోయే గది ప్రశాంతంగా, చీకటిగా ఉండేలా చూసుకోవాలి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకుంటే శరీరం ఆ రొటీన్‌కు అలవాటు పడుతుంది.
వ్యాయామం, మానసిక ఆరోగ్యం
నైట్ షిఫ్ట్ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చాలా ముఖ్యం. రోజూ కొద్దిసేపు యోగా, వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి శక్తి పెరుగుతుంది. ధ్యానం (మెడిటేషన్) చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. నైట్ షిఫ్ట్ వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకుంటే నైట్ షిఫ్ట్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.
ఆరోగ్యంపై శ్రద్ద ముఖ్యం!
నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు గుండె సంబంధిత సమస్యలు, బరువు పెరగడం, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, జీవనశైలి మార్పులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వారు ఈ సూచనలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పనిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
Also read:Late Night Dinner Health Risks: రాత్రి ఆలస్యంగా తింటున్నారా.. మీరు డేంజర్‌లో పడ్డట్టే!

ఉమశ్రీ – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆటోమొబైల్, లైఫ్ స్టైల్ విభాగాల్లో అత్యంత ప్రావీణ్యం కలిగి ఉంది. ఈ విభాగాల్లో యూజర్లకు అవసరమైన అన్ని వార్తలను సమగ్రంగా అందిస్తాను. నాకు జర్నలిజం రంగంలో 8 సంవత్సరాల అనుభవం ఉంది.
