రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించిన 1955 తర్వాత తొలిసారిగా తమిళనాడుకు వెలుపల భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో కొత్త తయారీ యూనిట్, వెండర్ పార్క్ ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు రూ.2,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. రెండు దశల్లో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 5,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఏర్పడనున్నాయి.
భారత మధ్యస్థ మోటార్‌సైకిల్ విభాగంలో 225cc నుంచి 750cc ఇంజిన్ శ్రేణిలో 88 శాతం మార్కెట్ వాటా కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం తమిళనాడులోనే తన తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆటోమొబైల్ రంగంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా సత్యవేడు ప్రాంతం తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల పరిశ్రమల అభివృద్ధికి అనుకూలంగా మారనుంది.
ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తుండగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ప్రముఖ సంస్థ రాష్ట్రాన్ని ఎంచుకోవడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి ప్రణాళిక
రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ఈ కొత్త తయారీ యూనిట్ తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వనేల్లూరు, రాళ్లకుప్పం గ్రామాల్లో ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 276 ఎకరాల భూమిని కేటాయించినట్లు సమాచారం. ఇందులో వనేల్లూరులో 233.76 ఎకరాలు, రాళ్లకుప్పంలో 42.38 ఎకరాలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశ 2029 నాటికి, రెండో దశ 2032 నాటికి పూర్తవుతుందని అంచనా. మొదటి దశలో తయారీ యూనిట్‌తో పాటు వెండర్ పార్క్ కూడా నిర్మించనున్నారు. ఆటోమొబైల్ తయారీలో వెండర్ పార్క్ కీలక పాత్ర పోషిస్తుంది. విడిభాగాల తయారీ సంస్థలు ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ వేగవంతమవుతుంది.
ఈ ప్లాంట్ ద్వారా సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 9 లక్షల మోటార్‌సైకిళ్ల మేర పెరగనుంది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం వార్షిక సామర్థ్యం 14.6 లక్షల యూనిట్లుగా ఉంది. కొత్త ప్లాంట్ ప్రారంభమైతే.. కంపెనీ తన ఉత్పత్తులను దేశ, విదేశాలకు ఎగుమతి చేయనుంది. అంటే డిమాండ్ సరైన సమయంలో తీరుస్తుందన్నమాట.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పరిశ్రమలను తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిష్టర్ నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రాయల్ ఎన్‌ఫీల్డ్ కేవలం మోటార్‌సైకిల్ బ్రాండ్ మాత్రమే కాదు. ఇది చరిత్ర, నైపుణ్యం, నాణ్యతకు ప్రతీక. ఈ ప్రతిష్ఠాత్మక బ్రాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతించడం గర్వకారణం” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ మరియు ఆధునిక తయారీ వ్యవస్థను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ పెట్టుబడి బలాన్నిస్తుందని ఆయన తెలిపారు.
సత్యవేడు ప్రాంతం భౌగోళికంగా కూడా పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. ఇది తమిళనాడు సరిహద్దుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రవాణా, సరఫరా వ్యవస్థలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. చెన్నై పోర్ట్, శ్రీ సిటీ వంటి పారిశ్రామిక కేంద్రాలకు సమీపంగా ఉండటం ఈ ప్రాజెక్టుకు అదనపు ప్రయోజనంగా మారింది.
తమిళనాడు వెలుపల తొలి విస్తరణ
1955లో భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ తన తయారీ యూనిట్లను ప్రధానంగా తమిళనాడులోనే అభివృద్ధి చేసింది. కంపెనీకి చెన్నై పరిసర ప్రాంతాల్లో ప్రధాన తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త యూనిట్ ఏర్పాటు చేయడం కంపెనీ వ్యూహాత్మక విస్తరణలో కీలక అడుగుగా భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మధ్యస్థ మోటార్‌సైకిళ్ల విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యం కొనసాగుతోంది. క్లాసిక్ 350, బుల్లెట్, హంటర్, మీటియర్, హిమాలయన్ వంటి మోడళ్లకు యువతలో మంచి ఆదరణ ఉంది. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ ఎగుమతులపై కూడా కంపెనీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త తయారీ కేంద్రం అవసరమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దూకుడు
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద కంపెనీలను ఆకర్షించేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది. గత ఏడాది దక్షిణ కొరియాకు చెందిన హ్వాసెంగ్ సంస్థ తమ నాన్-లెదర్ స్పోర్ట్స్ షూ తయారీ యూనిట్‌ను తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మార్చిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. కుప్పంలో 100 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయించారు.
అదే విధంగా క్యారియర్ గ్లోబల్ కూడా దక్షిణ భారతదేశంలో తమ తొలి తయారీ యూనిట్‌ను శ్రీ సిటీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై క్లస్టర్‌ను పరిశీలించిన తర్వాత చివరకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడం రాష్ట్ర పారిశ్రామిక వాతావరణానికి బలమైన సంకేతంగా భావిస్తున్నారు.
పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక వసతులు, రహదారులు, పోర్ట్ కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
రాజకీయ పరిణామాల ప్రభావం?
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ నిర్ణయం తీసుకున్న సమయం కూడా ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. తమిళనాడు ఇప్పటికీ దేశంలో అగ్రగామి తయారీ రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఎగుమతుల రంగాల్లో ఆ రాష్ట్రం బలమైన స్థానం కలిగి ఉంది.
అయితే కొత్త రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతమంది పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని చూపిస్తూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటుతో తిరుపతి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా ఫ్యాక్టరీ ఉద్యోగాలతో పాటు వెండర్ కంపెనీలు, రవాణా, లాజిస్టిక్స్, హోటల్, రియల్ ఎస్టేట్ రంగాలకు కూడా లాభం కలగనుంది.
Guess who’s coming to AP? pic.twitter.com/6JvNA15DXS
— Lokesh Nara (@naralokesh) May 7, 2026
స్థానిక యువతకు సాంకేతిక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. పరిశ్రమల విస్తరణతో చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు కూడా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది.
మొత్తం మీద చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కీలక మైలురాయిగా మారింది. అనుకున్న విషంగా ప్రాజెక్టు పూర్తయితే.. సత్యవేడు ప్రాంతం దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త: ఈ నెల 11న మెగా జాబ్ మేళా!

ఉమశ్రీ – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆటోమొబైల్, లైఫ్ స్టైల్ విభాగాల్లో అత్యంత ప్రావీణ్యం కలిగి ఉంది. ఈ విభాగాల్లో యూజర్లకు అవసరమైన అన్ని వార్తలను సమగ్రంగా అందిస్తాను. నాకు జర్నలిజం రంగంలో 8 సంవత్సరాల అనుభవం ఉంది.
