భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు రెండు కొత్త రూపాల్లో.. దేశీయ విఫణిలో లాంచ్ అయింది. ఇందులో ఒకటి 2025 వెన్యూ కాగా.. మరొకటి వెన్యూ ఎన్ లైన్. కంపెనీ కొత్త వెన్యూ ధరలను అధికారికంగా ప్రకటించింది. వెన్యూ ఎన్ లైన్ ధరలను వెల్లడించాల్సి ఉంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే..
2025 హ్యుందాయ్ వెన్యూ
కొత్త హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధర రూ. 7.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా కంపెనీ ఈ కారును లాంచ్ చేయడానికి ముందే.. బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, స్కోడా కైలాక్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న 2025 వెన్యూ.. మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
ఎనిమిది రంగులలో లభించే 2025 హ్యుందాయ్ వెన్యూ.. కొంత అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందినట్లు తెలుస్తోంది. పరిమాణం పరంగా కూడా ఇది.. సాధారణ మోడల్ కంటే కొంత పెద్దదిగానే ఉంది. అప్డేటెడ్ బంపర్లు, అల్లాయ్ వీల్స్ వంటి వాటితో బ్యాడ్జెస్ కూడా ఈ కారులో కనిపిస్తాయి.
విశాలమైన క్యాబిన్ కలిగిన.. హ్యుందాయ్ 2025 వెన్యూ కారు ప్రీమియం ఫీచర్స్ పొందుతుంది. ఇందులో డ్యూయెల్ 12.3 ఇంచెస్ స్క్రీన్లు, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, కొత్త సెంటర్ కన్సోల్ మొదలైనవి ఉన్నాయి. ఇవి కాకుండా.. లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్, రియర్ విండో సన్‌షేడ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 2 స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, ఆటో హోల్డింగ్ విత్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టం కూడా ఈ కారులో ఉన్నాయి.
కొత్త హ్యుందాయ్ వెన్యూ కారు.. 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ & 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది. డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్
కంపెనీ వెన్యూ ఎన్ లైన్ కారును కూడా ఆవిష్కరించింది. అయితే దీని ధరలను ఇంకా వెల్లడించలేదు. ఇది చూడటానికి సాధారణ వెన్యూ కారు మాదిరిగా ఉన్నప్పటికీ.. రెడ్ కలర్ యాక్సెంట్స్ వంటి అప్డేట్స్ పొందుతుంది. ఈ కారు కోసం కూడా కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. ఈ కొత్త వేరియంట్ ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. దీని ప్రారంభ ధర రూ. 11 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ఉండే అవకాశం ఉంది.
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కారు.. కేవలం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే పొందే అవకాశం ఉంది. ఇది 172 ఎన్ఎమ్ టార్క్, 120 హార్స్ పవర్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుందని సమాచారం. కాబట్టి పనితీరు అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము.