వాహనదారులకు శుభవార్త.. ఇకపై NOC అవసరం లేనట్టే?

ఉద్యోగం చేసే చాలామంది ఎప్పటికప్పుడు నగరాలు మారుతూ ఉంటారు. అలాంటి వారు వారితోపాటే తమ వాహనాలకు కూడా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో వాహనాన్ని కొత్త రాష్ట్రంలో మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రస్తుతం చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి వస్తోంది. కేంద్రం కొత్త ఆలోచన ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. వాహనం మొదట రిజిస్టర్ చేసిన రాష్ట్రంలోని RTO (Regional Transport Office) నుంచి తప్పనిసరిగా […]

ఉద్యోగం చేసే చాలామంది ఎప్పటికప్పుడు నగరాలు మారుతూ ఉంటారు. అలాంటి వారు వారితోపాటే తమ వాహనాలకు కూడా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో వాహనాన్ని కొత్త రాష్ట్రంలో మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రస్తుతం చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి వస్తోంది.

కేంద్రం కొత్త ఆలోచన

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. వాహనం మొదట రిజిస్టర్ చేసిన రాష్ట్రంలోని RTO (Regional Transport Office) నుంచి తప్పనిసరిగా NOC (No Objection Certificate) తీసుకోవాలి. ఈ ప్రక్రియలో అనేక పత్రాలు సమర్పించడం, కార్యాలయాలకు పలుమార్లు వెళ్లడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు NITI Aayog ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ కొన్ని ముఖ్యమైన సంస్కరణలను సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్రం వాహన బదిలీ నిబంధనలు సులభతరం చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

ఎన్ఓసీ అవసరం తగ్గే అవకాశం

ఒక వాహనాన్ని.. మరో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు, పాత రాష్ట్రంలోని RTO నుంచి NOC తీసుకోవడం తప్పనిసరి. ఈ సర్టిఫికేట్ ద్వారా వాహనంపై ఎలాంటి బకాయిలు, ట్రాఫిక్ చలాన్లు లేదా రోడ్ ట్యాక్స్ బకాయిలు లేవని నిర్ధారిస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. దేశవ్యాప్తంగా వాహనాల సమాచారం మొత్తం VAHAN నేషనల్ డేటాబేస్లో ఇప్పటికే డిజిటల్ రూపంలో నమోదు అవుతోంది. ఈ డేటాబేస్‌ను దేశంలోని అన్ని రవాణా శాఖలు యాక్సెస్ చేయగలవు.

కమిటీ సూచనల ప్రకారం.. ఈ డేటాను ఉపయోగించి వాహనం యాజమాన్యం, పన్నుల స్థితి, పెండింగ్ చలాన్లు వంటి వివరాలను ఆటోమేటిక్‌గా ధృవీకరించవచ్చు. దీంతో భౌతికంగా NOC తీసుకోవాల్సిన అవసరం లేకుండా వాహన బదిలీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ విధానం అమల్లోకి వస్తే.. రాష్ట్రాల మధ్య వాహన బదిలీ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

వాహన వయస్సు – కమిటీ సూచనలు

కొత్త సంస్కరణలతో పాటు వాహనాల వయస్సుకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలను కూడా సమీక్షించాలని కమిటీ సూచించింది. ప్రస్తుతం కొన్ని రవాణా నియమాల ప్రకారం.. వాహనం ఒక నిర్దిష్ట కాలం (సాధారణంగా 15 లేదా 20 సంవత్సరాలు) దాటిన తర్వాత రోడ్లపై నడపడానికి అనుమతి ఉండదు. దీంతో మంచి పరిస్థితిలో ఉన్న వాహనాలు కూడా.. నిర్ణయించిన వయసు దాటితే వినియోగం నుంచి తప్పుకోవాల్సి వస్తోంది.

కమిటీ అభిప్రాయం ప్రకారం.. వాహనాల వినియోగాన్ని వయస్సు ఆధారంగా కాకుండా ఫిట్‌నెస్ ఆధారంగా నిర్ణయించాలి. అంటే వాహనం సురక్షితంగా ఉందా?, ఉద్గార ప్రమాణాలను పాటిస్తున్నదా? అనే విషయాలను కఠినంగా పరీక్షించి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి విధానం ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉంది. వాహనం సురక్షిత ప్రమాణాలను పాటిస్తే అది ఎంత పాతదైనా ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.

ప్రయోజనాలేమిటంటే?

ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా వాహన యజమానులకు ప్రయోజనం కలగవచ్చు. రాష్ట్రాల మధ్య వాహన బదిలీ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది, RTO కార్యాలయాలకు వెళ్లే అవసరం తగ్గుతుంది, డాక్యుమెంట్స్ ప్రక్రియలు తగ్గుతాయి. డిజిటల్ వ్యవస్థ వల్ల పారదర్శకత పెరుగుతుంది. మొత్తం మీదే దీనివల్ల వాహనదారులకు చాలా ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో లక్షలాది మంది ఉద్యోగం, విద్య, వ్యాపారం కోసం రాష్ట్రాల మధ్య తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాహన బదిలీ నిబంధనలు సులభతరం చేయడం వారికి చాలా ఉపయోగాకారంగా ఉంటుంది.

తుది నిర్ణయం ఎప్పుడంటే?

ప్రస్తుతం తెరమీదికి వచ్చిన ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తోంది. సంబంధిత శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే.. NOC లేకుండానే వాహన బదిలీ చేసే విధానం దేశవ్యాప్తంగా పెద్ద సంస్కరణగా మారవచ్చు. ఇది భారతదేశంలో రవాణా వ్యవస్థను మరింత డిజిటల్ మరియు సులభతరం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. బహుశా తుది నిర్ణయం వేగంగానే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: మీకు తెలుసా: అప్పుడు రక్షణ దళాల కోసం వాహనాలు.. ఇప్పుడు ఇలా..

Himansh
Himansh
హిమాన్షు - నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో ఒక సంవత్సర కాలంగా పనిచేస్తున్నాను. నాకు ప్రత్యేకించి స్పోర్ట్స్ వార్తలు రాయడంలో అనుభవం ఉంది. జర్నలిజం రంగంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన నేను.. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.

Related Articles

Latest Articles