తెలంగాణకు కొత్త గవర్నర్.. ఎవరీ శివ ప్రతాప్ శుక్లా?

తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయనకు పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ వర్గాలు మరియు అధికార యంత్రాంగం కొత్త గవర్నర్‌కు స్వాగతం పలికాయి.

తెలుగులో ప్రమాణం స్వీకారం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివ ప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణం చేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇతర రాష్ట్రానికి చెందిన నాయకుడు అయినప్పటికీ, రాష్ట్ర భాషలో ప్రమాణం చేయడం పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంలో పలువురు నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి గవర్నర్‌గా ఆయన సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత గవర్నర్ బదిలీ

ఇదివరకు తెలంగాణ గవర్నర్‌గా పని చేసిన Jishnu Dev Varmaను ఇటీవల Maharashtraకు బదిలీ చేశారు. దీంతో కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కొత్త గవర్నర్ బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్ర రాజ్‌భవన్‌లో అధికారిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఎవరీ శివ ప్రతాప్ శుక్లా

ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివ ప్రతాప్ శుక్లా.. సీనియర్ రాజకీయ నాయకుడు. కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఐదవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు (మార్చి 11) నుంచి ఈయన గవర్నర్ బాధ్యతలు చేపడతారు.

గత తెలంగాణ గవర్నలు

తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత ఈ.ఎస్.ఎల్. నరసింహన్ మొదటి గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత తమిళసై సౌందర రాజన్, సీపీ రాధాకృష్ణన్, జిష్ణుదేవ్ వర్మ వరుసగా గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కొత్తగా శివ ప్రతాప్ శుక్లా గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు.

గవర్నర్ బాధ్యతలు ఏమిటంటే?

భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. రాష్ట్రానికి రాజ్యాంగ పరమైన అధిపతి అన్నమాట. గవర్నర్‌ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది గవర్నర్ పర్యవేక్షిస్తారు.

గవర్నర్‌కు ముఖ్యంగా కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ఎన్నికల తర్వాత అసెంబ్లీలో మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించడం గవర్నర్ బాధ్యత. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రివర్గ సభ్యులను నియమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన గవర్నర్ పేరుతో నడుస్తుంది.

శాసన వ్యవస్థలో కూడా గవర్నర్‌కు కీలక పాత్ర ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను పిలవడం, వాయిదా వేయడం, అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయడం గవర్నర్ అధికారాల్లో భాగం. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతే చట్టాలుగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో గవర్నర్ బిల్లులను తిరిగి పరిశీలన కోసం అసెంబ్లీకి పంపే అధికారం కూడా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు.

ఆర్థిక విషయాల్లో కూడా గవర్నర్ పాత్ర ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ అనుమతి అవసరం. అలాగే మనీ బిల్లులు గవర్నర్ అనుమతి లేకుండా ప్రవేశపెట్టలేరు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో గవర్నర్ ప్రాధాన్యతను చూపిస్తుంది.

న్యాయ పరమైన అధికారాలు కూడా గవర్నర్‌కు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో శిక్షలను తగ్గించడం లేదా మన్నించడం వంటి అధికారాలు ఆయనకు ఉంటాయి. అదనంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి, అవసరమైతే రాష్ట్రపతి పాలనను సిఫారసు చేసే బాధ్యత కూడా గవర్నర్‌దే.

Also read: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్!