కియా కారెన్స్ ఇప్పుడు సీఎన్‌జీ రూపంలో: ధర & మైలేజ్ వివరాలు

ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన సౌత్ కొరియన్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. భారతీయ విఫణిలో కియా కారెన్స్ సీఎన్‌జీ కారును లాంచ్ చేసింది. ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్, పెరిగిన మైలేజ్ వంటి వాటిని గమనించవచ్చు. ఈ లేటెస్ట్ సీఎన్‌జీ కారు ధర, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రైస్ (ధర)

కియా కొత్త సీఎన్‌జీ కారెన్స్ ధర రూ.11.77 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే కంపెనీ ఈ సీఎన్‌జీని కేవలం ప్రీమియం (ఓ) ట్రిమ్‌లో మాత్రమే అందిస్తుంది. ధర కూడా సాధారణ మోడల్ కంటే ఎక్కువ. కంపెనీ ఈ సీఎన్‌జీ కిట్ మీద మూడేళ్లు లేదా ఒక లక్ష కిమీ థర్డ్ పార్టీ వారంటీని అందిస్తుంది.

ఇంజిన్

సరికొత్త కియా కారెన్స్ సీఎన్‌జీ మోడల్.. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 113 బీహెచ్పీ పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. కాగా పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది కేజీ సీఎన్‌జీతో 23 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని సమాచారం. బహుశా ఇది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంది.

కియా కారెన్స్ (ఓ) ప్రీమియం గురించి

సాధారణ కియా కారెన్స్ (ఓ) ప్రీమియం ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా కారెన్స్ సీఎన్‌జీ ధర స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 77,900 ఎక్కువని తెలుస్తోంది.

కారెన్స్ (ఓ) ప్రీమియం వేరియంట్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, రూఫ్ మౌంటెడ్ ఏసీ, రెండవ వరుసలో వన్ టచ్ ఎలక్ట్రికల్ టంబుల్, సెమీ లెథరెట్ అపోల్స్ట్రే, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ ఓఆర్వీఎం, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వ్యూ కెమెరా మొదలైన ఫీచర్స్ పొందుతుంది. అయితే ఇప్పుడు సీఎన్‌జీ ఆప్షన్ రావడంతో.. ఇందులో బూట్ స్పేస్ ఎంత ఉంటుందనే విషయం స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే ఫ్యూయెల్ మోడల్స్ మాత్రం 216 లీటర్స్ బూట్ స్పేస్ పొందుతుంది.

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. కియా కారెన్స్ (ఓ) వేరియంట్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ఆల్ వీల్ బ్రేక్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఐసోఫిక్స్ పాయింట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్ మొదలైనవి పొందుతుంది. ఇప్పటికే కారెన్స్ గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (జీఎన్సీఏపీ) క్రాష్ టెస్టులో 3-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.

డీలర్స్ స్థాయిలో సీఎన్‌జీ అమర్చిన ఇతర కార్లు

మన దేశంలో డీలర్ స్థాయిలో సీఎన్‌జీ కిట్ అమర్చిన కార్ల జాబితాలో.. ఇప్పటికే హోండా సిటీ, హోండా అమేజ్, హోండా ఎలివేట్, రెనాల్ట్ క్విడ్, రెనాల్ట్ ట్రైబర్, రెనాల్ట్ కైగర్, సిట్రోయెన్ సీ3, సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్, నిస్సాన్ మాగ్నైట్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కియా కారెన్స్ చేసింది. కాగా ఇండియన్ మార్కెట్లో సీఎన్‌జీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే పలు కంపెనీలు కార్లను సీఎన్‌జీ విభాగంలో లాంచ్ చేస్తున్నాయి.