Home Blog Page 80

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక… వీసీకే అభ్యర్థిగా తెలంగాణ శ్యామ్

0

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశాక, ఆయన శాసనసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఆ సీటుని భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ జారిచేసింది. నవంబర్ పదకొండో తేదీ రోజున పోలింగ్ జరుగనున్నది. 21న అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. 24న నామినేషన్ ఉపసంహారణ ఉంటుంది. 14న కౌంటింగ్ పనులను ప్రారంభిస్తారు. 16వ తేదీన ఎన్నికలు ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుందని కమిషన్ ఇదివరకే ప్రకటన విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.

బరిలోకి అభ్యర్థులు

ఈ ఎన్నికకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ లంకల దీపక్ రెడ్డిని ఖరారు చేశారు.  ఇప్పటి వరకు త్రిముఖ పోరు అనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం ఈ స్థానానికి అనూహ్యంగా విముక్త చిరుతల కక్షి (వీసీకే) తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. వీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్ తమ అభ్యర్థిగా తెలంగాణ శ్యామ్ పేరును ప్రకటించారు.

శ్యామ్‌కు ఎమ్మెల్యే టికెట్

తెలంగాణ శ్యామ్ వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. రాజకీయంగా మరియు సామాజికంగా తెలంగాణలోనే కాకుండా దేశంలో జరిగే ప్రతి సమస్య మీద ఆయన త్వరితగతిన స్పందిస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గానీ శ్యామ్ ఎప్పుడూ బాధితుల తరుపున పోరాడుతుంటారు. వారికి అన్ని వేళల అందుబాటులో ఉంటూ అండగా నిలబడటం ఆయన యొక్క సహజ లక్షణంగా చెబుతుంటారు. నిరంతరం ప్రజల పక్షం వహించే సామాజిక ఉద్యమకారుడు మరియు నిత్యం జనం పడే బాధలపట్ల సరైన అవగాహన, మంచి జ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడు అయిన తెలంగాణ శ్యామ్‌కు జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించడం నిజంగా హర్షించదగినదిగా అందరూ భావిస్తున్నారు. ఇంతకు ముందు వీసీకె నుంచి ఎంపీగా పోటీచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏ మేరకు ఫలితాలు సాధిస్తారో చూడాలంటే నవంబర్ 14 వరకు వేచిచూడాలి.

మార్వాడీ గోబ్యాక్ ఉద్యమానికి రూపకర్త

తెలంగాణలో ఉన్న స్థానిక వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, తరతరాలుగా చేతివృత్తి చేసుకుని బతికే పేద చిన్న చిన్న వ్యాపారస్థులు తీవ్రంగా నష్టపోతున్నారని.. వాళ్ల అందరి తరపున ఆయన మార్వాడీ గోబ్యాక్ ఉద్యమానికి శ్యామ్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ వాసుల కట్టు, బొట్టు, తిండి, పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మాట్లాడే బాష, సంస్కృతి మొత్తం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలనుంచి వచ్చిన మార్వాడిల కారణంగా నాశనం అవుతున్నదని, స్థానికంగా ఉన్న ప్రజలపైన దాడులకు పాల్పడుతున్నారని, వాళ్ళు చేసే ఇల్లీగల్ దందా వల్ల స్థానిక వ్యాపారులు దుకాణాలు ముసివేసే పరిస్థితులు వచ్చాయని వీటి నుంచి మాకు విముక్తి కావాలని ఆయన పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన్ని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తరువాత ఏ కేసు లేకుండా పూచికత్తుపై విడుదల చేశారు. అయితే ఇప్పటికి శ్యామ్ ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

అంబేద్కర్ భావజాలం

బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు, అశోకుడు లాంటి వారి భావజాలంతో పనిచేసే వ్యక్తి శ్యామ్. అతనికి తగినట్టుగానే ఆయన ఎంచుకున్న పార్టీ కూడా.. తోల్ తిరుమావళవన్ (చిదంబరం ఎంపీ, తమిళనాడు) అంబేద్కర్, పెరియార్, కమ్యూనిస్ట్ భావజాలంతో వీసీకే పార్టీని స్థాపించారు. దళిత్ పాంతర్ మూమెంట్ నుంచి ఈ పార్టీ పుట్టింది. దానికి తగిన విధంగానే ఆ పార్టీ పనిచేస్తోంది.

ప్రశ్నార్థకంగా మారిన ఫోర్డ్ ఇండియా పరిస్థితి!: ఎందుకిలా..

0

అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారతదేశం తన కార్యకలాపాలను 2021లోనే అధికారికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాలు ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ.. ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేక, సుమారు రూ. 15,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో తన కార్యకలాపాలను భారతదేశంలో నిలిపేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు.. ఇది అసంభవమేమో అని చెబుతున్నాయి.

ప్రశ్నార్థకంగా మారిన ఫోర్డ్ ఇండియా పరిస్థితి!

ఫోర్డ్ కంపెనీ.. చెన్నైలోని తన తయారీ కేంద్రంలో మళ్ళీ తన ఉత్పత్తిని ప్రారంభించాలనే ఆలోచలనతో ఉన్నట్లు కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే అమెరికా అధ్యక్షుడి ఆంక్షల ప్రభావం కారణంగా.. ఫోర్డ్ మళ్ళీ ఇండియాకు వచ్చే సూచనలు చాలా తక్కువని తెలుస్తోంది. కాగా 2022 మధ్య నుంచి క్రియారహితంగా ఉన్న.. తమిళనాడు ప్లాంటులో తమ కార్యకలాపాలను నిర్వహించడానికి అధికారుల సమావేశం త్వరలోనే ఉండొచ్చని సమాచారం.

కంపెనీ ఇంతకుముందు తమిళనాడు ప్లాంటును ఇంజిన్ తయారీకి ఉపయోగించుకోవాలని, ఇక్కడ తయారైన ఇంజిన్లను ఎగుమతి చేయాలనీ నిర్ణయించుకుంది. అయితే ఇది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. ఇప్పుడు ఫోర్డ్ సంస్థ ఇండియాలోకి రావడమనేది ప్రశ్నార్దకంగా మారింది.

యూరప్ & జర్మనీ మార్కెట్లపై ఫోర్డ్ దృష్టి

ఇదిలా ఉండగా.. ఫోర్డ్ కంపెనీ యూరప్ మార్కెట్ మీద ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా జర్మనీలో తన కార్యకలాపాల విస్తరణ కోసం 4.4 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. కొలోన్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది. యూకేలో కాంపోనెంట్ హబ్, బ్యాటరీ ఆర్&డీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో కంపెనీ ముందుకు వెళ్లాలనే ఆలోచనను చెప్పకనే చెబుతున్నాయి.

చెన్నైలోని తమ తయారీ కేంద్రం విషయంలో 2024 చివరి నుంచి మా స్థానం మారలేదని.. కంపెనీ పేర్కొంది. అయితే ప్లాంట్‌లో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి.. స్టేట్ ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్‌ను మెరుగుపరచడానికి సంబంధించిన ఫోర్డ్ ఉద్దేశ్యాలను స్పష్టంగా వెల్లడించాలని తమిళనాడు ప్రభ్యత్వం కోరింది. దీనిపై కంపెనీ స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంది.

భారతదేశంలో ఫోర్డ్ చరిత్ర

నిజానికి భారతదేశంలో ఫోర్డ్ కంపెనీకి.. దశాబ్దాల చరిత్ర ఉంది. 1926లో ప్రారంభమైన ఈ కంపెనీ.. మొదట తన కార్యకలాపాలను ముంబైలో ప్రారంభించింది. ప్రారంభంలో సజావుగా ముందుకు సాగినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల 1953లో ఇండియాలో తన కార్యకలాపాలను నిలిపివేసింది.

ఆ తరువాత 1995లో మళ్ళీ మన దేశంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ఫోర్డ్ ఇండియాగా అవతరించింది. కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తూ.. ముందుకు సాగుతున్న కంపెనీకు 2016 నుంచి 2021 మధ్య ఆశించిన లాభాలు లభించలేదు. హ్యుందాయ్, టాటా మోటార్స్, మారుతి సుజుకి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. చేసేదేమీ లేక మరోమారు తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. ఇది జరుగుతుందా? లేదా?, అనేది త్వరలోనే తెలుస్తుంది.

బైసన్ ట్రైలర్ వచ్చేసింది: ధృవ్ విక్రమ్ విశ్వరూపం చూశారా?

0

ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన బైసన్ మూవీ ట్రైలర్ తమిళ్, తెలుగు రెండు బాషలలో ఒకేసారి విడుదల అయింది. అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అట్టహాసంగా రిలీజ్ కానుంది. తెలుగులో మాత్రం అక్టోబర్ 24న థియేటర్లలో విడుదల అవుతుంది. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. నీలం స్టూడియోస్ మరియు అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పైన పా. రంజిత్, అదితి ఆనంద్, సమీర్ నాయర్, దీపక్ సంయుక్తంగా నిర్మించారు. నివాస్ కే ప్రసన్న సంగీతం అందించారు. పశుపతి, లాల్, అమీర్, రజిషా విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

రొటీన్‌కు భిన్నంగా ధృవ్ విక్రమ్

బైసన్ ట్రైలర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్స్ బ్లాక్ అండ్ వైట్‌లో రొటీన్‌కు భిన్నంగా కనిపిస్తోంది. మారీ సెల్వరాజ్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక జంతువుని సింబాలిక్ చూపిస్తుంటాడు. అదే విధంగా ఇందులో కూడా దున్నపోతుని హీరో క్యారెక్టర్‌కు ప్రతిబింబంగా చూపించినట్టు అనిపిస్తోంది. అంటే ఆ జంతువుకున్న బలం, పౌరుషం మెండుగా ఉన్నాయని చెప్పకనే చెప్పాడు డైరెక్టర్. బాగా కొమ్ములు తిరిగిన పొట్టేలు అరుపు, కసితో పడగేత్తి బుసకోట్టే నాగుపాము.. ఆ తరువాత హీరో ధృవ్ విక్రమ్ ముఖాన్ని చూపించడం ఏదో సాధించి తీరాలనే ఒక ఆవేశం ఆ కల్లల్లో స్పష్టంగా కనిపించడం మనం గమనించవచ్చు.

ధృవ్ విక్రమ్ ఈ సినిమా కోసం కఠోర శ్రమ చేసాడనే తెలుస్తోంది. పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. ధ్రువ్‌కి ఇదే డెబ్యూ మూవీ అన్నట్టుగా వర్క్ పట్ల ఎంతో కసితో పనిచేసాడు. కబడ్డీ క్రీడాకారుడిగా క్యారెక్టర్‌లో బాగా ఒదిగిపోయాడు. అంతే కాకుండా ఒక సాధారణ పల్లెటూరు వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన యువకుడి పాత్రలో జీవించాడు అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

ముందు సినిమాల కంటే.. బైసన్ ప్రత్యేకం!

ముందు రెండు చిత్రాల కంటే బైసన్ సినిమా.. ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని పబ్లిక్ అభిప్రాయపడుతున్నారు. హీరో కెరియర్‌లో బైసన్ ఒక మైలురాయి అవుతుంది అని చెప్పొచ్చు. తన ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులు ఒకపక్క.. తన కుటుంబం ఇంకోపక్క, తను ప్రేమించిన అమ్మాయి, వీటి మధ్యలో తను నమ్ముకున్న కబడ్డీ ఆట కోసం హీరో పడే ఆరాటం కనిపిస్తుంది. జీవితంలో ఎలాగైనా గెలవాలనే తపన ట్రైలర్‌లో కనిపిస్తోంది.

తండ్రిగా పశుపతి.. మొదట కొడుకు ఆటని ఒప్పుకోకుండా.. ఒట్టు వేయించుకోవడం, తరువాత ట్రైలర్ చివరలో తానే తన కొడుక్కి అండగా నిలబడి వెన్నుతట్టినట్టుగా అనిపిస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నివాస్ కే ప్రసన్న అత్యద్భుతంగా అందించారు. ట్రైలర్‌కి మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని స్పష్టంగా తెలుస్తోంది.

ఇన్‌స్పిరేషన్ ఇచ్చే డైలాగ్స్

“రేయ్ కిట్టయ్య ఇది సరిపోదు రా, ఇది సరిపోదు. నీ కాళ్ళు విరగ్గొట్టిన, చేతులు విర్గగొట్టినా పరిగెడుతూనే ఉండు, పైకి ఎదుగుతూనే ఉండాలి, టాప్‌కి చేరుకోవాలి, శిఖరాన్ని అందుకోవాలి అప్పుడే మనకు ఒక గౌరవం ఉంటుంది. రేయ్ నువ్వు బయలుదేరరా…” ట్రైలర్ చివరిలో హీరో (ధృవ్ విక్రమ్) తండ్రి (పశుపతి ) చెప్పే మాటలు అందరికి ఇన్‌స్పిరేషన్ ఇచ్చేవిగా ఉన్నాయి. తను ఏ పరిస్థితుల మధ్య నుంచి వచ్చాడు, ఆ వాతావరణంలో మనగలగాలి అంటే ఎలా బతకాలి అనే కసిని నూరిపోయడం ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది.

ఏదైనా సాధిస్తేనే తప్పా ఆ మనుషుల మనసుల్లో మనకంటూ ఒక గుర్తింపు ఉండదు అని డైరెక్టర్ చాలా బలంగా ఆ పాత్రతో సొసైటీకి సందేశం చెప్పినట్టే అనిపిస్తుంది. డైలాగ్స్ ఆ వీడియోకు చాలా పవర్ జనరేట్ చేసాయి అని చెప్పొచ్చు. ట్రైలర్ సూపర్‌గా ఉందని పబ్లిక్‌లో రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ వైడ్ బైసన్ సినిమా కోసం అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మారీ సెల్వరాజ్ ఖాతాలో మరో హిట్ మూవీగా నిలిచేలా ఉందని అర్థమవుతోంది.

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కారు.. ఇప్పుడు కొత్త రూపంలో: ధర ఎంతో తెలుసా?

0

మెర్సిడెస్ బెంజ్ ఇండియా.. ఒక సంవత్సరం విరామం తరువాత జీ-క్లాస్ ఆఫ్ రోడర్ డీజిల్ వెర్షన్ లాంచ్ చేసింది. దీంతో ఈ కారు దేశంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో మాత్రమే కాకుండా.. డీజిల్ వెర్షన్‌లో కూడా లభిస్తుంది. ఈ కొత్త కారు ధర ఎంత?, ఇతర వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ప్రైస్ వివరాలు

సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జీ 450డీ ధర రూ. 2.90 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). అయితే కంపెనీ మొదటి కేటాయింపుగా కేవలం 50 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. దీని ధర ఎలక్ట్రిక్ జీ 580 కంటే రూ. 20 లక్షలు తక్కువ. ఈ కొత్త డీజిల్ వెర్షన్ ఇండియన్ మార్కెట్లోని ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 డీజిల్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధర పరంగా ల్యాండ్ రోవర్ ధర రూ. 1.6 కోట్లు తక్కువ.

ఇంజిన్ వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ జీ 450 డీ డీజిల్ వెర్షన్.. 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 367 హార్స్ పవర్, 750 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం ద్వారా మరో 20 హార్స్ పవర్ అదనంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ జీ 450 డీ డీజిల్ కారు.. టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది 5.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు 241 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. కాబట్టి మంచి ఆఫ్ రోడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మొత్తం మీద ఇది అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.

బయటి డిజైన్ వివరాలు

2025 మెర్సిడెస్ బెంజ్ జీ 450 డీ డీజిల్ కారు.. కొత్త గ్రిల్, బంపర్లు, అల్లాయ్ వీల్స్ పొందుతుంది. గ్రిల్ ఇప్పుడు క్రోమ్‌తో ఫినిష్ అయి 4 సమాంతరంగా ఉండే స్లాట్స్ కలిగి ఉంది. 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, కొత్తగా అప్డేట్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లను కూడా ఇక్కడ చూడవచ్చు. డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా.. చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇంటీరియర్ ఫీచర్స్

బెంజ్ జీ 450 డీ డీజిల్ కారు.. 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ వంటివి ఉన్నాయి. ఇవి కారుకు సంబంధించిన చాలా వివరాలను వెల్లడిస్తాయి. అంతే కాకుండా ఇందులో నప్పా లెదర్ అపోల్స్ట్రే, యాంబియంట్ లైటింగ్, డాల్ఫీ అట్మాస్‌తో కూడిన 18 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టం, లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్ (యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, లైన్ కీపింగ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా) కూడా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కారు

ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కారు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఈయన ఒకప్పుడు మెర్సిడెస్ బెంజ్ జీ55 కారును కలిగి ఉండేవారు. అయితే ప్రస్తుతం ఈ కారు ఉందా? లేదా? అనేదానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈ కారు అంటే పవన్ కళ్యాణ్కు చాలా ఇష్టమని సమాచారం. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ మోడల్ కార్లను చాలా వరకు అప్డేట్ చేసింది.

జీఎస్టీ ప్రభావం.. పండుగ ఆఫర్స్: భారీగా తగ్గిన మారుతి ఎస్-ప్రెస్సో ధర!

0

2025 సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఆ రోజు నుంచే మారుతి సుజుకి.. తన ఉత్పత్తుల (కార్లు) ధరలను తగ్గింపు ధరతో విక్రయించడం ప్రారంభించింది. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపులకు.. ఫెస్టివల్ డిస్కౌంట్స్, ఆఫర్స్ తోడయ్యాయి. దీంతో బ్రాండ్ యొక్క వాహనాల ధరలు మరింత తగ్గాయి. ఈ కథనంలో మారుతి ఎస్-ప్రెస్సో ధర గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి-ఎస్ ప్రెస్సో ఒకటి. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు దీనిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొత్త జీఎస్టీ, దీపావళి పండుగ ఆఫర్ కింద వేరియంట్‌ను బట్టి.. రూ. 70000 నుంచి రూ. 1.30 లక్షలు తగ్గుతుంది. ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్స్ ఉన్నాయి.

వేరియంట్ వారీగా ఏసీ షోరూమ్ ధరలు

  • ఎస్టీడీ (ఓ): రూ. 3.50 లక్షలు (రూ.77000 తగ్గింది)
  • ఎల్ఎక్స్ఐ: రూ. 3.80 లక్షలు (రూ. 1.2 లక్షలు తగ్గింది)
  • వీఎక్స్ఐ (ఓ): రూ. 4.30 లక్షలు (రూ. 91000 తగ్గింది)
  • ఎల్ఎక్స్ఐ (ఓ) సీఎన్‌జీ: రూ. 4.62 లక్షలు (రూ. 1.3 లక్షలు తగ్గింది)
  • వీఎక్స్ఐ (ఓ) ఆటోమాటిక్: రూ. 4.75 లక్షలు (రూ. 97000 తగ్గింది)
  • వీఎక్స్ఐ ప్లస్ (ఓ): రూ. 4.80 లక్షలు (రూ. 71000 తగ్గింది)
  • వీఎక్స్ఐ (ఓ) సీఎన్‌జీ: రూ. 5.12 లక్షలు (రూ. 1 లక్ష తగ్గింది)
  • వీఎక్స్ఐ ప్లస్ (ఓ) ఆటోమాటిక్: రూ. 5.25 లక్షలు (రూ. 76000 తగ్గింది)

మారుతి ఎస్-ప్రెస్సో

ధరల తగ్గుదల తరువాత దేశీయ విఫణిలో మారుతి ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర సెప్టెంబర్ 22కు మించి రూ. 4.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). సింపుల్ డిజైన్ కలిగిన ఈ కారు.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ రూపాల్లో మార్కెట్లో అమ్మకానికి ఉంది.

మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబటులో ఉండే.. మారుతి ఎస్-ప్రెస్సో అమ్మకాల పరంగా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. దేశీయ విఫణిలో క్రాస్ఓవర్లు, పెద్ద కార్ల సంఖ్య పెరుగుతున్న సమయంలో హ్యాచ్‌బ్యాక్‌ల మార్కెట్ వాటా క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ.. ఎస్-ప్రెస్సో మాత్రం ఈ విభాగంలో ఇప్పటికీ అధిక ప్రజాదరణ పొందుతూనే ఉంది.

ప్రస్తుతం కంపెనీ ఈ ఎస్-ప్రెస్సో ధరను బాగా తగ్గించింది. దీంతో ఈ కారు మంచి అమ్మకాలు పొందుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తక్కువ ధరలో ఓ మంచి కారు కోసం చూస్తున్న ప్రజలకు లేదా పండుగ సమయంలో తక్కువ ధరలో కారు కొనాలనుకునే వారికి మారుతి ఎస్-ప్రెస్సో సరైన ఎంపిక అనే చెప్పాలి.

సెప్టెంబర్ నెలలో పెరిగిన మారుతి సుజుకి సేల్స్

మారుతి సుజుకి ప్రస్తుతం ఎస్-ప్రెస్సో ధరలను మాత్రమే కాకుండా.. ఇతర వేరియంట్ల ధరలను కూడా బాగా తగ్గించింది. ఈ కారణంగానే గత నెలలో (2025 సెప్టెంబర్) కంపెనీ 1.32 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ కార్లను విక్రయించగలిగి.. మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది. ఇందులో ఎస్-ప్రెస్సో సేల్స్ 1774 యూనిట్లు అని సమాచారం. ప్రస్తుతం ఈ కారు (ఎస్-ప్రెస్సో) ధరలు తగ్గడం చేత.. అక్టోబర్ 2025లో మరింత ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యే అవకాశం ఉందని సమాచారం.

బీఎస్పీ మెగా ర్యాలీ హైలెట్స్.. గళం విప్పిన మాయావతి

0

బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షిరామ్ వర్ధంతి సందర్బంగా బీఎస్పీ లక్నోలోని కాన్షిరామ్ స్మారక స్థలంలో భారీ ర్యాలీని నిర్వహించింది. భారతదేశ నలుమూలల నుంచి ఈ మీటింగ్‌కు కొన్ని లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. నీలి కండువాలు, జెండాలు, బ్యానర్‌లు, కటౌట్స్, నీలి దుస్తులతో సభా ప్రాంగణంతో పాటు లక్నో మొత్తాన్ని నీలి సంద్రంలా మార్చివేశారు.

మాయావతి కీలక వ్యాఖ్యలు

ఈ ర్యాలీలో ‘బెహెంజి మాయావతి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి.. మాకు అధికారం కావాలి’, ఉచితాలు కాదు (రేషన్ కాదు) లాంటి కొత్త నినాదాలతో పాటు బహుజన హితయా బహుజన సుకాయా అనే కాన్షిరామ్ గారి వ్యాఖ్యలను కూడా పెద్ద ఎత్తున నినదించారు. జై భీమ్ జై భారత్.. అంటూ మారుమోగించారు. ఈ ఉత్సహం చూస్తుంటే వచ్చిన జనసందోహానికి కచ్చితంగా ఈసారి అధికారం చెపడతామనే నమ్మకం కలిగినట్టుగా కొంతమంది కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన బహుజన సమూహన్ని ఉద్దేశించి.. బిఎస్పీ రాజకీయ భవిష్యత్తు గురించి పార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే 2027 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మాయావతి మాట్లాడుతూ.. ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికి.. అవి ఆయా పార్టీలకు మేలుజరిగింది గానీ.. బీఎస్పీకి ఏ ప్రయోజనం కూడా చేకూరలేదు అని అన్నారు. ప్రతిసారి మా ఓట్లు పొత్తులో ఉన్న వాళ్లకి బదిలీ అవుతున్నాయి తప్పా మిగిలిన వారి ఓట్లు ఒక్కటి కూడా ఇటు రావడం లేదని వాపోయారు. అందుకే ఈసారి ఒంటరిగా పోటీచేస్తామని స్పష్టంచేశారు.

ప్రత్యర్థులపై విమర్శల వర్షం

తమ ప్రత్యర్థి పార్టీలపైన ఆమె విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ రెండు పార్టీలు దళిత సమాజాన్ని మోసానికి, అన్యాయానికి గురిచేస్తున్నాయని.. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని, కాన్షిరామ్ మృతిపట్ల సంతాపం తెలుపకపోవడం కాంగ్రెస్ ఆలోచనలకు నిదర్శనం అన్నారు. ఇప్పుడు రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని, అదొక డ్రామా పార్టీ అని అన్నారు.

పవర్‌లో ఉన్నప్పుడు దళితులు, మిగిలిన ఇతర అణచివేయబడిన కులాలను పట్టించుకోరు. తరువాత మాత్రమే వాళ్లు గుర్తుకు వస్తారని, అదొక అవకాశవాద, రెండు దోరణులు కలిగిన పార్టీగా మాయావతి అభివర్ణించారు. కాన్షిరామ్ పట్ల గౌరవం లేదని, జిల్లాలకు కాన్షిరామ్ పేర్లు మార్చడం, స్మారక స్థలానికి నిధులు ఆపివేయడం వంటివాటిని మాయావతి గుర్తు చేశారు.

బీజేపీ ప్రభుత్వం సిబీఐ, ఈడీ లాంటి సంస్థలతో నన్ను, మన నాయకులను, కుటుంబాన్ని అనవసరమైన కేసుల్లో ఇరికించి దళితుల అభివృద్ధిని, పార్టీని ఇబ్బంది పెట్టిందని – కాంగ్రెస్, సమాజ్ వాది, బీజేపీ మనల్ని ఆపడానికి ఉన్నాయని కానీ బీఎస్పీ మాత్రం ఎక్కడ విశ్రమించకుండా వాటిని ఎదురక్కొని పనిచేస్తుంది అని అన్నారు. బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితాలపై ఆధారపడకుండా ప్రజలు సొంతంగా ఏదిగేలా అభివృద్ధి చేశామని ఆమె అన్నారు. 2027లో మళ్ళీ అధికారం చేపడుతామని కార్యకర్తల్లో విశ్వాశాన్ని నింపారు.

రాజకీయ వారసుని గురించి

తన మేనల్లుడు బీఎస్పీ జాతీయ కన్వీనర్ ఆకాష్ ఆనంద్ గురించి చెబుతూ.. కాన్షిరాం కాలంలో ఆయనకు తరువాత నాకు ఇంతకాలం అన్ని కష్ట సమయాల్లో ఏ విధంగా అయితే అండగా నిలబడ్డారో ఇప్పుడు ఆకాష్ ఆనంద్ కూడా అదే విధంగా మద్దతుగా ఉండాలని, నా మార్గదర్శకత్వంలో తను నడుస్తాడని ఆమె తన రాజకీయ వారసుని గురించి చెప్పుకొచ్చారు.

మొన్న రష్మికతో నిశ్చితార్థం!.. ఇప్పుడు కీర్తి సురేష్‌తో సినిమా!

0

విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న నిశ్చితార్థం విషయం కొంత సద్దుమణుగుతోంది. ఈ తరుణంలో నటుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమా రౌడీ జనార్దన్కు సంబంధించిన పూజా కార్యక్రమం ఈ రోజు (అక్టోబర్ 11) హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు?.. సినిమా రిలీజ్ వంటి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ, ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

రౌడీ జనార్దన్.. విజయ్ దేవరకొండ

నటుడు విజయ్ దేవరకొండ తదుపరి సినిమా రౌడీ జనార్దన్’కు రాజావారు రాణిగారు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రవికిరణ్ కోల దర్శకత్వం వహించనున్నారు. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 16 (అక్టోబర్ 16) నుంచే ముంబైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు జరిగిన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమానికి.. అల్లు అరవింద్ ప్రత్యేక అతిథిగా హాజరై.. తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొదటిసారి కీర్తి సురేష్‌తో జంటగా

రౌడీ జనార్దన్ సినిమాలో హీరోయిన్‌గా మహానటి కీర్తి సురేష్ నటించనున్నారు. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా కనిపించనున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. దీంతో అటు దేవరకొండ ఫ్యాన్స్, ఇటు కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని చాలా అతృతతో ఎదురు చూస్తున్నారు. పేరుకు తగ్గట్టుగానే ఇది మంచి యాక్షన్ కథా చిత్రమని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ కేటాయించనున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 చివరి నాటికి థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి.

హిట్ కొట్టేనా?

ఇటీవల రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమా ఊహించిన అంచనాలను అందుకోలేకపోయింది. గీత గోవిందం సినిమా తరువాత.. అంత పెద్ద హిట్ సాధించిన సినిమాలు విజయ్ దేవరకొండ ఖాతాలో పడలేదు. ఈ సారైనా రౌడీ జనార్దన్ సినిమాతో హిట్ కైవసం చేసుకుంటాడేమో వేచిచూడాలి. సినిమా టైటిల్, దర్శక & నిర్మాతలను బట్టి చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధిస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు.

విజయ్ దేవరకొండ గురించి

2011లో నువ్విలా సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు దాదాపు అంతంతమాత్రమే అనిపించాయి. సినిమా విషయం పక్కన పెడితే.. నటి రష్మిక మందన్నతో.. విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ విషయాన్ని వారిరువురు అధికారికంగా ప్రకటించినప్పటికీ.. అసలు స్పందించనే లేదు. దీన్నిబట్టి చూస్తే వీరు నిశ్చితార్థం చేసుకున్నారనే విషయం నిజమే అని తెలుస్తోంది. కాగా వీరి పెళ్లి 2026 ఫిబ్రవరిలో ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘లవ్ చేస్తే లైఫ్ ఇస్తా అని వరమిచ్చా’: కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ ట్రైలర్ చూశారా

0

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. దిల్‌రూబా సినిమా తరువాత తెరకెక్కనున్న ఈ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. తాజాగా రిలీజ్ అయిన ఈ లేటెస్ట్ మూవీ ట్రైలర్ గురించి, సినిమా రిలీజ్ గురించి మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

కే ర్యాంప్ ట్రైలర్

తాజాగా రిలీజ్ అయిన కే ర్యాంప్ ట్రైలర్ విషయానికి వస్తే.. ప్రారంభంలోనే ఒక బామ్మ పక్కన కూర్చుకు భయపడుతూ కాళ్లు ఊపుతూ ఉంటాడు. అప్పుడు ఆ బామ్మ.. కాళ్లు ఊపకూడదు అని చెబితే, నా గర్ల్‌ఫ్రెండ్‌ను తలచుకుంటుంటే అవే ఊగిపోతున్నాయని చెబుతాడు. ఆ తరువాత ఎంసెట్ ఎగ్జామ్ రాయలేదంటగా.. అంటే, తాగేసి పడిపోవాల్సి వచ్చిందని చెబుతాడు. లవ్ చేస్తే లైఫ్ ఇస్తా అని వరమిచ్చాను సర్.. అనటం ఇలా డైలాగ్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. హీరోయిన్ యుక్తి తరేజతో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. బీజీఎం మ్యూజిక్ అద్భుతంగా ఉంది.

ఐ లవ్ యు కుమార్.. నువ్వు కూడా చెప్పు కుమార్, అన్నప్పుడు హీరో కళ్లలో కన్ఫ్యూజన్ తెగ నవ్వు తెప్పిస్తుంది. నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ మొదలైనవారు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న (2025 అక్టోబర్ 18) థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ట్రైలర్ మాత్రం రిలీజ్ అని కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో పాజిటీవ్ రెస్పాన్స్ పొందుతోంది.

కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్!

కే ర్యాంప్ సినిమా హాస్య మూవీ పతాకంపై నిర్మించారు. దీనికి జైన్స్ నాని దర్శకత్వం వహించారు. రాజేష్ దండా, శివ బొమ్మక్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం ఎంత ఖర్చు చేశారనే విషయం అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.. కాబట్టి భారీ వసూళ్ళు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా మంచి హిట్ సాదిస్తుందని, కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ యాడ్ అవుతుందని ఇప్పటికే కొందరు చెబుతున్నారు. ట్రైలర్ చూస్తుంటే నిజమే అని కూడా అనిపిస్తోంది. దీపావళికి చాలా సినిమాలో థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి కిరణ్ అబ్బవరం సినిమా కొంత గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

కిరణ్ అబ్బవరం గురించి

తెలుసు సినిమా ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరంకు మంచి క్రేజ్ ఉంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినిమా రంగంలో నిలబడిన ఇతడంతే.. ఎంతోమందికి అభిమానం కూడా. రాజావారు రాణిగారు సినిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం.. ఎస్ఆర్ కళ్యాణమండపం, నేను మీకు బాగా కావలసినవాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, క వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా కే ర్యాంప్ సినిమాథి తెరమీదకు రానున్నారు. ఈ సినిమా ఎలాంటి టాక్ పొందుతుంది? ఎలాంటి వసూళ్లను రాబడుతుంది.. అనే విషయాలు సినిమా రిలీజ్ తరువత తెలుస్తాయి.

విద్యార్థులకు గొప్ప అవకాశం: రూ.కోటి గెలుచుకునే ఛాన్స్!

0

భారతదేశంలో చదువుతున్న 6వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మంచి కార్యక్రమం ప్రవేశపెట్టింది. వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి?, కాన్సెప్ట్ ఏమిటి? ప్రైజ్ ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

వికసిత్ భారత్ బిల్డథాన్ థీమ్స్

ఆవిష్కరణ స్ఫూర్తిని విద్యార్థులలో పెంపొందించడానికి, సమస్యలకు పరిష్కారం వెతికే దిశగా ప్రోత్సహించడానికి కేంద్రం ఈ వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 స్టార్ట్ చేసింది. ”స్వదేశీ, ఆత్మనిర్భర భారత్, సమృద్ధి భారత్, లోకల్ ఫర్ లోకల్” వంటి థీమ్‌లతో ఆవిష్కరణలు, సమస్యలకు పరిష్కారాలను చూపాలని కేంద్రం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొననటానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఆఖరి తేదీ (2025 అక్టోబర్ 11). విద్యార్థులు 3 లేదా 5 మంది కలిసి ఒక బృందంగా మారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అధికారిక పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. మీకు ఒక ప్రత్యేకమైన ఐడీ జనరేట్ అవుతుంది.

రూ.కోటి విలువైన బహుమతులు

రిజిస్ట్రేషన్ చేసుకున్న బృందాలు ఒక థీమ్ ఎంచుకుని.. సమస్యకు తమదైన శైలిలో విభిన్న పరిష్కారాలను వెల్లడించాలి. దీనికి సంబంధించి 2-3 నిమిషాల వీడియో రికార్ట్ చేసి.. దానిని అక్టోబర్ 13 నుంచి 31వ తేదీ మధ్యలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2026 జనవరిలో అంటే వచ్చే ఏడాది విజేతలను ప్రకటిస్తారు. విజేతలకు రూ. కోటి విలువైన బహుమతులను అందిస్తారు.

ప్రధాన ఉద్దేశ్యం

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 కార్యక్రమంలో దేశంలోని సుమారు 2.5 లక్షల పాఠశాలల నుంచి కోటి కంటే ఎక్కువమంది విద్యార్థులను పాల్గొనేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వికసిత్ భారత్ 2047 దిశగా కేంద్రం వేస్తున్న మరో పెద్ద అడుగు. ఈ కార్యక్రమాన్ని అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ సహకారంతో విద్యామంత్రిత్వ శాఖ ప్రారంభించింది. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రతిభకు ప్రపంచ కేంద్రంగా మలచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.

రిజిస్ట్రేషన్ విధానం

  • వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 కార్యక్రమంలో పాల్గొనాలనుకునే విద్యార్థులు అధికారికి వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • మీ బృందం వివరాలతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి.
  • ఇప్పటికే ప్రస్తావించిన నాలుగు థీమ్‌లలో ఏదో ఒకదానికి ఎంచుకుని.. మీ ఆవిష్కరణ భావన, ప్రాజెక్ట్ ఆలోచనలను సమర్పించాలి.

వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ తేదీ: 2025 సెప్టెంబర్ 23
  • రిజిస్ట్రేషన్ గడువు: 2025 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 11 వరకు
  • లైవ్ బిల్డథాన్: 2025 అక్టోబర్ 13
  • విజేతల ప్రకటన: 2025 డిసెంబర్ లేదా 2026 జనవరి

విద్యార్థులకు గొప్ప అవకాశం

మీలోని సృజనాత్మకతను, సమస్యలకు పరిష్కారం కనుగొనే తెలివిని ప్రపంచానికి చాటి చెప్పుకోవడానికి వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 ఒక గొప్ప అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ప్రపంచానికి పరిచయం చేసుకోవడం మాత్రమే కాదు.. విలువైన బహుమతులు కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో లేదా ఇలాంటి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనడానికి ఆసక్తి చూపించాలి. వికసిత్ భారత్ 2047లో మీరు కూడా భాగస్వాములవ్వాలి.

చండీగఢ్‌ వ్యాపారవేత్తతో పెళ్లి?: స్పందించిన త్రిష

0

సినీ పరిశ్రమలో పరిచయమే అవసరం లేని ప్రముఖులలో నటి త్రిష ఒకరు. ఎందుకంటే 2004లో వర్షం సినిమాతో తెలుగు సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు 2025లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో కనిపిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాలుగు పదుల వయసుదాటినా.. ఏ మాత్రం తగ్గకుండా కుర్ర హీరోయిన్లలకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఎప్పుడూ.. త్రిష పెళ్లికి సంబంధించిన రూమర్స్ తెరమీదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అదే టాపిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై త్రిష కూడా స్పందించింది.

పెళ్లి వార్తలపై స్పందించిన త్రిష

ఇప్పుడు తెరమీదకు వచ్చిన సమాచారం.. చండీగఢ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తతో త్రిష పెళ్లి జరగనున్నట్లు, దీనికి త్రిష తల్లిదండ్రులు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త పూర్తిగా అబద్దం అని చెప్పడమే కాకుండా.. ”నా కోసం నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్నవారంటే నాకు ఎంతో ఇష్టం, పెళ్లి గురించి మాత్రమే కాకుండా.. హనీమూన్ షెడ్యూల్ కూడా చెప్పేయండి” అని త్రిష కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చింది. దీంతో త్రిష ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టంగా చెప్పేసింది.

త్రిష పెళ్ళికి సంబంధించిన పుకార్లు.. తెరమీదకు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు త్రిష పెళ్ళికి సంబంధించిన వార్తలు చాలానే వచ్చాయి. అవన్నీ అబద్దాలని నటి వెల్లడించింది. ఇప్పుడు కూడా అలాంటి రూమర్ ఒకటి వెలుగులోకి రావడంతో.. త్రిష స్పందించింది.

పెళ్లి గురించి చెప్పిన త్రిష

సాధారణంగా.. నటి త్రిష తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంది. అయితే ఈ మధ్య కాలంలో తన వివాహం గురించి చెబుతూ.. సరైన వ్యక్తిని కలిస్తే.. తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సరైన వ్యక్తి ఎప్పుడు, ఎలా కలుస్తాడో.. త్రిష పెళ్లి ఎప్పుడు చూస్తామో అని పలువురు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

గతంలో నిశ్చితార్థం

2015లో త్రిషకు.. వరుణ్ మణియన్ అనే ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బంధం పెళ్లివరకు వెళ్లలేదు. ఆ తరువాత త్రిష ఎప్పుడూ పెళ్లి గురించి బహిరంగంగా చెప్పలేదు. ఈమె తల్లిదండ్రులు కూడా పెళ్ళికి సంబంధించిన విషయాలను పెంచుకోవడం లేదు. మొత్తానికి 42 ఏళ్ల వయసులో కూడా త్రిష.. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

నటి త్రిష గురించి

1983 మే 4న తమిళనాడులోని మద్రాసు(ఇప్పుడు చెన్నై)లో కృష్ణన్ అయ్యర్ & ఉమా అయ్యర్ దంపతులకు జన్మించారు. చెన్నైలోనే తన ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టి.. ప్రింట్ అండ్ టెలివిజన్ వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. 1999లో మిస్ చెన్నై విజేతగా నిలిచింది. ఆ తరువాత 2001లో బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును సైతం దక్కించుకుంది. నిజానికి ఈమె మొదట్లో సినిమాల్లోకి రావాలనుకులేదు.. తాను సైకాలజిస్ట్ కావాలని అనుకున్నట్లు గతంలో ఓ సందర్భంలో త్రిష పేర్కొన్నారు. అయితే పాపులర్ నటిగా గొప్ప గుర్తింపు పొందింది. ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది. ఈమెకు తమిళ అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది.