Home Blog Page 83

రెండు వారాల్లో 25000 బుకింగ్స్: పండుగలో ఈ కారుకు ఫుల్ డిమాండ్!

0

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో గొప్ప ఆదరణ పొందుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త విక్టోరిస్ అద్భుతమైన అమ్మకాలను పొందగలిగింది. దీంతో వెయిటింగ్ పీరియడ్ అమాంతం పెరిగిపోయింది.

25000 కంటే ఎక్కువ బుకింగ్స్

సెప్టెంబర్ 15న మారుతి సుజుకి తన విక్టోరిస్ కారును లాంచ్ చేసింది. అయితే మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు కేవలం రెండు వారాల వ్యవధిలోనే 25000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొంది.. అమ్మకాల్లో ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కంపెనీ ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసింది. దీంతో ఈ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ ఎంపిక చేసిన వేరియంట్‌లకు సుమారు 10 వారాలు ఉన్నట్లు తెలిసింది. అయితే ఏ వేరియంట్ కోసం ఎన్ని వారాలు వెయిట్ చేయాలనే విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.

ఈ ఏడాది నవరాత్రి సీజన్ మారుతి సుజుకి కంపెనీకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ సమయంలో విక్టోరిస్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కంపెనీ 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు సుమారు 1.50 లక్షల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికి (9 నెలల కాలంలో) దాదాపు 1.65 లక్షల వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. అంతే కాకుండా సంస్థ దసరా నాటికి 2 లక్షల కార్లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. బహుశా ఈ లక్ష్యాన్ని చేరుకొని ఉంటుందనే భావిస్తున్నాము.

మారుతి సుజుకి విక్టోరిస్

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మారుతి సుజుకి విక్టోరిస్ కారు యాంత్రికంగా గ్రాండ్ విటారా మాదిరిగా ఉంది. అయితే కంపెనీ ఈ కారును నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా కాకుండా.. అరీనా అమ్మకాల నెట్‌వర్క్ ద్వారా విక్రయించనుంది. కాగా విక్టోరిస్ భారతీయ విఫణిలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

మారుతి విక్టోరిస్ కారు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ (ఓ), జెడ్ఎక్స్ఐ ప్లస్ (ఓ) అనే ఆరు వేరియంట్లలో.. మూడు ఇంజిన్ (పెట్రోల్, సీఎన్‌జీ, స్ట్రాంగ్ హైబ్రిడ్) ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఈ కారులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్.. 101.6 బీహెచ్‌పీ పవర్, 139 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కాన్వర్టర్ ఆటోమాటిక్ ఎంపికలను పొందుతాయి. సీఎన్‌జీ వేరియంట్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఆన్‌బోర్డ్ బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటారుతో జతచేస్తుంది. పెట్రోల్ మిల్ సుమారు 91.7 బీహెచ్‌పీ పవర్, 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోటారు 79 బీహెచ్‌పీ పవర్, 141 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. తద్వారా మంచి పనితీరును అందిస్తుంది.

మారుతి విక్టోరిస్ సేఫ్టీ రేటింగ్

మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిన మారుతి విక్టోరిస్ అత్యుత్తమ పనితీరును అందించడం మాత్రమే కాకుండా.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. దీంతో ఇది సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లతో లెవల్ 2 ఏడీఏఎస్ సిస్టం వంటి వాటితో.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ కూడా ఉన్నాయి.

కుమారుడి పేరు వెల్లడించిన వరుణ్ తేజ్: పవన్ పేరులాగే అబ్బాయికి..

0

కొణిదెల నాగబాబు వారసుడు.. వరుణ్ తేజ్ & లావణ్య త్రిపాఠి దంపతులకు సెప్టెంబర్ 10న కుమారుడు పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ బాబుకు విజయదశమి సందర్భంగా బారసాల చేసి, నామకరణం కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

లావణ్య & వరుణ్ తేజ్ కుమారుడి పేరు

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల కుమారుడి పేరును వాయువ్ తేజ్ కొణిదెలగా నామకరణం చేసారు. హనుమాన్ ఆశీర్వాదంతో పుట్టాడని, అందుకే ఆ ఆంజనేయుని పేరు వచ్చేలా.. తమ కుమారుడి పేరు పెట్టుకున్నట్లు సమాచారం. వాయువ్ అనే హనుమంతుని పేర్లలో ఒకటి. ఇక తేజ్ అనేది వరుణ్ తేజ్ పేరులో ఉన్నదే. ఇక చివరి ఇంటిపేరు చేర్చి.. వాయువ్ తేజ్ కొణిదెలగా పేరుపెట్టుకున్నారు. పేరు పెట్టిన సందర్భంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ తమ కొడుకు దగ్గర ఉన్న ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వాయువ్ తేజ్ కొణిదెలను నెటిజన్లు ఆశీర్వదిస్తున్నారు.

హనుమంతుని పేర్లు ఎందుకంటే?

నిజానికి కొనేదెలా కుటుంబంలో చాలామంది పేర్లు హనుమంతుని పేరుతో ముడిపడి ఉన్నాయి. చిరంజీవి (చిరకాలం జీవించి ఉండేవాడు – హనుమంతుడు), పవన్ కళ్యాణ్ (పవన్ అంటే వాయుదేవుడు – వాయుదేవుని కుమారుడు ఆంజనేయుడు), రామ్ చరణ్ (రాముని చరణాల దగ్గర ఉండేవాడు – అంజనీ సుతుడు), ఇప్పుడు వరుణ్ తేజ్ కుమారుడు వాయువ్ తేజ్ (వాయువ్ అనే కూడా ఆంజనేయ స్వామితో ముడిపడి ఉంది).

చిరంజీవి తండ్రి స్వయంగా ఆంజనేయ స్వామి భక్తుడని చాలా సందర్భాల్లో మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే తమ్ముడికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. తాను కూడా ఆంజనేయస్వామి భక్తుడు కావడం చేత.. రామ్ చరణ్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఇప్పుడు దీనినే వారసత్వంగా తీసుకుని వరుణ్ తేజ్ కూడా తన బిడ్డకు వాయువ్ అని పేరు పెట్టినట్లు అర్థమవుతోంది.

వరుణ్ తేజ్ & లావణ్య త్రిపాఠిల గురించి

నిజానికి వీరిరువురు నటీ నటులు. వరుణ్ తేజ్ ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ మొదలైన సినిమాల్లో హీరోగా నటించాడు. లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తరువాత దూసుకెళ్తా, భలేభలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, సోగ్గాడే చిన్నినాయన, రాధ, ఉన్నది ఒకటే జిందగీ మొదలైన సినిమాల్లో నటించింది.

మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయమే.. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మధ్య ప్రేమగా మారింది. ఆ తరువాత వీరు ఇరువురి ఇళ్లలో ఒప్పించి.. పెద్దల సమక్షంలో 2013లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చిన తరువాత కూడా రిసెప్షన్ పెట్టుకున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఇప్పుడు ఈ జంటకు కొడుకు పుట్టాడు. ఈ జంట ప్రస్తుతం అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఆత్మగౌరవం, తెగింపే ఆయన సినిమాలు: ఇప్పుడు విక్రమ్ తనయునితో..

0

డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఆత్మగౌరవ చిత్రాలకు పెటింది పేరు. అతని సినిమాలు అన్ని కూడా మనుషుల యొక్క నిజ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. అంతేకాకుండా సమాజంలో నిత్యం జరిగే అన్యాయాలు, అవమానాలు, అణచివేతలే తన సినిమాలకు కేంద్ర బిందువుగా మారుతాయి. ఆయన తీసే చిత్రాల్లోని సన్నివేశాలు నిరాశావాదంలో కూరుకుపోయిన వారిలో జీవితం పట్ల ఆశావాదాన్ని రేకెత్తిస్తాయి. మారి సెల్వరాజ్‌కు చెందిన.. ఏ మూవీ చూసినగానీ ధీనత్వంలో ఉన్న బాధితులకు తెగింపుని, ధైర్యాన్ని నింపి, వారి వారి సమస్యలపై పోరాడే తత్వాన్ని నేర్పి వాళ్ల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. తన నిత్య జీవిత సంఘటనల ఆధారంగా రాసే చిన్న చిన్న డైలాగ్స్ మనకు ప్రేరణ కలిగిస్తాయి. ప్రతి పాత్రలో మనల్ని మనం చూసుకున్నట్టే ఉంటుంది. మనకు ఎంతో ప్రేరణ కలిగించి, మనలో స్ఫూర్తిని నింపే సృజనాత్మక దర్శక, రచయిత గురించి మరి కొన్ని వివరాలు తెలుసుకుందాం..

మారి సెల్వరాజ్ సినిమా జీవిత ప్రస్థానం..

సెల్వరాజ్ మొదట నటుడు అవ్వాలి అని తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ తరువాత తాను డైరెక్టర్ రామ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సహాయ దర్శకుడిగా కాట్రాదు తమిళ్, తంగ మీనకల్, తారామణి వంటి సినిమాలకు పని చేశాడు. 2018లో వచ్చిన పరియేరుమ్ పెరుమాళ్ సినిమాతో పూర్తిస్థాయి దర్శకుడిగా మారాడు.

తర్వాతి కాలంలో చిత్రీకరించిన ధనుష్ కర్ణన్ . ఉదయనిధి స్టాలిన్ నటించిన మామన్నన్. వాలై ఇందులో అందరిని కొత్త నటీనటులతో తీశారు. పై అన్నీ చిత్రాలు కూడా విజయవంతమై ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం చియాన్ విక్రమ్ కుమారుడు దృవ్ విక్రమ్‌తో చేస్తున్న సినిమా బైసన్ ఈ దీపావళి కి విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్‌గానే.. కాకుండా పాటల రచయితగా, స్క్రీన్ రైటర్‌గా, సీరియల్ రైటింగ్, పుస్తక రచయితగా కూడా గుర్తింపు పొందాడు.

మారి సినిమాల్లో ఏముంది?

పరియేరుమ్ పెరుమాళ్: ఇందులో సమాజంలోని కులవ్యవస్థ అందులోని వివక్ష పట్ల ఒక చదువుకున్న యువకుడు చేసే ఎదిరించి చేసే పోరాటం కనబడుతుంది. ఆ సినిమాతో ఎన్నో అవార్డులు, ప్రశంసలతో పాటు కీర్తిప్రతిష్టలు పొందాడు.

కర్ణన్: సినిమాలో ఒక సాధారణ పల్లెటూరి పిల్లగాడు తన చుట్టూ జరిగే సమస్యలు అన్యాయాల మీద ప్రతిఘటించే విధానం మనల్ని ఆకట్టుకుంటుంది. కథానాయకుడు బాహ్య ప్రపంచానికి, అంతర్గత ప్రపంచానికి మధ్య పడే సంఘర్షణ మనల్ని గుండెల్ని పిండేలా చేస్తుంది. చట్టం, వ్యవస్థ నిన్ను కాపాడలేనప్పుడు నువ్వే నీ వాళ్ళని రక్షించుకోవాలనే వీరత్వాన్ని నేర్పిస్తుంది.

మామన్నన్ (తెలుగులో నాయకుడు): ఈ చిత్రంలో రాజకీయంలోని అధికార అహంకారం, సొసైటీలో ఉన్న వ్యత్యాసం & బానిస మనస్తత్వం పట్ల తిరగబడి పోరాడే వ్యక్తి జీవితం అందరిని ఆలోచింపజేస్తుంది. మనం నిత్యం చుట్టుపక్కల జరిగే అంశాలే వాటిని బలంగా మన చెంపపై కొట్టినట్టు ఉంటుంది. మీ బానిసత్వాన్ని పోగొట్టుకుని మహారాజుల్లా జీవించమని ఈ మూవీ బోధిస్తుంది.

వాలై: దినసరి అరటి కూలీల జీవితాలు, బాధలు మధ్యలో ఒక తెలివైన స్కూల్ విద్యార్థి భవిష్యత్తు వీటన్నిటి మధ్య అనుకోని ఒక సంఘటన ఎలా బతుకులను మార్చివేసింది అనేది అద్భుతంగా చూపించారు. తన జీవిత వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకేక్కించిన అంశాలు ప్రేక్షకులకు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి.

బైసన్: ఈ నెల 17 న దీపావళి రోజున విడుదలకు సిద్దమైంది. కబడ్డీ ఆటగాడి చుట్టూ కథాంశం అల్లుకోబడి ఉన్నట్టుగా అర్థమవుతోంది.

వ్యక్తిగత జీవితం గురించి క్లుప్తంగా..

ఈయన పూర్తి పేరు మారి సెల్వమ్ సెల్వరాజ్. తమిళనాడు లోని తిరునల్వేళిలో 1984 మార్చి 7న జన్మించారు. దివ్య అనే ఆమెతో 2016లో వివాహం అయింది, వీరికి నవ్వి (కుమార్తె ), యువ్వాన్ (కుమారుడు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారి అతి సాధారణ దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినవాడు. ప్రస్తుతం తన వృత్తి దర్శకుడు, రచయిత, స్క్రీన్ రైటర్, పాటల రచయితగా కొనసాగుతున్నాడు

పెళ్లి చేసుకున్న అవికా గోర్: ఈమె భర్త ఇంత ట్యాలెంటెడ్‎డా!

0

చిన్నారి పెళ్లికూతురు అనగానే అవికా గోర్ గుర్తొస్తుంది. అంతలా పాపులర్ అయిన ఈ అమ్మడు తాజాగా పెళ్లి చేసుకుంది. 2020 నుంచి ప్రేమించిన తన ప్రియుడు మిలింద్ చాంద్వానీతో ఏడడుగులు నడించింది. దీంతో అవికా గోర్ అభిమానులు మిలింద్ చాంద్వానీ ఎవరనే విషయం తెలుసుకోవడానికి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.

ఎవరీ మిలింద్ చాంద్వానీ?

మిలింద్ చాంద్వానీ.. ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్ధి. ఈయన బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కాగా ప్రస్తుతం కుకు ఎఫ్ఎమ్లో ప్రొడక్షన్ విభాగంలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతను గతంలో బైజూస్, ఓలా ఎలక్ట్రిక్ సంస్థల్లో కూడా పనిచేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన రియాలిటీ షో రోడీస్ రియల్ హీరోస్‌లో కూడా పాల్గొన్నాడు.

చదువు పూర్తయిన తరువాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తన కెరియర్ ప్రారంభించిన మిలింద్.. క్యాంప్ డైరీస్ అనే ఎన్‌జీవో ఫౌండర్ కూడా. దీంతో ఇతడు సామజిక అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తూ.. వెనుకబడిన భారతీయ పిల్లలకు సాధికారతను కల్పిస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయిన మిలింద్ సోషల్ మీడియా ఫేమ్ కూడా. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా లక్ష కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే.. అవికా గోర్ భర్త ఇంత ట్యాలెంటెడ్‎డా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

అవికా గోర్ లవ్‌స్టోరీ

2019లో ఒక కార్యక్రమంలో కలుసుకున్న మిలింద్.. అవికా గోర్ 2020లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తరువాత ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా 2025 సెప్టెంబర్ 30 పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా వీరిరువురూ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకంక్షాలు చెబుతున్నారు.

అవికా గోర్ గురించి

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా పాపులర్ అయిన.. అవికా గోర్ ఉయ్యాలా జంపాల సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆ తరువాత లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, నెట్, బ్రో, ఉమాపతి వంటి సినిమాల్లో నటించింది. ఈమె తెలుగులో మాత్రమే కాకుండా.. కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. కాగా ఈమె మూడు ఇండియన్ అకాడమీ అవార్డులను, ఒక సైమా అవార్డును అందుకుంది.

1997 జూన్ 30న ముంబైలోని ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించిన అవికా గోర్.. ముంబైలోని ములుండ్ శివారులోని షారన్ ఇంగ్లీష్ హైస్కూల్‌లో చదివింది. కాగా 2007లో హిందీ సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగానికి పరిచయమై.. ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ.. తనదైన రీతిలో అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల చిన్నారి పెళ్లి కూతురు నిజంగానే పెళ్లి కూతురై.. మిలింద్ చాంద్వానీని పెళ్లి చేసుకుని.. సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలు షేర్ చేసింది. దీంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ.. ఆశీర్వదిస్తున్నారు.

భారీగా పెరిగిన బంగారం.. తారాస్థాయికి చేరిన వెండి: కొత్త ధరలు ఇలా..

0

విజయదశమి ముందుంది.. దీపావళి రాబోతోంది. ఇలాంటి సమయంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సెప్టెంబర్ 2025లో చుక్కలు తాకిన గోల్డ్ రేటు.. ఈ నెలలో కూడా శాంతించే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే.. రూ. 1.11 లక్షలు దాటేసిన పసిడి ధరలు.. ఇంకెంత పెరుగుతాయో అని పసిడి ప్రియులు ఒకింత భయపడుతున్నారు. ఈ రోజు (2025 అక్టోబర్ 1) కూడా 10 గ్రాముల గోల్డ్ ధరలు గరిష్టంగా రూ. 1200 పెరిగింది.

బంగారం ధరలు

హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాల్లో ఈ రోజు (బుధవారం) గోల్డ్ రేటు పెటిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1200 పెరిగి రూ. 1,18,640 వద్ద నిలిచింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1100 పెరిగి రూ. 108750 వద్దకు చేరింది.

చెన్నైలో అయితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 320 మాత్రమే పెరుగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 300 పెరిగింది. దీంతో ఇక్కడ ధరలు వరుసగా రూ. 1,18,800 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,08,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్దకు చేరాయి.

ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా), రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా) పెరిగాయి. దీంతో ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,18,790 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,08,900 వద్దకు చేరింది. ప్రస్తుత ధరలను బట్టి చూస్తే.. గోల్డ్ రేటు జీవితకాల గరిష్టాలను చేరుకున్నట్లు స్పష్టమవుతోంది.

వెండి ధరలు

ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. ఈ రోజు (బుధవారం) సిల్వర్ రేటు రూ. 1000 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 1,60,000 వద్దకు చేరింది. అంటే నేడు ఒక్క గ్రామ్ వెండి రేటు రూ. 160 అన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, చెన్నైలలో కూడా కొనసాగుతాయి. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రూ. 1,51,000 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. వెండి ధరలు త్వరలోనే రూ. 2 లక్షలకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.

18 క్యారెట్స్ & 16 క్యారెట్లకు పెరుగుతున్న డిమాండ్

భారతదేశంలో 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. పసిడి ప్రియుల చూపు 18 క్యారెట్స్, 16 క్యారెట్స్ బంగారంవైపు పడింది. 18 క్యారెట్స్ & 16 క్యారెట్స్ గోల్డ్ రేటు.. 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ గోల్డ్ రేటు కంటే తక్కువ. ఈ కారణంగానే ఈ రకమైన గోల్డ్ కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

బంగారం & వెండి ధరలు పెరగడానికి కారణాలు

భారతదేశంలో బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్ పెరగడమే. అంటే గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పండుగలు, ఇతర కార్యక్రమాల సమయంలో గోల్డ్ కొనేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతే కాకుండా గోల్డ్, సిల్వర్ మీద పెట్టుబడి పెడుతున్నవారి సంఖ్య కూడా పెరిగింది. ఇవన్నీ కూడా పసిడి ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఇప్పుడు వెండి రేటు కూడా తారా స్థాయికి చేరుతోంది. వెండి కూడా రాబోయే రోజుల్లో బంగారం ధరలను చేరుకునే లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నారా లోకేష్‌కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్: ఎదురు చూస్తున్నా.. అన్న ఐటీ మినిష్టర్!

0

భారత్ – పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో.. చివరి వరకు పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి తిలక్ వర్మ. పాకిస్తాన్ బౌలింగ్ దాటికి ఇండియా టీమ్ టాప్ ఆటగాళ్లంతా.. క్రికెట్ అభిమానుల కళ్ళలో నిరాశలు నింపి, ఒక్కొక్కరుగా మైదానం నుంచి నిష్క్రమిస్తున్న వేళ పాకిస్తాన్ బౌలర్లు నన్నేమీ చెయ్యలేరు అన్నట్టు ఫోర్లు, సిక్సులతో వీర బాదుడు బాదాడు. సంజు శ్యాంసన్, శివమ్ దుబేతో కలిసి మంచి పార్టనర్షిప్ స్కోర్ చేస్తూ 53 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 69 స్కోర్ చేశాడు. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ ఇలా వరుసగా అందరూ విఫలమైన అతి క్లిష్టమైన సమయంలో మ్యాచ్‌ను ఆపద్దబాంధవుడిలా ఆదుకున్నాడు. మొత్తంగా భారత్‌కు విజయాన్ని అందించాడు.

తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్

ఈ గెలుపు సంబరాల అనంతరం తిలక్ వర్మ భారత్ – పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌లో.. తాను వాడినటువంటి హెడ్ క్యాప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు.. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ & ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్‌కు బహుమతిగా ఇచ్చారు.

ఆ క్యాప్‌పైన తిలక్ వర్మ ఈ క్రింది విధంగా రాసుకొచ్చాడు. “ప్రియమైన లోకేష్ అన్నా.. చాలా ప్రేమతో.. ఈ క్యాప్ మీ కోసమే” అని తన మసులోని భావాలను, తనలోని విజయానందాన్ని మంత్రి లోకేష్ మీద ఉన్న అభిమానాన్ని ఆ క్యాప్‌పై రాశాడు. తను రాస్తున్న ఆ దృశ్యాన్ని మొబైల్ ఫోన్‌లో వీడియో రూపంలో చిత్రీకరించారు, ఆ సమయంలో తను రాసేటప్పుడు చెప్పలేనంత హ్యాపీగా కనిపించాడు. వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి నారా లోకేష్ పట్ల తన ప్రేమను ఈ రకంగా అందరితో పంచుకున్నాడు. ఆ గిఫ్ట్‌ను తిలక్ వరకు స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు అందిఇవ్వనున్నారు.

ఐటీ మినిష్టర్ నారా లోకేష్ స్పందన ఇలా..

తిలక్ వర్మ పోస్ట్ చేసిన ఆ వీడియోకి మంత్రి నారా లోకేష్ కూడా.. అంతే సోదర భావంతో ప్రతిస్పందించారు. నా జీవితంలో నాకు ఇది చాలా ప్రత్యేకమైన, గొప్పదైన రోజుగా మారిపోయిందని, నువ్వు ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఆ బహుమతిని నీ చేతుల మీదుగా నేను తీసుకుంటాను అని ఆయన ట్వీట్ చేశారు. అంతే కాకుండా నువ్వు ఆ గిఫ్ట్‌ను నేరుగా నాకు ఇచ్చేటప్పుడు దాన్ని నేను తీసుకోవడానికి, ఎంతో ఉత్సహంతో ఎదురుచూస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ ట్వీట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మన తెలుగు వాడైన తిలక్ వర్మ భారత్‌ను గెలుపు బాట పట్టించినందుకు తెలుగు వాళ్లంతా కూడా గర్వంగా భావిస్తున్నారు. ఇంకా తన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించాలని, మరిన్ని విజయాలను తన క్రికెట్ కెరియర్‌లో సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా నారా లోకేష్, తిలక్ వర్మల ట్వీట్స్.. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, సోదరభావాన్ని, సత్సంబందాన్ని తెలియజేస్తున్నాయి.

లగ్జరీ కారు కొన్న ఫేమస్ సింగర్.. డీలర్‌షిప్‌లోనే పాట పాడేశారు

0

సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేసి.. వినియోగిస్తారనే విషయం అందరికి తెలుసు. ఇందులో భాగంగానే ప్రముఖ మలయాళీ సింగర్ ఎంజీ శ్రీకుమార్.. మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కారు వివరాలు

సింగర్ ఎంజీ శ్రీకుమార్.. కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ సెడాన్. ఈయన తెలుపురంగు కారును కొనుగోలు చేసిన తరువాత.. డీలర్షిప్ సిబ్బందిలోని ఒక మహిళతో కలిసి స్వయంగా ఒక పాటపాడి అలరించారు. కారును కొనుగోలు చేయడానికి ఆయన, తన భార్యతో కలిసి వచ్చారు. కారును డెలివరీ తీసుకున్న తరువాత శ్రీకుమార్.. ఆయన భార్య అనంత పద్మనాభస్వామి ఆలయంలో పూజలు చేసినట్లు సమాచారం. ఈ ఫోటోలను వారు ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఇందులో కారుకు పూజ చేసి పువ్వులు వేసి ఉండటం కూడా కనిపిస్తుంది.

మెర్సిడెస్ బెన్ ఈ-క్లాస్ గురించి

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెర్సిడెస్ బెంజ్.. 2024లో ఈ-క్లాస్ కారును లాంచ్ చేసింది. ఈ సెడాన్ అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. దీని ప్రారంభ ధర రూ. 78.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఈ200, ఈ220డీ, ఈ450 అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ కారు.. ఈక్యూ మాదిరిగా ఉండే స్టైలింగ్ పొందుతుంది. కాబట్టి ఇది కొత్త ఫ్రంట్ ఫాసియా, బ్రాండ్ లోగో, ప్లస్ టైప్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్ వీల్స్, ఎల్ఈడీ లైటింగ్, కొత్త బంపర్లు పొందుతుంది. ఇవన్నీ కారును అద్భుతమైన లుక్ అందిస్తాయి.

బెంజ్ ఈ-క్లాస్ కారు ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇందులో మూడు స్క్రీన్స్ ఉంటాయి. అవి 14.4 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్, 12.3 ఇంచెస్ ప్యాసింజర్ స్క్రీన్, 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్. ఇవి కాకుండా 4డీ సరౌండ్ సౌండ్ సిస్టం, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ200 వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ220డీ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ద్వారా శక్తిని ఇస్తుంది. ఈ450 మోడల్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ మూడు వేరియంట్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి.

ఎంజీ శ్రీకుమార్ గురించి

కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటలు పాడిన ఎంజీ శ్రీకుమార్.. పాడిన పాటలు చాలానే ఉన్నాయి. 1960 జూన్ 2న కేరళలోని కోజికోడ్ నగరంలో జన్మించిన ఈయన 1980లో పాటలు పాడటం మొదలు పెట్టారని సమాచారం. అప్పటి నుంచి పలు భాషల్లో వందలాది పాటలు పాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయన ఒక ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగానే అప్పుడప్పుడు తనకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తుంటారు.

తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డ్స్: పూర్తి వివరాలు

0

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఊరూ, వాడల్లో బతుకమ్మలు నిలిపి సంబరాలు చేసుకుంటారు. ఈ సారి బతుకమ్మ సంబరాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దీనికోసం సరూర్ నగర్ మున్సిపల్ స్టేడియంలో జీహెచ్ఎంసీ, రాష్ట్ర పర్యాటక శాఖ కలిసి తగిన ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా సుమారు 63 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్

తెలంగాణాలో ఏర్పాటైన 63 అడుగుల బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు అధికారికంగా వెల్లడించారు. అంతే కాకుండా ఈ భారీ బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు ఒకేసారి ఆడిపాడారు. దీనికిగానూ మరో గిన్నిస్ రికార్డ్ లభించింది. మొత్తం మీద తెలంగాణ ప్రభత్వం శ్రీకారం చుట్టిన ఈ భారీ బతుకమ్మ కార్యక్రమాన్ని రెండు గిన్నిస్ బుక్ ఆర్ రికార్డులు వచ్చాయి. ఇది బతుకమ్మకు, తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం అనే చెప్పాలి.

ప్రత్యేక ఏర్పాట్లు & సౌకర్యాలు

ప్రభుత్వం నిర్వహించిన ఈ భారీ బతుకమ్మ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు సౌకర్యాలను కల్పించారు. ఉచిత తాగునీరు, భోజన సదుపాయాలతో పాటు.. మహిళల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో సంబరాలు జరుపుకోవడానికి కావలసిన లైటింగ్ సదుపాయం, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.

ఒకప్పుడు బతుకమ్మ సంబరాలు.. పల్లెల్లో మాత్రమే నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం ఈ ఆచార, సంప్రదాయాలను నగరవాసులు కూడా గౌరవిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఈ కారణంగానే నగరంలోని దాదాపు అన్ని సందుల్లోనూ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత.. ఈ పండుగకు మరింత ఆదరణ పెరిగింది. కాబట్టి ప్రభుత్వాలు మారినా.. ఈ పండుగను ఆడంబరంగా నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో ఆడపడుచులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో ఒకటి బతుకమ్మ. ఒకప్పటి నుంచి.. ఇప్పటి వరకు బతుకమ్మ ఆడే పద్దతిలో కావచ్చు, పాడే పాటల్లో కావచ్చు ఎంతో వ్యాత్యాసం కనిపిస్తున్నప్పటికీ.. ఆనవాయితీని మాత్రం అలాగే కొనసాగిస్తున్నానందుకు ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ బతుకమ్మ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఇతర శాఖల క్యాబినెట్ మంత్రులు, కమిషనర్లు, ఐఏఎస్ & ఐపిఎస్ అధికారులు మొదలైనవారు పాల్గొన్నారు.

గల్లీ నుంచి గ్లోబల్ వరకు..

బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న సందర్భంగా.. మంత్రి సీతక్క మాట్లాడుతూ, బతుకమ్మ ప్రముఖ్యతను ఈ రోజు ప్రపంచానికి చాటి చెప్పాము. గల్లీ నుంచి గ్లోబల్ వరకు మహిళలు ఏ రంగంలో అయినా రాణిస్తారు అని చెప్పడానికి ఇది నిదర్శనం అని అన్నారు. బతుకమ్మ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకోవడానికి కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు చెబుతూనే.. ఆడబిడ్డల జీవితాలు వెలుగులతో నిండాలని ఆకాంక్షించారు. మొత్తం మీద తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రపంచ రికార్డ్ సాధించడం గొప్ప విషయం, దీనికి సహకరించిన ప్రభుత్వం ప్రసంశనీయం.

పుట్టలో చేయిపెడితే కుట్టడానికి నేనేమైనా చీమనా?: దుమ్ములేపుతున్న రాజా సాబ్ ట్రైలర్

0

డార్లింగ్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ ట్రైలర్‌ను ‘ది బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ ఎవర్ ఇన్ ఇండియన్ సినిమా’ అనే పేరుతో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా రిలీజ్ చేసింది. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కొత్త సినిమా ట్రైలర్ అభినుల్లో కొత్త ఉత్సాహాన్ని.. సినీ పరిశ్రమలో భారీ అంచనాలను పెంచేసింది.

రాజా సాబ్ రిలీజ్ డేట్

ప్రభాస్ రాజా సాబ్.. ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే.. మిలియన్ వ్యూస్ పొందిన ఈ సినిమా 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరో కాగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్ పాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో కనిపించరు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.

ఆదిపురుష్ సినిమా తరువాత.. ప్రభాస్ కన్నప్ప సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇప్పుడు రాజా సాబ్ సినిమాలో నటించారు. ఇప్పుడు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానుల అంచనాలను సైతం దాటేసింది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క.. ఈ సినిమా ఓ లెక్క అనే రేంజిలో ఈ సినిమా ఉందని అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

ది రాజా సాబ్ సినిమాలో.. మళ్ళీ పాత ప్రభాస్ కనిపించారు. మిర్చి సినిమా తరువాత.. అలాంటి బాడీ లాంగ్వేజ్ గానీ డైలాగ్ డెలివరీ గానీ మళ్ళీ కనిపించలేదని చాలామంది కొంత నిరాశపడ్డారు. ఆ తరువాత వచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ దాదాపు మారిపోయారని అనిపించింది. కానీ ఇన్నేళ్లకు మళ్ళీ ప్రభాస్ రొమాంటిక్ లుక్‌లో కనిపించారు.

యాక్షన్, రొమాంటిక్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్ ఎప్పుడూ హారర్ సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు మొదటిసారి ప్రభాస్ హారర్ సినిమాలో కూడా కనిపించేసారు. డైరెక్టర్ మారుతి మార్క్ ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌లో కనిపించింది. తనకి ఎప్పుడూ అలవాటైన కామెడీ, రొమాన్స్ తెరకెక్కించడంలో మారుతికి ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. కాబట్టి రాజా సాబ్ సినిమాలో ఏది వదిలిపెట్టకుండా.. అటు కామెడీ, ఇటు రొమాన్స్ మాత్రమే కాకుండా హారర్ కూడా అందిస్తూ.. ఊర మాస్ ఫైట్ కూడా అభిమానుల కోసం అందించినట్లు ఇట్టే అర్థమైపోతుంది.

ప్రత్యేక పాత్రలో సంజయ్ దత్

రాజా సాబ్ సినిమాలో ఒక్కో పైట్ అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. రొమాన్స్, కామెడీలో ప్రభాస్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హారర్ సీన్స్ కూడా ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉన్నాయి. ప్రత్యేక పాత్రలో నటించిన సంజయ్ దత్ కూడా తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఒదిగిపోయారు.

డైరెక్టర్ మారుతి స్టైల్ ప్రభాస్.. ఈ రాజా సాబ్ సినిమాలో కనిపించారు. స్టోరీ పరంగా ఏదో బలంగా చెప్పదలచుకున్నట్లు ట్రైలట్ చెప్పకనే చెప్పేస్తోంది. ప్రభాస్ నటన గురించి చెప్పడానికి మాటల్లేవ్ అనే చెప్పాలి. ”ఇందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమైన చీమనా?, రాక్షసుణ్ణి” అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతోంది. ఇక ఈ సినిమా చూడాలంటే 2026 జనవరి 9 వరకు వేచి చూడాల్సిందే!.

అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్: బీఆర్ఎస్ నెక్స్ట్ ప్లాన్ అదేనా..

0

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని అచ్చంపేటలో.. అచ్చంపేట జనగర్జన సభ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

పార్టీ వీడిన గువ్వల బాలరాజు

బీఆర్ఎస్ పార్టీకి చెందిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఈ జనగర్జన సభను నిర్వహించారు. నిజానికి గువ్వల బాలరాజు తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన నాయకుడు. దీంతో ఆయన శ్రమను, అంకితభావాన్ని గుర్తించిన కేసీఆర్ 2014లో పార్టీ టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా రెండు సార్లు అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీ కృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఓటమిపాలైన తరువాత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ అంత చురుకుగా పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు. తరువాత గత నెల ఆగస్టు 02న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాకుండా ఆగస్టు 10న బీజేపీలోకి చేరిపోయారు. దీంతో అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు కరువయ్యారు.

బీఆర్ఎస్ గూటిని వదిలి..

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా అచ్చంపేట నియోజకవర్గ ప్రజల్లో తిరిగిన వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా అక్కడ రాజకీయ సత్సంబంధాలు కలిగిన రాజకీయ దురంధరుడు. అదే విధంగా ఆ ప్రాంతం మెలుకువలు ఎత్తుగడలు తెలిసిన నాయకుడు. నేటికీ అచ్చంపేట ప్రజలలో అత్యంత ఆదరణ పొందుతున్న ప్రజాప్రతినిధి. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ గూటిని వదిలిపెట్టడం పార్టీ శ్రేణుల్లో కొంత నిరాశ కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి.. మిగిలిన నాయకులను, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన, నిలుపుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

త్వరలో స్థానిక ఎన్నికలు

ఇకపోతే.. త్వరలోనే తెలంగాణ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం బీఆర్ఎస్ ముందు ఉన్న ఒక సవాలు. ఏ మాత్రం ఆలస్యం చేసిన కూడా ఉన్న క్యాడర్ చల్లాచెదురయ్యే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ.. తమ కార్యకర్తల్లో ఉత్సహం నింపడానికి, ఆత్మవిశ్వాశాన్ని పెంచడానికి ‘అచ్చంపేట జన గర్జన’ పేరుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చెయాల్సి వచ్చింది.

జన గర్జన సభలో కేటీఆర్

అచ్చంపేట జనగర్జన సభలో.. కేటీఆర్ తనదైన మాటలతో పార్టీ అభిమానులను ఊర్రుతలుగించారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురాగలిగారు. ప్రతిపక్ష పార్టీల తీరుపైన.. ఆ నాయకుల చేష్టలపైన రాజకీయ పరమైనా విమర్శలు గుప్పించారు. వచ్చే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను, కార్యకర్తలను కేటీఆర్ కోరారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాదిస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ప్రజల కష్టాలను పార్టీ తప్పకుండా తీరుస్తుందని కేటీఆర్ బహిరంగ సభలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.