‘కష్టపడి పనిచేస్తే.. ఎదో ఒకరోజు తప్పకుండా పైకొస్తావు’ అని చాలామంది పెద్దవాళ్లు చెప్పడం మన నిత్యజీవితంలో వినేఉంటాము. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనమే రాహుల్ తనేజా. ఒకప్పుడు బతుకుతెరువు కోసం చేతికి దొరికిన పనిచేస్తూ.. ఆటో రిక్షా సైతం నడిపిన ఈయన.. ఇప్పుడు తన కొడుకు ఆడి కారు నెంబర్ ప్లేట్ కోసం రూ. 31 లక్షలు ఖర్చు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
11ఏళ్ల వయసులో డాబాలో వెయిటర్!
జైపూర్‌కు చెందిన.. వ్యాపారవేత్త రాహుల్ తనేజా గురించి ఈ రోజు అందరికీ తెలుసు. కానీ ఆటో ముందు సీటులో ప్రారంభమైన తన ప్రయాణం నేడు లగ్జరీ కారు వెనుక సీటులో కొనసాగుతోంది. దీనికి కారణం ఆయన కృషి, పట్టుదల అనే చెప్పాలి. మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలోని కాట్రా అనే చిన్న గ్రామంలో తనేజా జన్మించారు. ఈయన తండ్రి సైకిల్ పంక్చర్ షాప్ నిర్వహించేవారు. 11ఏళ్ల వయసులో.. తనేజా రోడ్డుపక్కన ఉన్న డాబాలో వెయిటర్‌గా పనిచేయడం ప్రారంభించారు. రెండేళ్లపాటు.. కుటుంబాన్ని పోషించడానికి టీ, స్నాక్స్ వంటివి విక్రయించాడు.
రైల్వే స్టేషన్‌లో ఆటో రిక్షా నడిపాడు
దీపావళి పండుగల సమయంలో.. తన తోటివాళ్లు ఆనందంగా గడుపుతుంటే, తనేజా రోడ్డుపై వ్యాపారం చేఉకునేవాడు. హొలీ సందర్భంగా రంగులు, సంక్రాంతి సందర్భంగా గాలిపటాలను విక్రయించేవాడు. తరువాత వేసవి కాలంలో కామిక్స్ అమ్మడం, కొరియర్ డెలివరీ చేయడం, న్యూస్ పేపర్ పంపిణీ చేయడం వంటి అన్నీ పనులు చేసాడు. 16 సంవత్సరాల వయసులో జాపూర్ దుర్గాపుర రైల్వే స్టేషన్‌లో ఆటో రిక్షా నడిపేవాడు. 19 ఏళ్ల వయసులో జైపూర్‌లోని ఒక కాలనీలో కార్ ప్యాలెస్ అనే చిన్న కార్ డీలర్‌షిప్ ప్రారంభించారు. అదే సమయంలో మోడలింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసాడు.
రాహుల్ తనేజా మోడలింగ్
మోడలింగ్ చేయడం ప్రారభించిన తరువాత.. మిస్టర్ జైపూర్, మిస్టర్ రాజస్థాన్ వంటి టైటిల్స్ మాత్రమే కాకుండా.. 1999లో మేల్ ఆఫ్ ది ఇయర్ అనే టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఇదే అతన్ని వెలుగులోకి తెచ్చింది. ఇలా కొనసాగుతూనే 2000వ సంవత్సరంలో లైవ్ క్రియేషన్ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజన్సీ ప్రారంభించారు. ఆ తరువాత పదేళ్లకు ప్రీమియం వెడ్డింగ్ బ్యానర్ కింద.. లగ్జరీ వెడ్డింగ్ ప్లానింగ్‌లోకి అడుగుపెట్టారు.
వీఐపీ నెంబర్ ప్లేట్స్
రాహుల్ తనేజా చేసిన వ్యాపారాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాయి. అతి తక్కువ కాలంలోనే జైపూర్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తల స్థానంలోకి చేరుకున్నాడు. ఇలా చిన్నస్థాయి నుంచి.. ఎందో మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగాడు. బాగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక.. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్స్ కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇలా 2011లో ఈయన తన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు కోసం.. రూ. 10 లక్షలు ఖర్చు చేసి, RJ 14 CP 0001 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ కొనుగోలు చేశారు. 2018లో జాగ్వార్ ఎక్స్‌జేఎల్ కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేసి RJ 45 CG 0001 సొంతం చేసుకున్నాడు.
కొడుకు కారు కోసం రూ.31 లక్షల నెంబర్ ప్లేట్
భారీ డబ్బును వెచ్చించి.. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్స్ కొనుగోలు చేసే రాహుల్ తనేజా తన కొడుకు ఉపయోగించే ఆడి ఆర్ఎస్‌క్యూ8 కోసం వీఐపీ నెంబర్ కొనాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 16 నాటికి తన కొడుకు వయసు 18 ఏళ్లు నిండుతాయి. పుట్టిన రోజు సందర్భంగా ఆ వీఐపీ నెంబర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం రూ. 31 లక్షలు వెచ్చించి.. RJ 60 CM 0001 నెంబరును జైపూర్ రైల్వే రవాణా కార్యాలయం నుంచి కొనుగోలు చేసాడు. ఇప్పటి వరకు రాజస్థాన్ రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ ఇదే అని అధికారులు ధృవీకరించారు.
కొడుకు ఆనందం కోసం!
కారు నెంబర్ కోసం రూ. 31 లక్షల దుబారా ఖర్చు అవసరమా?, అనే ప్రశ్నకు ”నేను వర్తమానంలోనే జీవిస్తాను. ఈ రోజు నాకు ఏది సంతోషాన్ని ఇస్తుందో.. అది చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నా ఆనందం నా కొడుకు ఆనందంలోనే ఉంది. నా కొడుకు ఆనందం కార్లు, కార్ నెంబర్లలో ఉంది. నా కొడుకు ఆనందం కోసం ఏదైనా చేయాలంటే.. ఎక్కువగా ఆలోచించను” అని తనేజా నవ్వుతూ సమాధానం ఇచ్చారు.