నవంబర్ 1 నుంచి కొత్త రూల్: అలాంటి వాహనాలకు నో ఎంట్రీ!

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రత గణనీయంగా పెరిగిపోతోంది. శీతాకాలం సమీపిస్తున్న సమయంలో.. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువై.. వాతావరణం కలుషితమైపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఏక్యూఎం (కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జోయినింగ్ ఏరియాస్) ఒక కీలక ప్రకటన చేసింది.

నవంబర్ 1నుంచి కొత్త రూల్

ఢిల్లీలో రిజిస్టర్ చేయని (ఢిల్లీ బయట లేదా ఇతర ప్రాంతాల్లో రిజిస్టర్ అయిన) మరియు బీఎస్-VI ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా లేని కమర్షియల్ గూడ్స్ వెహికల్స్ (వాణిజ్య వస్తువుల వాహనాలు) 2025 నవంబర్ 01 నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకూడదని సీఏక్యూఎం ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. డీజిల్‌తో నడిచే.. సరుకును రవాణా చేసే వాహనాల నుంచి ఉద్గారాలు అధికంగా రిలీజ్ అవుతాయి. కాబట్టి వాటిని నిషేధించడం వల్ల నగరంలో వాయు కాలుష్య తీవ్రత బాగా తగ్గుతుందని స్పష్టం చేసింది.

అలాంటి వాహనాలకు పరిమితులు లేదు!

కమర్షియల్ గూడ్స్ వెహికల్స్ ఢిల్లీలో రిజిస్టర్ అయి ఉంటే.. అలాంటి వాహనాలకు ఎలాంటి పరిమితులు ఉండవు. అక్టోబర్ 31 తరువాత కూడా నగరంలో తిరగవచ్చు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) యొక్క వివిధ దశల కింద.. వాణిజ్య వస్తువుల వాహనాలు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని సీఏక్యూఎం వెల్లడించింది. 2025 అక్టోబర్ 17న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

కాలుష్యం తగ్గించడానికే!

వాయు కాలుష్య కారకాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో.. 2021లోని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సెక్షన్ 12(1) కింద ఢిల్లీలో.. ఇతర ప్రాంతాల్లో రిజిస్టర్ అయిన వాహనాలు తిరగకూడదు. అయితే ఢిల్లీలో రిజిస్టర్ అయిన.. కమర్షియల్ గూడ్స్ వాహనాలకు ఎలాంటి నిషేధం లేదు. గాలి నాణ్యతను బట్టి.. భవిష్యత్తులో ఈ నిర్ణయాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నియమాన్ని తప్పకుండా అమలు చేయాలి. కమర్షియల్ గూడ్స్ వాహనదారులు కూడా ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి.

బీఎస్-IV వాహనాల నిషేధం

ఇప్పటికే బీఎస్-IV వాహనాల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. బీఎస్-IV వాహనాలపై ఆంక్షలు తగదని వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ కమర్షియల్ గూడ్స్ వాహనాలపై నిషేధం విధించడం సమంజసం కాదని.. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్‌కు చెందిన భీమ్ వాధవా పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చించనున్నట్లు.. ఆల్ ఇండియా మోటార్ అండ్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌కు చెందిన రాజేంద్ర కపూర్ తెలిపారు. అవసరమైతే మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు కూడా తాము సిద్ధమని అన్నారు.

ఢిల్లీలో గాలి కాలుష్యం

శీతాకాలం ఇంకా పూర్తిగా మొదలవ్వనేలేదు. కానీ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ బాగా తగ్గిపోయింది. కాలుష్య కారకాలు.. నగరంలో మేఘాలమాదిరిగా వ్యాపించాయి. రాజధానిలో గాలి నాణ్యత 304 వద్ద ఉందని సీపీసీబీ వెల్లడించింది. గత సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 301 గా ఉందని తెలిసింది. దీన్నిబట్టి చూస్తే.. అక్కడ పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. సీపీసీబీ ప్రకారం.. 0 నుంచి 50 వరకు ఉంటే ఎయిర్ క్వాలిటీ మంచిది, 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరం, 101 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్థం, 201 నుంచి 300 వరకు ఉంటే పేలవమైనది.. ఇంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం.