Home Blog Page 140

తెలంగాణాలో ఎరువుల సమస్య.. అప్రమత్తమైన చంద్రబాబు: అధికారులకు కీలక సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో యూరియా కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఈ సమస్య రాజకీయమైంపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. యూరియా కొరత ఏర్పడుతుందని మేము చెప్పామని బీఆర్ఎస్ చెబుతోంది. కేంద్రం సరఫరా చేయకపోవడం వల్లనే.. యూరియా సరఫరా చేయలేకపోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ సమస్యను పార్టీ పెద్దలు ఢిల్లీలో కూడా వినిపించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు.

ఎరువులు పక్కదారి పడితే

రాష్ట్రంలో వ్యవసాయేతర పనులకు యూరియా విక్రయించకూడదని ఏపీ సీఎం స్పష్టం చేశారు. అంతే కాకుండా ఎరువుల ధరలను పెంచి అమ్మినట్లయితే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల సరఫరాను తగ్గించాలని.. రైతులకు అందుబాటు ధరలో అందించడానికి మార్క్‌ఫెడ్ ద్వారానే ఎక్కువగా విక్రయించాలని ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడటమే కాకుండా.. రైతులకు అందేలా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులకు ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఎరువుల లభ్యత, సరఫరాపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యతను తెలుసుకుంటూ ఉండాలని, ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు.

తెలంగాణాలో యూరియా సమస్యకు కారణం ఏంటి?

ఇటీవల కాలంలో తెలంగాణ రైతులు ఎరువుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల కోసం వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకుండా పోతోంది. అసలే వర్షాకాలం, ఈ సమయంలో దాదాపు రైతులందరూ.. వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతారు. పంట ఏపుగా రావాలంటే తప్పకుండా ఎరువులు అవసరం. దీంతో రైతులకు ఎరువుల అవసరం ఏర్పడింది.

కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన స్థాయిలో ఎరువులను పంపించకపోవడం వల్లనే రైతులకు అవసరమైనంత ఎరువులను అందించలేకపోయినట్లు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది. 2025 ఏప్రిల్ నుంచి కూడా ఎరువుల సరఫరా అంతంత మాత్రంగానే ఉందని, దీనికి సంబంధించిన గణాంకాలను కూడా వారు విడుదల చేశారు. మొతం 8.30 లక్షల టన్నుల ఎరువులు అవసరం అయితే.. ఇందులో కేంద్రం 5.12 లక్షల టన్నుల యూరియాను మాత్రమే పంపించినట్లు తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

కేద్రం స్పందన

తెలంగాణాలో తలెత్తిన యూరియా సమస్యపై కేంద్రం స్పందించింది. కర్ణాటక నుంచి 10 వేల టన్నుల యూరియాను కొనుగోలు చేసి.. మొత్తం 50 వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి పంపించే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మొత్తం మీద త్వరలోనే తెలంగాణ రైతన్నల సమస్య తీరనుంది.

రైతు దేశానికి వెన్నెముక.. వారు పంట పండిస్తేనే, అందరికీ ఆహారం సరఫరా అవుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సి ఉంది. వారి అవసరాలను ముందుగానే గ్రహించి, దానికి అవసరమైన ప్రణాళికలను ఏర్పాటు చేయాలి. లేకుంటే రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి.. ఒక రకంగా ప్రభుత్వమే కారణం అవుతుంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ చూశాక మైండ్‌లో ఫిక్సయ్యా.. శ్రీలీల తల్లి

జీవితంలో ఎదగాలంటే ఎవరో ఒకరిని తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే అనుకున్న గమ్యాన్ని, సరైన లక్ష్యాన్ని చేరుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ రోజు లైఫ్‌లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికీ ఒక రోల్ మోడల్ తప్పకుండా ఉండే ఉంటారు. నటి శ్రీలీల డ్యాన్స్ బాగా నేర్చుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ కారణమని స్వయంగా శ్రీలీల తల్లి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కూతురు పుడితే..

తాతకు తగ్గ మనవడుగా, సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న తారక్.. చిన్నప్పటి నుంచే నటనపై అమితమైన ఆసక్తిని కనపరిచేవారు. దీంతో నేడు చిత్ర సీమలో తిరుగులేని నటుడుగా స్థానం సంపాదించుకున్నారు. డైలాగ్ డెలివరీలో, డ్యాన్స్ వేయడంలో తనకు తానే సాటిగా నిరూపించుకున్న ఈయన.. శ్రీలీల డ్యాన్స్ నేర్చుకోవడానికి ఆదర్శం. 1997లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన తానా సభలో జూనియర్ ఎన్టీఆర్ కూచిపూడి నాట్యం చేశారు.

ఎన్టీఆర్ కూచిపూడి నాట్యం చూసి ముగ్దురాలైన డాక్టర్ స్వర్ణలత (శ్రీలీల తల్లి).. తనకు ఆడపిల్ల పుడితే డ్యాన్స్ నేర్పించాలని అప్పుడే ఫిక్స్ అయినట్లు.. నటుడు జగపతి బాబు హోస్టుగా నిర్వహిస్తున్న జయమ్ము నిర్ఛయమ్ము షోలో వెల్లడించారు. ఆ సమయంలో తానూ ఎన్టీఆర్‌తో మాట్లాడినట్లు కూడా చెప్పింది. అనుకున్నట్లుగానే నాకు ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు మంచి డ్యాన్సర్ అయిందని స్వర్ణలత చెప్పారు.

శ్రీలీల గురించి

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంగా బాగా పాపులర్ అయిన నటీమణులలో శ్రీలీల ఒకరు. తెలుగు సినిమాలలోకి రాకముందే శ్రీలీల కన్నడ సినిమాలలో నటించారు. అయితే పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి సినిమాల్లో కథానాయకిగా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత వచ్చిన పుష్ప 2 సినిమాలో కిస్ కిస్ కిస్సిక్ అనే పాటకు డ్యాన్స్ వేసి.. మరింత మందిని ఆకట్టుకుంది. కాగా ఈమె ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా కనిపించనున్నట్లు సమాచారం.

నటి శ్రీలీల అమెరికాలో పుట్టినప్పటికీ.. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. ఈమె తల్లి గైనకాలజీ డాక్టర్ స్వర్ణలత. చిన్నపాటి నుంచే శ్రీలీల భరతనాట్యం నేర్చుకుంది. డాక్టర్ కావాలనే కోరికతోనే ఈమె ఎంబీబీఎస్ చేస్తోంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద అమెరికాలో పుట్టి, బెంగళూరులో పెరిగి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తిరుగు లేకుండా దూసుకెళ్తోంది.

శ్రీలీల రెమ్యునరేషన్

హీరోయిన్ శ్రీలీల పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మాత్రమే రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. గుంటూరు కారం సినిమాకు రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే పాత్రను బట్టి, సినిమాను బట్టి ఒక్కో సినిమాకు దాదాపు రూ. 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీలీల గురు, శోభిత అనే ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకుంది.

బుకింగ్స్ చరిత్రలో సరికొత్త హిస్టరీ: సెకన్ల వ్యవధిలో అన్నీ సేల్

మహీంద్రా కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 700, థార్, స్కార్పియో వంటి కార్లు గొప్ప బుకింగ్స్ పొందాయి. ఇప్పుడు ఆ రికార్డును బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ చెరిపేసింది. కేవలం సెకన్ల వ్యవధిలో మొత్తం అమ్ముడుపోయి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

135 సెకన్లలో సేల్

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మధ్య కాలంలోనే.. బీఈ 6 ఎలక్ట్రిక్ కారును ప్రత్యేకమైన బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ రూపంలో లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారు కోసం ఆగస్టు 23న ఉదయం 11:00 గంటలకు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ స్వీకరించడం స్టార్ట్ చేసిన 135 సెకన్లలో (దాదాపు 3 నిముషాలు) కేటాయించిన 999 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది బుకింగ్స్ చరిత్రలోనే ఓ గొప్ప హిస్టరీ.

నిజానికి మహీంద్రా కంపెనీ బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లాంచ్ చేసినప్పుడు.. కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఆ తరువాత ఈ సంఖ్యను 999కి పెంచారు. అయినప్పటికీ అన్నీ సెకన్ల వ్యవధిలో సేల్ అయిపోయాయి. ఈ కారుకు కంపెనీ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్ భాగస్వామ్యంతో నిర్మించింది.

బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ధర

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. స్టాండర్డ్ బీఈ 6.. 79 కిలోవాట్ ప్యాక్ 3 వేరియంట్ ఆధారంగా నిర్మితమైంది. దీని ధర రూ. 27.79 లక్షలు (ఎక్స్ షోరూం). ఈ కారును బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు సెప్టెంబర్ 20న అంతర్జాతీయ బ్యాట్‌మ్యాన్ దినోత్సవం నుంచి ప్రారంభం కానున్నాయి.

డిజైన్ & ఫీచర్స్

కొత్త మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. స్టాండర్డ్ బీఈ 6 ఆధారంగా తయారు చేసినప్పటికీ, ఆకర్షణీయమైన కాస్మొటిక్ డిజైన్స్ పొందినట్లు తెలుస్తోంది. ఇది శాటిన్ బ్లాక్ ఫినిషింగ్, బ్యాట్‌మ్యాన్ డెకాల్స్, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, బోల్డ్ ఆల్కెమీ గోల్డ్ పెయింటెడ్ సస్పెన్షన్, బ్రేక్ కాలిపర్లు అన్నీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. బ్యాట్ లోగోలు హబ్ క్యాప్స్, క్వార్టర్ ప్యానెల్స్, రియర్ బంపర్ అంతటా ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్రీమియం ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. స్వెడ్ లెదర్ అపోల్స్ట్రే, బ్యాట్‌మ్యాన్ నెంబర్ ప్లేక్, ఎంబోస్డ్ బ్యాట్ లోగోలు మొదలైనవన్నీ ఇందులో ఉన్నాయి. స్టీరింగ్ వీల్ కూడా ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. లెవెల్ 2 ప్లస్ ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

పర్ఫామెన్స్

మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. స్టాండర్డ్ ‘బీఈ 6’ 79 కిలోవాట్ బ్యాటరీ ఎడిషన్ ఆధారంగా నిర్మించబడింది. కాబట్టి బ్యాట్‌మ్యాన్ ఎడిషన్లో కూడా అదే 79 కిలోవాట్ బ్యాటరీ 281 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 682 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఈ కారు కేవలం 6.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది 175 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. 20 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. మొతం మీద ఈ స్పెషల్ ఎడిషన్ అన్ని విధాలా వాహన వినియోగదారులను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది.

రూ.లక్ష కంటే తక్కువ ధరలో!.. అందరికీ నచ్చే ఐదు బైకులు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో చాలా టూవీలర్ కంపెనీలు.. లెక్కకు మించిన బైకులను లాంచ్ చేశాయి, చేస్తున్నాయి. ఇందులో తక్కువ ధర వద్ద లభించే బైకులు ఉన్నాయి, ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న బైకులు ఉన్నాయి. అయితే చాలామంది తక్కువ ధరలో.. ఉత్తమ పనితీరును అందించే బైక్ కొనాలనుకుంటారు. అలాంటి వారికోసం ఈ కథనంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభించే 5 బైకుల గురించి పరిశీలిద్దాం.

హోండా ఎస్పీ 125

భారతీయ మార్కెట్లో కొంత తక్కువ ధరలో లభించే బైకుల జాబితాలో హోండా ఎస్పీ 125 ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 93,247 (ఎక్స్ షోరూం). ఇది 123.94 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 10.9 హార్స్ పవర్, 10.9 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 2025 ఓబీడీ2బీ ఉద్గార నిబంధనలకు అనుకూలంగా 4.2 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటివి పొందింది.

టీవీఎస్ రైడర్ 125

రూ. 87,375 (ఎక్స్ షోరూం) వద్ద మార్కెట్లో అందుబాటులో ఉన్న టీవీఎస్ రైడర్ 125 కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. ఇది స్పోర్టి డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. యువ రైడర్లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ బైకును లాంచ్ చేసింది. ఇది 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 11.4 హార్స్ పవర్, 11.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది మల్టిపుల్ కలర్స్, మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్

కొంత తక్కువ ధరలో లభించే బైకుల జాబితాలో హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ కూడా ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 98,425 (ఎక్స్ షోరూం). ఈ బైక్ 124.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 11.5 హార్స్ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

బజాజ్ పల్సర్ 125

ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ పల్సర్ 125 కూడా మన జాబితాలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 85,178 (ఎక్స్ షోరూం). ఎక్కువమంది యువకులు ఇష్టపడి కొనుగోలు చేస్తున్న బైకుల జాబితాలో ఒకటిగా ఉన్న బజాజ్ పల్సర్ 125.. 124.4 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 11.8 హార్స్ పవర్, 10.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్, పర్ఫామెన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.

బజాజ్ పల్సర్ ఎన్125

పల్సర్ ఎన్125.. పల్సర్ 125 రెండూ ఒకే కంపెనీకి చెందినప్పటికీ డిజైన్, పనితీరు అన్నీ వేరుగా ఉంటాయి. ధరలో కూడా వ్యత్యాసం ఉంది. ఈ బైక్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైంది. దీని ధర రూ. 93,158 (ఎక్స్ షోరూం). ఈ బైకులోని ఇంజిన్ 12 హార్స్ పవర్, 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

పైన పేర్కొన్న ధరలు అన్నీ కూడా ఎక్స్ షోరూం ఆధారంగా ఉన్నవే. ఆన్ రోడ్ ధరలు వేరుగా ఉంటాయి. అంతే కాకుండా యాక్సెసరీస్ ధరలు అన్నీ కలిపితే ఎక్స్ షో రూమ్ ధరల కంటే కొంత ఎక్కువగానే ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా.. ఆన్ రోడ్ ధరలు కూడా నగరాన్ని బట్టి మారుతాయి. మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి కూడా ధరలలో వ్యత్యాసం ఉంటుంది. పాఠకులు లేదా వాహన ప్రేమికులు దీనిని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి.

అమ్మ చేతుల మీదుగా.. నోయెల్‌కు కొత్త కారు: దీని రేటెంతో తెలుసా?

కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. పెద్దవాళ్లకైనా, ధనవంతులకైనా.. సాధారణ ప్రజలకైనా, సెలబ్రిటీలకైనా అందరికీ ఇష్టమే. సాధారణ ప్రజల విషయాన్ని పక్కన పెడితే.. సెలబ్రిటీలు మాత్రం ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే.. బిగ్‌బాస్ 4 తెలుగు సీజన్ కంటెస్టెంట్, నటుడు అయిన ‘నోయెల్ సీన్‘ తాజాగా కొత్త కారు కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసాడు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. నోయెల్ సీన్ మహీంద్రా కంపెనీకి చెందిన ‘బీఈ 6‘ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారును తన అమ్మ చేతుల మీదుగా తీసుకున్నాడు. కారును డెలివరీ తీసుకున్న తరువాత కేక్ కట్ చేసి.. తల్లికి తినిపించాడు. నోయెల్ బీఈ 6 కారు ఏ వేరియంట్ అనేది వెల్లడించలేదు. అయితే దీని ధర రూ. 20 లక్షల కంటే ఎక్కువే ఉంటుందని సమాచారం. కొత్త కారు కొన్న విషయాన్ని అభిమానులతో పంచుకోవడంతో.. అభిమానులు శుభాకాంక్షలు, అభినందలు చెబుతున్నారు.

నోయెల్ సీన్ గురించి

హైదరాబాద్‌కు చెందిన నోయెల్ సీన్ ‘సంభవామి యుగేయుగే’ సినిమాతో.. మూవీ కెరీర్ ప్రారంభించాడు. ఆ తరువాత మంత్ర, ఈగ వంటి సినిమాల్లో కనిపించాడు. కుమారి 21 ఎఫ్ సినిమాలో నెగటివ్ రోల్ చేసాడు. ఆ తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అయితే అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కనిపిస్తుంటారు. కాగా ఇతడు బిగ్‌బాస్ 4 తెలుగు సీజన్‌లో పాల్గొన్నాడు, కానీ అనారోగ్య కారణాల వల్ల మధ్యలోనే బయటకు వచ్చేశాడు. 2019లో హీరోయిన్ ‘ఎస్తేర్ నొరోన్హా’ని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్ళైన ఏడాదికే వీరు విడిపోయారు.

మహీంద్రా బీఈ6

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బీఈ 6 పేరుతో కారును లాంచ్ చేసింది. ఇది చూడటానికి ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని కార్లకంటే కూడా భిన్నంగా ఉంది. దృఢమైన బాడీ, ఆకట్టుకునే డిజైన్, సరికొత్త లోగో అన్నీ కూడా వాహన ప్రేమికులను మంత్రముగ్దుల్ని చేస్తోంది.

ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్న మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల మధ్య ఉన్నాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 557 కిమీ నుంచి 683 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ కారు.. ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు గొప్ప డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. టాప్ ఎండ్ వేరియంట్ లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇక స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, డ్రైవర్ ఇన్ఫర్మషన్ డిస్‌ప్లే, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం అన్నీ.. బీఈ 6 అన్ని వేరియంట్లలోనూ ఉంటాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో కూడా ఇది ఒకటిగా ఉంది.

వచ్చేస్తోంది టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్: ఆగస్టు 28న లాంచ్!

భారతదేశంలో టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. ఈ స్కూటర్ మంచి అమ్మకాలను పొందుతున్న వేళ.. సంస్థ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. లాంచ్ డేట్ ఆగస్టు 28 అని కూడా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ టీవీఎస్ లాంచ్ చేయనున్న స్కూటర్ ఏది?, దాని ధర ఎంత ఉంటుంది అనే వివరాలు ఈ కథనంలో..

టీవీఎస్ మరో ఎలక్ట్రిక్ స్కూటర్

టీవీఎస్ కంపెనీ లాంచ్ చేయనున్న స్కూటర్ ‘ఆర్బిటర్’ అని తెలుస్తోంది. సంస్థ దీని కోసం ఇప్పటికే ట్రేడ్‌మార్క్ కూడా దాఖలు చేసింది. అంతే కాకుండా దీని ధర కూడా రూ. 1 లక్ష కంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది సమాచారం. ఇది మార్కెట్లో బజాజ్ చేతక్, ఓలా ఎస్1 ఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ శ్రేణి ధరలు రూ. 1 లక్ష నుంచి రూ. 1.59 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ధర మిడిల్ క్లాస్ వినియోగదారులకు కొంత ఎక్కువే. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఆర్బిటర్ లాంచ్ చేయడానికి సంకల్పించింది.

టీవీఎస్ లాంచ్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి

ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, ఫీచర్స్ వంటి విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. కానీ ఇది మంచి స్టైల్, పెద్ద వీల్స్ కలిగి.. స్వింగ్‌ఆర్ము మౌంటెడ్ మోటారును కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు వెల్లడైన స్కెచ్‌ల ప్రకారం.. ఈ స్కూటర్ ప్రీమియం లుక్ పొందుతుందని తెలుస్తోంది. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. టీవీఎస్ కంపెనీ లాంచ్ చేయబోయే స్కూటర్ ఆర్బిటర్ అవుతుందా?, లేక భిన్నంగా ఉంటుందా? అనేది.

ఐక్యూబ్ సేల్స్

ఇండియన్ మార్కెట్లో ఎక్కువ అమ్మాకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఒకటి. ఇది ఇప్పటి వరకు 6 లక్షల యూనిట్ల సేల్స్ పొందినట్లు సమాచారం. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్.. మంచి రేంజ్ వంటివి అందించడం వల్లనే దీనిని ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. ఈ స్కూటర్ సిటీ ప్రయాణానికి మాత్రమే కాకుండా నగర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో, వివిధ బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉండటం కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్

నిజానికి ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. దీనికి ప్రధాన కారణం అవగాహన లోపం, మౌలిక సదుపాయాల కొరత. అంతే కాకుండా అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు. అయితే ఇప్పుడు కాలం మారింది. చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి.. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలను అందించింది. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచింది.

పవన్ కళ్యాణ్ ఓజీ లేటెస్ట్ అప్డేట్: సెప్టెంబర్ 2కు ప్లాన్ అదే!

అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ అంటే.. చాలామందికి చెప్పలేనంత అభిమానం. కొంతమంది అభిమానులు పవర్ స్టార్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా?, అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ‘ఓజీ’ సినిమా కోసం వేచి చూస్తున్నారు. కాగా చిత్ర బృందం కూడా పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు ఓ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ 2న ఓజీ సాంగ్!

నటుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా షూటింగ్స్ ముగించుకుని పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే ‘హరిహర వీరమల్లు’ పూర్తి చేశారు. ఇక ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఓజీ షూటింగ్ కూడా దాదాపు పూర్తయిందని, ఇంకొంత భాగం పూర్తి కావాల్సి ఉందని సినిమా బృందం పేర్కొంది. ఓజీ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతంకంటే ముందు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా.. ఓజీ సినిమాకు సంబంధిన ఒక సాంగ్ విడుదల చేయడానికి ఓజీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా యాక్షన్ మూవీగా తెరకెక్కనుంది. దీనికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత.. డీవీవీ దానయ్య సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రియ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, వెన్నెల కిషోర్ మొదలైనవారు నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఓజీ సినిమాకు సంబంధించిన కొన్ని గ్లింప్స్, పోస్టర్ విడుదలయ్యాయి. ఇందులో పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా కనిపించడం చూడవచ్చు.

కొత్త అవతారంలో పవర్ స్టార్

నటుడు పవన్ కళ్యాణ్ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్).. సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికి విడుదలైన పోస్టర్లలో చూస్తే.. చేతిలో తుపాకీ పట్టుకుని, వర్షంలో తడిసి.. ఎగిరే బుల్లెట్లలతో చుట్టుముట్టిన కమాండింగ్ పోజులో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన చాలామంది అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. సినీ పరిశ్రమలో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

అంతంత మాత్రంగానే హరిహర వీరమల్లు

ఇటీవల తెరకెక్కిన పవన్ కళ్యాణ్ చిత్రం.. హరిహర వీరమల్లు ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. చాలా రోజుల ఆలస్యం తరువాత రిలీజ్ అయిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. అంతంత మాత్రమే అనిపించింది. పురాతన కథ అయినప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా కోసం రూ. 250 కోట్ల నుంచి రూ. 300 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ మాత్రం రూ. 106 కోట్లు అని తెలుస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడంటే?

ఓజీ సినిమా రిలీజ్ అయిన తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కనుంది. ఈ సినిమా 2025 నవంబర్ 14న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. బహుశా ఈ తేదీలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా, చమ్మక్ చంద్ర మొదలైనవారు నటిస్తున్నారు. ఈ సినిమాకు రూ. 200 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.

ప్రధాని మోదీ అంటే?: చంద్రబాబు సమాధానం ఇదే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద ప్రతీకార సుంకాలను విధించిన విషయం తెలిసింది. సుంకాల కారణంగా భారత ఆర్ధిక వ్యవస్థ క్షిణిస్తుందని పలువురు ఆర్ధిక నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వంటి వారు.. ఈ సమస్య తాత్కాలికం మాత్రమే.. శాశ్వతం కాదని చెబుతున్నారు. ఈ విషయం గురించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎకనమిక్స్ టైమ్స్ వరల్డ్ క్లాస్ ఫోరం సదస్సులో ప్రస్తావించారు.

ప్రతి సవాలును స్వీకరించాలి

ట్రంప్ విధించిన సుంకాల వల్ల.. కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. కానీ మనకు ఎదురయ్యే ప్రతి సవాలును స్వీకరించాలి, పరిష్కరించుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం మన ముందున్న సుంకాల సవాలును ప్రధాని మోదీ సమర్థవంతంగా ఎదుర్కుంటున్నారు.

2047 నాటికి భారతదేశంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదుగుతుంది. దీనికి సంస్కరణలు, సాంకేతిక, జనాభా వంటి అంశాలు మద్దతు ఇస్తున్నాయని.. ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాత్కాలికమైన ఎదురు దెబ్బలు ఎదురైనా.. అవన్నీ దేశ పురోగతిని ఆపలేవని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్ సొంత బ్రాండ్‌లను నిర్మించుకోవడం మీద దృష్టిపెట్టాలని సూచించారు.

ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ నాకు తెలుసు

సమావేశంలో తన రాజకీయ ప్రయాణాన్ని కూడా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తెలుగుదేశం (టీడీపీ) అధినేతగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా కాలం పనిచేశాను. ప్రతి పక్షంలో కూడా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ నాకు బాగా తెలుసని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన వంటి సవాళ్లు రాష్ట్ర అభివృద్ధికి సవాళ్లుగా ఉన్నప్పటికీ.. నేను దేశ అభివృద్ధికి కట్టునది ఉన్నానని చంద్రబాబు పేర్కొన్నారు. మనమందరం కూడా దేశాభివృద్ధికి కట్టుబడి ఉండాలని అన్నారు.

మోదీ నాయకత్వంపై ప్రశంస

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. సమయం, పరిస్థితులు, నాయకత్వం అన్నీ భారతదేశాన్ని నడిపిస్తున్నాయని అన్నారు. ”సరైన సమయం, సరైన స్థలం, సరైన నాయకుడు – అదే ప్రధాని మోదీ” అని చెప్పారు. ప్రపంచాన్ని భారత్ శాసించే రోజు తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశం శక్తిని ఏదీ ఆపలేదు.. ఎదురుదెబ్బలు తాత్కాలికంగానే ఉంటాయని అన్నారు.

భారతదేశంలో ఇప్పుడే.. అమెరికా, చైనా వంటి వాటికి ధీటుగా నిలబడగల శక్తిని సంపాదించింది. అయితే సమగ్ర వృద్ధి, సంక్షేమం వంటివి భారతదేశ అభివృద్ధికి మరింత దోహదపడతాయని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో సంక్షేమం తప్పనిసరి. భవిష్యత్తులో మనం చూడబోయే భారతదేశం అన్ని వర్గాలను కలుపుకొని ఉంటుందని పేర్కొన్నారు. సబ్సిడీలు, ఉచితాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సీఎం సమాధానాలు ఇచ్చారు.

రాష్ట్రానికి పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి బాటలో నడుస్తోంది. గడచినా ఏడాది కాలంలో రాష్ట్రానికి ఏకంగా రూ. 10లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. లక్ష్మి మిత్తల్ లక్ష కోట్ల రూపాయలతో స్టీల్ సిటీ నిర్మించబోతున్నారు. టీవీఎస్, గూగుల్ వంటి కంపెనీలు కూడా తమ పెట్టుబడులను మరింత పెంచనున్నాయి. ఇది రాష్ట్రంలో ఉద్యోగావకాశాలను కూడా కల్పిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆ గ్రామంలో హనుమంతుణ్ణి పూజించరు, మారుతి కార్లు వాడరు: ఆశ్చర్యపరిచే విషయాలు

చిన్న, పెద్ద, ముసలి, ముతక ఇలా అందరికి ఇష్టమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే.. అది తప్పకుండా రామదూత ‘హనుమాన్‘ అని చెబుతారు. యావత్ భారతదేశంలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఆంజనేయస్వామి విగ్రహం లేదా గుడి తప్పకుండా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ మన దేశంలోనే ఒక గ్రామంలో హనుమంతుని ఆలయం గానీ.. మారుతి కార్లు గాని లేవు. వినడానికి ఇది వింతగా అనిపించినా.. ఇది నిజం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది?, అక్కడి ప్రజలు హనుమంతుణ్ణి, మారుతి కార్లను వద్దనుకోవడానికి గల కారణం ఏమిటనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..

హనుమంతుణ్ణి పూజించరు

ఉత్తరప్రదేశ్‌లోని బిస్రాఖ్ అనే గ్రామంలో స్థానికులు రావణుడిని.. తమ పూర్వీకునిగా భావించి పూజలు చేస్తారు. అదేవిధంగా.. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉండే ”నండూర్ నింబా దైత్య లేదా దైత్య నండూర్” అనే గ్రామంలో హనుమంతుణ్ణి పూజించరు. హనుమాన్ ఆలయాలు అసలే లేవు. అక్కడ పుట్టే పిల్లలకు కూడా అలంటి పేర్లు పెట్టరు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. మారుతి కార్లను కూడా ఉపయోగించరు. మారుత్ అంటే గాలి, హనుమంతుడు వాయుదేవుని కుమారుడు కావడంతో.. మారుతి కార్లను కూడా ఇక్కడి ప్రజలు వాడటానికి ఇష్టపడరు.

అక్కడి ప్రజల నమ్మకం వెనుక ఉన్న పురాణం

స్థానిక పురాణాల ప్రకారం.. నింబ దైత్యునికి.. హనుమంతుని ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. నింబ దైత్యుడు రాక్షసుడు అయినప్పటికీ.. రామ భక్తుడని చెబుతారు. నింబ దైత్యుడు రాముణ్ణి వేడుకోవడం వల్ల.. ఆ గ్రామంలో ప్రధాన దేవతను రాముడే ఇచ్చాడని చెబుతారు. ఇక్కడి దేవుడు రాక్షసుడే అయినప్పటికీ.. ఎలాంటి జంతుబలులు ఉండవు. భయంకరమైన ఆచారాలను పాటించరు. గ్రామస్థుల ప్రతి ఇంట్లోనూ నింబ దైత్యుని విగ్రహం ఉంటుందని చెబుతారు.

మారుతి ప్రభావం

2000వ సంవత్సరంలో డాక్టర్ సుభాష్ దేశ్‌ముఖ్.. నండూర్ నింబ దైత్య గ్రామంలో వైద్యం చేస్తూ ఉండేవాడు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు రోజంతా ట్రీట్మెంట్ చేస్తుండే వాడు. ఇలా రోజూ తన క్లినిక్ ముందు పెద్ద క్యూ ఉండేది. ఒక రోజు క్లినిక్ ముందర హఠాత్తుగా క్యూ మాయమైంది. దీనికి కారణం అక్కడే ఉన్న మారుతి 800 కారు అని కనుక్కున్నాడు. ఈ కారును అమ్మేసి టాటా సుమో కొనుక్కున్న తరువాత యధావిధిగా పేషంట్స్ రావడం మొదలుపెట్టారు.

స్థానికుల నమ్మకాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నండూర్ నింబ దైత్య గ్రామంలో కార్మికుల బృందం మకాం వేసింది. ఒక రోజు రాత్రి అందులో ఒక కార్మికుడు అరవడం, ఇతరులను కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు అక్కడికి స్థానికులు వెళ్లి దైత్య దేవాలయానికి తీసుకెళ్లి, ప్రార్థనలు చేసి నయం చేసారు. ఆ తరువాత అతని పేరు మారుతి అని ఉండటం వల్లనే ఇలా జరిగిందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా.. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో నియమించబడిన మారుతి అనే ఇద్దరు ఉపాధ్యాయుల కథ కూడా ఉంది. మొత్తం మీద వారి నమ్మకాల మీద విశ్వాసంతో.. అక్కడి ప్రజలు ఆచారాలను పాటిస్తున్నారు.

‘అందుకే సినిమాలు తగ్గించాను’: మనసులో మాట చెప్పిన సమంత

చిత్ర సీమలో పరిచయం అవసరం లేని హీరోయిన్స్ పేర్లలో సమంత ఒకరు. ఏమాయ చేసావే సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఆ తరువాత దిగ్గజ నటుల సరసన నటించి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు వరుస సినిమాలతో కాకుండా.. ఎప్పుడో ఒకటి అన్నట్టుగా సినిమాల్లో నటింస్తోంది. దీనికి గల కారణాన్ని కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సినిమాలు తగ్గించుకోవడానికి కారణం ఏమిటంటే?

విజవంతమైన నటీమణులలో ఒకరైన సమంత.. ప్రస్తుతం తన కెరీర్‌లో ఓ కొత్త దశను స్వీకరించినట్లు, దీనికి కారణం ఆరోగ్యం మీద శ్రద్ద చూపడమే అని తెలుస్తోంది. పని భారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలని.. తనకు అనుగుణంగా ఉన్న ప్రాజెక్టులను మాత్రమే స్వీకరించాని నిర్ణయించుకున్నట్లు సమంత ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నేను చాలావరకు నాకు ఇష్టమైన పనులను చేస్తాను. అందులో ఫిట్‌నెస్, సినిమాలు రెండూ ఉన్నాయి. నేను చాలా సినిమాలు, సిరీస్‌లలో నటించాను. అవన్నీ నా ఫ్యాషన్ ప్రాజెక్టులు కాదని అన్నారు.

ఇప్పుడు నేను చేసే ప్రతి పని, నేను పెట్టుబడి పెట్టే ప్రతి వ్యాపారం, నేను నిర్మించే ప్రతి సినిమా నా హృదయంలో ఉన్నాయి. ఇకపై ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్టులు తీసుకోను. ఎందుకంటే శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమంత పేర్కొన్నారు. నా శరీరం చెప్పిందే వినాలనుకుంటున్నాను. అందుకే పనిని తగ్గించుకున్నానని ఆమె స్పష్టం చేసారు.

ప్రొడ్యూసర్‌గా సమంత

నటి సమంత ఖుషి సినిమా తరువాత.. మా ఇంటి బంగారం అనే సినిమాలో నటింస్తోంది. ఓ వైపు విజయవంతమైన నటిగా కీర్తి పొందిన సమంత.. శుభం సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి సక్సెస్ సాధించింది. ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించి.. పాపులర్ అయింది.

మోడలింగ్ నుంచి హీరోయిన్

తమిళనాడులో జన్మించిన సమంత.. తమిళం, తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. హొలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. ఆ తరువాత స్టెల్లా మారిస్ కాలేజీలో వాణిజ్యంలో డిగ్రీ పూర్తి చేసింది. సమంత అండర్ గ్యాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసే సమయానికి మోడలింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత కాలంలో.. ఏ మాయ చేసావే సినిమాలో మొదటిసారి తెరపై కనిపించింది. ఆ తరువాత 2013లో ఐదు సినిమాల్లో నటించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత సినిమాలలో నటించడం చాలా వరకు తగ్గించింది.

వ్యాపారాల్లో పెట్టుబడి & రెమ్యునరేషన్ వివరాలు

సమంత సినిమాల్లో నటిస్తూనే.. సాకి, సస్టైన్‌కార్ట్, నౌరీష్ యూ, వరల్డ్ పికెల్‌బాల్ లీగ్ వంటి వాటిలో కూడా పెట్టుబడి పెట్టింది. వ్యాపార సామ్రాజ్యంలో కూడా మంచి లాభాలను గడిస్తున్న సమంత.. ఒక్కో సినిమాకు గానూ రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. మొత్తం మీద సినిమాల్లో నటిస్తూ.. వ్యాపార రంగంలో రాణిస్తూ.. తనదైన రీతిలో సమంత ముందుకు సాగుతోంది. అయితే మళ్ళీ వరుస సినిమాలతో కనిపించాలనీ.. ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.