హైదరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ డ్రైవ్ తనిఖీలు: ఎంతమంది పట్టుబడ్డారో తెలుసా?

రోజురోజుకి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ సందర్భంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో 273 మంది మోటారిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఈ కేసుల్లో ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం మోతాదు అధికంగా ఉన్న 16 మందిపై ప్రత్యేక కేసులు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు.

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో.. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి వీకెండ్ స్పెషల్ డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో.. బిజీ జంక్షన్లు, ఐటీ కారిడార్ ప్రాంతాలు, ప్రధాన రహదారులపై ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి.

ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు వివరాల ప్రకారం.. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ఈ తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పట్టుబడ్డ వాహనాల సంఖ్య

  • 214 మంది: ద్విచక్ర వాహనదారులు
  • ఎనిమిది మంది: త్రిచక్ర వాహనదారులు
  • 49 మంది: నాలుగు చక్రాల వాహనదారులు
  • ఇద్దరు: హెవీ వెహికల్ డ్రైవర్లు

ఈ డ్రంక్ డ్రైవింగ్ తనిఖీల్లో పట్టుబడిన వారిలో 16 మంది రక్తంలో మద్యం మోతాదు (BAC) 301 mg/100 ml కంటే ఎక్కువగా ఉన్నట్లు టెస్టులో తెలిసింది. ఇది చట్టపరంగా అత్యంత ప్రమాదకర స్థాయిగా భావిస్తారు. ఇలాంటి కేసుల్లో కోర్టు కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

కఠిన చర్యలు తప్పవా?

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకారం.. డ్రంక్ డ్రైవింగ్‌లో పట్టుబడిన వారందరినీ త్వరలో కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు ఆదేశాల ప్రకారం జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ప్రజలకు పలు సూచనలు కూడా చేశారు. మద్యం సేవించిన తర్వాత.. వాహనం నడపకుండా ఉండాలని, అవసరమైతే క్యాబ్ సేవలు లేదా ఇతర ప్రయాణ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. కుటుంబ సభ్యులు & స్నేహితులు కూడా మద్యం సేవించిన వారిని డ్రైవ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు చెప్పారు.

లక్ష్యం ఏమిటంటే?

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే డ్రంక్ డ్రైవింగ్ తనిఖీల ప్రధాన లక్ష్యం అని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. వీకెండ్ రోజుల్లో పబ్‌లు, రెస్టారెంట్లు & పార్టీలు ఎక్కువగా ఉండటంతో మద్యం సేవించి వాహనం నడపడం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇలాంటి సమయంలో కఠినమైన తనిఖీలు నిర్వహిస్తే గానీ.. ప్రమాదాలు తగ్గించడం కష్టం. కాబట్టి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు కొనసాగిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Also Read: My GHMC on WhatsApp: ఒక ఫిర్యాదులో.. చెత్త సమస్యకు చెక్!