Home Blog Page 114

మొదటి ఉద్యోగం.. మూడు గంటల్లోనే రాజీనామా!: కారణం ఇదే అంటూ పోస్ట్

చదువుకోవడం ఒక ఎత్తు అయితే.. చదువుకున్న తరువాత జాబ్ తెచ్చుకోవడం మరో ఎత్తు అయిపోయింది. అయితే కొందరు మాత్రం వచ్చిన ఉద్యోగం నచ్చక.. గంటల వ్యవధిలో లేదా రోజుల వ్యవధిలో ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్వాపరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మూడు గంటల్లో జాబ్ వదిలేశా!

”ఈ రోజు నాకు ఉద్యోగం వచ్చింది. ఇదే నా మొదటి జాబ్. ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉద్యోగమే.. కొంత ఒత్తిడితో కూడుకున్నది. అయినప్పటికీ.. రోజుకు 9 గంటల పని, జీతం రూ. 12వేలు మాత్రమే. ఈ ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ మూడు గంటల తరువాత.. ఇది (జాబ్) నా సమయాన్నంతా తీసుకుంటోంది. నేను కెరీర్‌లో ఎదగలేనని గ్రహించాను. దీంతో నేను ఉద్యోగం వదులుకున్నాను” అని రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. కెరియర్ గురించి ఆలోచించడం మంచిదే అని కొందరు చెబుతుంటే.. ఉద్యోగం చేరడానికి ముందే అలొచుకుంకోలేదా అని ఇంకొందరు అంటున్నారు. కొంతమంది మాకు అలాంటి వర్క్ ఫ్రమ్ జాబ్ కావాలని అంటున్నారు.

విశ్లేషణ చేద్దాం..

కెరియర్ దృష్ట్యా.. రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన యూజర్ చేసిన పని సమర్ధనీయమే. కానీ 140 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న మనదేశంలో.. ప్రతి ఏటా డిగ్రీలు చదివి బయటకు వస్తున్నవారు లెక్కకు మించి ఉన్నారు. అయితే బయటకు వచ్చినవారిలో ఏదో ఒక ఉద్యోగం చూసుకుని.. అందులోనే ముందుకు వెళ్లేవారు కొందరు ఉంటే.. నచ్చిన ఉద్యోగం కోసం చాలా రోజులు ఎదురు చూసేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. మరికొందరు నచ్చిన ఉద్యోగం వచ్చేవరకు.. చేతికి దొరికిన పని చేస్తూ, ఖర్చులకు డబ్బులు సంపాదించుకుంటున్నారు.

చదువుకుని డిగ్రీలు తెచ్చుకుని, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పేదకుటుంబాలకు చెందినవారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. ఒకానొక దశలో గొప్ప ఉద్యోగాలను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే డబ్బున్నవారు.. తమకు కావలసిన ఉద్యోగం వచ్చేవరకు ఇంకో పనిచేయడానికి బహుశా సుముఖత చూపరు. దీన్ని బట్టి చూస్తే రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి ఏ కోవకు చెందినవారో అర్థం చేసుకోవచ్చు. బహుశా అతడు రూ. 12వేలు జీతం వచ్చే ఉద్యోగానికి అప్లై చేసాడంటే.. వారిది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు.

ఉద్యోగానికి అప్లై చేయడానికి ముందే..

ఇకపోతే.. ఉద్యోగానికి అప్లై చేయడానికి ముందే, జీతం ఎంత?, చేయాల్సిన పని గంటలు ఎంత? అనే విషయాలను తప్పకుండా చూసుకోవాలి. అవన్నీ ఒకే అనుకున్నప్పుడే ఉద్యోగాలకు అప్లై చేయాలి. ఎందుకంటే ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు చాలామందే ఉన్నారు. మీరు జాబ్ తెచ్చుకుని.. గంటల్లో రాజీనామా చేస్తే.. వెనుక ఉన్న ఉద్యోగి మొదట్లో మీ వల్లనే ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం నాకు చాలా అవసరం అనుకున్నప్పుడే.. జాబ్ కోసం ముందగు వేయడం మంచిదని మా అభిప్రాయం.

టాటా సియెర్రా vs హ్యుందాయ్ క్రెటా: ధరలు, ఇంజిన్ డీటెయిల్స్ ఇవే!

టాటా మోటార్స్ ఇటీవలే దేశీయ విఫణిలో తన సియెర్రా కారును ఆవిష్కరించింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు భారతదేశంలో అడుగుపెట్టిన తరువాత.. హ్యుందాయ్ క్రెటా కారుకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కార్లకు సంబంధించిన డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వివరాలు, ధరలు ఎలా ఉన్నాయి?, ఇందులో.. రెండు కార్లకు మధ్య ఉన్న సారూప్యం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

డిజైన్ ఎలా ఉందంటే?

టాటా సియెర్రా.. బాక్సీ డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్స్, డీఆర్ఎల్ వంటి వాటితో పాటు.. బ్రాండ్ లోగో, సియెర్రా అక్షరాలు కనిపిస్తాయి. స్కిడ్ ప్లేట్, ఫాగ్ ల్యాంప్‌లతో అనుసంధానించండి ఉంటుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్.. 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా ఈ కారులో ఉండటం గమనించవచ్చు. వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్‌లతో విలీనమయ్యే ఎల్ఈడీ లైట్ బార్ ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా.. చూడచక్కని డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ లైట్ బార్, క్రోమ్ యాక్సెంట్‌లు ఉన్నాయి. ఇది డ్యూయెల్ టోన్ ఫినిషింగ్ పొందటం వల్ల చూడటానికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సియెర్రా మాదిరిగా బోల్డ్ డిజైన్ పొందదు. క్రెటా అంచులలో యాంగ్యులర్ డిజైన్ కనిపిస్తుంది. స్ప్లిట్ టెయిల్‌లైట్ క్లస్టర్ ఉంటుంది. ఈ కారు స్పోర్టీ లుక్‌ను మరింత మెరుగు పరచడానికి రూఫ్ స్పాయిలర్, సిల్వర్ ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.

డైమెన్షన్స్ (కొలతలు)

టాటా మోటార్స్ తన సియెర్రా కారును ఆవిష్కరించింది. కానీ దీని పరిమాణంకు సంబంధించిన విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ.. ఇది బాక్సీ డిజైన్ కలిగి ఉండటం వల్ల.. హ్యుందాయ్ క్రెటా కంటే కూడా కొంత పెద్దదిగా, విశాలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

హ్యుందాయ్ క్రెటా విషయానికి వస్తే.. దీని పొడవు 4330 మిమీ, వెడల్పు 1790 మిమీ, ఎత్తు 1635 మిమీ, వీల్‌బేస్ 2610 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 190 మిమీ వరకు ఉంది. అంటే ఇది ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.

ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

ప్రస్తుతానికి టాటా సియెర్రా వేరియంట్లకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. కానీ ఈ మోడల్ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ జోన్ ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రియర్ సన్‌షేడ్‌లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం వంటివన్నీ ఉంటాయని తెలుస్తోంది.

హ్యుందాయ్ క్రెటా ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయెల్ జోన్ ఆటోమాటిక్ టెంపరేచర్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నెల్ వంటివెన్నో పొందుతుంది.

ధరల గురించి

టాటా మోటార్ తన సియెర్రా కారు ధరలను అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 12.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉండవచ్చని సమాచారం. అయితే కంపెనీ ఈ కారు ధరలను కంపెనీ నవంబర్ 25న లాంచ్ సమయంలో వెల్లడించనుంది. హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా ధరలు రూ. 10.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది మల్టిపుల్ వేరియంట్లలో, బహుళ ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎంచుకునే వేరియంట్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి.

ఇంజిన్ వివరాలు ఇలా

కొత్త టాటా సియెర్రా కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 170 హార్స్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో లభిస్తుంది. అంతే కాకుండా ఇది.. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇది 118 హార్స్ పవర్, 260 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటాలో 115 బీహెచ్పీ పవర్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 116 బీహెచ్పీ పవర్ డెలివరీ చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 160 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ వంటి ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.

50ఏళ్ల సినీ ప్రస్థానం: రజినీకాంత్, బాలకృష్ణకు అరుదైన గౌరవం

0

ఏదైనా ఒకరంగంలో సుదీర్ఘ కాలం మనగలగడం అంటే.. అది సాధారణ విషయం కాదు. అలాంటిది సినిమా రంగంలో ఐదు దశాబ్దాలు (50 ఏళ్లు) పూర్తి చేసుకున్న నటులుగా సూపర్ స్టార్ రజినీకాంత్, నటసింహ నందమూరి బాలకృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు. దీనికి గాను.. గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా 2025 (ఐఎఫ్ఎఫ్ఐ 2025) కార్యక్రమంలో వీరిని ఘనంగా సత్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయకమంత్రి డాక్టర్ ఎల్ మురుగన్.. గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో వెల్లడించారు.

2025 నవంబర్ 20న ప్రారంభం కానున్న ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమం నవంబర్ 28న ముగుస్తుంది. కార్యక్రమం ముగింపు రోజు రజనీకాంత్, బాలకృష్ణలకు సన్మానం చేయనున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో శాశ్వత ముద్ర వేసిన ఈ ఇరువురిని ఇక్కడ గౌరవించనున్నారు. ఈ వేడుకలు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో డీబీ బందోద్కర్ రాదు వెంబడి గల్లా ఫ్లోట్ పరేడ్‌లో ప్రారంభమవుతుందని సమాచారం.

ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమం గురించి

గోవాలో ప్రారంభం కానున్న ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమంలో.. 84 వేర్వేరు దేశాల నుంచి 270 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇందులో సుమారు 7500 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని మంత్రి మురుగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయులు మాత్రమే కాకుండా.. స్పెయిన్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా పాల్గొంటాయి. ఇక్కడ కేన్స్, బెర్లినేల్, వెనిస్ మరియు ఇతర అంతర్జాతీయ చలన చిత్రాల నుంచి అవార్డులు గెలుచుకున్న చిత్రాలను ప్రదర్శిస్తారు.

రజినీకాంత్ 

తమిళ నటుడు అయినప్పటికీ.. రజనీకాంత్ తెలుగువారికి కూడా సుపరిచయమే. ఈయన 1975లో అపూర్వ రాగంగల్ సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ప్రారంభంలో అనేక నెగిటివ్ పాత్రలను పోషించిన ఈయన.. ఆ తరువాత మంచి మంచి సినిమాల్లో నటించి ఎనలేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. 70 సంవత్సరాల వయసు దాటినప్పటికీ.. రజినీ కాంత ఇప్పటికి కూడా తనదైన రీతిలో సినిమాల్లో నటిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా రంగానికి ఈయన చేసిన సేవకుగాను.. ఇప్పటికే ఎనలేని గొప్ప అవార్డులు కూడా రజినీకాంత్ సొంతం అయ్యాయి. ఎంత పెద్ద స్టార్ అయినా.. చాలా సాదాసీదాగా గడిపే మహామనిషి ఈయనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నందమూరి బాలకృష్ణ

రామారావు కుమారుడు.. నందమూరి బాలకృష్ణ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. దీంతో ఈయన నటించిన మొత్తం సినిమాల సంఖ్య ఏకంగా 100 దాటేసింది. సమరసింహా రెడ్డి, సింహా, ముద్దుల మావయ్య వంటి ఎన్ని సినిమాల్లో నటించిన ఈయన రాజకీయ ప్రవేశం కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఇప్పుడు అఖండ 2 సినిమాతో త్వరలోనే మరో సినిమాతో తెరమీద కనిపించనున్నారు. 65 సంవత్సరాల వయసులో కూడా.. కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్న ఈయన.. నటన అనిర్వచనీయం అనే చెప్పాలి. అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయాల్లో బిజీగా ఉండే బాలకృష్ణ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలోనే ఈయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

పెళ్లి ఎప్పుడో చెప్పిన హీరో సాయిధరమ్‌ తేజ్‌

0

మెగా ఫ్యామిలీలో మరొకరు పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా వెల్లడించినట్లు సమాచారం. గత ఏడాదే వరుణ్ తేజ్ పెళ్లి జరిగింది. ఇక సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పెళ్లిపై క్లారిటీ..

నటుడు సాయిధరమ్ తేజ్.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లిపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో నా పెళ్లి ఉంటుందని అన్నారు. మంచి జీవితాన్ని, మంచి చిత్రాలను అందించిన భగవంతునికి కృతఙ్ఞతలు. కొత్త ఏడాది వస్తోంది. ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే ఏడాది నేను నటించిన సంబరాల ఏటిగట్టు సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.

సంబరాల ఏటిగట్టు

సాయిధరమ్ తేజ్ నటించిన సంబరాల ఏటిగట్టు సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం.. రోహిత్ కేపీ దర్శకత్వంలో విడుదల కానుంది. ఇంకా ఈ సినిమాలో అనన్య నాగేళ్ల, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం భారీగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రం తన జీవితంలో చాలా ముఖ్యమైందని గతంలో జరిగిన ఒక కార్యక్రమంలో.. సాయిధరమ్ తేజ్ స్పష్టం చేశారు.

నటుడు సాయిధరమ్ తేజ్

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈయన 2014లో పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతో.. తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, విన్నర్, జవాన్, చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించారు. బ్రో సినిమాలో.. పవన్ కళ్యాణ్ & సాయిధరమ్ తేజ్ ఇద్దరూ కలిసి కనిపించారు. కాగా ఇప్పుడు సంబరాల ఏటిగట్టు సినిమాతో కనిపించనున్నారు. ఈయన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్, సంతోషం ఫిల్మ్ అవార్డు, సినిమా అవార్డు వంటివి గెలుచుకున్నారు.

ఐశ్వర్య లక్ష్మి గురించి

బహుశా ఐశ్వర్య లక్ష్మి గురించి చాలామందికి తెలిసుండకపోవచ్చు. కానీ 2022లో రిలీజ్ అయిన అమ్ము సినిమాలో కనిపించింది. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఈమె.. ప్రారంభంలో మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. ఆ తరువాత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈమె ఒక కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, మూడు సైమా అవార్డులను మాత్రమే కాకుండా.. ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు సౌత్ కూడా అందుకుంది.

ఈమె పొన్నియమ్ సెల్వం సినిమాలో కూడా నటించింది. ఆ తరువాత అనేక సినిమాల్లో నటిస్తూ.. అత్యధిక పారితోషికం తీసుకుంనే మలయాళీ నటిగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఇప్పుడు సాయిధరమ్ తేజ్ సరసన సంబరాలు ఏటిగట్టు సినిమాలో కనిపించనుంది. ఈ సినిమా 2026లో రిలీజ్ అవుతుందని సమాచారం. అయితే ఏ నెలలో రిలీజ్ అవుతుందనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

కారులో టింటెడ్ గ్లాస్ ఫిల్మ్: ఇవి తెలుసుకోకుంటే.. ప్రమాదమే!

కారు కొనుగోలు చేసే దాదాపు అందరూ.. టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ లేదా సన్ ఫిల్మ్ ఎంచుకుంటారు. అయితే కొందరు మాత్రం థర్డ్ పార్టీ యాక్ససరీలను ఉపయోగిస్తారు. అయితే టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ వల్ల ఉపయోగాలు ఏమిటి?, థర్డ్ పార్టీ యాక్ససరీలుగా ఈ ఫిల్మ్ వాడటం చట్టబద్దమేనా?, అనే ఆసక్తికరమైన విషయాలు పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం.

ఏమిటీ టింటెడ్ గ్లాస్ ఫిల్మ్

టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ అనేది.. క్యాబిన్‌లోకి నేరుగా వచ్చే కాంతిని, సూర్యరశ్మిని (వేడి) తగ్గిస్తాయి. దీంతో కారు లోపల ఏసీ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే భారతదేశంలో ఆఫ్టర్ మార్కెట్ టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ ఉపయోగించడం చట్ట విరుద్ధం. దీనికి సంబంధిత శాఖలు జరిమానాలు కూడా విధిస్తాయి.

భారతదేశ ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు 2012లో ఒక తీర్పును ఇచ్చింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆఫ్టర్ మార్కెట్ టింటెడ్ గ్లాస్ ఫిల్మ్‌లను ఉపయోగించకూడదని స్పష్టం చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాహనాన్ని తయారు చేసిన కంపెనీ మాత్రమే.. ముందు, వెనుకవైపు 70 శాతం.. సైడ్ విండోలకు 50 శాతం కాంతి ప్రసారాలను కలిగిన టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ ఉపయోగించడం చట్టబద్ధమే. అయితే ఎట్టి పరిస్థితుల్లో.. ఆఫ్టర్ మార్కెట్ టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ ఉపయోగించకూడదు.

టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ వల్ల ఉపయోగాలు

  • టెంపరేచర్ కంట్రోల్: టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ ఉపయోగించడం వల్ల బయట నుంచి కారులోకి వచ్చే ఉష్ణోగ్రత తగ్గుతుంది. తద్వారా ఏసీ వినియోగం కొంత తగ్గుతుంది. తద్వారా ఏసీ లైఫ్ టైమ్ కొంత పెరుగుతుంది.
  • అల్ట్రా వయొలెట్ కిరణాల నుంచి రక్షణ: సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల (అల్ట్రా వయొలెట్ కిరణాలు)ను టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ ఆపుతుంది. దీంతో ప్రయాణికుల చర్మానికి ప్రమాదం తగ్గుతుంది. కారు లోపల ఉండే ఇంటీరియర్స్ కొంతకాలం మన్నికగా ఉంటాయి.
  • భద్రత & సౌందర్యం: టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ ఉపయోగించడం వల్ల లోపల ఉన్న విలువైన వస్తువులు బయటి వారికి అంతగా కనిపించవు. ఇది ఒకరకంగా భద్రతకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా వేడి, ఇతర కిరణాలు నేరుగా కారు లోపలికి పడదు, కాబట్టి కారు చూడటానికి చాలా రోజులు అందంగానే కనిపిస్తుంది.

ఆఫ్టర్ మార్కెట్ టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ వల్ల నష్టాలు

  • ఆఫ్టర్ టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ ఉపయోగించడం వల్ల కారు లోపల ఏమి జరుగుతుందో.. బయటివారికి కనిపించదు. కాబట్టి కొందరు ఇలాంటి సందర్భంలో అసాంఘిక కార్యకలాపాలను పాల్పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే సుప్రీం కోర్టు ఆఫ్టర్ మార్కెట్ టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ ఉపయోగించకూడదని తీర్పును ఇచ్చింది.
  • థర్డ్ పార్టీ లేదా ఆఫ్టర్ మార్కెట్ టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ ఉపయోగించడం వల్ల.. రాత్రి సమయంలో దృశ్యమానత చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా అనుకోని ప్రమాదాలు జరుగుతాయి.
  • కంపెనీ ఇచ్చే టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ కాకూండా.. ఇతర కంపెనీలు ఇచ్చే టింటెడ్ ఫిల్మ్ గ్లాస్ ఉపయోగిస్తే ఇన్సూరెన్స్ సమస్యలు కూడా ఎదుర్కోవాలి ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు మీ కారులో థర్డ్ పార్టీ టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ ఉపయోగించారని తెలిస్తే.. ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అవుతుంది.
  • ఆఫ్టర్ మార్కెట్ టింటెడ్ గ్లాస్ ఫిల్మ్ ఉపయోగిస్తూ.. ట్రాఫిక్ పోలీసులు లేదా రవాణా అధికారులకు పట్టుబడితే భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వాహన వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

సన్‌రైజర్స్ హైదరాబాద్: ఈసారి పక్కా ప్రణాళికతో..

2026 ఐపీల్ సీజన్ కోసం అన్ని ప్రాంచైజీలు తమ తమ ట్రేడ్ అండ్ రిటెన్షన్ వివరాలు బయటపెట్టాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ తనకు అవసరం లేని చాలామంది ఆటగాళ్ళని వేలంలోకి వదిలేసింది. బౌలర్ మహమ్మద్ షమీని ట్రేడ్ ద్వారా 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్‌కి ఇచ్చేసింది. ఇతను ఎస్‌ఆర్‌హెచ్‌కు అనుకున్నంత పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోవడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. అయితే మిగిలిన ఆటగాళ్లందరిని ఆక్షన్‌లోకి వదిలింది.

జాబితా ఇలా..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది మందిని ఆటగాళ్ళని విడిచిపెట్టింది. జాబితాలో ఆడమ్ జంపా, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, అథర్వ్ టైడే, వివాన్ ముల్డర్, సీమార్జీత్ సింగ్, రాహుల్ చాహర్, మహమ్మద్ షమీ ఉన్నారు.

ఎనిమిది మందిని తొలగించిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మిగిలినవారు ”ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, కమిందు మెండీస్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, జీషాన్ అన్సారీ, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, అనికేత్ వర్మ, బ్రడోన్ కార్శే, ఆర్. స్మారన్” లాంటి కోర్ టీమ్ మాత్రమే.

కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్

దీంతో క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకుంటుంది అనే ఊహగానాలకు పులస్టాప్ పెట్టినట్టు అయింది. అయితే అందుకు కారణం అతని ధర రూ. 23 కోట్లుగా ఉండటమే అని చెప్పొచ్చు. క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినప్పటికి అతనిని కొనసాగించడానికే మొగ్గు చూపింది.

అయితే ఇప్పుడు ఎనిమిది మందిని విడిచిపెట్టిన తర్వాత సన్‌రైజర్స్ ఖాతాలో 25 కోట్ల రూపాయలు మిగిలాయి. ఈ డబ్బులతో దాదాపు పది మంది ఆటగాళ్లను కొనాల్సి ఉంది. మరి ఇప్పటికి అయితే బ్యాటింగ్ విభాగం ముందు ఉన్నదే అలాగే ఉంది. కాబట్టి బ్యాటర్లపై పోకస్ పెట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఆల్ రౌండర్స్ కూడా అంతే ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి, కామిందు మెండీస్, హర్ష దూబే, అనికేత్ వర్మ, జీషాన్ మలింగ లాంటి వాళ్లు ఉండనే ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. ముందు ఉన్న వారినే నమ్ముకుని మళ్లీ రిటైన్ చేసుకుంది. కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ కొనసాగనున్నాడు.

కప్ గెలవడమే లక్ష్యం!

సన్‌రైజర్స్ 2024లో ఫైనల్ వరకు వెళ్లి కేకేఆర్ చేతిలో దారుణంగా ఓటమిపాలయింది. అయితే మళ్ళీ కొన్ని చిన్న మార్పులతో అదే టీమ్‌తో 2025లో ఆడినప్పటికి ప్లేఆఫ్స్ కూడా వెళ్లలేకపోయింది. కానీ లెక్కలేనన్ని రికార్డులు మాత్రం నెలకొలిపింది. దీంతో ఐపీఎల్‌లో హైయస్ట్ స్కోర్ చేసిన టీమ్‌గా చరిత్ర సృష్టించింది. మొదట నాలుగు 277, 278, 286, 287 స్థానాల్లో కూడా సన్‌రైజర్స్ జట్టే నిలిచింది. దీంతో అభిమానులు 300 టార్గెట్ అనేది ఎక్కువ ప్రచారం చేశారు. మరి ఈ సారి కాటేరమ్మ కొడుకులు ఎలా ఆడుతారో చూడాలి. వికెట్స్ ఒక వైపు దూకుడుగా ఆడి ప్రత్యర్థి బౌలర్లను బయపెట్టడం వీరి నైజం. ఆ దూకుడే సన్‌రైజర్స్‌కు ఎప్పుడు లేనంతగా అభిమానులని సంపాధించి పెట్టింది. అయితే ఇప్పుడు ఎలాగైనా ఫైనల్‌కు వెళ్లి కప్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతున్నది.

అప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు వారణాసి: జక్కన్న మనసులో ఏముంది?

0

దర్శక ధీరుడు, ఓటమి ఎరుగని డైరెక్టర్ పాన్ ఇండియా క్రియేటర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి సినిమా ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మొదలైన నేటికీ నెంబర్ స్థానంలోనే కొనసాగుతున్న ఈయన 2025 నాటికి మొత్తం 13 సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రధాన కథానాయకుడుగా (హీరో) చేసి ఒక సినిమా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు వారణాసి అనే పేరు కూడా పెట్టేశారు. ఇప్పుడు చాలామంది మనసులో మెదులుతున్న ప్రశ్న, గూగుల్ తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తున్న అంశం ఏమిటీ వారణాసి అని.

ఏమిటీ వారణాసి?

నిజానికి వారణాసి అనేది భారతదేశంలోని ఒక పుణ్యభూమి.. మహాశివుడు కొలువై ఉన్న కాశీనే వారణాసిగా పిలుస్తారు. సంస్కృతంలో వారణాసికి అర్థం ప్రకాశించే స్థలం అని అర్థం. ఇది దేవభూమి. అలాంటి పవిత్రమైన నగరం పేరును తెలుగు సినిమాకు పెట్టడం చాలా ఆనందించాల్సిన విషయం. పేరును బట్టి చూస్తే.. మహేష్ బాబు వారణాసి సినిమా, కాశీ పరిసర ప్రాంతాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందని తెలుస్తోంది. మొత్తం మీద వారణాసి గొప్పతనాన్ని చూపించడానికి.. రాజమౌళి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోందని చాలామంది భావిస్తున్నారు. బహుశా ఆయన మనసులో ఇదే ఉందేమో?

2027లో రిలీజ్?

ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని వారణాసి గ్లింప్స్ చూస్తుంటే.. మహేష్ బాబు చేతిలో త్రిశూలం పట్టుకుని, నందిపై రావడం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. నదులు, అందమైన ప్రకృతి దృశ్యాలు, అన్నీ కూడా కనువిందు చేస్తున్నాయి. ఈ సినిమా బహుశా 2027 విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే విడుదల తేదీకి సంబంధించిన విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు.

మహేష్ బాబు విశ్వరూపం చూశా!

వారణాసి సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో మహేష్ బాబు విశ్వరూపం చూశానని పేర్కొన్నారు. ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. వారణాసి కథను ఆయనే రాసినప్పటికీ.. రాజమౌళి డైరెక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఒక పెద్ద సంచలనం సృష్టిస్తుందని.. సినిమా రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు.

మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్ ఖాయం!

నిజానికి పోకిరి సినిమాతో.. సినీ ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన మహేష్ బాబు.. ఇప్పుడు వారణాసి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు అర్థమైపోతోంది. ఈ సినిమా మహేష్ బాబు జీవితంలో మరిచిపోలేని ఘట్టం అని తెలుస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలు ఒక లెక్క.. రాబోయే వారణాసి ఇంకో లెక్క అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఏకంగా రూ. 1200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

రాజమౌళి సినిమాలు

2001లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో.. దర్శకుడిగా ప్రారంభమైన రాజమౌళి అడుగులు, ఇప్పుడు వారణాసి వరకు వచ్చాయి. ఈ మధ్యలో సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, బాహుబలి2, బాహుబలి ది ఎపిక్ వంటి సినిమాలను తెరకెక్కించారు. కాగా ఇక వారణాసి సినిమాను తెరకెక్కించడానికి దర్శకధీరుడు సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. రాజమౌళి ఫ్యాన్స్ కూడా వేచి చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

12ఏళ్ల బంధానికి వీడ్కోలు.. చెన్నై గూటికి సంజు శాంసన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రేడ్ మరియు రిటెన్షన్ ముగియడంతో ప్రాంచైజీలు ఆయా ఆటగాళ్ళను ఆక్షన్‌లోకి వదిలేసారు. ఎవరిని ట్రేడ్ చేశారు. ఎవరిని అలాగే నిలుపుకున్నారు అనేది తేలిపోయింది. దీంతో ఇప్పటి నుంచే అభిమానుల్లో ఐపీఎల్ హీట్ మొదలయిపోయింది. అయితే ఇప్పుడు సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు మారడంపైనే అందరు చర్చించుకుంటున్నారు.

సీఎస్‌కేకు సంజు శాంసన్‌

రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్‌ను సీఎస్‌కేకు ఇవ్వగా, సీఎస్‌కే రవీంద్ర జెడేజా మరియు సామ్ కరన్‌ను ఆర్ఆర్ టీముకు ఇచ్చేసింది. సంజుని 18 కోట్ల రూపాయలకు సీఎస్‌కే తీసుకోగా, జడేజాను రూ. 14 కోట్లకు, సామ్ కరన్‌ను రూ. 2.4 కోట్లకు ఆర్ఆర్ తీసుకుంది. ఈ విధంగా రెండు జట్లు కూడా ఒప్పందం కుదర్చుకున్నారు. దీంతో కొంతమంది అభిమానుల్లో నిరాశ, కొంతమందిలో సంతోషం నెలకొనింది.

రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీతో తన ఐపీల్ కెరియర్‌ను ప్రారంభించాడు సంజు శాంసన్. 2013 సంవత్సరంలో దాదాపు పంతోమ్మిదేళ్ల ప్రాయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి 2016 – 2017(డీసీ) మినహా మిగతా అంతా ఆర్‌ఆర్‌తోనే కొనసాగాడు. 2012లో కేకేఆర్.. అతన్ని పది లక్షల రూపాయలకు కొనుగోలు చేసినప్పటికీ కూడా కనీసం అతను అందులో ఒక్కటంటే ఒక్క ఆట కూడా ఆడకపోవడం గమనార్హం. కాబట్టి ఎవరు ఆ విషయాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు.

2021లో ఆర్ఆర్ కెప్టెన్

2022లో టీమును ఫైనల్‌కు చేర్చాడు. అక్కడ రన్నరప్‌గా నిలిచింది. తరువాత 2024లో ప్లే ఆఫ్స్‌లో నిలిపాడు. ఇక 2021లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుంచి 2025 ఐపీల్ వరకు అదే పొజిషన్‌లో కొనసాగాడు. 2026 ఐపీల్ ట్రేడ్ మరియు రిటెన్షన్ కారణంగా రాజస్థాన్ రాయల్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి చేరాడు.

ఇప్పటి వరకు ఐపీల్ కెరియర్‌లో సంజు శాంసన్ 177 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 172 ఇన్నింగ్స్ ఉన్నాయి. మొత్తం 4,704 పరుగులు తీశాడు. హైయస్ట్ స్కోర్ 119, మూడు సేంచెరీలు, 26 అర్ధ సెంచరీలు, 219 సిక్స్‌లు, 379 ఫోర్లు, వికెట్ కీపర్‌గా 80 క్యాచ్‌లు పట్టాడు.

12ఏళ్ల బంధం

రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీతో ఉన్న 12 సంవత్సరాల బంధాన్ని వీడి సీఎస్‌కేకు వెళుతున్న వేళ సంజు శాంసన్ ఆర్ఆర్ ఒక బావోద్వేగభరితమైన జ్ఞాపకాల వీడియోను విడుదల చేసింది. అందులో రాజస్థాన్ రాయల్స్ తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

ఆటగాళ్లు అందరు సంజుతో ప్రయానాన్ని గొప్పగా, ప్రేమగా, అభిమానంతో చెప్పుకొచ్చారు. సంజుకి వీడ్కోలు తెలుపుతూ “నువ్వు నీలి దుస్తుల్లో చిన్న పిల్లవాడిగా నడుచుకుంటూ వచ్చావు, కానీ ఈరోజు మేము ఒక కెప్టెన్‌కు, ఒక నాయకుడికి వీడ్కోలు పలుకుతున్నాము, నీ ప్రయాణంలో మేము ఒక భాగం అవడమనేది మా అదృష్టంగా భావిస్తున్నాము” అని ఆర్ఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్ రాయల్స్ అభిమానులు బాధపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సంతోషపడుతున్నారు. ఏది ఏమైనా సంజు శాంసన్ అభిమానులు మాత్రం.. ఇకపై ఎలా ఆట ఆడనున్నారు అనేదాని గురించి ఆలోచిస్తున్నారు.

అందమైన కారు ఆవిష్కరించిన టాటా మోటార్స్: దీని గురించి తెలుసా?

అనేక టీజర్ల తరువాత దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ తన సియెర్రా కారును అధికారికంగా.. భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది 2003లో నిలిపివేయబడిన ఐకానిక్ సియెర్రాను గుర్తు చేసింది. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు ధరలను సంస్థ నవంబర్ 25న ప్రకటించనుంది.

డిజైన్ ఎలా ఉందంటే

బాక్సీ డిజైన్ కలిగిన టాటా సియెర్రా కారు.. ముందు భాగంలో కాంట్రాస్టింగ్ గ్లాస్ బ్లాక్ ప్యానెల్, దానికి కనెక్ట్ అయిన ఎల్ఈడీ డీఆర్ఎల్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్.. బ్రాండ్ లోగోను అనుసంధానించబడి ఉంటాయి. బంపర్ రెండువైపులా.. పిక్సెల్ ఆకారంలో ఉండే ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా పొందుతుంది. 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చెస్, డోర్స్ మీద బ్లాక్ బాడీ క్లాడింగ్, బ్లాక్ రూఫ్ రైల్ మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు. వెనుక భాగంలో వెడల్పు అంతటా విస్తరించి ఉన్న ఎల్ఈడీ టెయిల్‌లైట్ బార్ ఉంది. మొత్తం మీద డిజైన్ అద్భుతంగా ఉందనే చెప్పాలి.

ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్

సియెర్రా లోపల భాగం విశాలంగా, విలాసవంతంగా ఉంది. లోపల మూడు స్క్రీన్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి డ్రైవర్ డిస్‌ప్లే కాగా.. రెండు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఉపయోగిస్తారు. టాటా కర్వ్ మాదిరిగా.. సియెర్రా కూడా ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ పొందుతుంది. ప్రకాశవంతమైన బ్రాండ్ లోగో ఇక్కడ కనిపిస్తుంది.

క్యాబిన్ నలుపు, బూడిద రంగు థీమ్ పొందుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా విశాలంగా ఉంది. సియెర్రా కారులోని ఐదు సీట్లు అడ్జస్టబుల్ చేయగల హెడ్‌రెస్ట్‌లు పొందుతుంది. 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు కనిపిస్తాయి. ఇవి మాత్రమే కాకుండా.. ఇందులో డ్యూయెల్ జోన్ ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.

ఇంజిన్ గురించి వివరాలు

కొత్త టాటా సియెర్రా.. రెండు ఇంజిన్ ఎంపికలతో రానుంది. ఇందులో ఒకటి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 170 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో లభిస్తుంది. రెండోది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.. ఇది కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

అంచనా ధర

టాటా సియెర్రా ధరను కంపెనీ వెల్లడించలేదు. కానీ దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. కంపెనీ దీని ధరలను నవంబర్ 25న అధికారికంగా వెల్లడించనుంది. కాగా కంపెనీ బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నాము.

సియెర్రా మంచి అమ్మకాలను పొందనుందా?

నిజానికి భారతదేశంలో లాంచ్ అయిన దాదాపు అన్ని టాటా కార్లు గొప్ప అమ్మకాలను పొందుతున్నాయి. ఇప్పుడు కొత్తగా లాంచ్ కావడానికి సిద్దమవుతున్న సియెర్రా కూడా తప్పకుండా ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాము. ఇది సరికొత్త డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటం మాత్రమే కాకుండా.. కొంత తక్కువ ధరలో విడుదలయ్యే అవకాశం ఉండటం వల్ల దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని ఆశిస్తున్నాము.

అమ్మకాల్లో సరికొత్త రికార్డ్.. ఒక్కనెలలో 4 లక్షల వెహికల్స్: కారణం ఇదే!

భారతదేశంలో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఎస్ఐఏఎం (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్) వెల్లడించింది. ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 2025 అక్టోబర్ నెలలో 4,60,739 యూనిట్లు అని నివేదికలో వెల్లడించింది. అక్టోబర్ 2024లో ఈ సేల్స్ 393238 యూనిట్లు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే గత నెల అమ్మకాలు 17.2 శాతం పెరిగాయని స్పష్టమవుతోంది.

వాహన అమ్మకాలు ఇలా..

టూ వీలర్ అమ్మకాలు 2025 అక్టోబర్‌లో 2.1 శాతం పెరిగి 22,10,727 యూనిట్లుగా నమోదయ్యాయి. 2024 అక్టోబర్‌లో ఈ సేల్స్ 21,64,276 యూనిట్లు కావడం గమనార్హం. ఈ విభాగంలో స్కూటర్ అమ్మకాలు 14.3 శాతం పెరిగి 824003 యూనిట్లు కాగా.. మోటార్‌సైకిల్ సేల్స్ 4 శాతం తగ్గి.. 13,35,468 యూనిట్లకు చేరుకున్నాయి.

త్రీ వీలర్ అమ్మకాల విషయానికి వస్తే.. గత నెలలో మొత్తం సేల్స్ 81,288 యూనిట్లు. అక్టోబర్ 2024లో ఈ సేల్స్ 5.9 శాతం ఎక్కువని సమాచారం. అయితే అక్టోబర్ 2025లో ప్యాసింజర్ క్యారియర్స్ 7.6 శాతం పెరిగాయి. గూడ్స్ క్యారియర్స్ 2.8 పెరుగుదలను నమోదు చేశాయి. అయితే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ మాత్రం తగ్గుదలను నమోదు చేశాయి. అంటే దేశీయ విఫణిలో కార్లు, టూవీలర్స్ అమ్మకాలు పెరిగినప్పటికీ.. త్రీ వీలర్స్ అమ్మకాలు తగ్గాయని స్పష్టంగా అర్థమవుతోంది.

వాహనాల ఉత్పత్తి ఇలా..

అక్టోబర్ 2025లో ప్యాసింజర్ వాహనాలు, త్రీ వీలర్స్, టూ వీలర్స్ మరియు క్వాడ్రి సైకిల్స్ మొత్తం ఉత్పత్తి 28,01,412 యూనిట్లు అని ఎస్ఐఏఎం నివేదిందింది. దీన్ని బట్టి చూస్తే దేశంలో వాహనాల ఉత్పత్తి కూడా భారీగా పెరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే రానున్న రోజుల్లో ఈ ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవగతం అవుతోంది.

వాహనాల అమ్మకాలు పెరగడానికి కారణం

ఇండియన్ మార్కెట్లో వాహనాల అమ్మకాలు పెరగడానికి.. పండుగ సీజన్, 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపు లేదా కొత్త జీఎస్టీ అమలు ప్రధాన కారణం అని ఎస్ఐఏఎం డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో డీలర్లకు ప్యాసింజర్ వెహికల్, త్రీవీలర్, టూవీలర్ విభాగాలు అత్యధిక వాహనాలను పంపించినట్లు వెల్లడించారు.

జీఎస్టీ రేటు తగ్గడం వల్ల వాహనాల రిజిస్ట్రేషన్ గణనీయంగా పెరిగింది. ఇది హోల్‌సేల్స్‌ను మించి రిటైల్ బలాన్ని భారీగా పెంచేసింది. సాధారణంగా పండుగ సీజన్ సమయంలో.. వాహనాల అమ్మకాలు పెరుగుతాయి. ఈసారి పండుగ సీజన్, జీఎస్టీ తగ్గింపు వంటివి బాగా కలిసి రావడంతో సేల్స్ పెరిగాయి.

టాప్ 10 కార్ సేల్స్ – అక్టోబర్ 2025

గత నెలలో (2025 అక్టోబర్) ఎక్కువ మంది కొనుగోలు చేసిన లేదా అత్యధిక అమ్మకాలు పొందిన కారుగా టాటా నెక్సాన్ (22,083 యూనిట్లు) మొదటి స్థానంలో నిలిచింది. తరువాత జాబితాలో వరుసగా మారుతి డిజైర్ (20,791 యూనిట్లు), మారుతి ఎర్టిగా (20,087 యూనిట్లు), మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (18,970 యూనిట్లు, హ్యుందాయ్ క్రెటా (18,381 యూనిట్లు), మహీంద్రా స్కార్పియో (17,880 యూనిట్లు), మారుతి ఫ్రాంక్స్ (17,003 యూనిట్లు), మారుతి బాలెనొ (16,873 యూనిట్లు), టాటా పంచ్ (16,810 యూనిట్లు), మారుతి స్విఫ్ట్ (15,542 యూనిట్లు) ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. గత నెలలో వాహనాల అమ్మకాలు పెరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.