భారతదేశంలో కార్ల ధరలు.. ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించిన చర్చలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంతకీ ఇండియాలో కార్ల ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి?, కారణాలు ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ధరలు ఎక్కువగా ఉండటానికి కారణం
భారతదేశంలో కార్ల ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. అధిక పన్నులు అని అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జీఎస్టీ స్లాబ్స్ సవరించినప్పటికీ.. లగ్జరీ కార్ల ధరలలో మాత్రం ఎటువంటి మార్పు జరగలేదు. అయితే మనదేశంలో ఖరీదైన.. ఎక్కువమంది ఇష్టపడే కార్లైనా.. ల్యాండ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్ బెంజ్ జీ-వ్యాగన్, టయోటా ఫార్చ్యూనర్ కార్లు దుబాయ్‌లో చాలా తక్కువ.
సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వైరల్ అవుతున్న ఒక వీడియాలో.. ఇద్దరు వ్యక్తులు దుబాయ్ – ఇండియాలలో కార్ల గురించి పేర్కొన్నారు. వీరి ప్రకారం ఇండియాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర రూ. 98 లక్షల నుంచి రూ. 2.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. అయితే దుబాయ్‌లో దీని ప్రారంభ ధర రూ. 54 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే అని తెలుస్తోంది.
టయోటా ఫార్చ్యూనర్ విషయానికి వస్తే.. ఇది భారతదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ పొందింది. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 33.65 లక్షల నుంచి రూ. 48.85 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. అయితే దుబాయ్‌లో దీని ధర రూ. 26 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే కావడం గమనార్హం.
ల్యాండ్ క్రూయిజర్ రూ. 64 లక్షలే!
ఇక మెర్సిడెస్ బెంజ్ జీ వ్యాగన్ గురించి చర్చిస్తే.. భారతదేశంలో దీని ధర రూ. 3.30 కోట్లు (ఎక్స్ షోరూమ్). దుబాయ్‌లో దీని రేటు రూ. 2.60 కోట్లు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా.. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు మొదలైన సెలబ్రిటీలు ఈ కారును కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ విషయానికి వస్తే.. దీని ధర దేశీయ విఫణిలో సుమారు రూ. 2.16 కోట్ల నుంచి 2.25 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది. ఇదే కారును దుబాయ్‌లో కొనుగోలు చేయాలంటే రూ. 64 లక్షలు వెచ్చిస్తే సరిపోతుందని సమాచారం.
చివరగా లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ ఎంపీవీ ధరల విషయానికి వస్తే.. దీని ధర భారతదేశంలో రూ. 3.42 కోట్లు. ఇదే కారు రేటు దుబాయ్‌లో రూ. కోటి మాత్రమే ఉంటుందని సమాచారం. మొత్తం మీద భారతదేశం కంటే.. దుబాయ్‌లో కార్ల ధరలు తక్కువగానే ఉంటాయని స్పష్టమైంది.
గమనించండి
నిజానికి లగ్జరీ కార్ల ధరలు భారతదేశం కంటే.. దుబాయ్‌లో కొంత తక్కువే అని దాదాపు అందరికీ తెలుసు. అయితే పైన పేర్కొన్న ధరలు కేవలం సూచన ప్రాయం మాత్రమే. ఎందుకంటే కొనుగోలుదారు ఎంచుకునే కారు వేరియంట్, ఇంజిన్ ఆప్షన్ మొదలైన వాటి మీద ధరలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని పాఠకులు తప్పకుండా గమనించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ సవరణ చిన్న కార్ల ధరలను తగ్గించింది. కానీ హైఎండ్ కార్లు లేదా లగ్జరీ కార్ల ధరలు ఏ మాత్రం తగ్గలేదు.