మోంథా తుఫాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీరప్రాంతాలను అల్లకల్లోలం చేసింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకున్నప్పటికీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతి ఈ రోజు తుఫాన్ బలహీనపడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా బుధవారం రోజు మొత్తం మీద తెలంగాణాలో ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. బహుశా ఈ రోజు కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో పరిస్థితులను ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని కీలక సూచనలు చేశారు.
తుఫాన్ ప్రభావం.. పవన్ కళ్యాణ్ సూచనలు
రాష్ట్రంలోని సుమారు 1583 గ్రామాలపై తుఫాన్ ప్రభావం పడినట్లు అధికారులు.. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. 125 చోట్ల రహదారులు పాడైనట్లు పేర్కొన్నారు. తుఫాన్ సమయంలో అధికార యంత్రంగా, సంబంధిత అధికారులు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంది. ముఖ్యంగా తాగునీటి వసతి కల్పించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దెబ్బతిన్న రోడ్లను తొందరగా బాగు చేయాలని ఆదేశించారు. సూపర్ క్లోరినేషన్, శానిటైజేషన్ వంటి కార్యక్రమాలను కూడా చేపట్టాలని వివరించారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో.. తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయి. వరదనీరు తగ్గేవరకు ప్రజలను కావలసిన నిత్యావసరాలను ఏర్పాటు చేయాలి. తాగునీటిని అందించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. గ్రామాల్లో ప్రత్యేకంగా శానిటైజేషన్ బృందాలను ఏర్పాటు చేయాలి. తాగునీరు కలుషితమైతే.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దీనిపై అధికారులు తప్పకుండా శ్రద్ద వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
పునరావాస కేంద్రాల్లో ఉండేలా..
రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ శానిటైజేషన్ బృందాలను ఏర్పాటు చేయాలి. పారిశుధ్య పనులను వేగవంతం చేయాలి. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను తక్షణమే బాగుచేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా తుఫాన్ బలహీన పడిన తరువాత కూడా.. పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలను పునరావాస కేంద్రాల్లో ఉండేలా చూసుకోవాలని అన్నారు. మోంథా తుఫాన్ తీరందాటే సమయంలో వర్షాలు భీభత్సంగా కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దీనికి అధికార యంత్రంగా తోడుగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
మోంథా తుఫాన్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో భారీ నష్టాన్ని కలిగింది. వేలఎకరాల పంట నష్టం జరిగింది. రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రజారవాణా చాలా చోట్ల ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా నీటిమయమే. అయితే ఇప్పటివరకు ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. కానీ పరిస్థితులు చూస్తుంటే.. ఊహకందని నష్టం జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది.
తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను బాగుచేయడానికి ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటోంది. ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్న ప్రకృతి వైపరీత్యాలను ఆపడం మానవాతీతం అనే చెప్పాలి. అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సహకరించింది. ఇదే సమయంలో పరిస్థితులను చక్కదిద్దడానికి.. తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీచేసారు.