Home Blog Page 137

సైమా 2025 అవార్డు విజేతలు వీరే.. ఉత్తమ నటిగా రష్మిక మందన్న

0

దుబాయ్‌లో జరిగిన ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025‘ (సైమా 2025) వేడుకలో తెలుగు చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి. ఈ కార్యక్రమంలో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలలో నటనఎం సంగీతం, సాంకేతిక విభాగాలకు చెందిన ప్రతిభావంతులను అవార్డులతో సత్కరించారు. ఇందులో ‘పుష్ప 2: ది రూల్‘ సినిమా ఎక్కువ అవార్డులతో జయజేతనం ఎగురవేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఆయా విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు. నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ, గౌరీ (కన్నడ) సినిమాలు కూడా అనేక విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి.

సైమా 2025 విజేతలు (తెలుగు)

➤బెస్ట్ యాక్టర్: అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
➤ఉత్తమ నటి: రష్మిక మందన్న (పుష్ప 2: ది రూల్)
➤బెస్ట్ డైరెక్టర్: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
➤బెస్ట్ మ్యూజిక్ కంపోజర్: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)
➤బెస్ట్ ఫిల్మ్: కల్కి 2898 ఏడీ
➤బెస్ట్ విలన్: కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
➤బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
➤ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి 2898 ఏడీ)
➤బెస్ట్ కమిడియన్: సత్య (మత్తు వదలరా)
➤బెస్ట్ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
➤బెస్ట్ లిరిక్ రైటర్: రామ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే చుట్టేసింది – దేవర)
➤బెస్ట్ సింగర్ (మేల్): కందుకూరి శంకర్ బాబు (వస్తున్నాయ్ ఫీలింగ్స్ – పుష్ప 2: ది రూల్)
➤బెస్ట్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావు (చుట్టమల్లే చుట్టేసింది – దేవర)
➤బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): తేజ సజ్జ (హను మాన్)
➤ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
➤బెస్ట్ డైరెక్టర్ (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హను మాన్)
➤ఉత్తమ నూతన నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్ళు)
➤ఉత్తమ నూతన నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
➤ఉత్తమ నూతన దర్శకుడు: నంద కిషోర్ యెమాని (35 ఒక చిన్న కథ)
➤ఉత్తమ నూతన నిర్మాత: నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్ళు)

తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాలో పుష్ప 2, కల్కి 2898 ఏడీ ఉన్నాయి. పుష్ప 2 సినిమా రూ. 1500 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల కలెక్షన్స్ రాబట్టగలిగింది. చిన్న సినిమా అయినప్పటికీ.. హను మాన్ మూవీ ఏకంగా రూ. 200 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసింది. అంతే కాకుండా నిహారిక నిర్మాతగా వ్యవహరించిన కమిటీ కుర్రోళ్ళ సినిమాకు రూ. 10 కోట్లు ఖర్చు పెడితే.. రూ. 25 కోట్లు వసూలు చేసింది.

సైమా అవార్డ్స్ గురించి

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లేదా దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా పురస్కారాలను 2012లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్ ఇందూరి ప్రారంభించారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమ కళాత్మక, సాంకేతిక విజయాలకు గుర్తుగా ఈ అవార్డ్స్ అందిస్తారు. ఈ అవార్డులు రెండు రోజుల పాటు వేర్వేరు భాగాలలో ప్రదర్శించబడతాయి. మొదటిరోజు జనరేషన్ నెక్స్ట్ అవార్డులలో అత్యంత ఆశాజనకంగా రాబోయే దక్షిణ భారత చిత్ర కళాకారులను సత్కరిస్తారు. రెండో రోజు ప్రధాన సినిమాలకు అవార్డులకు కేటాయిస్తారు.

‘బసాల్ట్ ఎక్స్’ లాంచ్ చేసిన సిట్రోయెన్: రూ.11 వేలతో బుకింగ్..

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ప్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్, దేశీయ విఫణిలో ‘బసాల్ట్ ఎక్స్‘ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన.. ఈ సరికొత్త వేరియంట్ ధరలు ఎలా ఉన్నాయి?, అప్డేటెడ్ ఫీచర్స్ ఏమిటి?, బుకింగ్స్.. డెలివరీ వంటి వివరాలను ఇక్కడ చూసేద్దాం..

ధర & బుకింగ్స్

సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ ధరలు రూ. 7.95 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. కంపెనీ ఈ కారు కోసం రూ. 11000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

డిజైన్ & ఫీచర్స్

బసాల్ట్ ఎక్స్ కారు.. కూపే సిల్హౌట్ పొందుతుంది. ఇది చాలా స్టైలిష్ డిజైన్ పొందుతుంది. టెయిల్‌గేట్‌పై కొత్త ఎక్స్ బ్యాడ్జ్.. గ్రిల్ మీద ఎల్ఈడీ డేటైమ్ స్ట్రిప్స్, డ్యూయెల్ జోన్ 16 ఇంచెస్ అల్లాయ్స్ వంటివన్నీ ఇక్కడ చూడవచ్చు. అయితే కొనుగోలుదారు రూ. 21000 చెల్లించి డ్యూయెల్ టోన్ రూఫ్ ఫినిషింగ్ ఎంచుకోవచ్చు. మొత్తం మీద డిజైన్ చూడచక్కగా ఉంటుంది.

ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. బసాల్ట్ ఎక్స్ లోపల టాన్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ చూడవచ్చు. బ్రాంజ్ కలర్ ట్రిమ్ ఇన్సర్ట్‌లు కూడా ఇక్కడ కనిపిస్తాయి. మరింత ప్రీమియం అనుభూతి కోసం సరికొత్త డాష్‌బోర్డ్ లభిస్తుంది. టాప్ వేరియంట్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, కప్‌హోల్డర్‌లతో కూడిన రియర్ ఆర్మ్‌రెస్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివన్నీ ఉన్నాయి.

ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే.. బసాల్ట్ ఎక్స్ మోడల్ వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్‌తో కూడిన 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్, 360 డిగ్రీ కెమెరా (రూ. 25000లు వెచ్చించాలి), రియల్ టైమ్ ప్లైట్ స్టేటస్, ట్రాఫిక్ ఆప్టిమైజేషన్, స్మార్ట్ రిమైండర్‌లు వంటివి కూడా ఉన్నాయి.

అత్యుత్తమ సేఫ్టీ రేటింగ్ కలిగిన బసాల్ట్ ఎక్స్ వేరియంట్.. ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఐసోఫిక్స్ మౌంట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి భద్రతను కల్పించడంలో ఉపయోగపడుతాయి.

ఇంజిన్ వివరాలు

బసాల్ట్ ఎక్స్ అనేది సిట్రోయెన్ కొత్త వేరియంట్ అయినప్పటికీ.. ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పులు లేదు. కాబట్టి ఇందులోని అదే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 82 బీహెచ్‌పీ పవర్, 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. మరో ఇంజిన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ విషయానికి వస్తే.. ఇది 110 హార్స్ పవర్, 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ పొందుతుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.

పదహారేళ్ల ‘జోష్’.. మనసులో మాట చెప్పిన నాగ చైతన్య

0

అక్కినేని నాగేశ్వర్ రావు మనువడు, కింగ్ నాగార్జున కుమారుడు.. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన యువ సామ్రాట్ అక్కినేని ”నాగ చైతన్య” ఇటీవల తన మనసులోని మాటలు చెప్పారు. తన మొదటి సినిమా జోష్.. 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

నా మొదటి సినిమా జోష్.. మొన్న మొన్న తెరమీదకు వచ్చినట్లు ఉంది. కానీ 16 ఏళ్లు పూర్తయిపోయాయి. ఇన్నేళ్ళలో అనేక ఆటుపోట్లను చూశాను. మొదట్లో నచ్చినట్లు ఉందామనుకుని సినిమాలు చేశాను. ఈ ప్రయాణంలో జయాపజయాలను చూశాను. ప్రస్తుతం నా జీవితం సినిమాకు మాత్రమే అని అర్థమైపోయింది. నా ప్రయాణంలో ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. చాలా సంతృప్తిగా ఉంది. ఈ సినిమా జీవితంలో నాన్న అందించిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను.

పేరుతెచ్చింది ప్రేమ కథలే

జోష్ సినిమా అంతంత మాత్రంగా అనిపించినా.. ఏమాయ చేసావే సినిమా, నిజంగా మాయ చేసింది. నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన మజిలీ, మనం, ప్రేమమ్ వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలే మంచి సక్సెస్ సాధిస్తాయి. ఇటీవల వచ్చిన తండేల్ సినిమా కూడా గొప్ప విజయం సాధించింది. నిజానికి అక్కినేని ఫ్యామిలీ అంటేనే ప్రేమమయం. తాతగారికి, నాన్నగారిని, నాకు కూడా మంచి పేరు తెచ్చిన సినిమాలన్నీ ప్రేమ కథలే. నిజ జీవితంలో కూడా నాకు ప్రేమ కథలంటేనే ఇష్టం. మా డైరెక్టర్లను కూడా ప్రేమ కథల గురించే అడుగుతూ ఉంటాను అని నాగ చైతన్య చెప్పారు.

మజిలీ, లవ్‌స్టోరీ వంటి సినిమాల్లో నటించిన తరువాత నా విధానం మొత్తం మారిపోయింది. కోవిడ్ తరువాత చాలామంది యాక్షన్ వంటివాటిపైకి వెళ్లిపోయారు. అయితే ప్రేమ కథలకు మంచి ఆదరణ ఉందని నేను నమ్ముతాను. ఒకప్పుడు మాదిరిగా కాకుండా కొత్తగా ఆలోచిస్తున్నాను. ఏడాది రెండు సినిమాలు అవసరం లేదు. ఓ ఆరు నెలలు ఆలస్యమైనా.. ఓ మంచి సినిమాలో నటించాలని ఎదురు చూస్తాను. ఒక సినిమా సక్సెస్ అయితే.. మమ్మల్ని ప్రేక్షకులు ఎక్కడో కూర్చోబెడుతున్నారు. అలాంటప్పుడు మాకు కూడా అలోచించి సినిమాలు ఎంచుకోవాల్సి బాధ్యత ఉందని నాగ చైతన్య చెప్పారు.

అక్కడే మన గురించి తెలుసుకోవచ్చు

సోషల్ మీడియా అంటేనే.. చాలామంది భయపడతారు. నిజం చెప్పాలంటే.. అక్కడే మన గురించి మనం తెలుసుకోగలుగుతాము అని నాగ చైతన్య పేర్కొన్నారు. ఎందుకంటే ఒక హీరోగా మనల్ని ప్రేమించేవాళ్ళు, మన బాగు కోసం విమర్శించేవాళ్లు అక్కడే ఉంటారు. అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహాలను పరిగణలోకి తీసుకునే.. ఏదైనా నిర్ణయం తీసుకుంటాను అని ఆయన అన్నారు. నా భార్య (శోభిత) సినిమా చూసి ఓ ప్రేక్షకురాలిగా తన అభిప్రాయం చెబుతుందని, తన విశ్లేషణ బాగుంటుందని అన్నారు.

నాగ చైతన్య సినిమాలు

జోష్ సినిమాతో తెలుగు చలన చిత్ర రంగంలో అడుగుపెట్టిన నాగ చైతన్య.. ఆ తరువాత ఏమాయ చేసావే, 100% లవ్, దడ, బెజవాడ, తడాఖా, మనం, ఆటో నగర్ సూర్య, ఒక లైలా కోసం, దోచేయ్, రారండోయ్ వేడుక చూద్దాం, సవ్యసాచి, మజిలీ, వెంకీ మామ, తండేల్ వంటి సినిమాల్లో నటించి.. తమదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనకంటూ కొంతమంది అభిమానులను సొంతం చేసుకోగలిగారు. కాగా ప్రస్తుతం ఎన్‌సీ24 సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు కోసం రూ.150 కోట్ల హెలికాఫ్టర్?: దీని స్పెషాలిటీ ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కొత్త హెలికాప్టర్ వినియోగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త హెలికాప్టర్‌కు మారినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది పాత హెలికాప్టర్ కంటే కూడా ఎక్కువ సేఫ్టీగా ఉంటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి ఇదివరకు.. బెల్ హెలికాప్టర్ వాడేవారు. ఈ హెలికాప్టర్ ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉండకపోవడం వల్ల, సీఎం జిల్లాల పర్యటనకు వెళ్లాలంటే.. ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లేవారు. ఆ తరువాత గమ్యాన్ని చేరుకున్న తరువాత.. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త హెలికాప్టర్ వినియోగిస్తుండటంతో.. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఇంటి దగ్గర నుంచే చేరుకోవాల్సిన ప్రాంతానికి వెళ్తున్నారు. దీని వల్ల సమయం కూడా చాలా ఆదా అవుతోంది.

సీఎం వినియోగానికి ఉపయోగిస్తున్న హెలికాప్టర్ ‘ఎయిర్‌బస్ హెచ్ 160‘ మోడల్. ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ప్రతికూల పరిస్థితుల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ హెలికాప్టర్‌లో పైలెట్ కాకుండా.. మరో ఆరుమంది వెళ్ళవచ్చు. ఈ హెలికాప్టర్‌నే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ప్రత్యేక ఫీచర్స్.. సేఫ్టీ అని చెబుతున్నారు. అయితే.. ఏపీ సీఎం కొత్త హెలికాఫ్టర్ వినియోగిస్తున్నారు అనే మాట.. వాస్తవమా?, అవాస్తవమా?, అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఎయిర్‌బస్ హెచ్ 160 హెలికాప్టర్

నిజానికి ఎయిర్‌బస్ హెచ్ 160 హెలికాప్టర్ ధర రూ. 150 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తుంది. ప్రపంచంలోనే.. టెక్నాలజీ పరంగా ఎక్కువ అభివృద్ధి చెందిన మోడల్ ఇదే అని చెబుతారు. ఈ విభాగంలో మంచి సౌకర్యాన్ని అందించడమే కాకుండా.. ఎక్కువ సేఫ్టీ కూడా అందిస్తుంది. ఇది 800 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదని సమాచారం. ఈ హెలికాప్టర్ గంటకు 255 కిమీ వేగంతో వెళ్తుంది. ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ హెలికాప్టర్ ఖర్చు 15 శాతం తక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

ఎయిర్‌బస్ హెచ్ 160 హెలికాప్టర్‌ మంచి వీఐపీ సీటింగ్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా.. వెనుక భాగంలో ట్విన్ స్టెబిలైజర్ డిజైన్ పొందుతుంది. దీనిని బైప్లేన్ స్టెబిలైజర్ అని కూడా పిలుస్తారు. 68 పేటెంట్ టెక్నాలజీలను కలిగి ఉన్న ఈ హెలికాప్టర్.. ఎలక్ట్రిక్ ల్యాండింగ్ గేర్ కూడా పొందుతుంది. దీనిని సొంత వినియోగానికి మాత్రమే కాకుండా, అత్యవసర వైద్య సేవల సమయంలో, రెస్క్యూ వంటి సమయంలో కూడా ఉపయోగిస్తారు.

లేటెస్ట్ టెక్నాలజీ హెలికాప్టర్

హెచ్160 అనేది.. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన పౌర హెలికాప్టర్. ఇది అత్యున్నత స్థాయి కార్యచరణ అందించడంతో పాటు.. భద్రతను కూడా అందిస్తుంది. సాధారణంగా ఇలాంటి హెలికాప్టర్లను బిలియనీర్లు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ మోడల్ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన మొదటి ఫ్యామిలీ.. అంబానీ కుటుంబమే. కంపెనీ ఈ హెలికాప్టర్‌ల డెలివరీలను 2025లో ప్రారంభించారు.

భారతదేశంలో రాజకీయ నాయకులు.. తమ పాలనలో హెలికాప్టర్లను ఉపయోగించడం సర్వ సాధారణం. పనులను వేగవంతం చేయడానికి, గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవడానికి హెలికాప్టర్లు ఉపయోగిస్తారు. తమ కాన్వాయ్‌లో కూడా హైఎండ్ కార్లను ఉపయోగిస్తారు. వీటన్నిటిలో కూడా పటిష్టమైన భద్రత ఉంటుంది.

ఆన్‌టైమ్‌కే మార్కెట్లో అడుగెట్టిన టీవీఎస్ కొత్త స్కూటర్: పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ చెప్పినట్లుగా.. ఇండియన్ మార్కెట్లో తన ‘ఎన్‌టార్క్ 150‘ స్కూటర్‌ను ఆన్ టైమ్ లాంచ్ చేసింది. ఈ సరికొత్త స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎన్‌టార్క్ 125 కంటే కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. టీవీఎస్ లేటెస్ట్ స్కూటర్ ధర, ఇతర వివరాలను ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.

వేరియంట్స్ & ధరలు

కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 150 స్కూటర్.. రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఒకటి బేస్ వేరియంట్, మరొకటి టీఎఫ్‌టీ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 1.19 లక్షలు, రూ. 1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). 125 సీసీ విభాగంలో అద్భుతమైన అమ్మకాలు పొందిన ఈ స్కూటర్ 150 సీసీ విభాగంలో లాంచ్ కావడంతో మరింత గొప్ప అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఇంజిన్

టీవీఎస్ ఎన్‌టార్క్ 150 స్కూటర్.. 149.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 7000 ఆర్‌పీఎమ్ వద్ద 17.7 బీహెచ్‌పీ పవర్, 5500 ఆర్‌పీఎమ్ వద్ద 14.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో లైట్ వెయిట్ పిస్టన్స్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ వంటి వాటితో పాటు.. అప్డేటెడ్ కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంటుంది. ఈ స్కూటర్ 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 104 కిమీ/గం కావడం గమనార్హం.

డిజైన్ & ఫీచర్స్

చూడటానికి కొంత స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ముందు భాగం భిన్నంగా ఉండటం గమనించవచ్చు. క్యాడ్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ ఆప్రాన్‌పై పైకి ఉన్నాయి. దిగువ భాగంలో స్ప్లిట్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉండటం చూడవచ్చు. ఇందులో కొత్తగా ఏరో వింగ్‌లెట్‌లు ఉన్నాయి. హ్యాండిల్ బార్.. బ్రేక్ లివర్స్ పొందుతుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 150 టాప్ వేరియంట్ 5 ఇంచెస్ టీఎఫ్‌టీ కలర్ డిస్‌ప్లే పొందుతుంది. ఇందులో రెవ్ కౌంటర్, ల్యాప్ టైమర్ వంటివి ఉన్నాయి. ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌తో పాటు బాష్ నుంచి సింగిల్ ఛానల్ ఈబీఎస్ ఉంటాయి. ప్యాకేజీలో భాగంగా స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం కూడా ఉన్నాయి.

ఇతర వివరాలు

కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 150 సీటు పొడవు 765 మిమీ, సీటు ఎత్తు 770 మిమీ, వీల్‌బేస్ 1285 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 155 మిమీ, అండర్ సీట్ స్టోరేజ్ 22 లీటర్లు, ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.8 లీటర్లు. 12 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ స్కూటర్ 115 కేజీల బరువు (కర్బ్ వెయిట్) ఉంటుంది. ఇది దాని ప్రత్యర్థులకంటే తేలికైనదిగా ఉంటుంది. కాగా ఈ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో ఏప్రిలియా ఎస్ఆర్ 160, యమహా ఏరోక్స్ 155 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

టీవీఎస్ లాంచ్ చేసిన ఎన్‌టార్క్ 125 ఇప్పటికే మార్కెట్లో గొప్ప అమ్మకాలు పొందుతూ.. 125 సీసీ విభాగంలో తిరుగులేని స్కూటర్ రికార్డ్ కైవసం చేసుకుంది. ఇప్పటికి వరకు ఈ స్కూటర్ 20 లక్షల కంటే ఎక్కువ యూనిట్లకు అమ్ముడయ్యాయి. దీన్నిబట్టి చూస్తే ఈ స్కూటరుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది.

మూడు నెలల ముందే స్థానిక ఎన్నికలు: ఎలక్షన్ నోటిఫికేషన్ & రిజల్ట్స్ వివరాలు

అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, టీడీపీ ప్రభుత్వం పాలన కూడా సాగుతోంది. కాగా ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్దమైపోతోంది. 2026 జనవరిలో ఈ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఓటర్ల జాబితాకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

ఎన్నికల కమిషనర్ లేఖ

గ్రామ పంచాయితీలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు 2026 జనవరిలోనూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2026 జులైలో జరగనున్నట్లు సమాచారం. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమదైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం పదవిలో ఉన్న పాలకుల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని.. పంచాయతీ రాజ్ & పురపాలక శాఖ కమీషనర్లకు లేఖ పంపింది. ఇందులో ఎన్నికలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సూచించారు.

నిజానికి ఏప్రిల్ 2026లో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. కాగా అంత కంటే ముందు 2026 మార్చిలో నగరపాలక, పురపాలక కార్పొరేటర్స్, కౌన్సిలర్ల పదవీకాలం ముగుస్తుంది. వీరి పదవి ముగియడానికి ముందే.. ఎన్నికల సంఘం ఎలక్షన్స్ నిర్వహించనుంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం.. అధికారుల పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందే స్థానిక ఎన్నికలను నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ చట్టం ప్రకారమే.. తొందరగా ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధిత అధికారులు సుముఖత చూపిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఎలక్షన్ షెడ్యూల్ ఇలా..

➤రాష్ట్రంలో వార్డులను విభజించడం, రిజర్వేషన్ల ప్రక్రియ వంటివి 2025 అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయాలి.
➤2025 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోపల వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి.
➤2025 నవంబర్ 1 నుంచి 30 లోపల ఎన్నికల అధికారుల నియామకం పూర్తి కావలి.
➤2025 నవంబర్ 16 నుంచి 30 లోపల పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయడం, ఈవీఎంలను సిద్ధం చేయడం వంటివి చేయాలి.
➤2025 డిసెంబర్ 15లోపల రిజర్వేషన్లను ఖరారు చేయాలి.
➤2025 డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి.
➤2026 జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్.. ఇదే నెలలో ఫలితాలు వెల్లడించేలా ఎన్నికల కమిషన్ ప్లాన్ చేసింది.

పదవీ కాలం పూర్తయిన తరువాత జరగాల్సిన ఎన్నికలు.. మూడు నెలల ముందే జరుపుతుండటం కొంతమందిలో అసంతృప్తిని రేకెత్తించే అవకాశం ఉంది. అయితే అమలులో ఉన్న చట్టాల ప్రకారం.. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి తప్పకుండా కట్టుబడి ఉండాల్సిందే. మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ జనవరిలో సర్పంచుల ఎలక్షన్స్.. జులైలో ఎంపీటీసీ & జెడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. దీన్నిబట్టి చూస్తే.. అభ్యర్థులు కూడా ఎన్నికలకు సిద్ధం కావలి.. గ్రామాల్లో ఎన్నికల నగారా మోగించాలి. జనవరిలోనే కొత్త సర్పంచులు ఎవరు?, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎవరనేది తెలిసిపోతుంది. కాబట్టి పోటీదారులు కూడా తమ మద్దతును పెంచుకోడానికి.. అవసరమైన సమావేశాలను న్యాయపరంగా, చట్టం పరిధికి లోబడి నిర్వహించుకోవాలి. ఎలాంటి అన్యాయాలకు చోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అభ్యర్థులకు కూడా ఉంది.

జీఎస్‌టీలో కీలక మార్పులు: ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే!

సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి.. భారత ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్రం.. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో కీలక మార్పులు చేసింది. దీంతో కేవలం రెండు స్లాబులు (5 శాతం, 18 శాతం) మాత్రమే మిగిలాయి. వస్తువుల రేట్లు చాలా వరకు తగ్గుతాయి. ఈ కొత్త రేట్లు లేదా కొత్త జీఎస్‌టీ నిర్మాణం సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారు.

ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే

ఆహార పదార్థాలు (వెన్న, నెయ్యి, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు & భుజియా, మిక్చర్, వంట సామాగ్రి), నిత్యావసర వస్తువులు (తల నూనె, షాంపు, సబ్బులు, షేవింగ్ క్రీమ్ , టూత్ బ్రెష్, టూత్ పేస్ట్ మొదలైనవి)లు అన్నీ 12 శాతం స్లాబ్ నుంచి 5 శాతం స్లాబ్‌లోకి చేర్చారు. ధర్మా మీటర్, కళ్లజోళ్లు, మెడికల్ గ్రిడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ గ్రిడ్, గ్లూకోమీటర్ వంటివి కూడా ఇప్పుడు 5 శాతం స్లాబ్‌లోకి చేరాయి. వ్యక్తిగత భీమా, జీవిత భీమా, ఆరోగ్య భీమా వంటివాటిపై ఎలాంటి జీఎస్‌టీ లేదు. వ్యవసాయ ఉత్పత్తులు, గ్రీన్ ఎనర్జీ, చిన్న కార్లు, బైకులపై కూడా జీఎస్‌టీ తగ్గింది.

టీవీలు, ఏసీలు, 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన టూ వీలర్స్ అన్నీ కూడా 28 శాతం స్లాబ్ నుంచి 18 శాతం స్లాబ్ కిందికి వస్తాయి. 1200 సీసీ కెపాసిటీ కలిగిన చిన్న కార్లు, 1500 సీసీ సామర్థ్యం కలిగిన డీజిన్ కార్లు కూడా 18 శాతం స్లాబ్ కిందకే వస్తాయి. దీన్నిబట్టి చూస్తే.. కొంత తక్కువ సామర్థ్యం ఉన్న వాహనాల ధరలు తగ్గుతాయని స్పష్టం అవుతోంది.

లగ్జరీ వాహనాలు, పొగాకు లేదా పొగాకు సంబంధిత ఉత్పత్తులు, కార్బోనేటేడ్ పానీయాలు, 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బైకులపైన 40 శాతం పన్ను వర్తిస్తుందని సమాచారం. రాష్ట్రాల ఆదాయాలు పెంచుకోవడానికి.. కేంద్రం నుంచి తీసుకున్న అప్పులను చెల్లించడానికి ప్రభుత్వం ఈ ఉత్పత్తులపై జీఎస్‌టీ కొంత పెంచినట్లు తెలుస్తోంది.

రూ. 48,000 కోట్ల నష్టం

కేంద్రం జీఎస్‌టీ స్లాబులను తగ్గించడంవల్ల.. ప్రభుత్వం రూ. 48,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని, రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ.. ప్రజలకు ఉపశమనం కలిగించాలని, అమెరికా టారిఫ్స్ ప్రభావం నుంచి కొంత కోలుకోవాలని కేంద్రం ఈ కీలక చర్యలు తీసుకుంది.

జీఎస్‌టీ సవరణపై మోదీ వ్యాఖ్యలు

నేను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో జీఎస్‌టీ సంస్కరణలను తీసుకురావాలనే ఉద్దేశాన్ని వెల్లడించాను. ఈ నేపథ్యంలో.. కేంద్రం సమర్పించిన.. ప్రతిపాదనలకు రాష్ట్రాలు కూడా అంగీకరించాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం, ఇది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఎనిమిదేళ్ల క్రితం జీఎస్‌టీ

నిజానికి ఈ జీఎస్‌టీ అనేది.. 2017 జులై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులో ప్రారంభించారు. ”ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్” అనే సూత్రంపై జీఎస్‌టీ ప్రవేశపెట్టారు. ప్రారంభంలో జీఎస్‌టీ ఐదు స్లాబులలో ఉండేది. ఆ తరువాత దీనిని నాలుగుకు చేర్చారు. ప్రస్తుతం రెండుకు వచ్చింది.

బిగ్‏బాస్ సీజన్ 9.. ఆటలో పోటీపడే కంటెస్టెంట్స్ వీరే?

బిగ్‏బాస్ రియాలిటీ షో.. ప్రారంభంలో దీనిని మంచి క్రేజ్ ఉండేది. రాను రాను.. బిగ్‏బాస్ షో అంటే విమర్శించేవాళ్లే ఎక్కువైపోయారు. ఆదరణ కూడా బాగా తగ్గిపోయింది. దీంతో బిగ్‏బాస్ సీజన్ 8 అంతంత మాత్రమే అన్నట్లు సాగింది. ఈసారి మాత్రం (బిగ్‏బాస్ సీజన్ 9) సరికొత్తగా ప్లాన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ రియాలిటీ షో ప్రారంభమైనప్పటికీ.. అసలైన ఆట మాత్రం అక్టోబర్ 7 నుంచి మొదలవుతుంది. కాగా ఈ సీజన్‌లో బిగ్‏బాస్ హౌస్‌లోకి వెళ్ళేది ఎవరు?, హౌస్‌లో చేసిన మార్పులు ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

రెండు హౌస్‌లు

గతంలో బిగ్‏బాస్ సీజన్ 9 షోలో పాల్గొనే కంటెస్టెంట్లను నేరుగా హౌస్‌లోకి పంపించేవారు. కానీ ఈ సార్ మాత్రం అందుకు భిన్నంగా.. కంటెస్టెంట్లకు అగ్ని పరీక్ష అంటూ కొన్ని పోటీలను నిర్వహించారు. ఇందులో గెలిచినవారే బిగ్‏బాస్ హౌస్‌లో అడుగుపెడతారు. ఇంకో విషయం ఏమిటంటే.. ఇంతకు ముందు మాదిరిగా బిగ్‏బాస్ హౌస్ ఒక్కటి కాదు. రెండు హౌస్‌లు ఉంటాయి. ఈ సీజన్‌లో 15 కంటే ఎక్కువమంది కంటెస్టెంట్స్ పాల్గొనే అవకాశం ఉంది. కాగా ఇందులో సగంమంది ఒక హౌస్‌లో ఉంటే.. మరోసగం మంది ఇంకో హౌస్‌లో ఉంటారు. ఎవరు ఏ హౌస్‌లో ఉంటారనేది.. వాళ్ళ ఆట తీరును బట్టి ఉంటుందని సమాచారం.

కేటగిరీలు

బిగ్‏బాస్ రియాలిటీ షోలో పాల్గొనే కంటెస్టెంట్లను నిర్వాహకులు వివిధ కేటగిరీల నుంచి సెలక్ట్ చేసుకుంటారు. ఇందులో సినీ తారలు, సోషల్ మీడియా పర్సన్స్, సీరియల్ యాక్టర్, కామన్ మెన్ కేటగిరి, సింగర్స్, కమెడియన్స్ ఇలా చాలానే కేటగిరీలు ఉన్నాయి. కామన్ మెన్ కేటగిరిలో సెలక్ట్ అవ్వాలంటే చాలా పరీక్షలే నెగ్గాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న అగ్ని పరీక్షలో గెలించిన వారిలో ఐదు లేదు ఆరుమందిని హౌస్‌లోకి పంపిస్తారు. కాగా బిగ్‏బాస్ హౌస్‌లో ఎవరు ఉండబోతున్నారు.. పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ బయటకు వచ్చింది.

కంటెస్టెంట్స్ జాబితా

సంజన గల్రానీ: ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లి
శ్రష్టి వర్మ: కొరియోగ్రాఫర్
ఆశా షైనీ: సీనియర్ హీరోయిన్
ఇమ్మాన్యుయేల్: జబర్దస్త్ కమెడియన్
రమ్య మోక్ష: అలేఖ్య చిట్టి పికెల్స్
హర్షిత్ రెడ్డి: యువ హీరో
సుమన్ శెట్టి: కమెడియన్
తనూజ పుట్టుస్వామి: కన్నడ సీరియల్ నటి
భరణి: సీరియల్ యాక్టర్
నాగ దుర్గ: ఫోక్ డ్యాన్సర్
రాము రాధోడ్: రాను బొంబాయికి రాను సింగర్, డ్యాన్సర్
శ్రీజ, నాగ ప్రకాష్, పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్: కామన్ పర్సన్స్ కేటగిరి

ఇప్పటికి బయటపడిన జాబితా ప్రకారం.. పైన పేర్కొన్న కంటెస్టెంట్స్ బిగ్‏బాస్ సీజన్ 9లో పాల్గొంటున్నారు. అయితే ఫైనల్ లిస్ట్ అక్టోబర్ 7న తెలుస్తుంది. పైన చెప్పిన జాబితాకు ఎవరైనా యాడ్ అవుతారా?, జాబితాలో ఉన్నవాళ్లు ఎవరైనా మిస్ అవుతారా అనేది ఆదివారం తెలిసిపోతుంది. ఈ సారి బిగ్‏బాస్ సీజన్.. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ కంటే కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఎలా ఉంటుందనేది.. ఆట మొదలైతేగానీ తెలియదు.

కోరుకున్నవాటిపై కొండంత డిస్కౌంట్స్!.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మెగా ఫెస్టివల్ సేల్

వినాయక చవితి ముగిసింది. దసరా (విజయదశమి) వచ్చేస్తోంది. ఆ వెంటనే దీపావళి కూడా రానుంది. ఈ పండుగ సీజన్ సమయంలో.. ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా?, నచ్చినవాటిని కొంత తక్కువ ధరలు ఎప్పుడు కొనేద్దామా అని చాలామంది వేచి చూస్తుంటారు. అలాంటి వారికోసం.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు శుభవార్త చెప్పాయి.

ఫ్లిప్‌కార్ట్

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్‌కార్ట్.. పండుగ సీజన్ సమయంలో ‘బిగ్ బిలియన్ డేస్ 2025‘ ప్రకటించింది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన తేదీలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఫ్లిప్‌కార్ట్ హోమ్‌పేజీలో మాత్రం త్వరలో వస్తుందని కనిపించింది. పండుగ సమయంలో ఎంపిక చేసిన చాలా వస్తువుల మీద కంపెనీ భారీ డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తుంది. చాలామంది ప్రజలు కూడా ఈ ఆఫర్స్ కోసం ప్రతి ఏటా వేచి చూడటం ఆనవాయితీగా వస్తోంది.

అమెజాన్

ఈ కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ కూడా.. ఫ్లిప్‌కార్ట్ మాదిరిగానే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025‘ పేరుతో డిస్కౌంట్స్ అందించడానికి సిద్ధమైంది. ఇది కూడా తేదీలను అధికారికంగా వెల్లడించలేదు. ఆఫర్స్ ప్రకటించడానికి 24 గంటల ముందు ప్రైమ్ సభ్యులకు యాక్సెస్ లభిస్తుంది. వీరు సాధారణ కస్టమర్ల కంటే ముందుగానే.. షాపింగ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఫ్లిప్‌కార్ట్ కూడా అందిస్తుంది.

వీటిపై భారీ తగ్గింపులు

ఈ కామర్స్ కంపెనీలు ఫెస్టివల్ సేల్ సమయంలో అందించే ఆఫర్స్ ద్వారా.. ఎలక్ట్రానిక్స్.. ముక్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి వాటిమీద గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గూగుల్ పిక్సెల్ 10, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 వంటివాటితో పాటు.. ఐఫోన్ 16 ధరలు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఏడాది అతిపెద్ద షాపింగ్ ఈవెంట్ రానుంది. అద్భుతమైన ఆఫర్స్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మిస్ చేసుకోకండి.. ఉత్సాహంతో మీ షాపింగ్ అనుభూతిని పెంచుకోండి అని ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక వెబ్‌సైట్ పేజీలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. సంస్థ మంచి ఆఫర్స్ అందించనున్నట్లు చెప్పకనే చెబుతోందని అర్థమవుతోంది.

ఇదే వరుసలో అమెజాన్ కూడా చేరింది. ఈ సంవత్సరం కస్టమర్లు.. తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపరణాల మీద గొప్ప డీల్స్ పొందవచ్చు. వేగవంతమైన డెలివరీలను పొందటమే కాకుండా.. విలువ ఆధారిత చెల్లింపులు కూడా చేసుకోవచ్చు అని ఒక బ్లాగ్ కంపెనీ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది.

ఈ కామర్స్ కంపెనీల సీజనల్ జాబ్స్

పండుగ సమయంలో.. తమ కస్టమర్లకు చేరువలో ఉండటానికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండూ కూడా లక్షలాది సీజన్ ఉద్యోగుల కోసం మెగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నగరాల్లో వేగవంతమైన డెలివరీలు చేయడానికి ఈ రెండు కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి. దీపావళి తరువాత కూడా సంక్రాంతి వస్తోంది. ఆ సమయంలో కూడా ఉద్యోగుల అవసరం ఉంటుంది. కాబట్టి జాబ్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇదో మంచి సదావకాశం. ఇది కొన్ని రోజులు తాత్కాలిక ఉద్యోగాన్ని అందిస్తుంది.

రూ.2 లక్షలుంటే చాలు!.. ఇందులో ఓ బైక్ కొనేయొచ్చు

ఇండియన్ మార్కెట్లో రూ. లక్ష కంటే తక్కువ ధరలో లభించే బైకులు ఉన్నాయి. రూ. కోటి రూపాయల ధర వద్ద లభించే బైకులు ఉన్నాయి. అయితే కొంతమంది.. ఎక్కువ పర్ఫామెన్స్ ఇచ్చే రూ. రెండు లక్షల ధర వద్ద లభించే 5 బెస్ట్ బైకులు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్

ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే బైకుల జాబితాలో బజాజ్ చెప్పుకోదగ్గ బ్రాండ్. ఇందులో ‘పల్సర్ ఎన్ఎస్400జెడ్’ ఒకటి. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.92 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇది 373 సీసీ ఇంజిన్ ద్వారా.. 43 హార్స్ పవర్, 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మంచి పనితీరును అందించే.. సరసమైన బైకులలో ఎన్ఎస్400జెడ్ ఒకటి కావడం గమనార్హం. ఇది మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇది రోజువారీ ప్రయాణానికి.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది 33 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.

హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్

రూ. రెండు లక్షల ధర వద్ద లభించే బైకులలో హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ ఒకటి. దీని ధర రూ. 1.76 లక్షలు. ఈ బైక్ 250 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 30 హార్స్ పవర్.. 25 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 3.25 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే.. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది.

ట్రయంఫ్ స్పీడ్ టీ4

రూ. 1.99 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే.. ట్రయంఫ్ స్పీడ్ టీ4 బైక్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది 399 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 31 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అద్భుతమైన లైటింగ్ సెటప్, బ్రేకింగ్, సస్పెన్షన్ వంటివన్నీ ఈ బైకులో ఉన్నాయి. ఇది 30 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ బైక్.. రోజువారీ వినియోగానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

రూ. 1.22 లక్షల ధర వద్ద లభించే బజాజ్ ఆటోకు చెందిన పల్సర్ ఎన్ఎస్200 బైక్ ఎక్కువమంది యువకులకు ఇష్టమైన బైక్. ధర తక్కువ మాత్రమే కాకుండా.. ఇది మంచి డిజైన్, రైడర్లకు కావలసిన అన్ని ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఇది మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుంది. ఇందులో 199.5 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 24.5 హార్స్ పవర్, 18.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 10.98 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం (యాక్సిలరేషన్) అవుతుంది. 36 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్.. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు.

అపాచీ ఆర్టీఆర్ 200 4వీ

టీవీఎస్ కంపెనీ చెందిన అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 197.75 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 20.8 హార్స్ పవర్, 17.25 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెయిన్, అర్బన్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్ 37 మిమీ యూఎస్డీ ఫోర్క్, హైడ్రోఫార్మ్డ్ హ్యాండిల్ బార్ వంటివి పొందుతుంది. మొత్తం మీద ఇది సరసరమైన బైక్ మాత్రమే కాదు.. రైడింగ్ చేయడానికి అత్యుత్తమమైన బైక్ కూడా.