Kavitha New Party TRS: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. గత కొంతకాలంగా ఊహాగానాలకు తెరదించి, కల్వకుంట్ల కవిత అధికారికంగా టీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన భారీ సభ వేదికగా ఈ ప్రకటన వెలువడటం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీసింది.
ఈ కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణలో ఇప్పటికే ఉన్న ప్రధాన పార్టీలకు కొత్త సవాల్ ఎదురవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నుంచి విడిపోయి కవిత కొత్త పార్టీ ప్రారంభించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయ మార్పు వరకు
కవిత తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను ప్రస్తావిస్తూ.. జాగృతి సంస్థ ద్వారా మహిళలను ఏకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో తన పాత్ర ఉందని తెలిపారు. తెలంగాణకు సాంస్కృతిక బలం జాగృతి ద్వారా పెరిగిందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “12 ఏళ్లు గడిచినా తెలంగాణ కలలు నిజం కాలేదు” అని వ్యాఖ్యానించడం గమనార్హం.
కేసీఆర్‌పై కవిత ఘాటు విమర్శలు
టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో కవిత చేసిన వ్యాఖ్యల్లో అత్యంత సంచలనం రేపిన అంశం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన విమర్శలే. “ఆనాటి కేసీఆర్ వేరు, ఈనాటి కేసీఆర్ వేరు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయారని ఆరోపించారు. ఉద్యమకారులకు న్యాయం జరగలేదని అన్నారు. అవినీతి అంశాలపై మాట్లాడినందుకు తనను పార్టీ నుంచి తొలగించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పడమే తన తప్పుగా మారిందని ఆమె తెలిపారు.
Remember The Name: Telangana Rashtra Sena
We refuse to back down, come what may;
It is time the people of Telangana have their say.
We will not let our aspirations decay;
Be reduced to ashes if you dare come in our way.Your Time is Done, Our Time is Now.#TRS… pic.twitter.com/UICyMplYJ1
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 25, 2026
బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు
బీఆర్‌ఎస్ పార్టీ తన అసలు ఆత్మను కోల్పోయిందని కవిత ఆరోపించారు. “ఆ పార్టీలో అమ్మతనం, మమకారం పోయాయి” అని ఆమె అన్నారు. పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ, గతంలో ఉద్యమకారులు చేసిన త్యాగాలు గుర్తించబడలేదని పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయం, ఉద్యమకారులకు జరిగిన అన్యాయంతో సమానమని ఆమె వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్‌పై విమర్శలు
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. గురుకులాల్లో పిల్లల మరణాలపై ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. రాష్ట్ర పరిపాలనలో బాధ్యత లోపించిందని విమర్శించారు.
BJPకి సవాల్
బీజేపీ తెలంగాణ ఏర్పాటును పూర్తిగా అంగీకరించలేదని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశంపై ఆ పార్టీ ఎంపీలు సరైన విధంగా స్పందించడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోయిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని బీజేపీకి సవాల్ విసిరారు.
“పాంచజన్యం” – కవిత ఐదు హామీలు
టీఆర్‌ఎస్ పార్టీ ద్వారా “పాంచజన్యం” పేరుతో ఐదు ప్రధాన హామీలను కవిత ప్రకటించారు. అవి విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం. ఈ ఐదు అంశాలపై పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.
భవిష్యత్ రాజకీయ వ్యూహం
కవిత తన ప్రసంగంలో రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. GHMC, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. “ఇప్పుడే మనమే ప్రధాన ప్రతిపక్షం, మరో రెండేళ్లలో అధికారంలోకి వస్తాం” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాలపై ప్రభావం
టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కు ఇది పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మేడ్చల్‌లో ప్రారంభమైన ఈ కొత్త పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఎంత ప్రభావం చూపుతుందన్నది రాబోయే ఎన్నికల్లో స్పష్టమవుతుంది.

మహేష్ – నేను MarthaTelugu వెబ్సైట్లో రెండు సంవత్సరాలుగా సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వార్తలు రాయడంలో అనుభవం ఉంది. జర్నలిజం రంగంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం కలిగిన నేను.. క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగి ఉన్నాను.
