Home Blog Page 131

పా. రంజిత్ కొత్త సినిమా.. డిఫరెంట్ లుక్‌లో అట్టకత్తి దినేష్..!

0

పా. రంజిత్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఈ పేరుకి ఇండియాలో ఒక ప్రత్యకమైన గుర్తింపు ఉంది. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అనే మాట ఈయనకు బాగా సరిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కరలేదు. ఇతని సినిమాలు కూడా ఈ దేశంలోని కొన్ని వర్గాల ప్రజల ఆస్థిత్వాన్ని, ఉనికిని చాటిచెప్పడానికే ప్రయత్నిస్తుంటాయి. సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో వెనకబడిన, అనచివేయబడిన జనం జీవితాలను, వారి చరిత్రను తెరకెక్కించడంలో పా.రంజిత్ సిద్దహస్తుడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన.. అట్టకత్తి, మద్రాస్, కబాలి, కాలా, సార్పట్ట పరంపర, తంగళాన్ సినిమాలు చూస్తే అతని ఆలోచన, తపన, ఆవేదన ఏంటి అనేది అర్థమవుతాయి. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు తాజాగా.. చేతుల్ని ముడుచుకుని మిగతా వాటితో పోరాడు అనే బలమైన క్యాప్షన్‌తో ఒక కొత్త మూవీ అప్డేట్ వీడియో రిలీజ్ చేశారు.

అట్టకత్తి దినేష్ బర్త్‌డే స్పెషల్

థియేటర్లలో ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న తమిళ చిత్రం తండకారణ్యం. ఈ సినిమా హీరో అట్టకత్తి దినేష్ (వీఆర్ దినేష్)  పుట్టిన రోజు సందర్భంగా.. పా. రంజిత్ శుభాకాంక్షలు చెబుతూ నీలం ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ఖాతాలో అతని కొత్త సినిమా వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో గమనిస్తే.. అట్టకత్తి దినేష్ మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. నల్లని దుస్తులు ధరించి కర్రసాము చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రాబోయే సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి.

రాబోయే ఈ సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్ & నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పా. రంజిత్8 అనే హ్యాష్‌ట్యాగ్‌తో రిలీజ్ అయిన ఈ వీడియో.. ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాలకంటే అద్భుతంగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ సినిమాకు ఇంకా ఖరారు చేయలేదు.

ప్రస్తుతం సినిమా.. షూటింగ్ దశలో ఉంది. పా. రంజిత్, అట్టకత్తి దినేష్ (వీఆర్ దినేష్)  సినీ జీవితంలో ఈ మూవీ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అర్థమవుతోంది. అయితే సినిమా టైటిల్ ఏమిటి?, దీనికోసం ఎంత బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు?, రిలీజ్ డేట్ వంటి చాలా విషయాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. బహుశా ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

నిర్మాతగా పా. రంజిత్ సినిమాలు

ప్రముఖ దర్శకుడుగా పేరుపొందిన పా.రంజిత్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, నిర్మాత కూడా. తన సొంత నిర్మాణ సంస్థ అయిన నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం తమిళంలో.. తాను నిర్మించిన తండకారణ్యం సినిమా రెండో వారంలో కూడా థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. కాగా చియాన్ విక్రమ్ కుమారుడు దృవ్ విక్రమ్ హీరోగా.. డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి నిర్మాత పా. రంజిత్. రాబోయే దీపావళికి ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

కాంతారా కోసం జూనియర్ ఎన్టీఆర్: అట్టహాసంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్

0

కాంతారా సీక్వెల్.. కాంతారా చాప్టర్-1 విడుదలకు సిద్ధమైంది. అంతకంటే ముందు సెప్టెంబర్ 28న .. అంటే రేపు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమాన్ని జూనియర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి అభిమానుల అంచనాలకు తగినట్టుగా హైద‌రాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకపై ఇప్పటికే అభిమానుల్లో కొత్త సందడి నెలకొని ఉంది.

కాంతారా మొదటి భాగం కర్ణాటక రాష్ట్రంలో.. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఎవరు ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి హీరోగా మాత్రమే కాకూండా.. డైరెక్టర్‌గా కూడా పనిచేసిన రిషబ్ శెట్టి అదే ఉత్సాహంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. కాంతారా మొదటి వెర్షన్ ఇచ్చిన విజయం వల్ల ఇప్పుడు ఈ కాంతారా చాప్టర్ -1 పైన అంచనాలు పెరిగిపోయాయి.

చీఫ్ గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే.. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. రిషబ్ శెట్టి.. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడంతో ఈ ఈవెంట్‌కి ఎన్టీఆర్ విచ్చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు, ఏ కార్యక్రమానికి హాజరైనా కూడా అభిమానులు పెద్ద ఎత్తున హాజరవుతారు. దీన్నిబట్టి చూస్తే.. కాంతారా చాప్టర్-1 ప్రీ రిలీజ్ కార్యక్రమానికి కూడా అభిమానుల హాజరు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. కాగా రేపు సాయంత్రం ఇద్దరినీ (రిషబ్ & ఎన్టీఆర్) ఒకే వేదికపై చూడటానికి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాంతారా చాప్టర్-1 సినిమా గురించి

ఇక కాంతారా చాప్టర్-1 విషయానికి వస్తే.. ఈ సినిమా 2025 అక్టోబర్ 02న విజయ దశమి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాంతారా ఘనవిజయం సాధించిన తరువాత.. దాని సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్న విధంగానే ఈ కాంతారా చాప్టర్-1.. కాంతారా విజయ పరంపరని కొనసాగిస్తుందా?, లేదా? అనేది రిలీజ్ తరువాత తెలుస్తుంది.

నిజానికి కన్నడ ప్రాంత సంస్కృతికి సంబంధించిన నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ఎంతోమందిని ఆకట్టుకుంది. రిషబ్ శెట్టికి కూడా ఈ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన కాంతారా చాప్టర్-1 టీజర్ అద్భుతంగా ఉందని అభిమానులే కాకుండా.. ఇతరులు కూడా చెబుతున్నారు. రాజులు, రాచరికాలు వంటి సన్నివేశాలు ఈ చాప్టర్-1 లో చూపించనున్నారు. మొత్తం మీద ఈ సినిమా సినిమా ప్రపంచంలో ఓ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందనే ఊహాగానాలు చాలామందిలో లేకపోలేదు. కాంతారా చాప్టర్-1 సినిమాలో రిషబ్ శెట్టి మాత్రమే కాకుండా.. రుక్మిణి వసంత్, జయరాం, గుల్సన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి మొదలైన వారు ఉన్నారు. ఈ సినిమా కోసం సుమారు రూ. 125 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

బంగారమే కాదు.. వెండి రేటు పెరిగిపోయింది: ఒక్కరోజే రూ.6000

0

బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న తరుణంలో వెండి ధరలు కూడా దూసుకెళ్తున్నాయి. ఈ ఒక్క రోజే (సెప్టెంబర్ 27) సిల్వర్ రేటు రూ. 6000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 159000లకు చేరింది. ఇక గోల్డ్ రేటు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికా సుంకాలు విధించినప్పటి నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు లక్ష రూపాయలు ఎప్పుడో దాటేసింది.

గోల్డ్ రేటు

శనివారం తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు రూ. 600 పెరిగి రూ. 115480 వద్దకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 550 పెరిగి.. రూ. 105850 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరులో కూడా కొనసాగుతాయి.

దేశ రాజధాని నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 115630 (రూ. 600 పెరిగింది) వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 106000 (రూ. 550 పెరిగింది) వద్దకు చేరింది. చెన్నైలో కూడా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గలేదు. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 990 పెరిగి రూ. 116080 వద్దకు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు 900 రూపాయలు పెరిగి రూ. 106400 వద్ద నిలిచింది. ప్రస్తుతం దేశంలో బంగారం ధర ఎక్కువగా ఉన్న నగరంగా చెన్నై రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

వెండి ధరలు

రోజుకు రూ. 1000 నుంచి రూ. 2000 పెరిగే వెండి.. ఈ రోజు ఒక్కసారిగా అందరకి షాకిచ్చింది. ఒక కేజీ వెండి రేటు ఏకంగా రూ. 6000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర ఇప్పుడు రూ. 159000 వద్దకు చేరింది. అంటే ప్రస్తుతం ఒక గ్రామ్ వెండి రేటు 159 రూపాయలన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే వెండి ధరలు రూ. 2 లక్షలకు చేరుకోవడానికి మరెంతో సమయం లేదని అర్థమైపోతోంది.

బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం

భారతదేశంలో బంగారం, వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఇప్పుడు చెప్పుకోదగ్గ ప్రధాన కారణం పండుగ సీజన్. ఓ వైపు దసరా (విజయ దశమి) నవరాత్రులు, మరోవైపు వస్తున్న దీపావళి. ఈ పండుగల సమయంలో చాలామంది బంగారం కొనుగోలు చేయడం శుభమని భావిస్తారు. ఈ కారణంగానే బంగారం కొనేవారి సంఖ్య పెరుగుతోంది. డిమాండ్ పెరుగుండటంతో.. ధరలు అమాంతం పెరుగుతున్నాయి.

ఒకప్పుడు శుభకార్యాలకు మాత్రమే బంగారం కొనేవారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి కూడా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. స్టాక్ మర్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటివాటితో నష్టాలు కూడా చవిచూడాల్సి ఉంటుంది. కానీ బంగారంపై పెట్టె పెట్టుబడి తప్పకుండా లాభాలనే అందిస్తుందని చాలామంది పెట్టుబడిదారులు.. బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి మరో ప్రధాన కారణం అనే చెప్పాలి.

ఇంకో ముఖ్యమైన కారణం.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాల కారణంగా.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు డీలా పడుతున్నాయి. లక్షల కోట్ల నష్టం వస్తోంది. దీంతో ప్రపంచ బ్యాంకులు సైతం పెద్ద ఎత్తున బంగారం కొంటోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం డిమాండ్ పెరిగిపోతోంది. ఈ కారణాల వల్లనే గోల్డ్ రేటు.. అంతకంతకూ పెరుగుతూనే పోతోంది.

పండుగ స్పెషల్: ఒకేరోజు మూడు బైకులు లాంచ్!

దసరా, దీపావళి దగ్గర పడుతున్న సమయంలో పలు వాహన తయారీ సంస్థలు దేశీయ విఫణిలో కొత్త బైకులు లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే హోండా మోటార్‌సైకిల్ సీబీ350సీ స్పెషల్ ఎడిషన్, సుజుకి మోటార్‌సైకిల్ కొత్త కలర్ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్, బీఎండబ్ల్యూ మోటోరాడ్ జీ 310 ఆర్ఆర్ బైకులను లాంచ్ చేశాయి. ఈ లేటెస్ట్ బైకుల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

హోండా సీబీ350సీ స్పెషల్ ఎడిషన్

ఇండియన్ మార్కెట్లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. సరికొత్త సీబీ350సీ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.01 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 అక్టోబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈ కొత్త సీబీ350సీ స్పెషల్ ఎడిషన్.. సీబీ350 రీబ్రాండెడ్ వెర్షన్. ఇది లేటెస్ట్ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇది రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ అనే రంగులలో లభిస్తుంది. ఈ బైకులోని 348.36 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్.. 5500 ఆర్‌పీఎమ్ వద్ద 20 హార్స్ పవర్, 3000 ఆర్‌పీఎమ్ వద్ద 29.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్

వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. ఈ పండుగ సీజన్ కోసం కొత్త కలర్ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ బైక్ లాంచ్ చేసింది. కొత్త రంగు (పసుపు, నలుపు) మాత్రమే కాకుండా.. ఇది కొత్త డెకాల్స్ కూడా పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్).

మంచి డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ బైక్ యాంత్రికంగా ఎలాంటి అప్డేట్స్ పొందలేదు. కాబట్టి అదే 249 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 26.5 బీహెచ్‌పీ పవర్, 22.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి పనితీరు పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

బీఎండబ్ల్యు జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన మరో బైక్.. బీఎండబ్ల్యు కంపెనీకి చెందిన జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్. దీని ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). భారతదేశంలో జీ 310 ఆర్ఆర్ బైక్ 1000 యూనిట్ల అమ్మకానికి నిదర్శనంగా దీనిని లాంచ్ చేశారు. కంపెనీ దీనిని 310 మందికి మాత్రమే విక్రయించనుంది. అంటే.. ఇది 310 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారన్నమాట.

కొత్త బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్.. 312.2 సీసీ ఇంజిన్ ద్వారా 34 బీహెచ్‌పీ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి ఇది చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఫీచర్స్ మాత్రం స్టాండర్డ్ బైకులో ఉండే విధంగా ఉంటాయి. ఎక్కువగా కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. మొత్తం మీద ఈ బైక్ స్టాండర్డ్ బైక్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

పూరీ – సేతుపతి కాంబినేషన్: సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

0

డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతిల కాంబినేషన్‌లో ఒక సరికొత్త సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతున్నాయి. పూరీ కనెక్ట్స్ – జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పైన పూరీ జగన్నాథ్ & ఛార్మీ కౌర్ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విజయ్ సేతుపతి రాబోయే సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో..

హిట్ కోసం పూరీ జగన్నాథ్!

పూరీ జగన్నాథ్.. రాబోయే సినిమా మంచి హిట్ సాధిస్తుందని గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఇదివరకు వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు అంతంత మంత్రంగానే ఉన్నాయి. కాబట్టి ఈసారి వచ్చే సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించాలన్న కసితో పనిచేస్తున్నారు. దీనికోసం నటుడు విజయ్ సేతుపతిని ఒప్పించారు. ఈ సినిమా అయినా పూరీ జగన్నాథ్ ఆశలను నెరవేర్చాలని కోరుకుందాం.

వరుస విజయాలతో విజయ్ సేతుపతి

ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస విజయాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ వెర్సటైల్ యాక్టర్. ఇటు తెలుగు.. అటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో పాత్రతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఏ క్యారెక్టర్‌కైనా ఇట్టే ఇమిడిపోయి న్యాయం చేస్తున్నారు. నిత్యామీనన్ కాంబినేషన్‌లో తమిళంలో తలైవా తలైవి.. తెలుగులో సార్ అండ్ మేడమ్ సినిమా ఇటీవలే మంచి విజయం సాధించింది.

టైటిల్ & టీజర్ ఎప్పుడంటే?

వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ సేతుపతి.. పూరీ జగన్నాథ్ సినిమా కోసం సిద్దపడటం అనేది ఆసక్తి కలిగించే అంశం. అయితే వీరి కాంబినేషన్ ఎలా వుంటుందో చూడాలంటే మనం ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు బెగ్గర్ అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇంకో రెండు రోజుల్లో.. సినిమా టైటిల్ మరియు టీజర్ రెండింటిని కూడా ఒకేసారి విడుదలచేయనున్నారు. అంటే సెప్టెంబర్ 28న (పూరి జగన్నాథ్ బర్త్‌డే సందర్భంగా) పూరీ – విజయ్ సేతుపతిల అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపించబోతున్నారు. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

సినిమాలో ఇతర ప్రముఖులు

పూరీ – విజయ్ సేతుపతిల సినిమా.. తెలుగులో మాత్రమే కాకుండా, తమిళం మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సంయుక్తా మీనన్, టబు, నీవేదా థామస్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమా తెరకెక్కలేదు. మొదటిసారి పూరీ సినిమా కోసం విజయ్ సేతుపతి సిద్ధమయ్యారు. దీంతో అభిమానుల అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. సినిమా ఎలా ఉండబోతుంది?, దీనికోసం ఎంత బడ్జెట్ కేటాయించనున్నారు, రిలీజ్ డేట్ వంటి వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. ఈ సారి పూరీ జగన్నాథ్ ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ ఖాయమని చాలామంది అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే!.

తండ్రి ప్రపంచ కుబేరుడు.. ఆర్థిక ఇబ్బందులతో అద్దింట్లో కూతురు

తండ్రి ధనవంతుడైతే.. పిల్లలు కూడా ధనవంతులుగానే విలాసవంతమైన జీవితం గడుపుతారు. అయితే ఎలాన్ మస్క్ కుమార్తె వివియన్ విల్సన్ మాత్రం అందుకు భిన్నం. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటూ.. ఒక అపార్ట్‌మెంట్‌లో మరో ముగ్గురితో కలిసి నివసిస్తోంది. న్యూయార్క్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె వెల్లడించారు.

నా దగ్గర లక్షల డాలర్లు లేవు!

ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ సంపద సుమారు రూ. 42,778 కోట్ల కంటే ఎక్కువ. అంతటి సంపన్నుడి కుమార్తె వివియన్ విల్సన్ మాత్రం ఎప్పుడూ.. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉండటం గమనార్హం. ఆర్ధిక సమస్యల కారణంగానే లాస్ ఏంజిల్స్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు రూమ్‌మేట్‌తో కలిసి నివసిస్తోంది. నా దగ్గర చాలా డబ్బు ఉంటుందని అనుకుంటారు. కానీ అదంతా నిజం కాదు. నాకు ఇప్పుడు ఆర్ధిక స్వాతంత్య్రం ఉంది. నా దగ్గర లక్షల డాలర్లు లేవు అని ఇంటర్వ్యూలో 21ఏళ్ల వివియన్ విల్సన్ పేర్కొన్నారు.

తన తల్లిదండ్రుల ఆర్ధిక ప్రపంచాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని కూడా ఇంటర్వ్యూలో వివియన్ విల్సన్ అన్నారు. తన తల్లి జస్టిస్ విల్సన్ కొంత సంపదను మాత్రమే కలిగి ఉండగా.. తండ్రి ఎలాన్ మస్క్ మాత్రం ప్రపంచ కుబేరుడు, ఈయన దగ్గర ఊహకందనంత డబ్బు ఉంది. అయితే వీరి ఇద్దరి డబ్బు మీద నేను ఆధారపడను. నేనే సొంతంగా జీవిస్తూ.. ఆహారం, రూమ్ రెంట్, నిత్యావసరాలు మొదలైనవాటికి సంపాదించుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది.

తండిపై కోపంతో ట్రాన్స్‌జెండర్‌గా!

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 2000వ సంవత్సరంలో జస్టిస్ విల్సన్ను పెళ్లి చేసుకున్నారు. ఈమె ఒక రచయిత్రి. అయితే వీరు 2008లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ జంటకు పుట్టిన పిల్లల్లో ఒకరు జేవియర్ అలెగ్జాండర్ మస్క్. తల్లి దండ్రులు విడిపోయిన తరువాత .. తన తండ్రి వారసత్వాన్ని వద్దనుకుని 16ఏళ్ల వయసులో ట్రాన్స్‌జెండర్‌గా (వివియన్ విల్సన్) మారిపోయాడు. దీనికి కావలసిన హక్కులను ఇతడు కోర్టు నుంచి పొందాడు. తండ్రి వారసత్వాన్ని మాత్రమే కాదు, తండ్రి ఆస్తిలో కూడా ఏమీ ఆశించకపోవడం గమనించదగ్గ విషయం.

చిన్నప్పటి నుంచి మానసిక వేదనకు గురైన.. జేవియర్ అలెగ్జాండర్ మస్క్, తల్లిదండ్రులు విడిపోయిన తరువాత.. తాను కూడా తండ్రితో ఎటువంటి సంబంధాలు ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తనకు స్వతంత్య్రమైన గుర్తింపు ఉండాలని భావించి.. ట్రాన్స్‌జెండర్‌గా మారి తల్లిపేరు వచ్చేలా వివియన్ విల్సన్‌గా మారిపోయారు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు.

వివియన్ విల్సన్ గురించి

ఎలాన్ మస్క్ 14 మంది సంతానంలో ఒకరైన వివియన్ విల్సన్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, మోడల్‌గా గుర్తింపు పొందింది. ఈమె జపాన్‌లోని టోక్యోలో టెంపుల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో చదువుకుంది. ఆ తరువాత 2025లో మోడలింగ్ కోసం లాస్ ఏంజిల్స్‌కు తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఈమె ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ భాషలను చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమెకు మొత్తం నలుగురు (గ్రిఫిన్, కై, సాక్సన్, డామియన్) సొంత తోబుట్టువులు ఉన్నారు. వీరు కాకుండా ఇంకా కొందరు తమ్ముళ్లు, చెల్లెల్లు ఉన్నారు.

తిరిగొస్తున్న 2025 ఆక్టావియా ఆర్ఎస్.. అక్టోబర్ 6న బుకింగ్స్!

చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా.. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థల్లో ఒకటి. ఒకప్పుడు గొప్ప అమ్మకాలతో.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇచ్చిన ఈ కంపెనీ ప్రస్తుతం కొంత డీలా పడినట్లు తెలుస్తోంది. అయితే స్కోడా.. ఇండియన్ మార్కెట్లో పూర్వ వైభవం పొందటానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ.. తన పర్ఫామెన్స్ ఐకాన్ ఆక్టావియా ఆర్ఎస్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది.

అక్టోబర్ 17న లాంచ్

స్కోడా పాపులర్ మోడల్.. ఆక్టావియా ఆర్ఎస్ మోడల్ అక్టోబర్ 17న అధికారికంగా మళ్ళీ లాంచ్ కానుంది. కాగా అంతకంటే ముందు.. అక్టోబర్ 6న కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టనుంది. దీనికి సంస్థ కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ)గా దేశానికి పరిమిత సంఖ్యలో (100 యూనిట్లు) దిగుమతి చేసుకుంటుంది.

ధర రూ. 50 లక్షలు!

నిజానికి స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారు సుమారు 20ఏళ్లు భారతదేశంలో గొప్ప ఆదరణ పొందింది. 2004లో మొదటిసారి టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ప్యాసింజర్ కారుగా మార్కెట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు మళ్ళీ 2025 మోడల్ రూపంలో అప్డేటెడ్ ఫీచర్స్, డిజైన్ పొందనున్నట్లు సమాచారం. దీని ధర రూ. 50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుందని సమాచారం.

2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 216 హార్స్ పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇది 6.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం. ఇందులో స్టాండర్డ్ మోడల్‌కు భిన్నంగా ఉండే.. ఎగ్జాస్ట్ సిస్టం పొందుతుంది.

డిజైన్ & ఫీచర్స్

త్వరలో లాంచ్ కానున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్ప్ లైన్‌లతో కూడిన డిజైన్ పొందుతుంది. అద్భుతమైన ఇంటీరియర్ కలిగి ఉండనున్న ఈ కారు.. స్పోర్ట్స్ సీట్లు, 13 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటివాటిని పొందుతుంది.

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ భారతదేశానికి తిరిగి రావడానికి సంబంధించి.. స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సంవత్సరం ప్రారంభంలో.. మేము భారతదేశానికి ఒక ఐకానిక్ మోడల్ తీసుకువస్తామని హామీ ఇచ్చాము. అన్నట్టుగానే వచ్చే నెలలో ఆక్టావియా ఆర్ఎస్ లాంచ్ చేయడానికి సిద్దమయ్యాము. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన ఈ కారు.. మళ్ళీ భారతదేశంలో పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.

భారతదేశంలోని స్కోడా కార్లు

స్కోడా కంపెనీ భారతదేశంలో ప్రస్తుతం నాలుగు మోడల్స్ మాత్రమే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అవి స్కోడా కైలాక్ (రూ.7.55 లక్షల నుంచి రూ. 12.80 లక్షలు, ఎక్స్ షోరూమ్), స్కోడా స్లావియా (రూ. 10 లక్షల నుంచి రూ. 17.70 లక్షలు, ఎక్స్ షోరూమ్), స్కోడా కుషాక్ (రూ. 10.61 లక్షల నుంచి రూ. 18.43 లక్షలు, ఎక్స్ షోరూమ్), స్కోడా కొడియాక్ (రూ. 39.99 లక్షల నుంచి రూ. 45.96 లక్షలు, ఎక్స్ షోరూమ్). కాగా ఈ జాబితాలోకి త్వరలోనే స్కోడా ఆక్టావియా అడుగుపెట్టనుంది.

అసెంబ్లీలో బాలకృష్ణ  కామెంట్స్.. నిజాలు బయట పెట్టిన చిరంజీవి

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తరంగా సాగాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని.. సినీ ప్రముఖులు కలిసిన అంశాన్ని గురించి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రస్తావించారు. చిరంజీవి గట్టిగా చెప్పడం వల్లనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగొచ్చిందని అన్నారు. దీనికి సమాధానంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎవరూ గట్టిగా అడగలేదు, అదంతా అబద్దం అని అన్నారు. ఈ మాటలకు మెగాస్టార్ చిరంజీవి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి రిప్లై

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తూ.. బాలకృష్ణ నా పేరు తీసుకొచ్చారు, కాబట్టి నేను స్పందిస్తున్నాను. సినీ ఇండస్ట్రీలోని సమస్యలను గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని.. ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు నా దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో బాలకృష్ణతో మాట్లాడటానికి ఫోన్ చేశాను. అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్‌ను స్వయంగా వెళ్లి కలిసి చెప్పమని చెప్పను. ఆయన ప్రయత్నం కూడా వృధా అయింది. చేసేదేమి లేక.. నేను చొరవ తీసుకుని కొంతమందితో వెళ్లి ముఖ్యమంత్రిని కలిశాను.

ఆ తరువాతనే వీరసింహా రెడ్డి సినిమాకైనా.. నా వాళ్తేరు వీరయ్య సినిమాకైనా ఆ రోజు టికెట్ రేట్లు పెరిగాయి. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభం చేకూరింది అని అన్నారు. నేను ముఖ్యమంత్రితో అయినా.. సామాన్యుడతో అయినా నా సహజమైన ధోరణిలోనే మాట్లాడుతానని, ప్రస్తుతం ఇండియాలో లేను కాబట్టి.. ఈ విషయాన్ని పత్రికా ప్రకటనద్వారా తెలియజేస్తున్నానని చిరంజీవి వివరణ ఇచ్చారు. అయితే బాలకృష్ణ, చిరంజీవి మధ్య ఈ మాటల యుద్ధం ఇటు రాజకీయంగా.. అటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయింది.

జగన్‌ను కలిసిన సినీ ప్రముఖులు ఎవరంటే?

గత ప్రభుత్వం హయాంలో.. అంటే 2022 సంవత్సరంలో వైస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది వ్యక్తులు సీఎంను, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిశారు. ఆ సందర్భంలో ఫిలిం ఇండస్ట్రీలో వివిధ సమస్యల గురించి.. ముఖ్యంగా సినిమా టికెట్స్ రేట్లు విషయం గురించి చర్చించడం జరిగింది.

జగన్ ప్రభుత్వం సినిమా టికెట్లను ఎటువంటి పరిస్థితుల్లో పెంచే ఆలోచన లేదని, దీనికి సంబంధించిన ఒక జీవోను కూడా అప్పట్లో విడుదల చేసింది. దీనిపై మాట్లాడటానికి సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ కొరటాల శివ, పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మొదలైనవారు ఉన్నారు.

సినీ పరిశ్రమపై.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోతే.. ఫిలిం ఇండస్ట్రీ నష్టాల్లోకి వెళ్తుందని.. చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఆ తరువాతనే ప్రభుత్వం సినిమా టికెట్స్ పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే ఆ సమయంలో సినీ ప్రముఖుల కార్లను గేటు బయటనే ఆపి.. కొంతదూరం నడుచుకుంటూ వెళ్లారని, విమర్శలు కూడా వినిపించాయి.

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’కి కొత్త అర్థం చెప్పిన నారా లోకేష్: అదేంటో తెలుసా?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ (దే కాల్ హిమ్ ఓజీ) ఈ రోజు (సెప్టెంబర్ 25) రిలీజ్ అయిపోయింది. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అమెరికాలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిష్టర్ ‘నారా లోకేష్‘ ఓజీకి కొత్త అర్థం చెప్పారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

”ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. కానీ మా పవన్ అన్న మాత్రం అభిమానులకు ఒరిజినల్ గాడ్ (నిజమైన దేవుడు). పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ మూవీ రిలీజ్ సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

ఓజీ సినిమా సింపుల్ రివ్యూ

ఓజాస్ గంభీర పాత్రలో కనిపించిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ అభిమానులను కట్టిపడేసారు. సుజీత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో.. ఆయనను గొప్పగా చూపించారు. తమన్ మ్యూజిక్ వేరే లెవెల్ అనే చెప్పాలి. హీరోయిన్ ప్రియాంక మోహన్ చాలా తక్కువ సన్నీ వేషాల్లో కనిపించినప్పటికీ.. తన అందంతో ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక విలన్ పాత్ర పోషించిన ఇమ్రాన్ హష్మి కూడా గొప్పగా.. కథానాయకునికి ధీటుగా నిలబడ్డారు. సినిమా మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ డైలాగులకంటే.. యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయనిపించింది. విరామం తరువాత సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కొంత గందరగోళానికి గురిచేశాయి.

మొత్తం మీద ఓజీ సినిమా ఎలాగో అభిమానులకు నచ్చేస్తుంది. తెలియాల్సిందల్లా.. సాధారణ ప్రేక్షకులను మెప్పించిందా? అనే విషయమే. ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉండటం వల్ల.. ఈ సినిమాపై భిన్నభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొంతమంది నెటిజన్లు సినిమా అర్థం కావడం లేదని చెబుతుంటే.. ఇంకొందరు పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించారని చెబుతున్నారు. ఈ సినిమాపై వస్తున్న టాక్ కూడా మిశ్రమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఓజీ సినిమా బడ్జెట్ & ఫస్ట్ డే కలెక్షన్స్

దే కాల్ హిమ్ ఓజీ.. సినిమా కోసం నిర్మాతలు సుమారు రూ. 250 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా ఫ్రీ బుకింగ్స్ వల్ల మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 90 కోట్ల నుంచి రూ. 98 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. భారతదేశంలో కూడా మొదటిరోజే దాదాపు రూ. 60 కోట్ల నుంచి రూ. 65 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ పోర్టల్ సాక్నిల్క్ వెల్లడించింది. ఉత్తర అమెరికాలో మాత్రమే ప్రీమియర్ల నుంచి రూ. 22.5 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ డేటా ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. కచ్చితమైన కలెక్షన్స్ గురించి తెలుసుకోవడానికి ఇంకా కొంత సమయం వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ డేటా నిజమే అయితే.. పవన్ కళ్యాణ్ ఓజీ బిగ్ ఓపెనర్‌గా నిలిచిందని స్పష్టమవుతోంది. కాగా హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజు రూ. 60 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ పొందినట్లు తెలుస్తోంది.

సీబీఎస్ఈ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్!: 45 లక్షల మంది హాజరయ్యే అవకాశం

0

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ).. 2026లో జరగనున్న 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షల షెడ్యూల్ ఐదు నెలల ముందుగానే ప్రకటించింది. ఇది విద్యార్థులు పరీక్షలకు మరింత గట్టిగా సన్నద్ధం కావడానికి సహకరిస్తుంది.

పరీక్షల షెడ్యూల్

సీబీఎస్ఈ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. సెకండరీ స్కూల్ పరీక్ష (10వ తరగతి) 2026 ఫిబ్రవరి 17న ప్రారంభమై, 2026 మార్చి 18 వరకు జరుగుతుంది. కాగా సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష (12వ తరగతి) 2026 ఫిబ్రవరి 17న మొదలై.. 2026 ఏప్రిల్ 4తో ముగుస్తుంది.

10వ తరగతి, 12వ తరగతులలో సుమారు 45 లక్షల మంది విద్యార్థులు మొత్తం 204 సబ్జెక్టుల పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని సీబీఎస్ఈ వెల్లడించింది. ఇందులో భారతదేశం అంతటా మాత్రమే కాకుండా.. విదేశాలలో ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న 26 దేశాలకు చెందిన విద్యార్థులు కూడా హాజరవుతారని సీబీఎస్ఈ వెల్లడించింది.

పదిరోజుల తరువాత పేపర్ కరెక్షన్!

ఇప్పటికి విడుదలైన సమాచారం ప్రకారం.. పరీక్ష పూర్తయిన 10 రోజుల తరువాత పేపర్ కరెక్షన్ మొదలవుతుంది. ఇది 12 రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. అంటే 12వ తరగతి భౌతికశాస్త్రం పరీక్ష 2026 ఫిబ్రవరి 20న జరిగితే.. కరెక్షన్ మార్చి 3న ప్రారంభమై.. మార్చి 15 నాటికి ముగుస్తుంది.

సీబీఎస్ఈ బోర్డు.. 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనుంది. పరీక్షలు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నట్లు కూడా సమాచారం. అయితే ప్రస్తుతం విడుదలైన షెడ్యూల్ తాత్కాలికమైనది మాత్రమే అనే సీబీఎస్ఈ వెల్లడించింది. అంటే ఈ షెడ్యూల్ తేదీలు బహుశా మళ్ళీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గురించి

సీబీఎస్ఈ అనేది విద్యార్థులకు సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా చేసుకుని ఏర్పాటైన ఒక నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డ్. ఇది 1929లో స్థాపించబడింది. దీనిని మొదట్లో బోర్డ్ ఆఫ్ హైస్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పేరుతో పిలిచేవారు. ఆ తరువాత ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’గా మారింది.

భారతదేశంలో అందరికీ సమానమైన విద్యను అందించడం, నాణ్యమైన విద్యను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా.. నైతిక విలువలను పెంపొందించడం, జాతీయత, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి సీబీఎస్ఈ పుట్టుకొచ్చింది. విద్యారులకు అభ్యాసపరంగా.. అన్వేషణాత్మకంగా నేర్చుకునే విధానం కూడా ఇక్కడ అలవాటు అవుతుంది.

మన దేశంలో మొత్తం 27,000 కంటే ఎక్కువ స్కూల్స్ సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్నాయి. భారతదేశంలో వెలుపల అంటే.. సౌదీ అరేబియా, సింగపూర్, యూఏఈ, నేపాల్ మొదలైన దేశాల్లో కూడా సీబీఎస్ఈ కింద ఉన్న స్కూల్స్ సంఖ్య చాలానే ఉంది. కాబట్టి మొత్తం 45 లక్షలమంది 2026లో సీబీఎస్ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే లేదా మంచి ర్యాంక్ తెచ్చుకుంటే.. మంచి కాలేజీలలో లేదా యూనివర్సిటీలలో సీటు సులభంగా వస్తుంది. తద్వారా మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఈ పరీక్షల కోసం గట్టిగా సిద్ధం కావాల్సి ఉంది.