Home Blog Page 65

భారత్ – అమెరికా డీల్: ఈ వాహనాల ధరలు తగ్గనున్నాయ్!

0

ఇటీవలే భారత్ – అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీంతో అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యే చాలా వస్తు, వాహనాల ధరలు తగ్గుతాయి. దీంతో భారతీయులు కొంత తక్కువ ధరకే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపైన ఎలాంటి రాయితీ ఉండదు.

30 శాతానికి ట్యాక్స్!

అమెరికా నుంచి ఇండియాకు దిగుమతి అయ్యే ఫ్యూయెల్ కార్ల ధరలపై సుంకాలు 110 శాతం నుంచి 30 శాతానికి వచ్చాయి. అంటే మన దేశానికీ దిగుమతి అయ్యే వాహనాలపై 80 శాతం ట్యాక్స్ తగ్గిందన్నమాట. ఇక్కడ గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ తగ్గింపులు 3000 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన వాహనాలను మాత్రమే వర్తిస్తాయి. ఇవి కూడా దశలవారీ 10 సంవత్సరాలలో అమలులోకి వస్తాయి.

ఎలక్ట్రిక్ వాహనాలకు నో ట్యాక్స్!

యూఎస్ఏ ఎలక్ట్రిక్ వాహనాలపైన ఇండియా ఉద్దేశ్యపూర్వకంగానే ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో టెస్లా వంటి కార్లు ఖరీదైనవిగానే ఉంటాయి. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని.. దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జరగాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తగ్గనున్న బైక్ ధరలు!

అమెరికా తయారు చేసిన బైకులపై కూడా.. భారత్ సుంకాలను తొలగించనుంది. కాబట్టి హార్లే డేవిడ్సన్ తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పటి వరకు ఇండియాకు వస్తున్నా ఈ బ్రాండ్ బైకులు థాయిలాండ్ నుంచి దిగుమతి అవుతున్నాయి. కాబట్టి ఇదే కొనసాగితే.. ఈ బైకుల ధరల్లో బహుశా పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు. అయితే భవిష్యత్తులో ఈ బైకులు నేరుగా అమెరికా నుంచే దిగుమతి చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లను చేస్తున్నారు.

మూడో స్థానంలో భారత్!

ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, చైనా తరువాత భారత్ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై ఇండియా 70 నుంచి 110 శాతం ట్యాక్స్ విధిస్తోంది. దీని వల్ల మన దేశంలో ఆటోమొబైల్ మార్కెట్.. భారీగా అభివృద్ధి చెందింది. కొన్ని ఇతర దేశాల కంపెనీలు.. ఇక్కడే తమ వాహనాలను తయారు చేయడం కూడా మొదలుపెట్టాయి. ఇప్పుడు అమెరికా దిగుమతులపై భారత్ ట్యాక్స్ తగ్గించడం వల్ల అమెరికా వాహన అమ్మకాలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

షరతులు వర్తిస్తాయా?

అయితే.. వాహనాల ధరలు, దిగుమతి సుంకాలు ఒక్కసారిగా తగ్గే అవకాశం లేదు. దశలవారీగా తగ్గుతాయి. అయితే ఎలా అమలు చేస్తారు, దీనికి ఏమైనా షరతులు, పరిమితులను విధిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ రాయితీలు.. ఐసీఈ కార్లు, బైకులకు మాత్రమే పరిమితం.

యూరోపియన్ యూనియన్‌తో విరుద్ధం!

అమెరికా – భారత్ మధ్య జరిగిన ఒప్పందం.. యూరోపియన్ యూనియన్‌తో ఇండియా చేసుకున్న వాణిజ్య ఒప్పందానికి కొంత విరుద్ధంగా ఉంది. ఇక్కడ విస్తృత శ్రేణి వాహనాలలో ట్యాక్స్ రేట్లు 10 శాతం వరకు ఉన్నాయి. కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రాయితీలు ఉన్నాయి. మొత్తం మీద రాయితీల వల్ల.. ఏ యూఎస్ వాహనాల ధరలు ఎంత తగ్గాయనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది.

రూ.10.37 కోట్ల ఫెరారీ కారు ఇది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

0

ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ భారతదేశంలో సరికొత్త మోడల్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఫెరారీ 849 టెస్టారోస్సా పేరుతో విడుదల కానున్న ఈ కారు 2026 మార్చి నాటికి అమ్మకానికి రానున్నట్లు సమాచారం. అయితే ఈ కథనంలో దీని రేటు ఎంత?, డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వంటి చాలా వివరాలు వివరంగా తెలుసుకుందాం.

ధర ఎంతంటే?

ఫెరారీ లాంచ్ చేయనున్న 849 టెస్టారోస్సా కారు ధర రూ. 10.37 కోట్లు నుంచి ప్రారంభమవుతుంది. దీన్నిబట్టి చూస్తే ఇది కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన కార్లలో ఒకటని తెలుస్తోంది. ఇది ఎస్ఎఫ్90 స్ట్రాడేల్ స్థానంలో అమ్మకానికి వస్తుంది. కాగా ఇప్పటికే అమ్మకానికి ఉన్న లంబోర్ఘిని రెవెల్టోకు ప్రత్యక్ష ప్రత్యర్థిగాఉంటుంది .

డిజైన్ ఇలా..

సూపర్ కార్లు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి డిజైన్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా.. కంపెనీ దీనిని అద్భుతంగా రూపొందించింది. 1950ల నుంచి కంపెనీ చరిత్రలో భాగమైన ఐకానిక్ టెస్టరోస్సా బ్యాడ్జ్ కూడా లేటెస్ట్ కారులో కనిపిస్తుంది. ముందు భాగంలో ఎల్ షేప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్.. బ్లాక్ ట్రిమ్ స్ట్రిప్ ద్వారా అనుసంధానించబడి ఉండటం చూడవచ్చు. పెద్ద సైడ్ ఇన్‌టేక్‌లు దీనిని మరింత అద్భుతంగా చూపించడంలో సహాయపడతాయి. వెనుక భాగంలో ట్విన్ టెయిల్ డిజైన్, స్లిమ్ హారిజాంటల్ టెయిల్ ల్యాంప్స్, హై మౌంటెడ్ ఎగ్జాస్ట్ లేఅవుట్.. పెద్ద డిఫ్యూజర్ వంటివి ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి.

ఫీచర్స్ ఇలా..

కొత్త ఫెరారీ 849 టెస్టారోస్సా ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో సాధారణ సెంట్రల్ టచ్‌స్క్రీన్ లేదు. కారును నడిపే డ్రైవర్ దృష్టిని ఏ మాత్రం మరల్చకుండా ఉంచడానికి.. స్టీరింగ్ వీల్ వెనుక 16 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. ఇందులోనే కారుకు సంబంధించిన మొత్తం సమాచారం కనిపిస్తుంది.

స్టీరింగ్ వీల్ సెన్సిటివ్ కంట్రోల్స్ కాకుండా.. ఫిజికల్ బటన్స్ పొందుతుంది. అంతే కాకుండా కంపెనీ దీని క్లాసిక్ గేటెడ్ మాన్యువల్‌లను దృశ్యమానంగా సూచించే గేర్ సెలెక్టర్‌తో నోస్టాల్జియాకు మొగ్గు చూపుతుంది. ఇందులో హార్డ్‌కోర్ ఫోకస్ ఉన్నప్పటికీ.. ప్రీమియం సౌండ్ సిస్టం, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అనేక ఫీచర్స్ ఉంటాయి.

ఇంజిన్ వివిరాలు

సూపర్ కార్ల పనితీరు అద్భుతంగా ఉండటానికి కంపెనీలు అత్యాధునిక ఇంజిన్ సెట్ చేస్తాయి. ఇందులో భాగంగానే ఫెరారీ కూడా తన 849 టెస్టరోస్సా కారులో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సెటప్ కూడా అందిస్తుంది. ఇందులోని 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్.. మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో జతచేయబడి ఉంటుంది. ఇందులో రెండు మోటార్లు ఫ్రంట్ ఆక్సిల్‌పై ఉంటాయి. ఇంకొకటి ఇంజిన్ & గేర్‌బాక్స్ మధ్య ఉంటుంది. ఇంజిన్ 800 బీహెచ్పీ పవర్ అందిస్తుంది. కానీ ఎలక్ట్రిక్ మోటార్లతో కలిపి ఇది 1050 బీహెచ్పీకు చేరుతుంది. 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ జరుగుతుంది.

ఫెరారీ 849 టెస్టరోస్సా కారు కేవలం రెండు సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. 200 కిమీ/గం వేగాన్ని చేరుకోవడానికి దీనికి పట్టే సమయం ఆరు సెకన్లు మాత్రమే. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ 330 కిమీ/గం కంటే ఎక్కువే. ఇందులోని 7.45 కిలోవాట్ బ్యాటరీ 25 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది లిమిటెడ్ ఆల్ ఎలక్ట్రిక్ డ్రైవింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

లాంచ్ ఎప్పుడంటే..

ఫెరారీ కంపెనీ 849 టెస్టరోస్సా కారును 2026 మార్చిలో లాంచ్ చేయనుంది. లాంచ్ అయిన తరువాత డెలివరీలు కూడా వెంటనే ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది. ఈ కారు ఎక్స్ షోరూమ్ బేస్ వేరియంట్ ధర రూ. 10.97 కోట్లు. కాబట్టి ఆన్ రోడ్ ధర.. ఇంకా ఎక్కువ ఉంటుంది.

తక్కువ హైట్ సీటు కలిగిన టాప్ 5 బైకులు

0

బైక్ రైడ్ చేసే ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల ఆజానుబాహులు కావలసిన అవసరం లేదు. పొట్టి వాళ్లు కూడా ఉంటారు. అలాంటి పొట్టివాళ్లకు సరిపోయే బైకులు కూడా మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఈ కథనంలో సీటు హైట్ తక్కువగా ఉన్న టాప్ 5 బైకుల గురించి తెలుసుకుందాం.

జావా 42

సీటు ఎత్తు తక్కువగా ఉన్న బైకుల జాబితాలో చెప్పుకోదగ్గది, ప్రధానమైనది జావా 42. కేవలం 740 మిమీ ఎత్తు సీటు కలిగిన ఈ బైక్.. మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. రూ. 2 లక్షల ఖరీదైన ఈ బైక్.. మిడ్ సెట్ ఫుట్‌పెగ్‌లను పొందుతుంది. ట్రాఫిక్‌లో కూడా ఇది సజావుగా ముందుకు సాగుతుంది. డిజైన్ కూడా ఇతర బ్రాండ్ బైకుల కంటే కొంత భిన్నంగా ఉంటుంది. అత్యాధునిక ఫీచర్స్ లభిస్తాయి.

టీవీఎస్ రైడర్

రైడర్ 125 బైక్.. బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని సీటు ఎత్తు 780 మిమీ. టీవీఎస్ కంపెనీకి చెందిన ఈ బైక్ ధర రూ. లక్ష వరకు ఉంటుంది. తక్కువ ఎత్తైన సీటును మాత్రమే కాకుండా.. ఈ బైక్ నిర్మాణం కూడా చాలా తేలికగా ఉంటుంది. సీటు హైట్ కొంత తక్కువగా ఉండటం వల్ల.. బెస్ట్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. రోజువారీ వినియోగానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని హ్యాండిల్ చేయడం కూడా సులభమే.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350

మీటియోర్ 350 బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ లాంచ్ చేసిన పాపులర్ మోడల్. తక్కువ ఎత్తు కలిగిన సీటును కలిగిన టూ వీలర్. 765 మిమీ ఎత్తు కలిగిన సీటు ఇందులో లభిస్తుంది. పొట్టి సీటు కలిగినప్పటికీ.. పనితీరు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ముందు వైపు అమర్చిన ఫుట్‌పెగ్‌లు నిటారుగా ఉండే హ్యాండిల్‌బార్ అన్నీ కూడా మంచి రైడింగ్ పొజిషన్ అందిస్తాయి. రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350

తక్కువ సీటు ఎత్తు కలిగిన మరో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్.. ఈ క్లాసిక్ 350. దీని సీటు ఎత్తు 750 మిమీ. ఫ్లాట్ సీటు కలిగి ఉండటం వల్ల.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని ధర సుమారు రూ. 2 లక్షలు. ఆకట్టుకునే డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఇది చాలామంది కొనుగోలుదారులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది. మార్కెట్లో కూడా ఎక్కువ సేల్స్ పొందిన బైకుల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

కవాసకి వల్కాన్ ఎస్

వల్కాన్ ఎస్ బైక్ గురించి కూడా దాదాపు అందరికీ తెలుసు. కవాసకి కంపెనీకి చెందిన ఈ టూవీలర్.. సీటు ఎత్తు 705 మిమీ. ఇది చూడటానికి కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ.. మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుందని మాత్రం చెప్పవచ్చు. క్రూయిజర్ స్టైల్ డిజైన్.. భూమికి దగ్గరగా ఉన్న ఫుట్‌పెగ్‌లు అన్నీ కూడా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి. వీల్‌బేస్ కొంత పొడవుగా ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో కొంత హైట్ సీటు కలిగిన బైకుల జాబితాలో జావా 42, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, మీటియోర్ 350, కవాసకి వల్కాన్ ఎస్ మాత్రమే కాకుండా.. బజాజ్ అవెంజర్, టీవీఎస్ రోనిన్ బైకులు కూడా ఉన్నాయి.

ప్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధం.. ఎందుకో తెలుసా?

0

ఇటీవల కాలంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా కార్లలో.. ప్లష్ డోర్ హ్యాండిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి డోర్ హ్యాండిల్స్ మీద చైనా నిషేధం విధించింది. చైనా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి?, భారతదేశంలో కూడా ఇది అమలులోకి వస్తుందా? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో మీ కోసం..

ప్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధం!

ఒకప్పుడు లేదా ఇప్పుడు కూడా చాలా కార్లలో కార్ డోర్ హ్యాండిల్స్ బయటవైపు ఉంటాయి. వాటిని డ్రైవర్ లేదా వాహనదారుడే మాన్యువల్‌గా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే కాలక్రమంలో.. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో కొన్ని కంపెనీలు ప్లష్ టైప్ డోర్స్ పరిచయం చేశాయి. అయితే ఇలాంటి డోర్స్ వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతాయని భావించిన చైనా.. వాటిపై నిషేధం విధించింది.

ప్లష్ డోర్ హ్యాండిల్స్ చూడటానికి ఆకట్టుకునేలా ఉంటాయి. కానీ వీటిలో సమస్యలు తలెత్తుతాయని చైనా వీటిపై పూర్తిగా నిషేధం విధిస్తూ.. 2027 జనవరి 1 నుంచి అన్ని వాహనాలలోనూ సాధారణ డోర్ హ్యాండిల్స్ ఉండాలని వెల్లడించింది. నిజానికి ఈ నిషేధం గతేడాది సెప్టెంబర్ నెలలో మొదలైంది.

జనవరి 1, 2027 నాటికి..

2027 జనవరి 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ప్రతిపాదనలు కూడా చైనా వెల్లడించింది. 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న అన్ని వాహనాల డోర్స్ హ్యాండిల్స్ కలిగి ఉండాలి. ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ డోర్ మధ్యలో కలిసిపోయి ఉంటాయి. ఇవి బయటకు కూడా పెద్దగా కనిపించవు. ఒకవేళా కారు ప్రమాదానికి గురైనప్పుడు.. ఎలక్ట్రిక్ డోర్స్ ఉండటం వల్ల బయట నుంచి ఎవరు ఓపెన్ చేయలేరు.

చైనా మాత్రమే..

2025 అక్టోబర్‌లో చైనాలో ఒక ఎలక్ట్రిక్ కారు ప్రమాదానికి గురైంది. కొంతసేపటికి అది మంటల్లో చిక్కుకుంది. అటుగా వెళ్తున్న వ్యక్తులు ఈ ప్రమాదాన్ని గమనించినప్పటికీ.. కారులోని ప్లష్ డోర్ హ్యాండిల్స్ ఓపెన్ చేయలేకపోయారు. ఈ ప్రమాదంలో బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చాలానే వెలుగులోకి వచ్చాయి. కానీ ప్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధాన్ని చైనా మాత్రమే అమలు చేయడానికి సంకల్పించింది.

అన్ని కార్లకు సేమ్ రూల్

చైనా కొత్త ప్రతిపాదన ప్రకారం.. 2029 నాటికి అన్ని కంపెనీల వాహనాలు తప్పకుండా సాధారణ డోర్ హ్యాండిల్స్ కలిగి ఉండాలి. దీనికి తగిన విధంగా డిజైన్ చేసుకోవడం కంపెనీ బాధ్యత. ప్లష్ డోర్ హ్యాండిల్స్ కేవలం ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా.. పెట్రోల్, డీజిల్ కార్లకు ఉన్నాయి. కాబట్టి చైనా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏ కారులోనూ ఇలాంటి డోర్స్ కనిపించకూడదు.

భారతదేశంలో నిషేధం!

ప్రస్తుతం ఇండియాలో కూడా ప్లష్ డోర్స్ కలిగిన కార్లు ఉన్నాయి. అయితే.. భారత ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిషేధం విధించలేదు. బహుశా భవిష్యత్తులో దీనిపై నిషేధం విధిస్తుందా?, లేదా? అనేది తెలియాల్సి ఉంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని.. చైనా తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమే. ఇది ఇండియాలో కూడా అమలులోకి వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే వస్తుందా?, రాదా? అనేది ప్రశ్నార్ధకమే..

రజనీ కాంత్ మెచ్చిన పారిశుద్ధ్య కార్మికురాలు.. ప్రభుత్వం సైతం ఫిదా!

0

మంచితనం ఎక్కడున్నా.. ప్రశంసించాల్సిందే. పక్కవాడు బాగుపడితే చూడలేని ఈ లోకంలో నిజాయితీగా ఉండే మనుషులు దాదాపు అందరించిపోయారనే చెప్పాలి. అయితే అక్కడక్కడా.. అప్పుడప్పుడా మట్టిలో మాణిక్యం లాగా ఎదో ఒక మూలన కొందరు నిజాయితీపరులు వెలుగులోకి వస్తుంటారు. అలాంటి కోవకు చెందినవారిలో ఒకరే చెన్నైలోని పారిశుద్ధ్య కార్మికురాలి పద్మ.

45 తులాల బంగారం అప్పగింత

పద్మ చెత్తను తొలగించే పనే అయినా.. నిజాయితీతో నిలువెత్తు బంగారం అనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించి.. అందరిచేత శభాష్ అనిపించుకుంది. ఈమె చేసిన పనికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా.. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ సైతం ఫిదా అయిపోయారు.

పద్మను సన్మానించిన రజనీ కాంత్

తనది కానీ వస్తువు బంగారమే అయినా.. తాను సొంతం చేసుకోకుండా నిజాయితీ చాటుకున్న పద్మను రజనీ కాంత్ గొప్పగా సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. శాలువాతో సన్మానించి.. ఒక బంగారు గొలుసు సైతం అందించారు. తలైవా చేసిన ఈ పనికి ఆమె ఎంతగానో సంతోషపడింది. రజనీ కాంత్ అభిమానులు కూడా ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష బహుమతి

పద్మ చేసిన పనికి తపాలా శాఖ ఆమె ఫొటోతో కూడిన పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేయడమే కాకుండా.. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా 15 లక్షల రూపాయల ప్రమాద బీమా పాలసీ అందించింది. తమిళనాడు ప్రభుత్వం సైతం పద్మ నిజాయితీకి మెచ్చుకుని లక్ష రూపాయల నగదు బహుమతిగా ఇచ్చింది.

ఇంకా సమాజంలో మంచి వాళ్లున్నారు!

పరుల సొమ్ము పాము వంటిది అని మనం చిన్నప్పుడే పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ మాటలను ఎవరు పాటిస్తున్నారు చెప్పండి?. ఆ మాటలు పుస్తకానికే పరిమితం చేసి.. పరుల సొమ్ము పాయసం లాంటిదని, పక్కవాళ్లను ముంచేస్తున్న మహానుభావులు సమాజంలో ఎంతోమంది. అయితే సోషలిటీలో అందరూ ఇలాంటి వాళ్లే ఉన్నారని చెప్పలేము. ‘పద్మ’లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు పద్మ వెలుగులోకి వచ్చారు. వారు వెలుగులోకి రాలేదు. అంతే తేడా. అయితే మంచి ఏ కొంచమైనా కనిపిస్తే.. ప్రతి ఒక్కరూ అభినందించాలి.

ఎంత మంచి మనసు!

45 తులాల బంగారం (450 గ్రాములు) ధర ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో (చెన్నై మార్కెట్లో) సుమారు రూ. 63 లక్షలు (450 x 14000 = 63 లక్షలు). ఇంత ఖరీదైన బంగారం కనిపిస్తే.. మూడో కంటికి కనిపించకుండా నొక్కేసేవాళ్లే ఎక్కువ. కానీ ఏ మాత్రం ఆశించకుండా పోలీసులకు అప్పగించాలంటే.. ఎంత మంచి మనసు అయి ఉండాలి.

ఇలాంటి సంఘటనలు గతంలో..

గతంలో కూడా కొంతమంది ఆటో డ్రైవర్లు.. తమ ఆటోలో ఎక్కిన ప్యాసింజర్లు ఏదైనా మరిచిపోతే దానిని తిరిగి పోలీసుకులకు అప్పగించారు. ఇంకొందరు హాటల్ కార్మికులు కూడా.. అక్కడ బస చేసిన వాళ్ల వస్తువులను కూడా తిరిగి అప్పగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులైన.. పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఎందోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

జియో ఎలక్ట్రిక్ సైకిల్.. రూ. 15వేలు మాత్రమే!

దాదాపు అన్ని రంగాల్లోనూ తన హవా చూపిస్తున్న అంబానీ రిలయన్స్ కంపెనీ.. జియో ఎలక్ట్రిక్ సైకిల్ ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో, కొంత ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలమైన ఈ సైకిల్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

రూ.15,000 మాత్రమే!

రిలయన్స్ కంపెనీ ప్రవేశపెట్టిన జియో ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ. 15000 మాత్రమే. దీనిని 999 రూపాయల ఈఎంఐ చెల్లిస్తూ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 100 కిమీ పరిధిని అందిస్తుంది. ఇది విద్యార్థులకు, రోజువారీ చిన్న దూరాలకు ప్రయాణించేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

లైట్ వెయిట్..

జియో ఎలక్ట్రిక్ సైకిల్.. చూడటానికి చాలా స్టైలిష్ డిజైన్ పొందుతుంది. వెడల్పుగా ఉన్న టైర్లు ప్రయాణించేటప్పుడు.. పట్టును అందిస్తాయి. ఇందులో ఎల్ఈడీ లైట్ కనిపిస్తుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని కూడా తక్కువగా ఉపయోగించుకుంటుంది. బిల్ట్ కూడా చాలా తేలికగా ఉండటం వల్ల.. ట్రాఫిక్‌లో కూడా సజావుగా ముందుకు వెళ్లడానికి సహాయపడుతుంది.

ఫీచర్స్..

ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ సౌకర్యవంతమైన సీటును కలిగి ఉంటుంది. కాబట్టి కనీసం 10 కిమీ నుంచి 25 కిమీ దూరం అలసట లేకుంటా రైడింగ్ చేయవచ్చు. సాడిల్ మెత్తగా ఉంటుంది. హ్యాండిల్ బార్ కూడా త్వరగా అలవాటు పడటానికి సహాయపడుతుంది. ఇందులోని కాంపాక్ట్ డిజిటల్ డిస్‌ప్లే.. సైకిల్ స్పీడ్, బ్యాటరీ లెవెల్, మిగిలిన పరిధి వంటి వాటిని చూపిస్తుంది. కాబట్టి బ్యాటరీ లెవెల్ ఆధారంగా.. ఎంత దూరం ప్రయాణించవచ్చని ముందుగానే అంచనా వేసుకోవచ్చు.

పరిధి.. స్పీడ్!

జియో ఎలక్ట్రిక్ సైకిల్.. 15 కిమీ వేగంతో, ఒక పూర్తి ఛార్జింగ్ ద్వారా 100 కిమీ దూరం ప్రయాణిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. రేంజ్ అనేది రైడర్ బరువు, స్పీడ్, రోడ్డు, టైర్ ప్రెజర్, అసిస్ట్ లెవెల్ వంటి వాటిమీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేంజ్ విషయంలో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.

ఛార్జింగ్.. పర్ఫామెన్స్

జియో ఎలక్ట్రిక్ సైకిల్.. సాధారణ సాకెట్ హోమ్ ఛార్జింగ్ ద్వారా ఛార్జింగ్ చేసుకోగలదు. అయితే ఛార్జింగ్ సమయం అనేది.. బ్యాటరీ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై కూడా సులభంగా ముందుకు సాగవచ్చు. బ్రేకింగ్, హ్యాండ్లింగ్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇందులో బ్యాటరీ లాకింగ్, దొంగతనాల నుంచి బయటపడటానికి కావలసిన టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కోసం భారతదేశంలో ప్రారంభమయ్యాయి. దీని ధర రూ. 15వేలు. అందరూ కొనుగోలు చేయడానికి వీలుగా.. దీనిని కంపెనీ ఈఎంఐ రూపంలో కూడా విక్రయిస్తోంది. నెలకు రూ. 999 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఇది మన దేశంలో మంచి అమ్మకాలు పొందుతుందని తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ కార్లు, బైకులకు మాదిరిగానే.. మన దేశంలో ఎలక్ట్రిక్ సైకిళ్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి చాలా కంపెనీలు దీనిని దృష్టిలో ఉంచుకునే.. మార్కెట్లో ఎలక్ట్రిక్ సైకిల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా రిలయన్స్ జియో చేరింది. చాలా రంగాల్లో.. దూసుకెళ్తున్న రిలయన్స్ జియో.. ఎలక్ట్రిక్ సైకిల్స్ విభాగంలో కూడా తన ఉనికిని చాటుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.

డియో స్పెషల్ ఎడిషన్ వచ్చేస్తోంది.. దీని గురించి తెలుసా?

భారతదేశంలో ఎన్ని బైకులు, ఎన్ని స్కూటర్లు లాంచ్ అయినా.. హోండా డియోకు ఉన్న డిమాండ్, ఆదరణ మాత్రం చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. 2025లో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి.. ఈ నాటికి కూడా ఈ స్కూటర్ కొనేవారు ఉన్నారు, కొంటున్నారు. ఇప్పుడు కంపెనీ ఇందులోనే ఓ స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చింది.

డియో స్పెషల్ ఎడిషన్

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. చాలా కాలంలో తన డియో స్కూటర్లో ఎలాంటి పెద్ద అప్డేట్ చేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఓ స్పెషల్ పరిచయం చేసింది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా భిన్నంగా ఉంది. ఈ లేటెస్ట్ ఎడిషన్ పేరు డియో 125 ఎక్స్.

డ్యూయెల్ టోన్ కలర్

డియో 125 ఎక్స్ స్కూటర్.. చాలా స్టైలిష్ డిజైన్ పొందింది. అయితే ఇందులో మెకానికల్ & హార్డ్‌వేర్ అప్డేట్స్ లేదు. కంపెనీ ఈ స్కూటర్ డీటైల్స్ అన్నీ వెల్లడించినప్పటికీ.. ధరలను మాత్రం అధికారికంగా రిలీజ్ చేయలేదు. ఇది బూడిద, నీలం రంగులో డ్యూయెల్ టోన్ బాడీ ప్యానల్ పొందుతుంది. స్కూటర్ మీద అక్కడక్కడా ఎరుపురంగు కూడా గమనించవచ్చు. కాగా అల్లాయ్ వీల్స్ నారింజ రంగులో ఉన్నాయి.

పరిమాణం ఇలా..

చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన హోండా డియో 125 ఎక్స్ స్కూటర్.. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, పవర్‌ట్రెయిన్ అన్నీ కూడా హెచ్-స్మార్ట్ వేరియంట్‌తో సమానంగా ఉంటాయి. పరిమాణం విషయానికి వస్తే.. ఈ కొత్త స్కూటర్ 1830 మిమీ పొడవు, 707 మిమీ వెడల్పు, 1172 మిమీ ఎత్తు, 1260 మిమీ వీల్‌బేస్ పొందుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 171 మిమీ, సీటు పొడవు 708 మిమీ. మొత్తం బరువు 105 కేజీలు (కర్బ్ వెయిట్). ఈ స్కూటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు.

స్పెషల్ ఎడిషన్ ఫీచర్స్

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త హోండా డియో 125 ఎక్స్ ఎడిషన్ టీఎఫ్‌టీ స్క్రీన్ డిస్‌ప్లే, సైడ్ కట్ ఆఫ్ మెకానిజం, ఇదిలా స్టాప్ – స్టార్ట్ సిస్టం వంటివి పొందుతుంది. ఇది 190 మిమీ ఫ్రంట్ డిస్క్, 130 మిమీ రియర్ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో 90/90-12 ట్యూబ్‌లెస్ టైర్, వెనుక భాగంలో 90/100-10 ట్యూబ్‌లెస్ టైర్ ఉన్నాయి. కాగా టెలిస్కోపిక్ ఫోర్క్ (ముందు వైపు), అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ యూనిట్ (వెనుక వైపు) ఉన్నాయి.

అదే ఇంజిన్.. అదే పర్ఫామెన్స్!

ఇక చివరగా ఇంజిన్ విషయానికి వస్తే.. డియో 125 ఎక్స్ ఎడిషన్.. సాధారణ డియోలోని అదే 123.92 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఎస్ఐ ఇంజిన్ ద్వారానే 6500 ఆర్పీఎం వద్ద 8.1 హార్స్ పవర్, 5000 ఆర్పీఎం వద్ద 10.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ట్యూనింగ్, ట్రాన్స్‌మిషన్ వంటి వాటిలో ఎలాంటి మార్పులు, అప్డేట్స్ లేదు.

హోండా డియో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి 30 లక్షల యూనిట్ల అమ్మకాలను పొందింది. అంటే.. 30 లక్షలమంది కొన్నారన్నమాట. ఇప్పుడు కూడా డియోకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం డియో స్పెషల్ ఎడిషన్ రూపంలో మార్కెట్లో అమ్మకానికి వస్తోంది. కాబట్టి దీని సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే.. దీని ధర ఎంత ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది.

బరువైపోతున్న బంగారం.. ఒక్కసారిగా పెరిగిపోయిన గోల్డ్ రేటు!

0

బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయా.. అన్నట్టు దూసుకెల్తూనే ఉన్నాయి. 2026 ప్రారంభం నుంచే అమాంతం పెరుగుతున్న రేట్లు ఇప్పుడు తాజాగా మరోమారు పైకి లేచాయి. దీంతో గోల్డ్ రేటు రూ. 16.5వేలు మార్క్ దాటేసింది. పసిడి కొనుగోలుదారుల్లో ఒకింత భయం మొదలైంది. ఈ కథనంలో నేటి (జనవరి 28) గోల్డ్ రేట్లు.. ఏ నగరం ఎలా ఉన్నాయి?, వెండి ధరల పరిస్థితి ఏమిటనే విషయాలను విపులంగా తెలుసుకుందాం.

బంగారం ధరలు ఇలా..

ముందుగా హైదరాబాద్ నగరం బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే.. ఈ నగరంలో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు అక్షరాలా రూ. 1,67,080 వద్ద ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 153150లకు చేరింది. 2025 జనవరి సుమారు రూ. 75వేలు వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఈ ఏడాది జనవరి చివరి రెట్టింపు పెరిగిపోయింది. ఈ ధరలు మున్ముందు.. ఇంకా ఎంత పెరుగుతాయో అని బంగారం కొనుగోలుదారులు ఉలిక్కిపడుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం.. త్వరలో పసిడి రేటు రూ. రెండు లక్షలకు చేరుతుందని తెలుస్తోంది.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో.. విజయవాడ, కర్నూలు, నెల్లూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మరియు ముంబై ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలో బంగారం ధరల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల విషయం పక్కన పెడితే.. చెన్నైలో బంగారం ధరలు చాలా పెరిగింది. 22 క్యారెట్ల రేటు 6500 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల రేటు 7090 రూపాయలు పెరిగింది. దీంతో తులం 22 క్యారెట్ల గోల్డ్ ధర 156100 రూపాయల వద్ద ఉండగా.. 24 క్యారెట్ల రేటు 170290 రూపాయల వద్ద నిలిచింది. భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలోనే పసిడి రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. ఈ నగరంలో 22 క్యారెట్ల బంగారం రేటు, 24 క్యారెట్ల పసిడి ధర వరుసగా.. 4700 రూపాయలు & 5130 రూపాయలు పెరిగింది. దీనివల్ల ఈ రోజు (బుధవారం) తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 153300 (22 క్యారెట్స్), రూ. 167230 (24 క్యారెట్స్) వద్ద నిలిచాయి.

బంగారం ధరలు ఎందుకింతలా..

పసిడికి డిమాండ్ ఉందని అందరికీ తెలుసు. ఇతర దేశాలతో పోలిస్తే.. మన దేశంలోని మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరిస్తారని కూడా తెలుసు. అయితే గోల్డ్ రేటు ఇంతలా పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు, ఊహకు అందలేదు కూడా. ప్రస్తుత ధరలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ధరలు ఇంకా పెరుగుతాయా? తగ్గే అవకాశం లేదా?, అని కొంత గాబరా బడుతున్నారు.

నిజం చెప్పాలంటే.. బంగారం ధరలు ఒకసారి పెరిగితే, తగ్గడం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ఊహించని పరిణాలు ఏర్పడితే.. అనుకోని ఏదైనా అద్భుతాలు జరిగితే తప్పా గోల్డ్ రేటు తగ్గే అవకాశం లేదు. బంగారం ధరలు భారీగా పడిపోవాలంటే కొనుగోలు చేయడం ఆపేయాలి. లేదా డిమాండుకు తగిన సరఫరా ఉండాలి. అప్పుడే గోల్డ్ రేటు తగ్గుతుంది. లేదంటే.. రాబోయే రోజుల్లో బంగారం కొనుగోలు కష్టమనే చెప్పాలి.

సిల్వర్ రేటు ఇలా..

బంగారం ధరలు ఒక ఎత్తైతే.. వెండి ధరలు మరో ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే వెండి రేటు ఇది వరకు ఎప్పడూ పెరగనంత పెరిగింది. ఈ రోజు కేజీ వెండి రేటు రూ. 4 లక్షలకు చేరింది. అంటే ఒక గ్రామ్ వెండి ధర 400 రూపాయలన్నమాట. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ రచయితా రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.

దేశభక్తి చాటుకున్న విద్యార్థులు: అట్టహాసంగా జరిగిన ‘వెరిటాస్’ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్

తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ (ప్రైవేట్ సైనిక్ స్కూల్) ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తోంది. అదే విధంగా ఈ రోజు (జనవరి 26) 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. పది ఎకరాలపైన విస్తీర్ణం కలిగిన వెరిటాస్ పరేడ్ గ్రౌండ్‌లో దాదాపు పదిహేడు వందల మంది విద్యార్థులతో భారీ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మేజర్ జనరల్ డాక్టర్ అఫ్తాబ్ ఆలమ్ (రిటైర్డ్) & గౌరవ అతిధిగా ఎయిర్ కమాండర్ డాక్టర్ అంజలి ఆలమ్ (రిటైర్డ్) హాజరయ్యారు.

కార్యక్రమ విశేషాలు

ఉదయం 7:30 గంటల నుంచి 11:30 వరకు ఆద్యంతం అట్టహాసంగా ఎంతో ఆసక్తిగా ఈ వేడుక కొనసాగింది. మొదటగా మేజర్ జనరల్ అప్తాబ్ ఆలమ్ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. విద్యార్థులు అతిధికి గౌరవ సలామ్ చేశారు. ఆ తరువాత  వెరిటాస్ సైనిక్ స్కూల్ విద్యార్థులు అందరూ పరేడ్ గ్రౌండ్‌లో కవాతు చేశారు. సుమారు ముప్పై నిముషాల పాటు సాగిన ఈ మార్చింగ్‌లో పదిహేడు వందలమంది విద్యార్థులు దేశం పట్ల వారికున్న ప్రేమని, అభిమానాన్ని, దేశభక్తిని చాటుకున్నారు.

హౌస్‌వైజ్ ఎవరికి వారు పోటాపోటీగా వారిలో దాగున్న శ్రద్ధ, పట్టుదలను ప్రదర్శించారు. చూసేంతసేపు చూపు తిప్పుకోలేనంత అద్భుతంగా అనిపించింది. వీక్షకులు కూడా విద్యార్థుల కవాతును ప్రశంశిస్తూ చప్పట్లతో సభా ప్రాంగణం అంతా మారుమ్రోగించారు. మార్చింగ్‌లో మాణిక్ష హౌస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, 2025-26 సంవత్సరానికి సంబంధించిన అబ్దుల్ కలామ్ హౌస్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అందుకునింది.

మేజర్ జనరల్ అప్తాబ్ ఆలమ్ మాట్లాడుతూ..

మన దేశానికి 76 సంవత్సరాల క్రితం పరిపాలన, రాజకీయ పరమైన ఎటువంటి అధికారాలు, హక్కులు లేకుండా ఉండేవని ఆ తరువాత డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం ద్వారానే మనకు అన్నీ లభించబడ్డాయని చెప్పుకొచ్చారు. అబ్దుల్ కలామ్ చెప్పినట్టు కోట్ల మంది యువ శక్తి భారతదేశంలో ఉందని.. వారే రేపటి భవిష్యత్తు అన్నారు. విద్యార్థుల గురించి చెబుతూ అందరూ కూడా ఐకమత్యంతో అద్భుత ప్రదర్శన చేశారన్నారు. మాకు ఈ భుజాల పైన స్టార్స్, యూనిఫామ్ ఉంటాయి, కానీ.. దేశం కోసం సేవ చేయడం అనేది గొప్ప విషయంగా, అదే అంతిమ లక్ష్యంగా భావిస్తామని అన్నారు. మీరు కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉండాలని హితవు పలికారు. విద్యార్థులు అంతా చక్కటి క్రమశిక్షణ, ప్రవర్తనతో ఉన్నారని, మిమ్మల్ని చూస్తుంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో భద్రంగా ఉంటుందని నేను నమ్ముతున్నానుని ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

ఈవెంట్ హైలెట్స్

➤పరేడ్
➤స్కూల్ ఎన్‌సీసీ బ్యాండ్
➤పిరమిడ్స్
➤సెక్షన్ బ్యాటిల్ డ్రిల్
➤రైఫిల్ డ్రిల్
➤రైఫిల్ షూటింగ్

స్టూడెంట్స్ చూపించిన ధైర్య సాహసాలు వాళ్ల నిబద్దతకి, కఠోర శ్రమకి, దేశం కోసం తమవంతు భక్తిని నిరూపించుకోవాలనే తపనకి నిదర్శనంగా నిలిచాయి. విద్యార్థులు ప్రదర్శించిన ఈ సాహసోపేతమైన కార్యక్రమాలు చూస్తే నిజమైన ఆర్మీ జవాన్లను చూసినట్టే అనిపించిందని.. చూడటానికి వచ్చిన వాళ్లు చెప్పుకొచ్చారు. అసలైన గణతంత్ర వేడుకలు ఎలా ఉంటాయో మా కళ్లారా చూసే అవకాశం ఈ విధంగా నెరవేరిందని కొనియాడారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

➤హూప్ డాన్స్
➤లెజిమ్స్
➤జుంబా డాన్స్
➤డంబెల్ డిస్‌ప్లే డాన్స్
➤చిల్డ్రన్స్ నేషనల్ లీడర్స్ ఫ్యాన్సీ డ్రెస్స్
➤పెట్రియాటిక్ సాంగ్ డాన్స్

దేశ నాయకుల ఫ్యాన్సీ డ్రెస్‌లో చిన్న పిల్లలు మాట్లాడిన ముద్దు ముద్దు మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. డ్యాన్స్‌లు అన్నీ కూడా ఉత్సహాన్ని, ఉతేజాన్ని రేకెత్తించాయి. ఈ సాంస్కృతిక  కార్యక్రమాల్లో అడుగడుగునా దేశం మీద వారి అంకితభావం మాత్రమే కనిపించింది.

ఐదు వేల మందితో..

వెరిటాస్ పాఠశాల యాజమాన్యం డైరెక్టర్స్ శ్రీకర్ రెడ్డి, సందీప్ రెడ్డి, సారిక రెడ్డితో పాటు డీన్ ఎయిర్ కమాండర్ సిజిహెచ్. ఖాన్ (రిటైర్డ్), ప్రిన్సిపాల్ పిఆర్ఎస్. చక్రవర్తి, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతే కాకుండా కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన తిరుపతి & పరిసర ప్రాంత వాసులు అందరితో కలిపి సభా ప్రాంగణం మొత్తం వేల మందితో నిండిపోయింది. ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో దాదాపుగా ఐదు వేలమంది పాల్గొన్నారని అంచనా. వచ్చిన వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ప్రతి ఒక్కరికి తాగునీరు, చిరు ఆహర పదార్థాలను అందించడమే కాకుండా, మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి ఉత్సవంలో భాగం అయినందుకు అందరూ సంతోషాన్ని, అనుభవాన్ని, అనుభూతిని వ్యక్తపరిచారు.

నా హెల్ప్ తీసుకున్న వాళ్లే.. బాధను చెప్పుకొచ్చిన శర్వానంద్

0

ఈ మధ్య కాలంలో సంక్రాతి సందర్బంగా చాలా సినిమాలు వెంటవెంటనే థియేటర్లలో విడుదలయ్యాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, ప్రభాస్ రాజాసాబ్, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

మన శంకరవరప్రసాద్ గారు భారీ విజయాన్ని నమోదు చేసుకోగా, రాజాసాబ్ నిరాశపరిచింది, ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి యావరేజ్‌గా ఆడింది, అనగనగా ఒకరాజు సైలెంట్‌గా వచ్చి డీసెంట్ హిట్ అందుకుంది. వీటన్నిటి మధ్యలో శర్వానంద్ హీరోగా తీసిన సినిమా నారీ నారీ నడుమ మురారీ కూడా చాలా నిశ్శబ్దంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్ని సినిమాలు పోటీగా ఉన్నా కూడా సంక్రాతి విన్నర్‌గా నిలిచింది.

శర్వానంద్‌కు సక్సెస్

సినిమా విడుదల అయిన మొదటలో థియేటర్స్ చాలా తక్కువ ఉండటం, మిగిలిన చిత్రాలు కూడా రిలీజ్ అవ్వడంతో అంత కలెక్షన్స్ అయితే రాలేదనే చెప్పాలి. వారం చివరలో మంచి పాజిటివ్ టాక్‌తో లాభాల బాటపట్టింది. దీంతో శర్వానంద్‌కు బిగ్ రిలీఫ్ దొరికినట్టు అయింది. ఎందుకంటే శతమానం భవతి చిత్రం తరువాత శర్వకి చెప్పుకోదగిన విజయాలేవి లేవు.

నారీ నారీ నడుమ మురారి సక్సెస్ అయిన సందర్బంగా.. మూవీ టీమ్ ఒక యూట్యూబ్ ఛానల్లో చిన్న చిట్ చాట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇందులో శర్వానంద్ తన ఆవేదను వెళ్ళగక్కాడు. దాదాపు ఏడు, ఎనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడా చెప్పుకోదగినటువంటి బలమైన గెలుపు ఒక్కటీ కూడా లేదు.

నన్ను వాడుకుని వదిలేశారు!

2017 తర్వాత శర్వ సినిమాల జాబితా చూసుకుంటే.. 2018లో పడి పడి లేచే మనసు డబ్బులు పరంగా భారీగా విఫలం అయినట్టు సమాచారం, ఆ తర్వాత 2020లో తమిళంలో మంచి క్లాసికల్ హిట్ ఇచ్చిన విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96ని తెలుగులో సమంతతో కలిసి జాను పేరుతో రీమేక్ చేశారు. అది బిలో యావరేజ్ ఆడింది. 2021లో వచ్చిన శ్రీకారం, మహా సముద్రం రెండు చిత్రాలు ఫ్లాప్ అయినట్టుగా మీడియా వర్గాలు చెబుతున్నాయి.

ఒకే ఒక జీవితం ఇది పర్వాలేదు అనిపించింది.. కానీ చెప్పుకోదగ్గ సినిమా కాలేకపోయింది. 2024లో మనమే ఇది కూడా రీమేక్ సినిమా యావరేజ్ ఆడిందని చెప్పవచ్చు. ఈ విధంగా ఒకరకంగా చెప్పాలంటే శర్వానంద్‌కు విజయాలు లేక నిరాశే మిగిలింది. నారీ నారీ నడుమ మురారీ విజయంతో చిట్ చాట్ మధ్యలో శర్వానంద్ మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను హెల్ప్ చేసిన ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు. అందరూ నన్ను వాడుకుని వదిలేసిన వాల్లే గానీ తిరిగి నాకు ఎవరు సహాయపడలేదు అన్నారు. అంతేకాకుండా ఇంకా మాట్లాడుతూ ఒకరికి మనం హెల్ప్ చేసినప్పుడు మనం మన వాడు అనుకుంటాము కదా అలాంటప్పుడు వాళ్లు తిరిగి సాయపడాలి కదా, కానీ అలా జరగలేదు. నేను హిట్ చూసి దాదాపు ఆరు, ఏడు సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ మోసం చేసే వాల్లే ఎక్కువైపోయారు. ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదని తన మనసులో ఉన్న బాధని చెప్పుకొచ్చాడు.

త్వరలో బైకర్

దీని తరువాత ఇప్పుడు బైకర్ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. 2025లోనే విడుదల అవుతుంది అనే ప్రచారం అయితే జరిగింది. కానీ నారీ నారీ నడుమ మురారీ సినిమా కోసమేమో ఆగినట్టు ఉంది. బైకర్.. ఇది ఒక బైక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ట్రైలర్ అత్యంత అద్భుతంగా వచ్చింది. ఆ చిత్రం పట్ల తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉన్నది.