Home Blog Page 127

ఘీంకరించిన ఏనుగు: దేశంలోనే అతిపెద్ద బీఎస్పీ ర్యాలీ!

రేపు అక్టోబర్ తొమ్మిదో తేదీన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరామ్ వర్ధంతిని పురష్కరించుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాయవతి అతిపెద్ద ర్యాలీకి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో కాన్షిరామ్ స్మారక వనంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఇప్పటికే ఈ వార్తను బీఎస్పీ పార్టీ శ్రేణులు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు దావానలంలా వ్యాపింపచేశారు. ఇందుకు యూపీలోని డెబ్భై ఐదు జిల్లాల్లో.. ఒక్కో జిల్లా నుంచి దాదాపు నలభైకి పైగా బస్సులు, వంద పైన కార్లు రానున్నట్టుగా సమాచారం. దేశం నలుమూలల నుంచి పది లక్షల జనాభాకి పైనే ఈ ర్యాలీలో పాల్గొంటారని అంచనా. ఇప్పటికే అనేక మంది నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున లక్నోకి తరలివెళ్తున్నారు. బీఎస్పీ ర్యాలీతో ఎటువంటి రాజకీయ పరిణామాలు ఏర్పడుతాయో.. అని దేశం అంతా ఇప్పుడు ఎంతో ఆసక్తిగా లక్నో వైపు చూస్తోంది.

ర్యాలీ ఉద్దేశ్యం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా నాలుగు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత బహుజన్ సమాజ్ పార్టీకి ఉంది. మూడు సార్లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగా, 2007లో ఎవరు ఊహించని విధంగా 206 సీట్లు సాధించి అత్యధిక మెజారిటీతో ఎవరి మద్దతులేకుండానే ప్రభుత్వాన్ని నడిపారు. అటువంటి పార్టీకి ఇప్పుడు ఆశించినంత ఫలితాలు ఎక్కడా కనిపించడంలేదు. దేశంలో కోట్లమంది కార్యకర్తలు, అభిమానులు ఉన్న అతిపెద్ద జాతీయ పార్టీకి ఇప్పుడు సరైన దిశానిర్దేశం అవసరం. ఈ ర్యాలీ.. చెల్లచెదురుగా, నిరాశలో ఉన్న బహుజనులకు ఒక నూతన ఉత్తేజాన్ని రగిలించునుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి బీఎస్పీకి పూర్వవైభవాన్ని కల్పించాలనే మాయావతి ఒక సంకల్పాన్ని తలపెట్టారు. ఇది కేవలం పార్టీ మీటింగో.. లేకుంటే కాన్షిరామ్ వర్ధంతి సభో కాదు, అణగారిన.. అణచివేయబడిన 85% బహుజన వర్గాల రాజకీయ జీవితాలను మార్చివేసే ప్రక్రియగా చెబుతున్నారు.

ర్యాలీకి ఆటంకాలు

బీఎస్పీ మీటింగ్ వల్ల.. మిగిలిన రాజకీయ పార్టీలను కంగారు పెడుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లోని అనేక రైళ్లను రద్దు చేయడం, మిగిలిన ట్రైన్స్ రాకపోకల సమయాల్లో మార్పలు చేయడంలాంటివి అందుకు నిదర్శనమని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఎస్పీ తిరిగి పుంజుకుంటే యూపీలోనే కాదు ఇండియాలో.. అనేక చోట్ల బీజేపీ, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ లాంటి పార్టీలకు పెద్ద సవాల్‌గా మారుతుంది. ఆ పార్టీల కోటలు బీటలుపారే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ర్యాలీకి అన్ని రకాల ఆటంకాలు, ఇబ్బందులు కలిగిస్తున్నట్టు బీఎస్పీ శ్రేణులు చెబుతున్నాయి. అక్టోబర్ తొమ్మిదిన జరిగే మీటింగ్‌పైన మిగిలిన పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు.

కాన్షిరాంకు ఘన నివాళి

2027 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది ఆరంభం అని కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం బీఎస్పీ పోస్టర్లు, వీడియోలు, పాటలతో ఒక ఊపు ఊపేస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్ 09 ఛలో లక్నో పేరిట ట్రెండింగ్ చేస్తున్నారు. ”జై భీమ్, జై పూలే, ఓట్లు మావి.. సీట్లు మీవా ఇకపై చెల్లదు ఇకపై చెల్లదు, మేమెంతో మాకంత, జాతీ చోడో సమాజ్ జోడో” లాంటి శక్తివంతమైన స్లోగన్లతో కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ.. ప్రజల్లో ర్యాలీ ఆతృతను, ఆసక్తిని పెంచుతున్నారు. ఈ భారీ ర్యాలీని విజయవంతం చేసి కాన్షిరాంకు ఘనంగా బహుజన నివాళులు అర్పించదలుచుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ర్యాలీ ప్రభావం ఏ విధంగా ఉందో తెలియాలంటే 2027 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ఈ మీటింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

తిరుపతిలో డ్యూడ్ టీమ్.. లవ్‌టుడే తరువాత సరికొత్త ప్లాన్!

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో.. ఈ రోజు (అక్టోబర్ 8) డ్యూడ్ సినిమా టీమ్ తిరుపతికి చేరుకున్నారు. ఈ సినిమా ఈ నెల 17వ తేదీన దీపావళి సందర్బంగా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ ప్లాన్ చేసింది.

లవ్‌టుడే, డ్రాగన్ వంటి సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత విజయం సాధించడంతో.. ప్రదీప్ రంగనాథ్ ఇక్కడ యువతలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇప్పుడు తాజాగా డ్యూడ్ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథ్ మంచి యంగ్ లుక్ మరియు డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి కాబట్టి.. అతన్ని యూత్ ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకోసమే మూవీ ప్రమోషన్ ప్రోగ్రామ్‌ను తిరుపతి నగరంలో నిర్వహించడం జరుగుతోంది.

డ్యూడ్ మూవీ టీమ్ తిరుపతి షెడ్యూల్

మొదటగా తిరుపతిలో ఉన్న ప్రెస్ అండ్ మీడియాతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో డ్యూడ్ టీమ్ పాల్గొని సినిమాకి సంబంధించిన షూటింగ్, రిలీజింగ్, పాటలు, నటీనటుల వ్యక్తిగత అంశాలతో పాటు మరిన్ని మూవీ విషయాలను మీడియాతో పంచుకుంటారు. ఆ విశేషాలు సమావేశం తరువాత మనం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో చూడచ్చు.

విద్యార్థులతో చిట్‌చాట్‌

ఈ మీడియా సమావేశం అనంతరం తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాలేజీలో ఉన్నటువంటి ఇంజినీరింగ్ విద్యార్థులతో చిట్‌చాట్‌ చేస్తారు. యూత్ ఎక్కువ ఫ్యాన్స్ కాబట్టి వారిని మరింత ఉత్సహాపరచి సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయనున్నారు. హీరో ప్రదీప్ కోసం ఎంతో విద్యార్థులు ఎదురుచూసే అవకాశం ఉంటుంది. అయితే మూవీ టీమ్ అంతా ఏ విధంగా సందడి చేస్తుందో చూడాలి అంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.

శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రోగ్రాం అయిపోయిన తరువాత.. అక్కడ నుంచి మరో కాలేజీలో కూడా విద్యార్థులతో మూవీ టీమ్ ముచ్చటించనుంది. అది తిరుపతి – తిరుచానూరు హైవే పక్కన ఉన్న రాయలచెరువు రోడ్డులో కేసీ పేటని ఆనుకోని ఉన్న మెడ్ జీ (అన్ అకాడమీ) కాలేజీలో ఈ ఈవెంట్ నిర్వహిస్తారని సమాచారం. సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. మెడ్ జీ కాలేజీలో కూడా అక్కడి స్టూడెంట్స్‌తో ఫన్ క్రియేట్ చేసి సినిమా పట్ల ఆసక్తిని కలిగించే కార్యక్రమం చేయనున్నారు.

రెండు రాష్ట్రాల ఆదరణ కోసం

ఈ ఈవెంట్స్‌తో డ్యూడ్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రల్లో అధిక ఆదరణ లభించే అవకాశం ఉంది. లవ్‌టుడే, డ్రాగన్ సినిమాలు ప్రేక్షకులను ఎంతోగానో అలరించాయి. ఆ రెండు కూడా మంచి కథా వస్తువు మరియు నటన ఉన్న సినిమాలు. కాబట్టి ప్రదీప్ రంగనాథ్ మీద హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ డ్యూడ్ కూడా అంతే కథా బలంతో నటతో ఉంటుందని ఆశిద్దాం. ఈ సినిమాలో హీరోయిన్‌గా మమిత బైజు నటించారు.

డౌట్ క్లియర్ చేసిన రష్మిక మందన్న: కన్నడ పరిశ్రమ బ్యాన్‌పై క్లారిటీ..

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే గుసగుసలు వినపడిన తరువాత వీరిరువురి పేరు గట్టిగా వినిపిస్తోంది. నిశ్చితార్థం విషయం గురించి రష్మిక, విజయ ఇప్పటివరకు స్పందిచకపోగా.. ఎవరిపనిలో వారు నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి సమయంలో.. కన్నడ పరిశ్రమ రష్మికను నిషేధించిందా? అనే వార్తపై నేషనల్ క్రష్ స్పందించింది.

కన్నడ పరిశ్రమ నిషేదించిందా?

నటి రష్మిక మందన్న ఈ రోజు నేషనల్ క్రష్ అని పాపులారిటీ పొందొచ్చు, పాన్ ఇండియా సినిమాల్లో నటించనూ వచ్చు.. కానీ ఈమె మూలాలు కన్నడ పరిశ్రమ నుంచి వచ్చాయని బహుశా చాలామందికి తెలియకుండా ఉండొచ్చు. అంటే ఈమె సినిమా అరంగేట్రం కన్నడ పరిశ్రమ నుంచే మొదలైంది. అయితే ఇప్పుడు కన్నడ సినిమా పరిశ్రమకు రష్మిక దూరంగా ఉందా?, లేక కన్నడ సినిమా పరిశ్రమే ఈమెను దూరంగా ఉంచిందా? అనేది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న.

ఇకపోతే.. భారతదేశంలోని అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన రష్మిక ప్రస్తుతం ‘థామా’ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. ఇలాంటి సమయంలో కన్నడ పరిశ్రమ మిమ్మల్ని దూరంగా ఉంచిందా అనే ప్రశ్నకు.. ఇంటర్వ్యూ లో స్పందించింది. ఇటీవల విడుదలైన కాంతారా చాప్టర్-1 సినిమాపై ఈమె స్పందించకపోవడంతో ఈ రూమర్ పుట్టింది. తెరవెనుక ఏమి జరుగుతోంది చాలామందికి తెలియదని రష్మిక పేర్కొన్నారు.

డౌట్ క్లియర్ చేసిన రష్మిక మందన్న

ఏ సినిమా అయినా.. రిలీజ్ అయిన రెండు మూడు రోజులు నేను చూడలేను. ఆ తరువాత చూస్తాను. ఇలాగే కాంతారా చాప్టర్-1 సినిమా కూడా చూశాను. సినిమా చాలాబాగుందని చిత్ర బృందాన్ని అభినందించాను. వారు కూడా నాకు థాంక్స్ చెప్పారు. చాలా విషయాలను నేను సోషల్ మీడియాలో షేర్ చేయను. ఇందులో కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి విషయాల్లో ఎవరు ఏమనుకున్నా నేను పెద్దగా పట్టించుకోను. నా సినిమా గురించి, నటన గురించి మాత్రమే పట్టించుకుంటానని రష్మిక మందన్న స్పష్టం చేశారు.

ఇక కన్నడ పరిశ్రమ నిషేదించిందా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నన్ను ఏ సినిమా ఇండస్ట్రీ నిషేధించలేదు. అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే. ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, ఇతరుల కోసం జీవించడం ఆపేయాలని రష్మిక క్లారిటీ ఇచ్చింది. కొన్ని అపార్దాల వల్లనే రూమర్స్ పుట్టుకొస్తాని ఆమె అన్నారు. మొత్తానికి చాలామందికి ఉన్న ఒక పెద్ద డౌట్ రష్మిక క్లియర్ చేసింది.

థామా విషయానికి వస్తే

రష్మిక మందన్న నటించిన.. త్వరలో థియేటర్లలో విడుదలకానున్న సినిమా థామా. ఈ సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, సత్యరాజ్, వరుణ్ ధావన్, మలైకా అరోరా, నోరా ఫతేహి వంటి దిగ్గజ నటులు కూడా నటిస్తున్నారు. ఇది రొమాంటిక్ హర్రర్ మూవీ. మాడ్డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు అన్నీ కూడా రిలీజ్ అయ్యాయి.

భారీగా పెరిగిన బంగారం ధరలు: ఇక కొనడం సాధ్యమేనా?

భారతదేశంలో బంగారం ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ.. పసిడి ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈ రోజు (అక్టోబర్ 8) రూ. 1,20,000 దాటేసింది. దీంతో ఒక్కసారిగా బంగారం కొనడం సాధ్యమేనా అనే ప్రశ్న చాలామందిలో పుట్టింది. ఇదిలాగే కొనసాగితే.. బంగారం రెండు లక్షల రూపాయలకు చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదని అర్థమవుతోంది. ఈ కథనంలో గోల్డ్ రేట్లు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

రూ. 12వేలు దాటేసింది గోల్డ్ రేటు

బుధవారం (అక్టోబర్ 8) హైదరాబాద్, విజయవాడలలో.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1150 రూపాయలు పెరిగి, రూ. 1,23,170 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1050 రూపాయలు పెరిగి.. రూ. 1,12,900 వద్ద నిలిచింది. బంగారం అంటే తెలుగు ప్రజలకు వెంటనే గుర్తచ్చే ప్రొద్దుటూరులో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి. అంతే కాకుండా బెంగళూరులో కూడా బంగారం ధరలు దాదాపు ఇలాగే ఉంటాయి.

ఇక సమీపంలోని చెన్నై నగరంలో.. బంగారం ధరల విషయానికి వస్తే, ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1100 రూపాయలు పెరిగి.. 1,23,280 వద్దకు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1000 పెరిగి.. 1,13,000 రూపాయలకు చేరింది. గతంలో కొన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడ (చెన్నై) పసిడి ధరలు కొనసాగాయి. ఇప్పుడు రేట్లలో చిన్న తేడా కనిపిస్తోంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1250 పెరిగి.. రూ. 1,23,320 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి విషయానికి వస్తే.. దీని ధర రూ. 1050 పెరిగి, రూ. 1,13,050 వద్ద నిలిచింది. మొత్తం మీద భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.

సెప్టెంబర్ 2025లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. అక్టోబర్ ప్రారంభంలో కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ నెల ప్రారంభమైన నేటికీ (ఎనిమిది రోజులకు) పసిడి ధర సుమారు రూ. 5900 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పరిస్థితితులు ఇలాగే కొనసాగితే.. దీపావళికి గోల్డ్ రేటు రూ. 13,000 (10 గ్రామ్స్) దాటేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇదే జరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి మాత్రం కొంత శాంతించిందనే చెప్పాలి. ఎందుకంటే కేజీ రేటు ఇప్పుడు.. నిన్నటి (మంగళవారం కంటే) రూ. 100 మాత్రమే తక్కువ. ఈ రోజు (బుధవారం) కేజీ వెండి రేటు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు వంటి నగరాల్లో రూ. 1,67,000 వద్ద ఉంది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర రూ. 1,57,000 వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే ఢిల్లీలో సిల్వర్ రేటు.. దేశంలోని ఇతర నగరాల్లో కంటే రూ. 10000 తక్కువని స్పష్టమవుతోంది. అయితే త్వరలోనే వెండి రూ. 2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు కూడా నిపుణుల మాటలను నిజం చేస్తాయా? అన్నట్టు ఉన్నాయి.

ప్రియదర్శి మిత్రమండలి.. దీపావళికి నవ్వుల సందడి: ట్రైలర్ చూశారా?

ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ లీడ్ రోల్‌లో నటించిన సినిమా మిత్రమండలి. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్, పోస్టర్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బిగ్ సక్సెస్ ఫుల్ టాక్‌‌తో నడుస్తున్న లిటిల్ హార్ట్స్ సినిమా యూనిట్ మౌళి, శివాని, సాయి మార్తాండ్ చేతుల మీదుగా చిత్రమండలి సినిమా ట్రైలర్‌ను మంగళవారం (అక్టోబర్ 7) ఉదయం పదకొండు గంటలకు ఏఏఏ సినిమాస్‌లో లాంచ్ చేయడం జరిగింది.

అక్టోబర్ 16న రిలీజ్

మిత్రమండలి సినిమాని అక్టోబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు ప్రెజెంటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. కథ బాగుంటే.. ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అనిపించిందంటే.. బన్నీ వాసు ఆ చిన్న చిన్న చిత్రాలను తీసుకొని థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. ఈమధ్య హిట్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమాను కూడా ఆయనే రిలీజ్ చేశారు. అందుకనే రెండు టీమ్‌లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి.. ప్రేక్షకుల కళ్ళల్లో ఆనందాన్ని నింపారు. ఏఏఏ సినిమాస్ అంతా నవ్వులతో, ఫుల్ జోక్స్‌తో నిండిపోయింది.

మొత్తం నవ్వులే..

సినిమా ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్‌లోనే చూపించేశారు. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పకనే చెప్పేశారు. సినిమా మొత్తం కామెడీ స్టార్స్‌తో నింపేశారు. ప్రతి సన్నివేశం మనకు ఎంతో నవ్వు తెప్పిస్తుంది. ఇందులో కామెడీ సూపర్ స్టార్ బ్రహ్మానందం, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్య, ప్రసాద్ బెహరా, రఘు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, విటివి గణేష్, డైరెక్టర్ అనుదీప్, యాష్ టాగ్ నైంటీస్ అనిల్, వంశీధర్ గౌడ్ లాంటి ఎంతో మంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఎంత కామెడీ జెనరేట్ అవుతుంది అనేది.

జంబరు గింబరు లాలా.. అంటే?

రవితేజ వెంకీ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం చెప్పిన వెరీ పాపులర్ డైలాగ్ మీమర్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేసే డైలాగ్ “జంబరు గింబరు లాలా”. డైరెక్టర్ విజయేంద్ర అదే డైలాగ్ ని తీసుకుని మిత్రమండలి సినిమాలో ఒకపాటని క్రియేట్ చేశారు. అలా రాసి కంపోజ్ చేయడమే కాకుండా ఆ పాటకు బ్రహ్మానందంతోనే డాన్స్ చేయించడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పటికే ప్రేక్షకులలో ట్రెండ్ అయిపోయాయి. ఈ డైలాగ్‌కు అర్థం ఏంటని బ్రహ్మానందంను అడిగితే.. ప్రత్యేకించి మీనింగ్ అంటూ ఏమి లేదు, కేవలం నవ్వుకోవడం కోసమే అని చెప్పారు. హీరో, హీరోయిన్ కూడా ఈ పాటకి డాన్స్ చేశారు.

మిత్రమండలి చిత్ర బృందం

కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, సోమరాజు, విజయందర్ రెడ్డి తీగల నిర్మాతలుగా వ్యవహరించారు. బన్నీ వాసు సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. సంగీతం ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చారు. సిద్దార్థ్ ఎస్‌జే సినిమాటోగ్రాఫర్ కాగా, ఎడిటర్ కోదాటి పవన్ కల్యాణ్ బాధ్యత వహించారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. కాగా ఈ సినిమా దీపావళికి అందరి ముఖాల్లో నవ్వులు పూయించడానికి థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.142000 జీతం!: ఇదిగో ఫుల్ డీటెయిల్స్

చదువు పూర్తవ్వగానే జాబ్ తెచుకోవడం చాలామంది కల అయితే.. ప్రత్యేకించి ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)లో ఉద్యోగం తెచ్చుకోవడం ఇంకొందరి ఫ్యాషన్. అలాంటి వారికోసం ఇస్రో శుభవార్త చెప్పింది. మొత్తం 20 ఉద్యోగాలను నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు

ఇస్రో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వివిధ విభాగాల్లో (సివిల్, మెకానికల్, ఐటీ/కంప్యూటర్ సైన్స్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎయిర్ కండిషనర్, మెకానిక్ రిఫ్రిజిరేటర్, ప్లంబర్) మొత్తం 20 జాబ్స్ ఉన్నాయి. మొత్తం మీద 10 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, మరో 10 టెక్నీషియన్-బీ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ. 500.

అప్లై చేయడానికి లాస్ట్ డేట్ & అర్హతలు

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు.. 2025 అక్టోబర్ 4 నుంచి 2025 అక్టోబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వారు 10వ తరగతి / ఐటీఐ / డిప్లొమో పూర్తిచేసి ఉండాలి. అంతే కాకుండా సంబంధిత రంగంలో అనుభవం కూడా ఉండాలి. కాగా దరఖాస్తుదారుల వయసు 2025 అక్టోబర్ 31 నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం వివరాలు

ఇస్రో నోటిఫికేషన్ ప్రకారం.. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి జీతం నెలకు రూ. 44,900 నుంచి రూ. 1,42,400 మధ్య ఉంటుంది. అదే సమయంలో టెక్నీషియన్-బీ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఉంటుంది. జీతం అనేది అనుభవాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది.

ఎంపిక విధానం

ఇస్రో ఉద్యోగాలను ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తరువాత ఎంపిక విధానం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్షకు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుందనే విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. జాబ్ తెచ్చుకోవాలంటే కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉన్నది తక్కువ జాబ్స్.. కాంపిటీషన్ భారీగా ఉండే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పరీక్షకు సిద్ధం కావాలి. నిజానికి ఇస్రోలో ఉద్యోగం చేయాలని తపనపడేవారికి.. ఇదొక చక్కని అవకాశం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తప్పకుండా.. అన్నివిధాలా సిద్ధమవ్వాలి.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గురించి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో.. భారత ప్రభుత్వం యాజమాన్యంలో ఉంది. ఈ సంస్థ ఉపగ్రహాలను, వాహన రాకెట్స్ వంటివాటిని తయారు చేసి.. అంతరిక్షంలోకి పంపుతుంది. ఈ సంస్థను 1969లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ స్థాపించారు. ఇప్పటి వరకు ఈ సంస్థలో ఎంతోమంది మహానుభావులు తమ సేవలను దేశం కోసం అందించి తరించారు. అంతటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. కాబట్టి దేశం కోసం పనిచేసే సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవడానికి చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. కాబట్టి నోటిఫికేషన్ విడుదలైన తరువాత పోటీ చాలా ఎక్కువగానే ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

డాక్టర్ అయ్యుండి.. సినిమాల్లోకి: శశివదనే హీరోయిన్ గురించి ఆసక్తికర విషయాలు

నెపోలియన్, అనుకున్నది ఒక్కటి ఐయినది ఒక్కటి, ఏడ తానున్నాడ, నేను సీతాదేవి.. లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ కోమలి ప్రసాద్. ఇప్పుడు శశివదనే అనే మంచి రొమాంటిక్ సినిమాతో మన ముందుకు వస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలవుతుంది. ఈ సందర్బంగా నిర్వహించిన సినిమా పాత్రికేయులతో సమావేశంలో కొన్ని సినిమా మరియు వ్యక్తిగత విషయాలను కోమలి మీడియాతో ముచ్చటించింది.

డాక్టర్ అయ్యుండి.. సినిమాల్లోకి ఎందుకొచ్చానంటే?

మీరు డాక్టర్ అయ్యుండి సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? అని శశివదనే ప్రెస్‌మీట్‌లో రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు.. కోమలి ప్రసాద్ సమాధానం ఇస్తూ.. మాములుగా నేను క్లాసికల్ డ్యాన్స్‌తో ఆరంగేట్రం చేశాను, డ్యాన్స్ అండ్ థియేటర్ ఆర్ట్స్ కూడా చేశాను. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. కాకపొతే అప్పుడు మా ఫాదర్ నీకు ఫ్యాషన్ ఏమున్నా కూడా.. ఎడ్యుకేషన్ పూర్తి అయినా తరువాతే అని చెప్పారు. ఎందుకంటే ఎడ్యుకేషన్‌కు ఆయన చాలా విలువ ఇస్తారు కాబట్టి అని చెప్పుకొచ్చారు. అందుకే నేను డాక్టర్ కోర్స్ పూర్తి చేశాకే యాక్టింగ్‌లోకి రావడం జరిగిందని హీరోయిన్ కోమలి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

మతం ఏదైనా ఉంటే అది ప్రేమే

ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. నేను పర్సనల్‌గా ప్రేమను చాలా నమ్ముతాను. నాకు మతం ఏదైనా ఉంటే అది ప్రేమే. అబ్బాయిని అమ్మాయి మోసం చేయడం, అమ్మాయిని అబ్బాయి మోసం చేయడం అనేది జెండర్‌ను బట్టి ఏమి ఉండదు. మనుషులు చెడ్డవాళ్ల మంచివాళ్ల అనేదాన్ని బట్టే ఏ ప్రేమైన ఉంటుందని.. సినిమాలో తన పాత్ర కూడా ఒక స్వచ్ఛమైన ప్రేమగల గోదావరి జిల్లాల అందమైన అమ్మాయి చుట్టూ తిరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్యూర్ లవ్ స్టోరీలు తక్కువ అయిన తరుణంలో మేము గనుక హిట్ అయితే అదే ట్రెండ్ ఆవుతుంది అని కోమలి మాట్లాడారు.

నటి కోమలి ప్రసాద్ గురించి

కోమలి ప్రసాద్ 1995 ఆగస్టు 24న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించినప్పటికీ.. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో పెరిగారు. ఈమె అహ్మద్‌నగర్‌లోని.. ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో బీడీఎస్ (డెంటిస్ట్) పూర్తిచేసిన తరువాత.. సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో తెలుగు సినిమాల్లోకి నటిగా ప్రవేశం చేశారు.

సినిమా ప్రస్థానం ఇలా..

మొదట నేను సీతాదేవి అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. తరువాత ఒక్కొక్కటిగా నెపోలియన్, హిట్ (ది ఫస్ట్ కేస్), అనుకున్నది ఒకటి అయినది ఒకటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీ.సీ 524, హిట్ ది సెకండ్ కేస్, హిట్ థర్డ్ కేస్ సీక్వెల్ వంటి సినిమాల్లో నటించింది. అలాగే లూజర్, మోడర్న్ లవ్ హైదరాబాద్, టచ్ మీ నాట్ లాంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. తనకు ఒకేలాగా ఉండే పాత్రలు చేస్తూ వెళ్లడం ఇష్టం లేదని, విభిన్నమైన, విలక్షణమైన కథలు, క్యారెక్టర్స్ చేయడం అంటే.. నాకు చాలా ఉత్సహంగా ఉంటుందని శశివదనే ప్రమోషన్‌లో భాగంగా చెప్పుకొచ్చారు. అదే సందర్బంగా ఈ సినిమాలో అనేక ట్విస్ట్‌లు ఉన్నాయని, ఇంటిల్లపాది కూర్చుని చూసే మూవీ ఇదని.. అక్టోబర్ 10న కుటుంబం అంతా కలిసి థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రేక్షకులను కోరారు.

2025 టీవీఎస్ రైడర్: అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ.. సరికొత్త ఫీచర్స్!

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన ‘రైడర్ 125‘ కొత్త వేరియంట్ అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టింది. సంస్థ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్.. ఎలాంటి అప్డేట్స్ పొందింది. ధర ఎంత?, ఇతర వివరాలు ఏమిటనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

ధర

టీవీఎస్ రైడర్ 125 కొత్త వేరియంట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి టీఎఫ్‌టీ డ్యూయెల్ డిస్క్ (రూ. 95600), ఎస్ఎక్స్‌సీ డ్యూయల్ డిస్క్ (రూ. 93800) ఇక్కడ అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఈ బైక్ ఇప్పుడు దేశంలోని అన్ని టీవీఎస్ మోటార్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఇప్పుడు ఈ కొత్త బైకుని ‘ది వికెడ్ ట్రోయికా‘ అని పిలుస్తుంది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ అప్డేట్స్ పొందుతుంది.

డిజైన్ & ఫీచర్స్

సరికొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ.. చిన్న అప్డేట్స్ పొందుతుంది. అవి ఫాలో మీ హెడ్‌ల్యాంప్, ఇంజిన్ ఆపివేసిన తరువాత కూడా లైట్ కొంతసేపు ఆన్‌లో ఉండే ఓ సేఫ్టీ ఫీచర్. ఇవి కాకుండా రైడర్ రెండు డిస్‌ప్లే ఎంపికలతో స్మార్ట్ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది. 99 కంటే ఎక్కువ ఫీచర్స్ అందించే టీఎఫ్‌టీ స్క్రీన్.. 85 కంటే ఎక్కువ ఫీచర్లతో.. రివర్స్ ఎల్‌సీడీ క్లస్టర్ ఇందులో లభిస్తుంది.

టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్ ప్లాట్‌ఫామ్.. బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్ట్, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, కాల్ హ్యాండ్లింగ్, నోటిఫికేషన్ వంటి వాటికి అనుసంధానంగా ఉంటుంది. ఇది రోజువారీ ప్రయాణాన్ని మరింత అనుకూలంగా మారుస్తుంది. ఇవి కాకుండా కొన్ని గ్రాఫిక్స్ అప్డేట్స్ కూడా పొందుతాయి.

ఇంజిన్ వివరాలు

కొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ ఇప్పుడు బూస్ట్ మోడ్ పొందుతుంది. ఇది ఐజీఓ అసిస్ట్ టెక్నాలజీతో కూడైన కేటగిరీ ఫస్ట్ ఫీచర్. ఇందులోని ఇంజిన్ 6000 ఆర్‌పీఎమ్ వద్ద 11.75 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, హార్స్ పవర్ మారదు 11.2 హెచ్‌పీ వద్దనే ఉంటుంది. ఏబీఎస్‌తో కూడిన డ్యూయెల్ డిస్క్ బ్రేక్‌లు ఇప్పుడు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

రైడర్ 125 బైక్ ఉప్పుడు 90/90-17 ఫ్రంట్, 110/80-17 రియర్ టైర్లను పొందుతుంది. కాబట్టి రోడ్డుపై మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. క్లాస్ లీడింగ్ టెక్నాలజీ, సెగ్మెంట్ ఫస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ లేటెస్ట్ బైక్.. ఎరుపు రంగులో అక్కడక్కడా మెటాలిక్ సిల్వర్ ఫినిషింగ్ పొందుతుంది.

కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే?

2025 టీవీఎస్ రైడర్ 125 లాంచ్ సందర్భంగా.. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ.. యువ రైడర్లు టీవీఎస్ మోటార్ నుంచి ఏమి కోరుకుంటున్నారో.. దానిని ఇవ్వడంలో భాగంగానే ఈ కొత్త బైక్ లాంచ్ చేసాము. ఇది తప్పకుండా రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. మరిన్ని కొత్త మోడల్స్ లేదా అప్డేటెడ్ మోడల్స్ తీసుకువడానికి కృషి చేస్తూనే ఉంటామని ఆయన అన్నారు. మొత్తం మీద కొత్త అదనపు ఫీచర్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని తెలుస్తోంది.

మొత్తానికి శుభవార్త చెప్పిన సమంత: మా ఇంటి బంగారం త్వరలో..

నటి సమంత గత కొంతకాలంగా.. సినిమాలు చేయడం బాగా తగ్గించింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తరువాత.. తెలుగు సినిమాల్లో ప్రత్యేకించి హీరోయిన్ పాత్రలో కనిపించలేదు. అయితే ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో మళ్ళీ టాలీవుడ్‌లో కనిపించడానికి సిద్దమైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. లెట్స్ టాక్ అనే ఒక ఇంటరాక్టివ్ సెషన్‌లో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది.

‘మా ఇంటి బంగారం’తో సమంత

లెట్స్ టాక్ సెషన్‌లో.. సమంత రాబోయే తెలుగు సినిమా గురించి అడిగినప్పుడు.. దానికి సమాధానం ఇస్తూ, మా ఇంటి బంగారం సినిమాతో వస్తున్నట్లు, ఆ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈ వార్త అభిమానుల్లో మంచి జోష్ నింపింది. ఎప్పుడెప్పుడు సినిమాలో సమంత కనిపిస్తుందా అని ఎదురుచూసేవారికి ఇది ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి.

సమంత.. చివరిసారి ప్రవీణ్ కందెగుల దర్శకత్వం వహించిన హారర్ కామెడీ చిత్రం శుభంలో అతిధి పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు సమంత నిర్మాతగా వ్యవహరించింది. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో కనిపించనుంది. ఇప్పటికి విడుదలైన పోస్టర్ ప్రకారం.. సమంత ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

సమంత.. రక్త్ బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్‌డమ్

ప్రస్తుతం సమంత.. ‘రక్త్ బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్‌డమ్‘ అనే సినిమాలో నటిస్తోంది. దీనిని రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటి సమంత మాత్రమే కాకుండా.. ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, జైదీప్ ఆహ్లావత్, వామికా గబ్బి మొదలైన వారు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఒక ప్రణాళికాబద్ధంగా.. వివిధ దశల్లో జరుగుతోంది. అయితే ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు.

ఈ సినిమా షూటింగ్ జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన దశల్లో జరుగుతుందని సమాచారం, అయితే అధికారిక విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. కాగా సమంత ఇప్పటికే హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హానీ బన్నీ‘ నటించింది. అయితే ఇది అనుకున్నంత ఆదరణ పొందలేదని చెప్పాలి. ఇక మొత్తం ఆశలు.. మా ఇంటి బంగారంపైనే అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఎందుకంటే?

చాలా రోజులుగా సమంత సినిమాల్లో కనిపించకపోవడానికి ప్రధాన కారణం.. ఆరోగ్యంపై దృష్టి సారించడమే అని తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని సజావుగా సాగుతున్నట్లు, దీంతో తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సమంత ఎప్పటికప్పుడు ఈషా ఫౌండేషన్ సందర్శిస్తూ.. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటోంది. ఈషా ఫౌండేషన్ నా రెండో ఇల్లు అని ఆమె స్వయంగా వెల్లడించింది. దీంతో పాటు.. తాను విద్యార్థిని ఉన్నప్పుడు ఏం నేర్చుకుందో.. ప్రస్తుతం ఉన్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడులను ఎదుర్కొంటున్నారని విషయాన్ని కూడా తాజాగా వెల్లడించింది. ఒత్తిడి చాలా ప్రమాదం అని కూడా సమంత పేర్కొంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది: పోలింగ్ ఎప్పుడంటే?

తెలంగాణాలో ఎన్నికల హడావుడి మొదలయింది. ఈ రోజు హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ నియోజక వర్గానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ను.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి విడుదల చేశారు. దీంతో హైదరాబాద్ అంతటా ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చింది. అన్నీ రాజకీయ పార్టీలు మరియు రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రతి ఫొటోను, బ్యానర్లను అన్నింటినీ ఎన్నికల యంత్రాంగం తొలగించే కార్యక్రమాన్ని చేపట్టిందని ఎలక్షన్ ఆఫీసర్ తెలియజేశారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను 2025 నవంబర్ 11వ తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి.. అభ్యర్థుల దగ్గర నుంచి అక్టోబర్ 13న నామినేషన్ పత్రాలను స్వీకరిచడం జరుగుతుంది. నామినేషన్స్ సమర్పించడానికి అక్టోబర్ 21వ తేదీని చివరి గడువు ఇచ్చారు. కాగా ఈనెల 23న ఉపసహరణకు అవకాశం కల్పించారు. వచ్చే నెల 11న పోలింగ్/ఓటింగ్ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 14వ తేది.. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతుందని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు.

ఓటర్లు ఓటు వేయడానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ బుక్, పోస్టు ఆఫీస్ బుక్, బ్యాంకు బుక్ లాంటివి 12రకాల ఐడీలలో ఏదో ఒకటి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఓటర్ లిస్టులో తమ వివరాలు ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాల్సి ఉంటుంది.

ఓటర్ల జాబితా

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు 139 కేంద్రాలు, 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 ఉండగా.. ఇందులో పురుషులు సంఖ్య 2,07,382 మందిగాను, మహిళలు 1,91,593 మంది ఉన్నారు. జాబితాలో 25 మంది ట్రాన్సజెండర్లు, 6106 మంది యువ ఓటర్లు, 2613 మంది వృద్ధులు, 1891 మంది వికలాంగులు, 311 మంది బధిరులు, 519 మంది అంధులు, ఇతర కేటగిరీలు 722 మంది, విదేశి ఓటర్లు 95 మంది ఉన్నారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూసిన కారణంగా.. ఈ ఉప ఎన్నిక నిర్వహించడం జరుగుతోంది. ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఏఐఎమ్ఐఎమ్ పైన 9వేల పైచిలుకు మెజారితో గెలిచారు. 2018లో టీఆర్ఎస్ పార్టీలో చేరి వరుసగా మరో రెండుసార్లు విజయం సాధించాడు. జూన్ 2025లో ఆయన పరమపదించారు.

బీఆర్ఎస్ తిరిగి టికెట్‌ను మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతకు కేటాయించిది. దీంతో సానుభూతి ఓట్లు సంపాదించి తన స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. మిగిలిన పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్, బీజేపీ హై కమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రచారంలో అయితే ఇప్పటికే ఒకరిమీద ఒకరు పోటీగా ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు. ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే. ఎవరి గెలుపు ఎంతమేరకు ఉందో మీ అభిప్రాయాలు తెలియజేయండి.