అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ అంటే.. చాలామందికి చెప్పలేనంత అభిమానం. కొంతమంది అభిమానులు పవర్ స్టార్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా?, అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ‘ఓజీ’ సినిమా కోసం వేచి చూస్తున్నారు. కాగా చిత్ర బృందం కూడా పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు ఓ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 2న ఓజీ సాంగ్!
నటుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా షూటింగ్స్ ముగించుకుని పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే ‘హరిహర వీరమల్లు’ పూర్తి చేశారు. ఇక ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఓజీ షూటింగ్ కూడా దాదాపు పూర్తయిందని, ఇంకొంత భాగం పూర్తి కావాల్సి ఉందని సినిమా బృందం పేర్కొంది. ఓజీ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతంకంటే ముందు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా.. ఓజీ సినిమాకు సంబంధిన ఒక సాంగ్ విడుదల చేయడానికి ఓజీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా యాక్షన్ మూవీగా తెరకెక్కనుంది. దీనికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత.. డీవీవీ దానయ్య సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రియ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, వెన్నెల కిషోర్ మొదలైనవారు నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఓజీ సినిమాకు సంబంధించిన కొన్ని గ్లింప్స్, పోస్టర్ విడుదలయ్యాయి. ఇందులో పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా కనిపించడం చూడవచ్చు.
కొత్త అవతారంలో పవర్ స్టార్
నటుడు పవన్ కళ్యాణ్ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్).. సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికి విడుదలైన పోస్టర్లలో చూస్తే.. చేతిలో తుపాకీ పట్టుకుని, వర్షంలో తడిసి.. ఎగిరే బుల్లెట్లలతో చుట్టుముట్టిన కమాండింగ్ పోజులో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన చాలామంది అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. సినీ పరిశ్రమలో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
అంతంత మాత్రంగానే హరిహర వీరమల్లు
ఇటీవల తెరకెక్కిన పవన్ కళ్యాణ్ చిత్రం.. హరిహర వీరమల్లు ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. చాలా రోజుల ఆలస్యం తరువాత రిలీజ్ అయిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. అంతంత మాత్రమే అనిపించింది. పురాతన కథ అయినప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా కోసం రూ. 250 కోట్ల నుంచి రూ. 300 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ మాత్రం రూ. 106 కోట్లు అని తెలుస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడంటే?
ఓజీ సినిమా రిలీజ్ అయిన తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కనుంది. ఈ సినిమా 2025 నవంబర్ 14న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. బహుశా ఈ తేదీలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా, చమ్మక్ చంద్ర మొదలైనవారు నటిస్తున్నారు. ఈ సినిమాకు రూ. 200 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.






