పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు చాలా ఆడంబరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మినిష్టర్ నారా లోకేష్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీనటి ఐశ్వర్య రాయ్ కూడా ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.
నరేంద్ర మోదీ మాట్లాడుతూ..
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న పీఎం నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. సత్యసాయి బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన బోధనలు మనతోనే ఉన్నాయి. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే ఆయన నినాదం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఆయన ప్రారంభించిన ఎన్నో సేవాకార్యక్రమాలు.. ఈ రోజుకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన బోధనలు దేశం మీద ప్రభావం చూపుతున్నాయి. అవే.. నేటికీ చాలామందిని సన్మార్గంలో నడిపిస్తున్నాయి.
సత్యసాయి బాబా నడిచిన.. ఈ పుట్టపర్తి భూమిలో ఎదో మహత్తు ఉంది. అదే నేటికీ ఆయన ప్రారంభించిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. అది ఎప్పటికీ అలాగే కొనసాగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకంటే ముందు ఆయన చేసిన సేవలకు గుర్తుగా.. తపాలా బిళ్లలను, 100 రూపాయల నాణేన్ని ఆవిష్కరించారు.
చంద్రబాబు మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మనం తెలిసిన, మనం చూసిన దైవస్వరూపం పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా మాత్రమే. మానవసేవే మాధవ సేవ అని నమ్మిన ఆయన.. ఎంతోమందికి, ఎన్నో విధాలుగా సేవ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలకంటే ముందుగా స్పందించే గుణం వారిదే అని చంద్రబాబు కొనియాడారు. సుమారు 1600 గ్రామాల్లో నీటి వసతి కల్పించారు. 100 కంటే ఎక్కువ విద్యాలయాలు, ఎన్నో ఆసుపత్రులను నెలకొల్పిన ఘనత సత్యసాయి బాబా సొంతం. భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని సుమారు 140 దేశాల్లో.. 200 కేంద్రాల్లో సత్యసాయి బాబా ట్రస్ట్ తన సేవలను అందిస్తోంది. ఆయన చూపిన మార్గంలోనే మనం కూడా ముందుకు వెళ్లాలని చంద్రబాబు అన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
సినీ నటుడు & ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచానికి వెలుగునిచ్చే ఆధ్యాత్మిక శక్తి శ్రీ సత్యసాయి బాబా. ఒక్క మన దేశంలో మాత్రమే కాకుండా.. విదేశాల్లో కూడా ఆయన భక్తులు ఉన్నారు. ఆయన సేవాగుణం ఎంతోమందిని ఆకట్టుకుంది. నేటికీ ఎంతోమంది సత్యసాయి ట్రస్ట్ ద్వారా మేలు పొందుతున్నారు. అది సత్యసాయి బాబా ఘనత అని ఆయన అన్నారు.
నారా లోకేష్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పేదవారికి సేవ చేయాలని చెప్పిన సత్యసాయి బాబా మాటలే నాకు స్ఫూర్తి. కేవలం ప్రేమతోనే ఆయన ప్రపంచాన్ని గెలిచారు. ఎందోమంది పేదవారికి ఆయన సేవాసంస్థలు ద్వారా సేవలందిస్తున్నారు. ఈయన ఎంతోమందికి ఆదర్శం అని లోకేష్ అన్నారు. సత్యసాయి బాబా బోధనలను మనం నిజ జీవితంలో తప్పకుండా ఆచరించాలని ఆయన సూచించారు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.