ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ సూచన: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ – వాయువ్య దిశగా కొనసాగుతున్న ఈ అల్పపీడనం.. ఆదివారం నాటికి వాయుగుండంగా మారి.. సోమవారం నాటికి తీరందాటే సమయంలో తీవ్ర తుఫానుగా మారుతుందని వెల్లడించింది.

ఈ జిల్లాల్లో భారీ వర్షం!

ఈ రోజు (శనివారం) కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కృష్ణ, బాపట్ల జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా ఉంటాయని వెల్లడించింది. అయితే మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) ప్రకారం.. రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, భారీ వర్షాలు కురుస్తాయి. అంతే కాకుండా తీరప్రాంతాల్లో గంటకు 50 కిమీ నుంచి 70 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. వర్షం తీవ్రత బలంగా ఉండటం వల్ల.. మత్స్యకారులు సముద్రం మీదకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను.. సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం కూడా అత్యవసర ప్రోటోకాల్ అమలు చేసింది. అంతే కాకుండా.. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ మౌలిక సదుపాయాల దగ్గర ఉండకూడదు. ఇవి అనుకోని ప్రమాదాలను తెచ్చిపెడతాయని సూచించింది.

తుఫాను పేరు ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని ప్రారంభంలోనే తెలుసుకున్నాం. ఈ తుఫానుకు మోంథా అని నామకరణం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పేరు థాయ్‌లాండ్‌ను సూచిస్తుంది.

ఈ తుఫాను ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా ఐదురోజుల పాటు ప్రభావాన్ని చూపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శని, ఆదివారాలు బాపట్ల, కడప, కాకినాడ మొదలైన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. సోమ, మంగళవారాలు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది. నిన్న (శుక్రవారం) ఏలూరు, అనకాపల్లి, కృష్ణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా పాకాల ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం (152.25 మిమీ) నమోదైంది.

అధిక వర్షాల వల్ల లాభ, నష్టాలు

గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. వర్షాలు అధికంగా కురవడం వల్ల.. ఎక్కువ లాభాలు ఉన్నప్పటికీ, నష్టాలు కూడా సంభవిస్తాయనేది నిజం. వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. పంటలు బాగా పెరుగుతాయి, వాతావరణం కూడా సుబ్రమవుతుంది. అదే సమయంలో పంట చేతికి వచ్చే సమయంలో.. వర్షాలు కురిస్తే, రైతు నష్టపోవాల్సి వస్తుంది. మౌలిక వసతులు కోల్పోవడం, రవాణా సమస్యలు, వ్యాధుల వ్యాప్తి పెరగడం, వరదలు సంభవించడం వంటివి జరుగుతాయి. ఏది ఏమైనా ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపడం సాధ్యం కాదు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.