AP New Zonal System 2005: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక విధానంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005 అమలులోకి రావడంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న పాత జోన్‌ల వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఈ కొత్త విధానం ప్రకారం రాష్ట్రాన్ని 26 జిల్లాల ప్రాతిపదికన విభజించి, ఆరు జోన్‌లు.. రెండు మల్టీ జోన్‌లుగా ఏర్పాటు చేశారు. ఇది ఉద్యోగ నియామకాలలో స్థానిక అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా తీసుకున్న కీలక నిర్ణయం. ఇప్పటికే రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటవడంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి కేంద్రానికి మళ్లీ ప్రతిపాదన పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త విధానం అమలు
ఇప్పటివరకు అమల్లో ఉన్న పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-1975 ప్రకారం జిల్లాలు, జోన్‌ల ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరిగేవి. కానీ కాలానుగుణంగా మారుతున్న పరిపాలనా అవసరాలు, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఈ విధానం పాతబడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005ను తీసుకువచ్చి, రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త విధానం అమలు చేయడానికి మార్గదర్శకాలు జారీ చేసింది.
యువతకు ఊరట
ఈ కొత్త విధానం ప్రధానంగా స్థానిక అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను పెంచే లక్ష్యంతో రూపొందించబడింది. ముఖ్యంగా గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలకు చెందిన యువతకు ఇది పెద్ద ఊరటనిస్తుంది. ఇకపై ఉద్యోగ నియామకాలలో 95% స్థానికులకు కేటాయించడం ద్వారా పోటీ తగ్గి, అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త జోన్‌ల వ్యవస్థ
మల్టీ జోన్–1
- జోన్ 1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
- జోన్ 2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ
- జోన్ 3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
మల్టీ జోన్–2
- జోన్ 4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు
- జోన్ 5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప
- జోన్ 6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి
ఉద్యోగాల విభజన విధానం
జిల్లా యూనిట్: జూనియర్ అసిస్టెంట్ మరియు దాని కంటే తక్కువ స్థాయి పోస్టులు, ఉపాధ్యాయ ఉద్యోగాలు
జోన్ యూనిట్: జూనియర్ అసిస్టెంట్ పైస్థాయి నుంచి సూపరింటెండెంట్ వరకు
మల్టీ జోన్ యూనిట్: డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న ఉన్నత పోస్టులు
లోకల్ కోటా పెంపు
ఇప్పటి వరకు అమలులో ఉన్న 80:20 (జిల్లా), 70:30 (జోన్) నిష్పత్తిని మార్చి, ఇప్పుడు అన్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల్లో 95% స్థానికులకు, 5% స్థానికేతరులకు కోటా కేటాయించారు. స్థానిక అభ్యర్థులు లేని పరిస్థితిలో ఆ పోస్టును 3 సంవత్సరాల వరకు క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు. అలాగే కనీసం ఒక పోస్టు ఓపెన్ కేటగిరీగా ఉంచడం తప్పనిసరి.
మినహాయింపులు ఇలా..
కొన్ని విభాగాలకు ఈ లోకల్ ఏరియా నిబంధనలు వర్తించవు
- ఆంధ్రప్రదేశ్ సచివాలయం
- విభాగాధిపతుల కార్యాలయాలు
- ప్రత్యేక కార్యాలయాలు
- రాష్ట్రస్థాయి సంస్థలు
- రాజధాని ప్రాంత పోలీసు ఉద్యోగాలు
అమలు గడువు
ఈ కొత్త కేడర్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 27 నెలల గడువు ఇచ్చింది. ఈ కాలంలో అన్ని పోస్టులను కొత్త కేడర్‌లలోకి సర్దుబాటు చేయాలి.
ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005 అమలు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో కీలక మార్పులకు దారి తీసింది. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత పెరగడం, జోన్‌ల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపనున్నాయి. ఈ మార్పులు యువతకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో చూడాల్సి ఉంది.
Also Read:
- ఖండాంతరాలు దాటిన RK రోజా కుమార్తె ఖ్యాతి: ప్రతిష్టాత్మక అవార్డ్!
- మెగాస్టార్ 158వ సినిమా.. టైటిల్ ఇదేనా?

మహేష్ – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో రెండు సంవత్సరాలుగా సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వార్తలు రాయడంలో అనుభవం ఉంది. జర్నలిజం రంగంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం కలిగిన నేను.. క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగి ఉన్నాను.
