బస్సు ఛార్జీలకు డబ్బులు లేవు.. అది మా పరిస్థితి!: లుంగీ మామ టీమ్

ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసిన కే-ర్యాంప్ సినిమాలో కిరణ్ అబ్బవరంతో కలిసి డాన్స్ చేసిన లుంగీ మామ (వెంకటరమణ) & వాళ్ల టీమ్ (ముని, నరేంద్ర) వీడియోలే కనిపిస్తున్నాయి. అంటే.. ఆ సినిమాకు ముందు కూడా వీళ్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దీనికి కారణం లుంగీ మామ డ్యాన్స్ వీడియోలు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలలో వైరల్ కావడమే.

వీడియో అప్లోడ్ చేస్తే చాలు.. కేవలం కొద్ది నిమిషాల్లోనే దాదాపు కొన్ని లక్షల మంది చూస్తారు. అంతగా పాపులర్ అయిపోయాయి. ఒక్కసారి వీడియో చూసామంటే కళ్ళు తిప్పుకోలేమన్నంతగా వశమైపోతారు వాళ్లు చేసే డ్యాన్సుకు. ఈ విధమైన పాపులారిటీ చూసే కే-ర్యాంప్ డైరెక్టర్ పిలిచి అవకాశం ఇచ్చారు. గ్రామాల్లో డ్యాన్స్ వేసుకునే స్థాయి నుంచి.. దర్శకుడిని ఆకట్టుకునేలా ఎదిగిన ఈ లుంగీ టీమ్ ప్రస్థానం గురించి కొన్ని ఆసక్తికర అంశాల విషయానికి వస్తే..

నెల్లూరు జిల్లా..

లుంగీ మామ టీముకు చెందిన.. వీళ్లందరు నెల్లూరు జిల్లా మారుమూల ప్రాంతానికి చెందినవారు. అందరూ కష్టం చేసుకుని బతికే మత్స్యకారుల కుటుంబాల నుంచి వచ్చిన వారే. అయితే వీరి జట్టులో ఎవరు కూడా ఆ వృత్తిలో లేరు. ఎందుకంటే సముద్రంలో ఇతర రాష్ట్రాల వాళ్ల ఆధిపథ్యం పెరిగిపోవడం. పక్కనే కలుషితమైన పరిశ్రమలు వచ్చి చేరడం. చేపలు పట్టడం, దానినే వ్యాపారంగా మలుచుకుని బతకడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పరిస్థితి.

ఈ పరిస్థితుల్లో టీమ్‌లో ఒకరు ఆటో నడపడం, ఇంకో ఇద్దరు స్కూల్లో డ్యాన్స్ నేర్పించడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఇలా చేసే పనులు వల్ల వారి ఆదాయం ఏ మాత్రం బాగోలేదట. అందరికి పెళ్లిళ్లు అవ్వడం, పిల్లలు ఉండటం, ఖర్చులు కూడా అదే రీతిలో ఉంటాయి గనుక పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి.

బస్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు

ఇంటర్వ్యూకి గానీ, ఏదైనా ఛాన్స్ వస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి రావడానికి బస్సు టికెట్ కొనడానికి కూడా చేతిలో డబ్బులు లేవు. అందుకోసం ఎక్కడో ఒకచోట అప్పు చేసిమరి రావాల్సిన దుస్థితి అని లుంగీ మామ బాధపడుతూ.. ఒకరకమైన నవ్వు నవ్వినప్పుడు అతన్ని చూస్తే ఎవరికైనా సరే నిజంగా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అంతటి బాధను కూడా దిగమింగి అందరినీ అలరించడం కోసం నవ్వుతూ వీడియోలు చేయడం చాలా గొప్ప విషయం.

పేరు వచ్చింది కానీ.. ప్రతిఫలం రాలేదు

కే-ర్యాంప్ సినిమాలో అవకాశం అయితే వచ్చింది. కానీ.. దానికి తగిన ప్రతిఫలం మాత్రం వారికి దక్కలేదంట. అందులో వాళ్ళు చేసిన డ్యాన్సుకు కొరియోగ్రఫి సైతం వాళ్లే చేయడం అనేది.. అభినందించదగ్గ విషయం. వాళ్ళు డాన్స్ చేసిన ఆ పాట థియేటర్ మొత్తం ఒక ఊపు ఊపుతోంది. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసినా మామూలు క్రేజ్ కాదు. అంతలా పర్ఫామెన్స్ చేసిన వాళ్లకు కనీసం డబ్బులు కూడా ఇవ్వకపోవడం బాధాకరమైన అంశమనే చెప్పాలి. ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉంటూ ఎన్నో కష్టాలు పడి వీడియోలు చేసి అందరు గుర్తించే విధంగా ఈ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఇటువంటి ప్రతిభ కలిగిన పేద కళాకారులకు ఎంత వీలైతే అంత ప్రోత్సహం అందించాలి.