2025 హ్యుందాయ్ వెన్యూ కోసం మొదలైన బుకింగ్స్: లాంచ్ ఎప్పుడంటే?

భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందిన కార్ల జాబితాలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెన్యూ ఒకటి. అయితే ఈ కారు ఇప్పుడు ఆధునిక హంగులతో 2025 వెన్యూ పేరుతో.. దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. అంతే కాకుండా హ్యుందాయ్.. ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ అప్డేటెడ్ మోడల్ లాంచ్, డెలివరీ మొదలైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

లాంచ్ & బుకింగ్ ప్రైస్

2025 హ్యుందాయ్ వెన్యూ.. 2025 నవంబర్ 04న ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. కాగా కంపెనీ ఈ కారు కోసం రూ. 25000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆసక్తికలిగిన కాస్తర్మర్లు కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు.. లాంచ్ తరువాత ప్రారంభమవుతాయి. ఈ కారు ఇప్పుడున్న మోడల్ కంటే కొంత ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది.

వేరియంట్స్ & కలర్ ఆప్షన్స్

2025 హ్యుందాయ్ వెన్యూ మొత్తం ఎనిమిది వేరియంట్లలో.. ఎనిమిది రంగుల్లో లభిస్తుంది. అవి హెచ్ఎక్స్ 2, హెచ్ఎక్స్ 4, హెచ్ఎక్స్ 5, హెచ్ఎక్స్ 6, హెచ్ఎక్స్ 6టీ, హెచ్ఎక్స్ 7, హెచ్ఎక్స్ 8, హెచ్ఎక్స్ 10. అయితే కంపెనీ ఏ వేరియంట్ ధర ఎంత అనే విషయాన్ని ఇప్పటికి అధికారికంగా వెల్లడించలేదు. ఈ వివరాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ వెన్యూ ఆరు మోనోటోన్ (సింగిల్ కలర్), రెండు డ్యూయెల్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. అయితే ఇందులో హాజెల్ బ్లూ, మిస్టిక్ సఫైర్ అనేవి కొత్త కలర్స్. మొత్తం మీద ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించడం వల్ల.. కొనుగోలుదారు తమకు నచ్చిన కలర్ కారును కొనుగోలు చేసుకోవచ్చు.

డిజైన్ & ఫీచర్స్

టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, కియా సోనెట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉందనున్న కొత్త హ్యుందాయ్ వెన్యూ అప్డేటెడ్ ఫ్రంట్ ఎండ్ పొందుతుంది. బోనెట్ మీద ఎల్ఈడీ స్ట్రిప్, హెడ్‌ల్యాంప్ యూనిట్ పక్కన డీఆర్ఎల్ ఉండటం చూడవచ్చు. గ్రిల్ కూడా కొత్తగా ఉంటుంది. ఫ్రంట్ బంపర్ కింద స్కిడ్ ప్లేట్స్, కొత్త ఫంక్షనల్ రూఫ్ రైల్ కూడా ఉన్నాయి. వెనుక భాగంలో బ్లాక్ ప్యానెల్‌లను కలిగి ఉన్న ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లతో అప్డేట్ అయి ఉండటం గమనించవచ్చు. కొత్త అల్లాయ్ వీల్స్ ఇందులో కనిపిస్తుంది.

లోపలి భాగం కూడా చాలా అప్డేట్ అయి ఉంది. డ్యూయెల్ టోన్ లెదర్ సీట్లు, కొత్త స్టీరింగ్ వీల్, 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవన్నీ ఉన్నాయి. అంతే కాకుండా.. రియర్ విండో సన్‌షేడ్, సరౌండ్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం లెదర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

2025 హ్యుందాయ్ వెన్యూ మొత్తం మూడు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉండనుంది. అవి 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇవన్నీ మాన్యువల్, ఆటోమాటిక్, డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటాయి. కాబట్టి పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.