Home Blog Page 115

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం: ఎవరీ నవీన్ యాదవ్?

మొత్తానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల హడావుడికి తెరపడింది. నవంబర్ 14న తమ అభిమాన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు వేసిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ముగిసింది. ఎలక్షన్ కమిషన్ ఫలితాలకు సంబంధించిన తుది తీర్పుని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అధిక మెజారిటీతో గెలుపొందాడు. తమ అభ్యర్థి విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించాడు. నవీన్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కు వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య 98,988.

భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీతకు 74259 ఓట్లు రావడంతో ఓటమితో ఆమె రెండో స్థానానికి సరిపెట్టుకునింది. ఇక మూడో స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన లంక దీపక్ రెడ్డికి ప్రజలు 17,061 ఓట్లు వేశారు. తర్వాత నోటా నాలుగో స్థానంలో నిలిచినది, దానికి 924 ఓట్లు వేశారు. బీజేపీ లంక దీపక్ రెడ్డితో సహా ఇండిపెండెంట్ కాండిడేట్స్ మరియు ఇతర పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయారు.

2009 తర్వాత మళ్లీ ఇన్నేళ్ళకి..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి. విష్ణువర్ధన్ రెడ్డి 54,519 (39.84%) ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో రెండు సార్లు మళ్ళీ అతనే పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ జెండా ఎగరేయలేకపోయింది. అనూహ్యంగా ఒక సారి టీడీపీ తరపున, రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ వరుసగా మూడుసార్లు గెలుపొందటం జరిగింది. తర్వాత ఆయన అకాలమరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక రావడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు  అక్కడ నిలబడిన నవీన్ యాదవ్ విజయం సాధించి ఇన్నాళ్లకి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు.

ఎవరీ నవీన్ యాదవ్..?

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ప్రాంతంలో పుట్టి పెరిగిన నవీన యాదవ్.. తన రాజకీయ జీవితాన్ని ఏఐఎంఐఏం పార్టీతో ప్రారంభించాడు. మొదట రెండు సార్లు జిహెచ్ఏంసీ ఎన్నికల్లో యూసుఫ్‌గూడ (2009) నుంచి 2016లో రహమాత్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2014లో ఏంఐఏం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు.

2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడు. అప్పుడు కూడా.. రెండు సార్లు కూడా ఓటమి చవిచూశాడు. ఆ తర్వాత 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2025లో ఈసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇన్ని ఓటముల తర్వాత చివరికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. ఈయనకు తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, తల్లి కస్తూరి. భార్య వర్ష యాదవ్, కుమారుడు అన్ష్ యాదవ్ ఉన్నారు. తండ్రి కూడా రాజకీయాల్లో ఉండటం కారణంగా.. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపులో ఆయన ముఖ్య పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

కెరియర్ మలుపు తిప్పిన సినిమా: ధృవ్ విక్రమ్ బైసన్ కలెక్షన్స్ ఎంతంటే?

0

బైసన్ సినిమా విడుదలై 25 రోజులు పూర్తైన సందర్బంగా.. చిత్ర బృందం చెన్నైలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ మారి సెల్వరాజ్, నిర్మాతలు పా. రంజిత్ & అధితి ఆనంద్, హీరో ధృవ్ విక్రమ్, హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్ & రజిష విజయన్‌లతోపాటు ఇతర నటులు అమీర్, లాల్, పశుపతి మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కే ప్రసన్న మొదలైనవారు పాల్గొన్నారు.

నెలరోజులైనా.. దూసుకెళ్తున్న బైసన్

ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతికత కారణంగా సోషల్ మీడియా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. దీని వల్ల కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు కనీసం వారం రోజులు కూడా థియేటర్లలో నిలబడటం లేదు. నిర్మాతలు కేవలం శుక్రవారం, శనివారం, ఆదివారాలను నమ్ముకుని మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఆ మూడు రోజుల్లో మా డబ్బులు మాకు వస్తే చాలనుకుంటున్నారు. లేదా అప్పుడప్పుడు ఏదైనా పండగలు, సెలవులు వస్తే.. ఆ తరుణంలో ఒకరకంగా ఆడుతున్నాయి. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చేస్తున్నాయి. లేదా అంతకు ముందే పైరసీకి గురవుతున్నాయి. అలాంటిది ఈ మధ్య కాలంలో డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో.. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా వచ్చిన “బైసన్” సినిమా విడుదలై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఇప్పటికి ఆ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది.

బైసన్ కలెక్షన్స్

ఎంత కలెక్షన్స్ వచ్చాయి.. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే.. సినిమా బడ్జెట్ ఇంచుమించు 30 కోట్ల లోపు ఉంటుందని అంచనా. అయితే కలెక్షన్స్ మాత్రం అంతకు మించి రాబడుతోంది. ఇప్పటి వరకు వచ్చిన మొత్తం.. ఇండియా గ్రాస్ కలెక్షన్స్ చూస్తే మొత్తం 55 కోట్ల వరకు కలెక్ట్ చేసిందట. అదే ఇండియా నెట్ కలెక్షన్స్ గమనిస్తే మొత్తం ఒక 47 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో దాదాపు 10 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఇంకా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ దాదాపు 70 కోట్ల రూపాయల పైనే అని మూవీ టీమ్ లెక్కలు బయట పెట్టింది.

ధృవ్ విక్రమ్ కెరియర్ మలుపుతిప్పిన బైసన్

హీరో ధృవ్.. కెరియర్ పరంగా బైసన్ కలెక్షన్స్ గొప్ప మలుపు తిప్పే విషయం అని చెపొచ్చు. ఇప్పటి వరకు తాను చేసిన రెండు సినిమాలు చెప్పుకోతగిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే బైసన్ మూవీ మాత్రం అతనికి బిగ్ బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ధృవ్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఖాతాలో మరో విజయం చేరింది.

ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేయడానికి పా. రంజిత్ నీలం స్టూడియోస్ & అప్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మంచి పుషప్ ఇచ్చింది. ఇప్పటికీ జనాల్లో బైసన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రేక్షకాదరణ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇటువంటి సినిమాలు యువతకి.. వారి నిజ జీవితంలో మానసికంగా ఒక ధృడమైన విశ్వాశాన్ని, ఆత్మ స్థైర్యాన్ని ఇస్తాయనే చెప్పాలి. ఈ సినిమాలో ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించారు. ఇతర నటీనటులు కూడా తమదైన రీతిలో నటించి.. ప్రేక్షకులను మెప్పించారు.

ఢిల్లీలో భారీగా పెరిగిపోతున్న కాలుష్యం: అసలైన కారణాలివే!

ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రమాదాలను ఊహించలేము. కానీ ప్రకృతికి ఇబ్బంది కలిగిస్తే.. వచ్చే ప్రమాదాన్ని ఆపడం బ్రహ్మ తరం కూడా కాదు. ఇది అక్షర సత్యం. ఒకప్పుడు ప్రపంచం ఆహ్లాదంగా ఉండేది. జంతు, పశుపక్ష్యాదులు తిరుగాడుతూ ఉండేవి. ఆ సమయంలో మనుషులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా సంతోషంగా కాలం గడిపేవాళ్లు. అయితే టెక్నాలజీ పేరుతో.. మనిషి సృష్టిస్తున్న అద్భుతాలు, అవాంతరాలను తెస్తున్నాయి. అవే మానవ మనుగడకు హాని చేస్తున్నాయి. దీనికి ఓ స్పష్టమైన ఉదాహరణ వాయు కాలుష్యం. ఎయిర్ పొల్యూషన్ అంటే ముందుగా గుర్తచ్చేది ఢిల్లీ నగరమే. ఇంతకీ ఇక్కడ గాలి కాలుష్యం ఎందుకు గణనీయంగా పెరుగుతోంది?, నివారణ మార్గాలు ఏమిటనేది చూసేద్దాం.

వాయు కాలుష్యానికి కారణాలు

  • పెరిగిన వాహనాలు: అభివృద్ధి చెందిన ఢిల్లీ నగరంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వాహనాల సంఖ్య పెరగడంతో.. వాటి నుంచి వెలువడే వాయువులు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
  • పారిశ్రామిక రంగం: అభివృద్ధి చెందిన నగరం అంటే.. పరిశ్రమలు ఉంటాయి. నగరం లోపల కాకుండా.. బయట ఉన్నప్పటికీ కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలవుతాయి. తద్వారా కాలుష్యం ఏర్పడుతోంది.
  • పంట అవశేషాలు: నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రైతులు పంట పండించిన తరువాత, పంట పూర్తిగా చేతికి వచ్చిన తరువాత వాటిని కాల్చేస్తారు. దాని నుంచి వచ్చే పొగ కూడా గాలిని కాలుష్యం చేస్తుంది.
  • ప్రస్తుత వాతావరణ పరిస్థితి: ప్రస్తుతం శీతాకాలం కావడంతో.. వాతావరణంలో మార్పు జరిగాయి. టెంపరేచర్ ఇన్వర్టర్ వల్ల గాలి స్థిరంగా ఉంది. ఈ కారణంగా గాలి ఒక నిర్దిష్ట స్థాయికంటే పైకి వెళ్లలేకపోతోంది. దీంతో కాలుష్య కణాలు కూడా అక్కడే ఆగిపోయాయి.
  • దీపావళి: గడిచిన దీపావళి సమయంలో నగరంలో కాల్చిన టపాసులు.. పెద్ద ఎత్తున కాలుష్యాన్ని కలిగించాయి. కాలుష్యం గురించి ప్రజలకు ఎంత హెచ్చరించినా.. మాట వినకపోవడంతో, ఇప్పుడు ఢిల్లిలో కాలుష్యం తారాస్థాయికి చేరింది.

కాలుష్యం తగ్గించే మార్గాలు

ఒక సమస్య వచ్చినప్పుడు దానిని వెంటనే పూర్తిగా నిర్మూలించడం అనేది అసాధ్యం. దశలవారీగా కొన్ని పద్దతులను అలవాటు చేసుకోవడం, పద్ధతులు మార్చుకోవడం చేయడం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఇందులో కొన్ని..

  • పాత వాహనాలను తొలగించడం: ఢిల్లీ వంటి నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే పాత వాహనాలు లేదా బీఎస్3, బీఎస్4 వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. ఈ వాహనాలు బీఎస్6 వాహనాలతో పోలిస్తే.. ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ప్రస్తుతం ఈ విధానం ఢిల్లీలో అమలులో ఉంది.
  • పచ్చదనం పెంచడం: పచ్చదనం పెంచాలని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. దాని విలువ బహుశా ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. లేకుంటే.. వాయు కాలుష్యం పెను విషాదం మిగులుస్తుంది.
  • పరిశ్రమల కాలుష్య నియంత్రణ: పరిశ్రమలను నియంత్రించడం కష్టం, కానీ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయ్యే కాలుష్య కారకాలను తగ్గించడానికి కొన్ని టెక్నాలజీలను ఉపయోగించడం మంచిది. లేకుంటే పరిస్థితి తీవ్రతరం అవుతుంది.
  • పంటలు కాల్చే విధానం: రైతు పంట పండించిన తరువాత చివరగా.. గడ్డి మొదలైన వ్యర్దాలను కాల్చకుండా దానిని క్రషింగ్ చేసి భూమిలోకి కలిపేయడం, తక్కువ మోతాదులో ఉంటే కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం వంటివి చేయాలి.

వాయు కాలుష్య తీవ్రత & వచ్చే సమస్యలు

దేశ రాజధానిలో వాయు కాలుష్యం 300 కంటే ఎక్కువ ఉంది. ఇది చాలా ప్రమాదం. వాయు కాలుష్యాన్ని తగ్గించకపోతే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రధానంగా శ్వాస సంబంధిత వ్యాధులు, తలనొప్పి, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది చిన్న పిల్లలు, వృద్దులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

లైఫ్‌టైమ్ vs ఐదేళ్లు: రోడ్ ట్యాక్స్ ఏది బెస్ట్

0

కారు కొనుగోలు చేయడం అనేది చాలామంది కల. ఈ కల కొంతమందికి నిజమవుతుంది, ఇంకొందరికి కల కలగానే మిగిలిపోతుంది. ఇవన్నీ పక్కనపెడితే.. కొత్త కారు కొనాలంటే మాత్రం లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా పక్కన పడితే.. కారు కొనుగోలు చేసిన తరువాత మెయింటెనెట్స్, ఇంధన ఖర్చు, ఇన్సూరెన్స్, ఇతర పన్నులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే కారును కొనుగోలు చేసినప్పుడు యజమాని / ఓనర్ రోడ్ ట్యాక్స్.. జీవితకాల పన్ను (లైఫ్ టైమ్ ట్యాక్స్) లేదా ఐదేళ్లకు ఎంచుకోవచ్చు. ఇందులో ఏది సెలక్ట్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది ఇక్కడ పరిశీలిద్దాం..

చాలామంది కారును కొనుగోలు చేసినప్పుడే పదేళ్ల పాటు తాము వినియోగిస్తామని నిర్ణయించుకుని లైఫ్ టైమ్ ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకుంటారు. ఎందుకంటే దీనివల్ల కొంత డబ్బు ఆదా అవుతుంది. ఐదేళ్ల ట్యాక్స్ ఎంచుకుంటే.. ఈ గడువు (ఐదేళ్లు దాటిన తరువాత) ముగిస్తే మళ్ళీ రెన్యూవల్ చేసుకోవలసి ఉంటుంది.

జీవితకాల పన్ను

  • జీవిత కాల పన్ను అనేది.. వాహనం కొనుగోలు చేసినప్పటి నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుంది. అంటే 15 సంవత్సరాలకుగానూ ట్యాక్స్ ఒకేసారి చెల్లిస్తారు.
  • లైఫ్ టైమ్ ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకునే వారు.. ఒకేసారి ట్యాక్స్ చెల్లించాలి. ఒకేసారి చెల్లించడం వల్ల రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళా రెన్యూవల్ డేట్ మర్చిపోయినప్పుడు ఫైన్ వంటి వాటి నుంచి కూడా బయటపడొచ్చు. ఈ లైఫ్ టైమ్ ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల కొంత డబ్బు ఆదా చేయవచ్చు. ఒకేసారి చెల్లించడం వల్ల స్వల్ప మొత్తంలో ఆదా అవుతుంది.
  • జీవిత కాల పన్నును ఎంచుకుని.. ఒకేసారి ట్యాక్స్ చెల్లించడం వల్ల.. మీరు వాహనాన్ని విక్రయించే సమయంలో కొంత ఎక్కువ ధరకు విక్రయించుకోవచ్చు. ఎందుకంటే తరువాత యజమాని.. తాను కొనుగోలు చేసాడు కాబట్టి, అతడు ప్రత్యేకంగా ట్యాక్స్ చెల్లించాల్సిన అవడం ఉండదు. దీనివల్ల మీ వాహనానికి కొంత విలువ పెరుగుతుంది.
  • మీరు ఉపయోగించే కారుకు లైఫ్ టైమ్ ట్యాక్స్ చెల్లించినప్పుడు.. వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు, అక్కడ ప్రో-రేటా ట్యాక్స్ చెల్లించి.. అసలు రాష్ట్రంలో వాపసు పొందాల్సి ఉంటుంది. ఇది కొంత క్లిష్టమైన ప్రక్రియ కావొచ్చు. జీవితకాల ట్యాక్స్ ఎంచుకోవడం వల్ల.. ఈ ఒక్కటి బహుశా సమస్యగా మారే అవకాశం ఉంటుంది.

ఐదు సంవత్సరాల ట్యాక్

  • కారు ట్యాక్స్ అనేది ఐదేళ్లకు ఎంపిక చేసుకుంటే.. దీని గడువు ఐదేళ్లు మాత్రమే.
  • ప్రారంభంలో చెల్లించాల్సిన చెల్లింపులు తక్కువగా ఉన్నప్పటికీ.. మళ్లీ మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సమయానికి రెన్యువల్ చేయకపోతే.. ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ఎంచుకుంటే.. ఐదేళ్లకు ఒకసారి ట్యాక్స్ కడుతూ ఉండాలి.
  • లైఫ్ టైమ్ ట్యాక్స్ చెల్లించిన కారును అమ్మేటప్పుడు దాని ధర కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ ఐదేళ్ల ట్యాక్స్ ఎంచుకున్న కారును విక్రయించేటప్పుడు.. దీని విలువ కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. స్వల్ప మొత్తంలో తేడా ఉంటుంది. దీనిని గమనించాలి.
  • ఐదేళ్ల ట్యాక్స్ చెల్లించడం వల్ల ఒక ప్రయోజనం ఏమిటంటే.. రాష్ట్రం నుంచి బదిలీ అయినప్పుడు అక్కడ రెన్యువల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆప్షన్ ఎందుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. ఉద్యోగస్తులకు ఈ ట్యాక్స్ ప్రయోజనకరంగా ఉంటుంది.

దేశాలు దాటిన ఖ్యాతి: సైమా వేదికపై తెలుగు సినిమా రికార్డ్!

0

ప్రతి సంవత్సరం సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ ఇవ్వడానికి.. అతి పెద్ద కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఇవి ఎవరికి ఇస్తారంటే.. దక్షిణ భారతదేశంలోని కళారంగం మరియు సాంకేతికరంగాలలో ప్రతిభను కనబరిచిన వారిని గుర్తించి ప్రతి ఏడు అందిస్తారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా కొంతమందికి సైమా అవార్డ్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యక్రమం యూఏఈలోని దుబాయ్ ఎక్సపో సిటీలోని ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగింది. నవంబర్ 5, 6 తేదీల్లో రెండు రోజులపాటు అవార్డు ప్రధానోత్సవం నిర్వహించారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, మాలయాళం సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు పాల్గొని సందడి చేశారు. కాగా తెలుగు చలన చిత్ర రంగం నుంచి పుష్ప-2 సినిమా ఎక్కువ అవార్డ్స్ అందుకునింది.

బెస్ట్ యాక్టర్ – అల్లు అర్జున్

అల్లు అర్జున్.. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా 2025లో వచ్చిన పుష్ప-2 సినిమాకు గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ ఫిలిమ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డును తన అభిమానులకి అంకితం ఇచ్చాడు. డైరెక్టర్ సుకుమార్‌కు మిగిలిన టీమ్ సభ్యులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేసాడు.

పుష్ప 2 సినిమాకు బెస్ట్ యాక్టర్ సైమా అవార్డును అందుకోవడంతో.. అల్లు అర్జున్ ఖాతాలో మొత్తం ఆరు సైమా అవార్డులు చేరాయి. ఇప్పటికే పరుగు, వేదం, రేసుగుర్రం, పుష్ప- ది రైజ్, రాణి రుద్రమదేవి వంటి సినిమాలకు కూడా సైమా బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకున్నాడు. దీనితో పాటు నేషనల్ అవార్డు, గద్దర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. అప్పటి వరకు తాను చేసిన యాక్టింగ్ వేరు పుష్పలో చేసింది వేరే లెవెల్ అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా బన్నీకి తన సినిమా కెరియర్‌లో మునుపెన్నడు చూడని సక్సెస్, ఫేమ్‌ను ఈ సినిమా తీసుకొచ్చింది.

కలెక్షన్లలో బాక్స్ ఆఫీస్ రికార్డులన్నిటిని కూడా బద్దలు కొట్టి చూపించింది పుష్ప-2. ఒక కూలివాడు పెద్ద రౌడీలని, డబ్బులు ఉన్న బడాబడా వ్యాపార వేత్తలను, రాజకీయ నాయకులను తెగువతో, ధైర్యంతో, తెలివితో ఎదిరించి మాట్లాడి వాళ్లతోనే వ్యాపారం చేసి, వాళ్ల పక్కనే సమానంగా కుర్చీలో కూర్చుని.. వాళ్ల చేత సలాం కొట్టించుకోవడం జనాలకు తెగ నచ్చేసింది. ‘తగ్గేదేలే, వైల్డ్ ఫైర్, ఈ కాలునాదే.. ఆ కాలునాదే నా కాలుమీద నా కాలేసుకున్నా మీ ఓనర్ మీద వేసిననా ఏంది” లాంటి డైలాగులు సినిమాకి మంచి ఊపు తీసుకొచ్చాయి. మొదటిసారి ఒక మూవీలో హీరో పాత్ర పూర్తిగా రాయలసీమ యాసలో మాట్లాడి మూవీకి కొత్తదనాన్ని తీసుకొచ్చారు.

బెస్ట్ యాక్ట్రెస్ – రష్మిక మందన్నా

నటి రష్మిక మందన్నా.. పుష్ప సినిమాలో తాను నటించిన శ్రీవల్లీ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. ఇందుకు గాను పుష్ప-2 మూవీకి సైమా బెస్ట్ యాక్ట్రెస్ ఫిలిమ్ ఫేర్ అవార్డును అందుకునింది. హీరోయిన్ రష్మికకు కూడా ఆమె సినీ జీవితంలో ఇదొక ప్రత్యేకమైన పాత్ర అని చెప్పొచ్చు. ఇప్పటికే రష్మిక.. కిరాక్ పార్టీ కన్నడ బెస్ట్ డెబ్యూ, గీత గోవిందం, పుష్ప, పుష్ప- 2 తదితర సినిమాలకు గానీ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకుంది.

బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్

పుష్ప సినిమాకు ఇన్ని అవార్డ్స్, ఇంత పాపులరిటీ, ఎనలేని ఖ్యాతి రావడానికి కారణం డైరెక్టర్ సుకుమార్. తాను రాసుకున్న కథ, పాత్రలు, అందుకు తగిన పవర్ ఫుల్ డైలాగులు.. సినిమాను తెరకేక్కించిన విధానం అన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి. సుక్కు ఎప్పుడు కూడా బెస్ట్ ఇస్తాడు. కానీ తన కెరియర్‌లో పుష్పతో అంతకు మించి ఇచ్చాడనే చెప్పాలి. ఏ స్టేజ్ ఎక్కినా కూడా సుకుమార్ ఈ సినిమా నీకోసమే తీశాను, అని బన్నీ(అల్లు అర్జున్)కి చెబుతూ ఉంటాడు. అవును అది నిజమే ..ఈ చిత్రం ప్రత్యేకించి బన్నీ కోసమే తీసినట్టు ఉంటుంది. అందుకే సైమా సుకుమార్‌కు బెస్ట్ సినిమా డైరెక్టర్ అవార్డు ఇచ్చింది. ఆర్య, రంగస్థలం, పుష్ప ది రైజ్ సినిమాలకు కూడా బెస్ట్ డైరెక్టర్, రైటర్ అవార్డ్స్ ఈయన అందుకున్నాడు.

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవి శ్రీ ప్రసాద్

పుష్ప సినిమా ఇంత ఆదరణ పొందడంలో సుకుమార్ తర్వాత అంత కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్లలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా ఉన్నాడు. సినిమాను తారా స్థాయికి తీసుకెళ్లడంలో పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా పనిచేశాయి అని చెప్పడానికి ఏ మాత్రం సందేహం అవసరం లేదు. హీరోను మ్యూజిక్ ఎంతగా ఎలివేట్ చేసిందో మాటల్లో చెప్పలేము. అందుకే దేవి శ్రీ ప్రసాద్‌కు పుష్ప-2 సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఇచ్చింది సైమా. ఈ సందర్బంగా డీఎస్పీ నిర్మాతలకి, డైరెక్టర్, బన్నీ, రష్మిక అందరికీ థాంక్స్ చెప్పాడు

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ – శంకర్ బాబు

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ శంకర్ బాబు (వచ్చుండాయ్ పీలింగ్స్) పాటకి బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ అవార్డును మొదటి సారిగా అందుకున్నాడు. ఈ రొమాంటిక్ సాంగ్ యూత్‌లో మంచి వైబ్ క్రియేట్ చేసింది. ఇది సినిమాకు ప్లస్ అయింది. ఇందుకు తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మూవీ డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మరియు తన భార్యకి థాంక్స్ చెప్పుకొచ్చాడు.

పుష్ప-3పై క్లారిటీ

ఈ సందర్బంగా పుష్ప-3 సినిమా ఉంటుందా?, ఉండదా? అనే అనుమానంతో ఉన్న బన్నీ అభిమానులకు డైరెక్టర్ సుకుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. పుష్ప-3 మూవీ ఉంటుందని స్పష్టం చేశాడు. మొత్తం మీద తెలుగు నుంచి ఎక్కువ అవార్డ్స్ గెలుచుకున్న సినిమాగా పుష్ప-2 నిలువడం ప్రశంసనీయం.

నాన్నా.. మీరుంటే బాగుండేది: ది గర్ల్‌ఫ్రెండ్ డైరెక్టర్ ఎమోషనల్ స్పీచ్

0

రష్మిక మందన్నా, దీక్షిత్ కలిసి నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఈ మూవీ నవంబర్ 07న ప్యాన్ ఇండియా లెవల్‌లో.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో.. థియేటర్లలో విడుదలైంది. మంచి పాజిటివ్ సక్సెస్‌తో విజయవంతంగా నడుస్తున్నది. అందాల రాక్షసి ఫేమ్ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో నటించారు కూడా. కాగా ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, చిత్ర యూనిట్ రష్మిక మందన, దీక్షిత్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాహుల్ రవీంద్రన్ తన మనసులోని మాటలను ఆవిష్కరించారు.

నటుడిగానే కాదు.. నిర్మాతగా కూడా!

రాహుల్ రవీంద్రన్ యాక్టింగ్ పరంగానే అందరికి సుపరిచితుడు. కానీ చి. ల. సౌ, మన్మధుడు-2 ఇప్పుడు ది గర్ల్‌ఫ్రెండ్ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. చేసిన మూడింటిలో రెండు సినిమాలు అటు బాక్స్ ఆఫీస్ పరంగా ఇటు క్రిటిక్స్ పరంగా రెండు రకాలుగా మంచి ఫలితాలను ఇచ్చాయి. అతని స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. అతని మొదటి సినిమాకే బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ మరియు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. పితృస్వామ్య వ్యవస్థ, మహిళల యొక్క స్వేచ్ఛ, మానవ సంబంధాలు, మనిషి వ్యక్తిగత అభివృద్ధి.. ఇవే అతని ప్రధాన కథా వస్తువుగా తన సినిమాల్లో కనిపిస్తుంటాయి. నటుడుగా దాదాపు ఒక 20 సినిమాలకు పైనే చేసి ఉంటాడు. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా తీయడానికి ముందు ఆరు సంవత్సరాలపాటు ఏ సినిమాల్లో నటించలేదు, డైరెక్షన్ చేయలేదు. అయినప్పటికీ మంచి స్టోరీతో దర్శకుడిగా గొప్ప విజయం అందుకున్నాడు.

నాన్నా.. ఇప్పుడు మీరు ఉండుంటే బాగుండేది

ఈ విజయోత్సవం సందర్భంగా రాహుల్ పక్కన తన నాన్న లేకపోవడం (కన్ను మూశారు) గురించి చాలా బాధపడ్డాడు. ఎంబీఏ పూర్తయిన తరువాత ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు తను తీసుకున్న ఫస్ట్ శాలరీతో వాళ్ల నాన్నకి కొనిచ్చిన హ్యాండ్ వాచ్ కట్టుకోని ఫంక్షన్‌కి వచ్చాడు. తన లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి ఆరేళ్లు అయింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ చూశాడు.

రాహుల్ మాట్లాడుతూ “నాన్న నిజంగా ఇప్పుడు మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. ఈ సమయంలో మీరు ఉండుంటే బాగుండేది. బహుశా పైన ఉండి మీరే ఇదంతా ప్లాన్ చేశారేమో అందుకే ఈ సక్సెస్ వచ్చింది, థాంక్యూ, లవ్యూ నాన్న అంటూ తన తండ్రి గురించి ఎమోషన్ అయ్యాడు. తన భార్య సింగర్ చిన్మయి శ్రీపాద పన్నెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన చొక్కా వేసుకొచ్చాడు. నాన్నకు, భార్యకు రాహుల్ ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసాడు”. మువీ టీమ్ గురించి అనేక విషయాలు పంచుకున్నాడు. దీక్షిత్, రష్మికలను పొగడ్తలతో ముంచేసాడు.

సక్సెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన నటుడు విజయ్ దేవర కొండ.. రష్మికను తెగ పొగిడేసాడు. తన చుట్టూ ఉన్నవాళ్లు బాగుండాలని కోరుకుంటుందని, ఎవరు ఎమన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుందని అన్నాడు. సినిమా మంచి విజయం సాధించిందని, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేసారు.

పెట్రోల్ కంటే డీజిల్ ఇంజిన్ వల్లనే ఎక్కువ కాలుష్యమా..: ఎందుకు?

ప్రారంభంలో డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, సీఎన్‌జీ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎన్ని కార్లు అందుబాటులో ఉన్నా.. పొల్యూషన్ అంటే డీజిల్ కార్లే గుర్తొస్తాయి. పెట్రోల్ కార్లు కూడా కాలుష్య కారకాలను విడుదల చేస్తున్నప్పటికీ.. డీజిల్ కార్ల కంటే కొంత తక్కువే అని చెప్పాలి. ఈ కథనంలో.. పెట్రోల్ కార్ల కంటే, డీజిల్ కార్లు ఎందుకు ఎక్కువ కాలుష్య కారకాలను రిలీజ్ చేస్తాయనే విషయాన్ని చూసేద్దాం..

కాలుష్య కారకాలను తగ్గించడానికి డీజిల్ ఇంజిన్ల అభివృద్ధి ప్రక్రియలో కొత్త నిబంధనలను, కొత్త టెక్నాలజీలను ఉపయోగించినప్పటికీ.. కాలక్రమంలో యధావిధిగానే డీజిల్ ఇంజిన్లు కాలుష్య కారణాలను విడుదల చేస్తున్నాయి. అంతే కాకుండా పెట్రోల్ కార్ల కంటే.. డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువ కూడా. ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా.. కార్ల అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో కొన్ని కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి. డీజిల్ ఇంజిన్లు ఎక్కువ కాలుష్యం కలిగించడానికి ఐదు కారణాల విషయానికి వస్తే..

అధిక ఉష్ణోగ్రత

డీజిల్ ఇంజిన్లు.. పెట్రోల్ ఇంజిన్ల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. అంటే డీజిల్‌తో ఇంజిన్ పనిచేయడానికి ఉష్ణోగ్రత ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి అధిక ఉష్ణోగ్రత వద్ద.. నైట్రోజన్, ఆక్సిజన్ వంటి వాయువులు చర్య జరిపి.. అధిక మొత్తంలో నైట్రోజన్ ఆక్సైడ్లను రిలీజ్ చేస్తాయి. ఈ వాయువులు చాలా ప్రమాదకరం. ఇవి పట్టణాల్లో పొగమంచును, ఆమ్ల వర్షాలు ఏర్పడటానికి కారణం అవుతాయి. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అసంపూర్ణ దహనం

సాధారణంగా డీజిల్ అనేది, పెట్రోల్ కంటే కూడా బరువైనది. ఇది అస్థిర హైడ్రోకార్బన్ మిశ్రమం. కాబట్టి జ్వలన ప్రక్రియలో.. డీజిల్ అసంపూర్తిగా దహనం అవుతుంది. తద్వారా మసి లేదా సూక్ష్మ కణ పదార్థాలు విడుదలవుతాయి. ఇవే గాలిలో కలిసి కాలుష్యాన్ని ఏర్పరుస్తాయి. ఈ కారకాల వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మాత్రమే కాకుండా.. ఉబ్బసం, హృదయ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

అధిక సంపీడనం & వేడి గాలి

డీజిల్ ఇంజిన్ శక్తిని ఉత్పత్తి చేయాలంటే.. కొంత ఎక్కువ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డీజిల్ ఇంజిన్లు కాలుష్య ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే పెట్రోల్ ఇంజిన్లు ఇంధనాన్ని మండించడానికి స్పార్క్ ప్లగ్‌లను ఉపయోగిస్తాయి. ఇలాంటివి ప్రత్యేకంగా డీజిల్ ఇంజిన్లలో ఉండవు. దీని వల్ల డీజిల్ ఇంజిన్ హైడ్రోకార్బన్ మిశ్రమాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.

అధిక సల్ఫర్ కంటెంట్

డీజిల్‌లో ఎక్కువ సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలు అధిక స్థాయిలో రిలీజ్ అవుతాయి. ఇది సాధారణంగా కాలుష్య కారకమే. అత్యంత ప్రమాదకరం కూడా. నిజానికి కంపెనీ డీజిల్ కారును ఉప్పత్తి చేసినప్పుడు.. టెస్టింగ్ దశలో పరీక్షిస్తాయి. ఇంజిన్ కొత్తగా ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో ఉత్పత్తి అయ్యే ఉద్గారాలు చాలా తక్కువ. ఇంజిన్ క్రమంగా పనిచేస్తూ ఉండటం వల్ల.. కాలుష్య కారకాలు పుడతాయి.

కాలుష్య కారకాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో.. కేంద్రం కూడా బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అమలులోకి తెచ్చింది. ఈ సమయంలో కొన్ని కంపెనీలు తమ డీజిల్ వాహనాలను అప్డేట్ చేయలేదు. దీనివల్ల చాలా డీజిల్ కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. కొన్ని కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను బీఎస్6 నిబంధనలను అనుగుణంగా అప్డేట్ చేశాయి. కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండటం వల్ల అమ్మకాలు తగ్గాయి. ఇలాంటి కారణాల వల్ల.. డీజిల్ వాహనాలు కనుమరుగుతున్నాయి.

అవును ఆమె నా రెండో భార్య: క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్

రషీద్ ఖాన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఈయన ఆప్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్. తనదైన రీతిలో క్రికెట్ ఆడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆయన రెండో భార్య ఎవరు?, ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

రెండో భార్యతో రషీద్ ఖాన్

ఆప్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్.. 2025 ఆగష్టు 2న తాను రెండో పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. అప్పటి నుంచి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ.. ఇటీవల నెదర్లాండ్స్‌లో రషీద్ ఖాన్ ఛారిటీ ఫౌండేషన్ కార్యక్రమంలో తన రెండో భార్యతో కనిపించారు. ఆ సమయంలోనే తన రెండో వివాహం గురించి అధికారికంగా వెల్లడించారు. కాగా వీరిరువురి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజమే రెండో పెళ్లి చేసుకున్నా

తన రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. 2025 ఆగష్టు 2న నా జీవితంలో ఒక అధ్యాయాన్ని ప్రారంభించాను. నేను ఎప్పుడూ ఆశించే ప్రేమ, శాంతి, భాగస్వామిన్ని ప్రతిబింబించే స్త్రీని వివాహం చేసుకున్నాను. ఇటీవల నేను, నా భార్యను ఒక ఛారిటీ కార్యక్రమానికి తీసుకెళ్ళాను. ఆమె నా భార్య, ఇందులో దాచడానికి ఏమీ లేదు అని పేర్కొన్నారు. మాపై ప్రేమ చూపిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు. అయితే.. ఆమెకు సంబంధించిన విషయాలను మాత్రం వెల్లడించలేదు.

2024లో మొదటి వివాహం

రషీద్ ఖాన్ 2024 అక్టోబర్ 3న తన మొదటి వివాహం చేసుకున్నాడు. తన ముగ్గురు సోదరులకు ఒకేసారి వివాహం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ జంట విడిపోయినట్లు.. సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. బహుశా ఆప్ఘనిస్తాన్ దేశంలో బహుభార్య విధానం అమలులో ఉంది. కాబట్టి మొదటి భార్య ఉండగానే.. రెండో వివాహం కూడా చేసుకుని ఉండొచ్చని కొందరు చెబుతారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి మొదటి భార్యకు విడాకులు ఇచ్చారా? లేదా? అనేది ఖచ్చితంగా వెలువడలేదు.

క్రికెట్ విషయానికి వస్తే..

రషీద్ ఖాన్ విషయానికి వస్తే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి ముందు, ఈయనను గుజరాత్ టైటాన్స్ (జీటీ) నిలుపుకుంటుందని భావిస్తున్నారు. టీ20ఐ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అయిన రషీద్.. ఐపీఎల్ 2025 సీజన్‌లో పెద్దగా ప్రదర్శించలేదు. తొమ్మిది కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో 15 మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

భారతదేశంలో రెండో పెళ్లి చట్టమేనా?

మన దేశంలో మొదటి భార్య ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవడం నేరం. ఒకవేళా భార్యకు అధికారికంగా విడాకులు ఇచ్చిన తరువాత రెండో పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళా మొదటి భార్య ఉండగా.. రెండో పెళ్లి చేసుకున్నట్లయితే చట్ట రీత్యా అతనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భారతదేశంలో భార్య ఉండగా.. రెండోపెళ్లి చేసుకోకూడదు. కొన్ని దేశాల్లో ఇది బహుశా చట్టబద్ధమే అయి కూడా ఉంది. కొన్ని దేశాల్లో ఇది బహుశా చట్టబద్ధమే అయి కూడా ఉంది. కాబట్టి రషీద్ ఖాన్.. దీని ప్రకారం పెళ్లి చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్ మీట్: రష్మికకు ముద్దుపెట్టిన విజయ్ దేవరకొండ

0

నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. సినిమాల్లో నటిస్తూ చాలా బిజీ అయిపోయింది. ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమా చేస్తూ సినిమా పరిశ్రమలో దూసుకెళ్తోంది. థామా సినిమా విజయం సాధించిన తరువాత.. ఈమె నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా కూడా మంచి ఆదరణ పొందుతోంది. రిలీజ్ అయిన చాలా తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిధిగా విజయ్ దేవరకొండ హాజరయ్యారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రష్మికను గీత గోవిందం సినిమా నాటి నుంచే చూస్తున్నాను. నాకు కోపం వస్తే లేదా నన్ను ఎవరైనా ఏమైనా అంటే.. వాళ్లమీదకు గొడవకు వెళ్తాను. కానీ రష్మిలా అలా కాదు. తనను బాధపెట్టిన వారిని కూడా క్షమించేస్తుంది. తనలోని అమాయకత్వం, అందరూ బాగుండాలనుకునే గుణం చాలా గొప్పవని ప్రశంసించాడు. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. ఎలాంటి సినిమాలను ఎంచుకోవాలి అనే విషయంలో కూడా రష్మిక మంచిని తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నంత సేపు రష్మిక పేరు వచ్చినప్పుడు.. విజయ్ దేవరకొండ రషి అని అంబోధించాడు.

మన భాగస్వామిక రక్షణగా ఉండాలని అందరూ అనుకుంటారు. కాబట్టి మనం వారి కలలను, ఆశయాలను సాధించేలా ప్రోత్సహించాలి. పుట్టడం, కన్నుమూయడం ఇవన్నీ మన చేతుల్లో ఉండవు. కానీ జీవితంలో ఎన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయన్నది ముఖ్యమని అన్నారు. అంతే కాకుండా.. సమాజంలో వచ్చే అనేక సంఘటనలను ఎదుర్కొని.. ఒక్కో మెట్టుగా రష్మిక ఎదిగిందని, రషి నువ్ అమేజింగ్ అని అన్నారు విజయ్. చాలా కాలం తరువాత నేను చూసిన బెస్ట్ సినిమాల్లో ది గర్ల్‌ఫ్రెండ్ ఒకటని.. ఆ చిత్ర బృందాన్ని కూడా ప్రశంసించారు.

రష్మిక చేతికి విజయ్ ముద్దు

ఇదిలా ఉండగా.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు ముఖ్య అతిగా హాజరైన విజయ్ దేవరకొండ, ప్రారంభంలోనే అల్లు అరవింద్, ఇతరత్రా ప్రముఖులతో మాట్లాడారు. ఆ సమయంలో కనిపించిన రష్మీకకు షేక్యాండ్ ఇవ్వడంతో పాటు, ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ఇది చూసిన అక్కడి ప్రేక్షకులు గట్టిగా కేకలు వేశారు. దీంతో రష్మిక కూడా సిగ్గుపడింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది.

రష్మిక మందన్న మాట్లాడుతూ..

నటి రష్మిక మందన్న మాట్లాడుతూ.. ది గర్ల్‌ఫ్రెండ్ కథను విన్న వెంటనే సినిమాకు ఒప్పుకున్న. ఎందుకంటే భూమా (సినిమాలో రష్మిక పాత్ర పేరు భూమాదేవి) జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు.. నా నిజ జీవితంలో కూడా ఎదురయ్యాయి. ఏదైనా సినిమాలో నటించేటప్పుడు.. ఏ పాత్రకు ఎంతవరకు నటించాలో అంతే నటిస్తా. కానీ ఈ సినిమాలో (ది గర్ల్‌ఫ్రెండ్) మాత్రం నా మనసులో ఏమైతే ఉందో దాన్ని చూపించా అని అన్నారు. అంతే కాకుండా విజ్జు (విజయ్ దేవరకొండ) ఈ సినిమా ప్రారంభం నుంచి నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ వంటి వ్యక్తి ఉండాలని. అదొక వరం అని ఆమె పేర్కొంది. మంచి సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించిన చిత్ర బృందానికి ఆమె కృతజ్ఞతలు చెప్పింది.

సమాజంలోని సమస్యను తెరపై చూపించేదే.. ‘సంతాన ప్రాప్తిరస్తు’

0

విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఈ చిత్రం 2025 నవంబర్ 14వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ మరియు నిర్వీ ఆర్ట్స్ పతాకంపైన నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మధుర శ్రీధర్ రెడ్డి & నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఇద్దరు కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, రచ్చ రవి, తాగుబోతు రమేష్ లాంటి వారందరూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కథ ఇలా..

ఇప్పటికే విడుదలయిన సినిమా ట్రైలర్ మరియు టీజర్లను బట్టి చూసినట్లయితే.. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే అబ్బాయి ఒక అమ్మాయి.. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం ఎలాగోలా.. హీరోయిన్ నాన్నకు తెలుస్తుంది. వారి ప్రేమ వివాహాన్ని ఆయన ఒప్పుకోడు, ఈ పరిస్థితుల్లో కనీసం పిల్లల్ని కంటే అయిన వారిని చూసి అయినా తల్లిదండ్రులకు, దగ్గర అవ్వచ్చు అనే ఒక సలహా తరుణ్ భాస్కర్ హీరోకి చెబుతాడు. అప్పటి నుంచి భార్య, భర్త ఇద్దరు కూడా పిల్లల కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. తర్వాత ఈ విషయంలో డాక్టర్‌ను కన్సల్ట్ అవుతారు. అయితే అందులో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. హీరోకి స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ కారణంగా హీరో చాలా బాధపడుతూ కనిపిస్తాడు. అయితే ఆ తర్వాత ఏమి జరుగుతుంది అనేది మనం థియేటర్లలో చూడాలి.

సంతానలేని సమస్యే కాన్సెప్ట్

హీరోకి ఉండే ఈ సమస్యల మధ్యలో వచ్చిపోయే ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉండనున్నట్టు అర్థమవుతోంది. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, తాగుబోతు రమేష్ వీళ్లందరి కామెడీ.. ఈ సినిమాకు ప్లస్ అవ్వనుంది. అభినవ్ గోమటం ట్రైలర్‌లో హీరో స్టోరీ చెప్పేవాడిలాగా కనిపించాడు. తరుణ్ హీరోకి స్టోరీ చెప్పమంటే అభినవ్ ఎంటర్ అయ్యి వీడియో ప్రారంభంలోనే.. దేవర కథ ప్రకాష్ రాజ్ చెబితే వినలేదా అనే డైలాగ్ బాగుంటుంది.

సంతాన ప్రాప్తిరస్తు సినిమాకి సంబంధించిన కథ విషయానికి వస్తే.. ప్రస్తుతం సమాజంలో ఒక పెళ్లైన జంటకు ఉన్నటువంటి సంతానలేమి సమస్యలనే డైరెక్టర్ ఇతివృత్తంగా తీసుకున్నాడు. ఆ విషయాన్నే కాస్త ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలనుకున్నట్టు ఉన్నాడు. దానితో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చేటట్టే అనిపిస్తుంది.

ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కనిపిస్తోంది. మొత్తం కామెడీ స్టార్స్ ఇందులో ఉండటం కారణంగా మొత్తం నవ్వులు పండిస్తున్నారు. సొసైటీలో ఉన్న ఈ సంతాన సమస్యని ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలాగా తీర్చిదిద్దినట్టు మూవీ టీమ్ చెప్పుకొచ్చారు. కుటుంబం అంతా చూడగలిగే ఒక మంచి సమస్యని, సందేశాన్ని కలిపి రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

హీరోకి ఇది తన మొదటి చిత్రం. ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్‌కు చాలా సంవత్సరాల తర్వాత నిర్మాతగా ఇది రెండో సినిమా. అయితే ఇంతకాలం ఆయన డిస్ట్రిబ్యూషన్, ఆడియో మ్యూజిక్, ఇతరత్రా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంకో నిర్మాత నిర్వి హరిప్రసాద్‌కు ఇది మొదటి సినిమా. వీరందరికి సంతాన ప్రాప్తిరస్తు మూవీ సక్సెస్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.