కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన కథనాయకుడుగా నటిస్తున్న.. గుమ్మడి నర్సయ్య అనే సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ హిర్వాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఎడిటింగ్ పనులు సత్య గిడుటూరి చూస్తున్నారు.
ఎవరీ గుమ్మడి నర్సయ్య?
గుమ్మడి నర్సయ్య.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఇల్లందు నియోజకవర్గ వాసి. ఇల్లందు నియోజకవర్గం నుంచి ఏకంగా ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైన రాజకీయ నేత. కమ్యూనిస్ట్ (సీపీఐ ఎంల్)పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన నేటి వరకు అదే జెండా, అదే సిద్దాంతం, అదే ఆలోచన విధానం, అదే జీవన శైలితో జీవిస్తున్న నిబద్ధుడు. ఇప్పటికి తనకంటూ ఒక సొంత ఇల్లు, భూమి సంపాదించుకోకుండా, ఎక్కడికైనా వెళ్ళిరావాలంటే ఎంత దూరమైనా సరే కేవలం సైకిల్ తొక్కుకుంటూనే వెళ్ళివస్తారు.
తన ఇల్లును కూడా పార్టీ ఆఫీసుగా మార్చి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన జీతాన్ని, ఇప్పుడు తనకి వస్తున్న పెన్షన్‌ను సైతం పార్టీకి ఇచ్చేసే నిస్వార్థపరుడు గుమ్మడి నర్సయ్య. ఏ మాత్రం అవినీతి, అక్రమ మచ్చలేని మహామనిషి. ఎప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాడి, వాటిని పరిష్కరించి, జనమందరితో మమేకమై.. వారి మధ్యనే అతి సాధాసీదాగా జీవించే నిజమైన ప్రజల నాయకుడు, నిరాడంబరుడు. జీతాన్ని, జీవితాన్ని రెండింటిని కూడా పార్టీకి, ప్రజలకి అంకితం చేసిన త్యాగధనుడు, ప్రజానాయకుడు గుమ్మడి నర్సయ్య .ప్రస్తుతం ఈయన జీవితాన్నే ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
టీజర్ విషయానికి వస్తే..
వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు.. చాలా గమ్మత్తుగా, ఆలోచనత్మాకంగా ఉన్నాయి. ముందుగా శాసనసభను కనిపించి తరువాత డాక్టర్ బీ ఆర్. అంబేద్కర్ విగ్రహం మీదుగా వెళ్లి.. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పుస్తకాలను చూపిస్తారు. ఆ తరువాత గాంధీ విగ్రహం చూపించి శివరాజ్ కుమార్ అద్దాలు పెట్టుకోవడాన్ని మనం చూడచ్చు. ఇంకా ఒక పాత సైకిల్, అరిగిన తోలు చెప్పులు, కళ్ళజోడు, భుజానికి ఒక తెల్ల సంచి తగిలించుకుని ఉన్నవన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అందరూ ఎమ్మెల్యేలు, సీఎం (సంకేతంగా ఎన్టీ రామారావు చూపించినట్టున్నారు) ఇలా అంతా అంబాసిడర్ కార్లల్లో అసెంబ్లీకి బయలుదేరుతుంటే.. శివరాజ్ కుమార్ మాత్రం సైకిల్ మీద వెళ్లడాన్ని వీడియోలో చూపించారు.
ప్రజల నాయకుడి సినిమా.. కన్నడ హీరో
గుమ్మడి నర్సయ్య నీతి, నిజాయితీ, నిబద్దత, ఆయన ఆలోచన, సిద్ధాంతం, అయన పాటించిన విలువలకు నిదర్శనంగా వీడియో ఉండటం చూడవచ్చు. వీడియోకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. శివరాజ్ కుమార్ గుమ్మడి నర్సయ్య పాత్రకి సరిగ్గా సరిపోయాడు. తెలుగువాడు అయిన ప్రజల నాయకుణ్ణి కన్నడ హీరో గుర్తించి సినిమా చేయడం అనేది నిజంగా అభినందించవలసిన అంశం. షూటింగ్ ఇప్పుడే ప్రారంభించినట్టుగా వీడియోలో చూపించారు. ట్రైలర్, సినిమా విడుదల తేదీ విషయాలను ఇంకా వెల్లడించలేదు.