సినిమాల్లోకి మహేష్ బాబు మేనకోడలు: వెండితెర వెయిటింగ్!

దివంగత నటుడు.. తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వ్యక్తి వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది. మహేష్ బాబుకు స్వయానా మేనకోడలు అయిన జాన్వీ స్వరూప్ త్వరలోనే.. సినిమాల్లో నటించే అవకాశం ఉందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మహేష్ బాబు మేనకోడలు

నటుడు మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని & సంజయ్ స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్. జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా మంజుల కుమార్తె సినీరంగ ప్రవేశానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. ”నా చిన్న కుమార్తె జాన్వీ స్వరూప్.. తన సొంత వెలుగులోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె వెలుగు వారసత్వంలోనే ఉంది.. ఇప్పుడు అది ప్రకాశించే సమయం వచ్చేసింది. ప్రపంచం కూడా ఆమె ప్రతిభను త్వరలోనే గుర్తిస్తుంది. ఐ లవ్ యూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు జాను” అంటూ మంజుల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

తల్లుదండ్రులు నటులే!

నిజానికి జాన్వీ తల్లిదండ్రులైన మంజుల, సంజయ్ స్వరూప్ ఇద్దరూ కూడా నటులే కావడం గమనించదగ్గ విషయం. మంజుల.. సేవకుడు, మళ్లీ మొదలైంది, ఆరెంజ్, కావ్యాస్ డైరీస్, మంత్ ఆఫ్ మధు, హంట్ వంటి సినిమాల్లో నటించింది. మనసుకు నచ్చింది అనే సినిమాకు ఈమె దర్శకురాలిగా కూడా పనిచేశారు. ఇక సంజయ్ స్వరూప్ విషయానికి వస్తే.. ఆయన చల్ మోహనరంగ, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు వీరి ముద్దుల కుమార్తె.. వేడితెర మీద కనిపించడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నారు.

జాన్వీ స్వరూప్.. సినిమాల్లో రానున్నట్లు క్లారిటీ వచేసినప్పటికీ.. ఎలాంటి సినిమాల్లో నటించనున్నారు, ఏ హీరో సరసన నటించనున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఈమె ఇప్పటికే మనసుకు నచ్చింది అనే సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించారు. ఇకపై కథానాయకి (హీరోయిన్)గా కనిపించబోతున్నారు. బహుశా.. ఈమెను సినిమా ప్రపంచానికి పరిచయం చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు.

సినిమా రంగంలో వారసత్వం

చిత్ర పరిశ్రమలో వారసత్వం కొత్తేమీ కాదు. కష్టపడి పైకొచ్చిన హీరోల కంటే.. ఆ హీరోల పేరుతో తెరమీదకు వచ్చినవారు చాలామందే ఉన్నారు. ఈ జాబితాలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇందులో హీరోలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. హీరోయిన్స్ మాత్రం తక్కువనే చెప్పాలి. అయితే ఇప్పుడు.. జాన్వీ స్వరూప్ త్వరలోనే వెండితెర మీద కనిపించనుంది.

జాన్వీ స్వరూప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు.. శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ శుభసందర్భంలో.. ఈమె సినిమాల్లోకి రానున్నట్లు వెల్లడించిన వార్త.. మహేష్ బాబు అభిమానుల్లో ఒకింత ఆనందాన్ని కలిగిస్తోంది. నెటిజన్లు కూడా ఈమెకు సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. మొత్తం మీద మహేష్ బాబు మేనకోడలు తెరమీద ప్రేక్షకులను అలరించబోతుందన్నమాట. కాబట్టి ఇక ఈమె ఏ సినిమాలో కనిపించబోతుందో తెలుసుకోవాలంటే.. ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే.