లాంచ్‌కు ముందే దుమ్మురేపుతున్న హైలక్స్: ఈ కారు గురించి తెలుసా?

పరిమాణంలో కొంత పెద్దదిగా ఉన్న వాహనాల జాబితాలో.. టయోటా కంపెనీకి చెందిన హైలక్స్ ఒకటి. సాధారణ వినియోగానికి మాత్రమే కాకుండా కమర్షియల్ ఉపయోగానికి పనికొచ్చే ఈ వెహికల్.. ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ మోడల్ ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ వెర్షన్ లాంచ్ కావడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ నవంబర్ 10న ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది.

2018 తరువాత పెద్ద అప్డేట్!

టయోటా కొత్త హైలెక్స్ కారుకు సంబంధించిన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జపాన్ బ్రాండ్ అయిన ఈ కారు డిజైన్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది ఇప్పుడున్న కారుకంటే కూడా కొంత ఎక్కువ అప్డేట్స్ పొందనుంది. 2018 తరువాత ఈ మోడల్ మొదటిసారి పెద్ద నవీనీకరణ పొందుతున్నట్లు సమాచారం.

2018లో ఎనిమిదవ తరం టయోటా హైలక్స్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఆ తరువాత కాలక్రమంలో చిన్న చిన్న అప్డేట్స్ పొందింది. ఫేస్‌లిఫ్ట్ రూపంలో కూడా లాంచ్ అయింది. ఇప్పుడు లాంచ్ కావడానికి సిద్దమవుతున్న హైలెక్స్.. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడుతుందని సమాచారం.

లేటెస్ట్ డిజైన్ & కొత్త ఫీచర్!

ఇప్పుడు విడుదలైన టీజర్ వీడియోలో.. హైలెక్స్ కొత్త డిజైన్ కలిగిన గ్రిల్ పొందుతుందని తెలుస్తోంది. అల్లాయ్ వీల్స్, దానిపై బ్రాండ్ లోగో, లైటింగ్ సెటప్ అన్నీ కూడా టీజర్ వీడియోలో కనిపిస్తున్నాయి. బంపర్ అవుట్‌గోయింజి మోడల్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది. బూమరాంగ్ షేప్ హెడ్‌ల్యాంప్ ప్రత్యేకమైన ఆకర్షణ అని తెలుస్తోంది. అయితే కంపెనీ ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ గురించి అధికారికంగా వెల్లడించలేదు. ఈ విషయాలను సంస్థ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

కొత్త టయోటా హైలక్స్ కారు.. అప్డేటెడ్ డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, పెద్ద ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటివి పొందుతుందని అంచనా. బహుశా ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం అనేది 12 ఇంచెస్ ఉండే అవకాశం ఉంది. డిటైటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అప్డేట్ అయి ఉండొచ్చని భావిస్తున్నాము.

కొత్త ఇంజిన్?

టయోటా కంపెనీ తన సరికొత్త హైలక్స్ కారులో.. కొత్త ఇంజిన్ పరిచయం చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఉండే అవకాశం ఉంది. ఇది 48 వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం కూడా పొందే అవకాశం ఉంది. ఇది 201 బీహెచ్పీ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుందని తెలుస్తోంది. అయితే.. టాప్ వేరియంట్ పవర్, టార్క్ అనేవి కొంత ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

హైలక్స్ డిమాండ్ ఎలా ఉందంటే?

ఇండియన్ మార్కెట్లో.. టయోటా హైలక్స్ కార్లకు చెప్పుకోదగ్గ డిమాండ్ లేదనే తెలుస్తోంది. ఎందుకంటే ఈ వాహనాల అమ్మకాల డేట్ చూస్తే.. సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ కార్లను కొనుగోలు చేసే రాష్ట్రాల జాబితాలో కేరళ ముందు వరుసలో ఉంది. కాగా కంపెనీ త్వరలో లాంచ్ చేసే అప్డేటెడ్ హైలక్స్ మోడల్ ఎలాంటి అమ్మకాలు పొందుతుందో తెలుసుకోవడానికి కొంతకాలం వేచి చూడాల్సిందే.