భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు మాత్రం ఓ ప్రత్యేక డిమాండ్ ఉంది. ఇందులో సరసమైన బైకుగా ప్రసిద్ధి చెందిన ‘హంటర్ 350‘ క్లాసిక్ డిజైన్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. కాగా హంటర్ 350 ధర వద్ద లభించే టీవీఎస్ కంపెనీకి చెందిన రోనిన్.. రాయల్ బండికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ కథనంలో ఈ రెండు బైకుల మధ్య వ్యత్యాసం గురించి తెలుసుకుందాం.
ధరలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోడల్ బేస్ రెట్రో వేరియంట్ ధర రూ. 1.37 లక్షలు, టాప్ స్పెక్ మెట్రో రెబెల్ ట్రిమ్ దధర రూ. 1.67 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). బైక్ ప్రేమికులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ.. ఒక సరసమైన బైక్ పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో దీనిని మార్కెట్లో లాంచ్ చేసింది.
ఇక్కడ టీవీఎస్ రోనిన్ విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర రూ. 1.24 లక్షలు (ఎక్స్ షోరూమ్), టాప్ వేరియంట్ ధర రూ. 1.59 లక్షలు (ఎక్స్ షోరూమ్). టీవీఎస్ రోనిన్ ధర.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కంటే కూడా కొంత తక్కువే.
ఇంజిన్ వివరాలు
హంటర్ 350 బైకులో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 349 సీసీ జే సిరీస్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అందించింది. ఇది 20.2 బీహెచ్‌పీ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 181 కేజీల బరువున్న ఈ బైక్.. నగర ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
టీవీఎస్ రోనిన్ బైక్ 225.9 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 20 బీహెచ్‌పీ పవర్, 19.93 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ బరువు కేవలం 159 కేజీలు మాత్రమే. బరువు కొంత తక్కువగా ఉండటం వల్ల త్రాటెల్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది. కొత్త రైడర్లకు కూకా చాలా అనుకూలంగా ఉంటుంది. రెండు బైకుల టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ మాత్రమే.
ఫీచర్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, టీవీఎస్ రోనిన్ రెండూ కూడా ఫీచర్స్ పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. హంటర్ 350 బైక్ అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ టెయిల్ లాంప్ వంటివాటిని పొందుతుంది. టాప్ వేరియంట్ మాత్రం.. ట్రిప్పర్ న్యావిగేషన్ కూడా పొందుతుంది.
టీవీఎస్ రోనిన్.. కొన్ని ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఏబీఎస్ ప్రతిస్పందనను అడ్జస్ట్ చేసే రైడింగ్ మోడ్స్.. అర్బన్, రెయిన్‌తో కూడిన ఫుల్లీ డిజిటల్ డిస్‌ప్లేను పొందుతుంది. ఈ బైకులో సస్పెన్షన్ అప్‌సైడ్‌డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. హంటర్ బైకులో స్టాండర్డ్ టెలిస్కోపిక్, ట్విన్ షాక్ సెటప్ వంటివి ఉన్నాయి. ఇది హంటర్ 350.. టీవీఎస్ రోనిన్ బైకుల్లో ప్రధాన వ్యత్యాసం అని తెలుస్తుంది.
నా అభిప్రాయం
ఇండియన్ మార్కెట్లో హంటర్ 350 బైకుకు, రోనిన్ బైకుకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెండింటిలో కొంత తక్కువ ధర వద్ద కావాలనుకునేవారికి రోనిన్ ఆప్షన్. ఇంజిన్ పనితీరు కొంత ఎక్కువగా ఉండాలనుకుంటే.. హంటర్ 350 ఎందుకోవచ్చు. రోజువారీ ప్రయాణానికి రెండూ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీ బడ్జెట్, రోజువారీ అవసరం వంటి విషయాలను బేరీజు వేసుకుని.. మీకు నచ్చిన బైక్ ఎంచుకోవడం ఉత్తమం.