శుభవార్త.. రైతులకు ఖాతాల్లోకి రూ.6000!

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆర్థిక భద్రత కోసం.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో భాగంగా మరో విడత నిధులను విడుదల చేయనుంది. ఈ నెల 13న కృష్ణా జిల్లాలోని గన్నవరంలో జరిగే కార్యక్రమంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నారు.

కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా.. రాష్ట్రవ్యాప్తంగా 46.80 లక్షల మంది రైతులు ఈ ప్రయోజనం పొందనున్నారు. మొత్తం రూ.2,808 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వ పథకం అయిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. రాష్ట్ర ప్రభుత్వ పథకం అయిన అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా అందిస్తారు.

పీఎం కిసాన్ & అన్నదాత సుఖీభవ పథకాలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Kisan Samman Nidhi పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందజేస్తారు. ఇది మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న Annadata Sukhibhava పథకం ద్వారా అదనంగా ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఈ రెండు పథకాల ప్రయోజనాలను కలిపి రైతులకు మరింత ఆర్థిక మద్దతు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం విడుదల చేయనున్న విడతలో పీఎం కిసాన్ కింద రూ.2,000 & అన్నదాత సుఖీభవ కింద రూ.4,000 కలిపి మొత్తం రూ.6,000 రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది.

రూ.6309 కోట్ల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు రెండు విడతలుగా రైతులకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేశారు. ఇప్పటివరకు రూ.6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకాల ద్వారా రైతులకు సాగు ఖర్చులకు కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

రైతులకు ఉపయోగం ఏమిటి?

వ్యవసాయంలో విత్తనాలు, ఎరువులు, ఇతర ఖర్చులు ఎక్కువగా ఉండటంతో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం వల్ల మధ్యవర్తులు లేకుండా రైతులకు సాయం చేరుతుంది. ఇలాంటి పథకాల వల్ల రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుందని, వ్యవసాయ కార్యకలాపాలు సులభంగా కొనసాగించేందుకు సహాయపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

రైతుల కోసం ప్రభుత్వం

రైతులకోసం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన మాత్రమే కాకుండా.. పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీని హెక్టారుకు రూ.17,000 నుంచి రూ.25,000 పెంచారు. వరి కొనుగోలుకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి కోసం వేల కోట్ల రూపాయలు చెల్లించి, చాలా సందర్భాల్లో 24 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

రైతులకు ఎరువుల కొరత లేకుండా పెద్ద మొత్తంలో యూరియా నిల్వలు ఏర్పాటు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు నింపడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. మిర్చి, ఉల్లిపాయ, మామిడి, పొగాకు వంటి పంటలకు ధరలు పడిపోతే రైతులను రక్షించడానికి ప్రభుత్వం Price Stabilisation Fund ద్వారా సహాయం చేస్తోంది. వీటితో పాటు ఆధునిక వ్యవసాయం కోసం కొత్త కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.

Also Read: రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్!.. నారా లోకేష్ సంచనల వ్యాఖ్యలు