Home Blog Page 119

ఆడదే ఆధారం.. ఈ రోజు తనే స్పెషల్‌!

మనిషి జీవితంలో ఇల్లు అనేది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం అవునన్నా.. కాదన్నా.. బతుకులో భాగమవుతుంది. జీవనం సాగించడానికి తప్పనిసరి సాధనంగా, సారథిగా మారుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో కేవలం ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే గృహస్థ జీవితమే మానవ మనుగడను నిర్దేశిస్తుంది. అయితే ఇంటిని చక్కదిద్దటం అనేది చాలా కష్టంతో కూడుకున్న అంశం. దానికి ఎక్కువ ఓర్పు, నేర్పు రెండు అవసరం. డబ్బు సంపాదన మాత్రమే ఇల్లుని నడిపించదు. ఇంటి పనులు స్త్రీ, పురుష బేధం లేకుండా ఎవరైనా చేయవచ్చు, కానీ ప్రపంచం అంతా ఎందుకో ఆడవాళ్లే ఈ బాధ్యత ఎక్కువగా నిర్వర్తిస్తుంటారు. కావాలని అందులోకి నెట్టివేయబడ్డారా? లేక అది స్త్రీ సహజ లక్షణమా? అనేది తెలియదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈరోజు నేషనల్ హౌస్ వైఫ్స్ డే.

ఎక్కడ, ఎలా మొదలైంది?

హౌస్ వైఫ్స్ డే అనేది సాధారణంగా అమెరికాలో మొదలైంది. ఇది ఎప్పుడు పుట్టింది. ఎవరు దీనిని ప్రారంభించారు అనే దానికి కచ్చితమైన ఆధారాలు లేవనే తెలుస్తోంది. అయితే 1956 లేదా 60వ దశకం నుంచి ఆరంభమైనట్టుగా చెబుతారు. అయితే ప్రతి ఏటా నవంబర్ 03వ తేదీన జాతీయ గృహిణుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ విధమైన సంస్కృతి ఎక్కువగా పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అవుతున్నప్పటికి.. ఇక్కడి వారు కూడా, వాటిని తమకు ఆపాదించుకుని సొంతం చేసుకున్న దాఖలాలు కోకొల్లలు. ఆ పరంపరలో భాగంగా ఈ హౌస్ వైఫ్స్ డేను కూడా జరుపుకుంటున్నారు.

హౌస్ వైఫ్స్ డే ఉద్దేశ్యం..

పొద్దున్నే నిద్ర లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. ఒక మహిళ తన కుటుంబాన్ని సరైన పద్ధతిలో నడిపించడానికి సమయాన్ని, శ్రమని వేచ్చిస్తుంది. ఇప్పుడు ఉన్న గ్లోబలైజేషన్ కారణంగా చదువుకున్న ఆడవారు ఒక వైపు ఉద్యోగం.. మరొక వైపు ఇంటి బాధ్యతలు రెండు కూడా చూసుకోవడం అనేది అనివార్యం అయింది. ఇంకా గ్రామీణ మహిళలు, అటు పట్టణ కార్మికుల గురించి అయితే చెప్పనక్కరలేదు. వారు నిరంతరం కూలీ పనులు, వ్యవసాయ ఆధారిత, అనేక రకాలైన ఇతర శ్రమ చేసే పనులన్నీ చేస్తూ ఇంట్లో పిల్లల చదువులు, భర్త అవసరాలు చూసుకోవాల్సి ఉంటుంది.

ఇంటిని, పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, బట్టలు ఉతకడం, పిల్లల స్నానాలు చేయించడం, ఇంట్లో అందరికి మూడు పూటలా వంట చేసి పెట్టడం అందులో ఇంకా వారు కోరింది చేసి ఇవ్వడం, స్కూల్ సమయానికి అన్ని సిద్ధం చేసి భర్తని ఆఫీసుకు, పిల్లల్ని స్కూలుకు పంపడం, తరువాత తాను రెడీ అయ్యి వెళ్లడం అనేది నిరంతర ప్రయాసతో కూడుకున్న పని. నేడు పెరిగిన, పెరుగుతున్న వేగవంతమైన పాశ్చాత్యా సంస్కృతి వరవడిలో మగవాళ్లు కూడా ఇంటి పనులు చేస్తున్నారు. తిండి విషయంలో అడపాదడప బయట హోటళ్లపైన ఆధారపడుతున్నప్పటికి.. సమాజంలో ఉన్న పురుషాదీక్యత కారణంగా ఎక్కువ శాతం ఆడవాల్లే ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు.

కాబట్టి ఈ ఒక్కరోజు అయినా.. గృహినులకి విశ్రాంతి ఇవాళ్లన్నదే హౌస్ వైఫ్స్ డే ప్రధాన ఉద్దేశ్యం. అయితే కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే వారికి శుభాకాంక్షలు తెలపడం, పనుల్లో ఉపశమనం కలిగించడం అనేది సరైన పరిష్కారం కాదు. ప్రతి రోజు కూడా భార్య, భర్త ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుని ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. పనులని పంచుకొని చేయడం వల్ల ఒకరిపైనే భారం పడదు. అప్పుడే గృహిణి కష్టం మగవాళ్లకు తెలుస్తుంది.

శుభాకాంక్షలు వారికి గౌరవాన్ని ఇవ్వదు!

ఒకరోజు శుభాకాంక్షలు చెప్పడం వారికి గౌరవాన్ని ఇవ్వదు. అది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు పనిలో భాగస్వామ్యం అవ్వడమే వారికి దక్కే గౌరవం. వారికీ మనం ఇచ్చే విశ్రాంతి అవుతుంది. ప్రత్యేకించి ఒకరోజు శుభాకాంక్షలు తెలపడం అనేది తప్పు అయితే కాదు, ఒక మంచి పరిణామం. ఇది గృహిణుల కళ్లలో ఆనందం నింపినవాళ్లు అవుతాము. కష్టపడి వాళ్ల జీవితాలని కుటుంబాల కోసమే త్యాగం చేసిన ఆడవాళ్ళకి అందరికి మా తరపున జాతీయ గృహిణి దినోత్సవ శుభాకాంక్షలు.

మరో ఎలక్ట్రిక్ కారు లాంచ్‌కు సిద్ధమైన మహీంద్రా: నవంబర్ 27న ముహూర్తం!

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న కారుకు ‘ఎక్స్ఈవీ 9ఎస్‘ అని కూడా నామకరణం చేసింది. కారు పేరును సూచించే ఒక చిన్న వీడియోను సైతం సంస్థ అధికారికంగా లాంచ్ చేసింది. ఇది నవంబర్ 27న దేశీయ విఫణిలో అడుగుపెడుతుందని కూడా ప్రకటించింది.

మరో ఎలక్ట్రిక్ కారు – ఎక్స్ఈవీ 9ఎస్

మహీంద్రా కంపెనీ 2024 నవంబర్ నెలలో బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. కాగా ఈ నవంబర్ నెలలో ఎక్స్ఈవీ 9ఎస్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ నవంబర్ 27న బెంగళూరులో జరిగే స్క్రీమ్ ఎలక్ట్రిక్ కార్యక్రమంలో ఈ కొత్త కారును ఆవిష్కరించనుంది. ఇది 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అని స్పష్టంగా వెల్లడించింది.

ఎక్స్ఈవీ 9ఎస్ అనే ఎలక్ట్రిక్ కారు.. ఇప్పుడు మార్కెట్లో అమ్ముడవుతున్న బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ యొక్క ఐఎన్‌జీఎల్‌ఓ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ఆర్కిటెక్చర్ మీద నిర్మితమవుతున్న మూడవ మోడల్ ఎక్స్ఈవీ అని తెలుస్తోంది. ఇది భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుంది. అంటే.. ఇతర దేశాల్లో కూడా ఇది అమ్ముడవుతుందన్నమాట.

లాంచ్ ఎప్పుడంటే?

మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ కారును ఈ నెలలో ఆవిష్కరించినప్పటికీ.. లాంచ్ ఎప్పుడు చేస్తుందనే విషయాన్ని వెల్లడించలేదు. బహుశా 2025 చివరి నాటికి లాంచ్ అవుతుందని భావిస్తున్నాము. ధరలు కూడా లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి.

బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ పేర్లు మాదిరిగానే.. ఎక్స్ఈవీ 9ఎస్ పేరు ఉంది కాబట్టి. అందులోనూ అదే ఐఎన్‌జీఎల్‌ఓ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది కాబట్టి.. రాబోయే ఎలక్ట్రిక్ కారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు మాదిరిగానే ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. కానీ 9ఎస్ ఫ్యామిలీ భిన్నంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పరిమాణం పరంగా ఎక్స్‌యూవీ700 కారుకు దగ్గరగా ఉంటుంది. కానీ మెకానికల్స్ పరంగా భిన్నంగా ఉంటుంది. పరిమాణం పరంగా ఎక్స్ఈవీ 9ఎస్ పెద్దదిగా ఉండటం వల్ల.. ఫ్యామిలీ కారుగా.. ఫ్యామిలీ ట్రిప్ కోసం ఇది చాలాబాగా ఉపయోగపడుతుంది.

ఫీచర్స్ ఎలా ఉంటాయంటే?

ఎక్స్ఈవీ 9ఎస్ కారులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయనే విషయాన్ని మహీంద్రా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇప్పటికే ఐఎన్‌జీఎల్‌ఓ ఆర్కిటెక్చర్ మీద నిర్మితమైన కార్లలో ఉన్న.. దాదాపు అన్ని ఫీచర్స్ ఉంటాయని సమాచారం. కాబట్టి 9ఎస్ కారులోని రెండో వరుసలో స్లైడింగ్ సీట్లు, ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టం, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఆటోపార్క్, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయని తెలుస్తోంది.

బ్యాటరీ & రేంజ్ వివరాలు

మహీంద్రా కంపెనీ బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్‌లనే.. ఎక్స్ఈవీ 9ఎస్ కారులో కూడా అందించే అవకాశం ఉంది. కాబట్టి 9ఎస్.. 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. అయితే రేంజ్ విషయంలో కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు 400 కిమీ నుంచి 600 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.

బైకర్ సినిమా ఈవెంట్: మనసులో మాటలు చెప్పిన శర్వానంద్

0

శర్వానంద్ తన కెరియర్‌లో గుర్తుండిపోయేలా బైకర్ అనే సినిమాను తీశారు. ఇది ఇండియాలో ఫస్ట్ మోటార్ క్రాస్ రేసింగ్ మూవీ. నవంబర్ 06వ తేదీన థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడు.

ఒరిజినల్ బైక్ స్టంట్స్

బైకర్ సినిమా తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుందని, కెరియర్‌లో గర్వంగా చెప్పుకోదగ్గ ఒక గొప్ప సినిమా చేశానని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కాలర్ ఎగరేసి ఇది శర్వానంద్ సినిమా అని చెప్పుకునేలాగా తీయడానికి సిద్దపడిన ప్రొడ్యూసర్ వంశీకి ధన్యవాదాలు తెలిపాడు. అందులోను ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లోనే మహానుభావుడు, రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి మంచి హిట్ సినిమాలు చేసిన అనుభవంతో ఏ మాత్రం వెనుకడకుండా మంచి ఎక్స్‌పరిమెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా చేయడం అనేది అంత సులువైన విషయం అయితే కాదు. ఎందుకంటే ఏవి కూడా డూప్ కాదు. ఒరిజినల్ బైకర్స్ చేసిన స్టంట్స్ లాగే ఉన్నాయి విజువల్స్.

బైక్‌లపై తిరుగుతూ ప్రచారం

సినిమా ప్రచారంలో భాగంగా.. ఈ నెల 15వ తేదీ నుంచి భారతదేశం మొత్తం బైక్స్ వేసుకొని హీరో శర్వానంద్ మరియు సినిమా టీమ్ తిరుగనున్నారు. సినీ అభిమానులని కలిసి వాళ్లతో సినిమా పట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నారు. అలాగే ప్రజలకు దగ్గరవడానికి కూడా ఈ దారి సరైందని శర్వా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇది ఒక కొత్తరకం మూవీ ప్రమోషన్ అనే చెప్పాలి. దీంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవ్వనుంది. పెద్ద పెద్ద సినిమాలను తీసే యూవీ వాళ్లు ఇందుకు భారీగా ఖర్చు చేయనున్నారు. సినిమా రూ. 60 కోట్ల బడ్జెట్ అని ప్రచారం జరుగుతున్నది.

ఈ సినిమాలో హీరో రాజశేఖర్ కూడా కీలక పాత్ర పోషించారు. దీనిపై శర్వానంద్ మాట్లాడుతూ.. రాజశేఖర్ ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది గొప్ప విషయం అని, ఆయనతో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నా అని కృతజ్ఞతలు తెలిపారు. సినిమా మొత్తం అనేక ఛాలెంజ్స్, ఇంట్రస్టింగ్ అవెంచర్స్ ఉంటాయి.. అవన్నీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పుకొచ్చాడు.

మనసులో మాటలు

డైరెక్టర్ అభిలాష్.. నాలో ఏమి చూసి నమ్మాడో తెలీదు గానీ ఒక పెద్ద కథ రాసుకొచ్చి నన్ను ఒప్పించాడు. మొత్తానికి సినిమా చేసాము. ఎప్పుడెప్పుడు ప్రేక్షకులకు ఈ మూవీ చూపించాలని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నానని, ఏ మాత్రం తడబడకుండా కాన్ఫిడెంట్‌గా శర్వనంద్ తన మనసులోని మాటలు బయటపెట్టాడు. మరి బైకర్ శర్వానంద్ సినిమా సాహసాలని చూడాలంటే మాత్రం ఇంకా ఒక నెల రోజులు ఆగాలి అన్నమాట. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ మాత్రమే కాకుండా.. బ్రహ్మాజీ లాంటి వాళ్ళు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు అభిలాష్ డైరెక్టర్ కాగా.. వంశీ, ప్రమోద్ నిర్మాతలు.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

గెలవడం కాదు, చివరి వరకు పోరాడటం గొప్ప: శర్వానంద్ బైకర్

0

శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా బైకర్. ఈ సినిమా గ్లింప్స్ నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి, దయానంద్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తుండగా.. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ జే. యువరాజ్ చేస్తుండగా.. జీబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

గ్లింప్స్ వీడియో.. 

బైకర్ గ్లింప్స్ వీడియో నిడివి.. ఒక నిమిషము ఇరవై ఒక్క సెకన్స్ మాత్రమే ఉంది. ఆ కొన్ని సెకండ్లలోనే మొత్తం సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగిందని అనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. “ఇక్కడ ప్రతి బైకర్‌కు ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ, చావుకు ఎదురెళ్లే కథ” ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో ప్రారంభంలో వచ్చే మాటలు. ఈ డైలాగ్స్ బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ స్థాయిలో ఉండబోతున్నదనేది.

బైక్ రేసింగ్ అయితే మామూలుగా లేదు. శర్వానంద్ చెప్పినట్టు భారతదేశ చలన చిత్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరు చేయని సినిమా ఇది అని కచ్చితంగా చెప్పొచ్చు. ఒక్కో బైక్ అలా పైకి గాల్లో ఎగురుతుంటే వొళ్ళంతా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇదివరకే మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, శర్వా కలిసి పనిచేసిన కారణంగా తనకి ఎలాంటి సంగీతం ఇవ్వాలో బాగా తెలుసు కాబట్టి బిజీఎం బాగుంది.

రేసర్‌గా శర్వానంద్

ఒక బైక్ రేస్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. శర్వానంద్ రేసర్‌గా వంద శాతం న్యాయం చేశాడని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా కోసం నిజమైన బైక్ రేసర్లని వాడారు. కోయంబత్తూరు, ఇండోనేషియాలకు వెళ్లి మరీ అక్కడ ఒరిజినల్ బైక్ రేసర్లతో మాట్లాడి ఈ సినిమా చేశారు. శర్వానంద్ బైకర్ కోసం.. ఒక నిజమైన రేసర్ మాదిరిగా తయారయ్యాడు. వాళ్లు ఎంత కష్టం చేశారు అనేది చెప్పడానికి ఒక్క గ్లింప్స్ చాలు అనిపిస్తుంది. హీరో లుక్ అయితే పూర్తిగా మారిపోయింది. బైక్ రేసింగ్ ఇష్టపడే యువత అయితే మాత్రం తప్పకుండా లైక్ చేస్తారు. శర్వానంద్ ఈ సినిమా కోసం కోసం చాలా గ్యాప్ తీసుకొని అన్నీ పూర్తిగా నేర్చుకుని రంగంలోకి దిగినట్టే ఉంది.

గ్లింప్స్ లాంచ్ ఈవెంట్

బైకర్ సినిమా డిసెంబర్ 06వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్నది. అయితే నవంబర్ 01న బైకర్ ది ఫస్ట్ లాప్ – ది గ్లింప్స్ పేరుతో ఒక కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్‌లో విలేకరుల మధ్యలో జరిగింది. ఈ ఈవెంట్‌కు హీరో రాజశేఖర్, జీవిత, మూవీ ప్రొడ్యూసర్ వంశీ, డైరెక్టర్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన మిగిలిన విశేషాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద శర్వానంద్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్ని ఒకెత్తు, ఈ బైకర్ సినిమా ఒకెత్తు. కాబట్టే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మాత్రం భారీగానే ప్లాన్ చేశారు.

జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్: అంచనాలు పెంచేస్తున్న రామ్ చరణ్ పెద్ది

అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్.. తెలుగు సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేస్తోంది. దేవర సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తోంది. ఇప్పటి వరకు రామ్ చరణ్ ఫోటోలను మాత్రమే రిలీజ్ చేసిన చిత్ర బృందం.. తాజాగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్

డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ చాలానే విడుదలయ్యాయి. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్.. అటు రామ్ చరణ్ అభిమానులను, ఇటు జాన్వీ కపూర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. జాన్వీ.. పెద్ది సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిగా.. అచ్చియ్యమ్మ అనే పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోటో చూడగానే దేనికి భయపడని ఒక ఫైర్ బ్రాండ్ కనిపిస్తుంది. పోస్టర్‌లో జాన్వీ జీపులో నిలబడి.. రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టినట్లు అనిపిస్తోంది. మరో పోస్టర్‌లో మైకు ముందు నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే.. గ్రామీణ వాతావరణం పెద్ది సినిమాలో పుష్కలంగా కనిపిస్తుందని తెలుస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే?

బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న పెద్ది సినిమాకు.. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట్ సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ & సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నారు. కొరియోగ్రాఫర్ బాధ్యతలను జానీ మాస్టర్ తీసుకున్నారు. కాగా ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. అయితే 2026 మార్చి 27న థియేటర్లలో రిలీజ్ అవుతుందని సమాచారం. అంటే నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా ఈ సినిమాలు రిలీజ్ చేయడానికి చిత్రబృందం కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.

వేగంగా సాగుతున్న షూటింగ్!

పెద్ది సినిమా షూటింగుకు సంబంధించిన కొన్ని విశేషాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు చాలా పెరిగిపోయాయి. కొన్ని రోజులకు ముందు ఏకంగా 1000 మందితో కూడిన ఒక సాంగ్ కూడా చిత్రీకరించడం జరిగింది. గత వినాయకచవితి సందర్భంగా దీనిని చిత్రీకరించినట్లు చిత్రబృందం వెల్లడించింది.

అత్యుత్తమ స్థాయి బృందాలతో..

రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం పూర్తి గెటప్ మార్చేశారు. కాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ మాత్రమే కాకుండా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అత్యున్నత స్థాయి సాంకేతిక బృందంతో.. పెద్దిని నిర్మిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెద్ది సినిమా కోసం రూ. 300 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు.

భారత్ కోసం సిద్దమవుతున్న సరికొత్త కార్లు: లాంచ్ ఎప్పుడంటే?

టోక్యో వేదికగా జరుగుతున్న 2025 జపాన్ మొబిలిటీ షోలో లెక్కకు మించిన వాహనాలు ప్రదర్శించబడ్డాయి. ఇందులో కనిపించిన కొన్ని కార్లను భారతదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్న.. జపాన్ మొబిలిటీ షో 2025లో కనిపించిన కార్లను గురించి ఈ కథనంలో వివరంగా.. తెలుసుకుందాం.

హోండా 0 సిరీస్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా.. జపాన్ మొబిలిటీ షోలో 0 సిరీస్ కారును ఆవిష్కరించింది. దీనిని కంపెనీ 2026లో భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్. కాబట్టి ఇది ఏఎస్ఐఎంఓ ఓఎస్ మరియు లెవల్ 3 ఏడీఏఎస్ అనే వెహికల్ వైడ్ ఆపరేటింగ్ సిస్టం పొందుతుంది. ఈ కారు 80 కిలోవాట్ మరియు 100 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో అందుబాటులో ఉండనుంది. కాగా దీనిని సంస్థ సీబీయూ మార్గం ద్వారా.. దేశీయ విఫణికి తీసుకురానుంది. దీని ధర రూ. 80 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్

భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన కార్ల మారుతి ఫ్రాంక్స్.. 2026 నాటికి ఫ్లెక్స్ ఫ్యూయెల్ రూపంలో లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ20 పెట్రోల్ తప్పనిసరి చేసిన తరువాత.. కంపెనీ ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ వెర్షన్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కారు ఈ85 (85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్) మిశ్రమాలకు సపోర్ట్ చేస్తుంది. అయితే కంపెనీ ఈ కారుకు సంబంధించిన స్పెసిఫికేషన్లను అధికారికంగా విడుదల చేయలేదు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు చూడటానికి సాధారణ పెట్రోల్ కారు మాదిరిగా ఉంటుంది. అయితే అక్కడక్కడా ఆకుపచ్చ స్కిక్కర్స్ కనిపిస్తాయి.

హోండా 0 ఏ (ఆల్ఫా)

0 సిరీస్ మోడల్ కాకుండా.. హోండా కంపెనీ 0 ఏ (ఆల్ఫా) పేరుతో మరో కారును భారతదేశంలో లాంచ్ చేయనుంది. దీనిని సంస్థ 2027లో మన దేశంలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిని సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటారు. కాబట్టి.. ఈ కారు ధర రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ కారు కావడంతో.. రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుందని సమాచారం. కాగా రేంజ్, ఇతర వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

టయోటా ఎఫ్‌జే క్రూయిజర్

2028 చివరలో టయోటా కంపెనీ తన ఎఫ్‌జే క్రూయిజర్ కారును భారతదేశంలో లాంచ్ చేయనుంది. కంపెనీ కొన్ని వారాల క్రితమే.. గ్లోబల్ మార్కెట్లో దీనిని లాంచ్ చేసింది. ఇది టయోటా ల్యాండ్ క్రూయిజర్ లైనప్‌కు ఎంట్రీ లెవల్ మోడల్ అని తెలుస్తోంది. అంతే కాకుండా ఎఫ్‌జే క్రూయిజర్.. ఫార్చ్యూనర్, హైలక్స్, ఇన్నోవా క్రిస్టా వంటి వాటికి మద్దతు ఇచ్చే.. ఐఎంవీ బాడీ ఆన్ ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది.

జపాన్ మొబిలిటీ షో 2025 కార్యక్రమంలో కనిపించిన టయోటా ఎఫ్‌జే క్రూయిజర్ కారును కంపెనీ.. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు సమాచారం. దీని ధర రూ. 30 లక్షల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. ఈ కారు 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 163 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఇది హైబ్రిడ్ లేదా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సెటప్‌తో రానుంది. 4 వీల్ డ్రైవ్ ఎంపికను కూడా పొందనున్నట్లు సమాచారం. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం వెల్లడికావాల్సి ఉంది.

ఎగసిపడే యువ కెరటాలు.. ఆటల్లో బంగారు పతకాలు

మనం ఏదైనా సాధించాలి అంటే ముందుగా మనసులో ఒక దృఢ సంకల్పం అవసరం. ఆ తరువాత.. అందుకు తగిన కష్టం (శ్రమ), అనుకున్నది సాధించి తీరాలనే కసి, పట్టుదల అతి ముఖ్యమైనవి. వీటితో పాటు మనకు మనమే తీసుకునే బలమైన నిర్ణయాలు, ఆలోచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. అన్నింటికీ మించి చెప్పింది చెప్పినట్టు వినడం, అందుకు తగినట్టు ప్రణాళికబద్దంగా అమలుపరచడం, క్రమశిక్షణతో మెలగడం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇవన్నీ కలగలిసిన చిచ్చర పిడుగుల్లాంటి విద్యార్థులే ఎస్. సనా మరియు రిషిత్ కుమార్. విద్యార్థులే అయినా.. ఎంచుకున్న ఆట పట్ల వారికున్న అంకితభావమే.. ఈరోజు ఓ నలుగురికి ఆదర్శమైంది.

సనా, రిషిత్ మాటల్లో వారి గురించి..

”నా పేరు ఎస్. సనా. మాది చిత్తూరు జిల్లా. నాకు ఊహ తెలిసినప్పటినుండి కబడ్డీ అంటే ఇష్టం. కబడ్డీ అంటే అబ్బాయిలకే పరిమితమా అనుకుంటారు. ఈ కారణంగానే.. ఇప్పటికీ చాలా చోట్ల అమ్మాయి, అబ్బాయి అనే వ్యాత్యాసం చూపిస్తుంటారు. కానీ నాకు మాత్రం మా తల్లిదండ్రులు అటువంటి తారతమ్యాలు చూపించకుండా.. నేను కోరుకున్న దారిలో వెళ్ళడానికి అన్నీ విధాలుగా ప్రోత్సహిస్తున్నారు” అని చెప్పుకున్నారు.

”నా పేరు రిషిత్ కుమార్. మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు ప్రాంతం. నాన్న కూడా పిఈటీ మాస్టారుగా పని చేస్తూ ఉండటం వలన.. నేను ఆరవ తరగతి నుంచి కబడ్డీ ఆడుతున్నాను. ఓటమి గెలుపు అనేవి సహజమని రెండింటిని ఒకేలాగా తీసుకోవాలని మా నాన్న నాకు ఎప్పుడు చెబుతుంటారు, అథ్లెటిక్స్‌లో కూడా మెడల్స్ సాధించాను” అని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు వీరు ఆడిన, అందుకున్న బహుమతులు

సనా

  • రాష్ట్రస్థాయిలో.. సీబీఎస్ఈ క్లస్టర్స్ మొదటి స్థానంలో గెలిచి బంగారు పతకం సాధించింది (గద్వాల్-2025)
  • అసోసియేషన్ తరపున అండర్-17 జాతీయ స్థాయిలో రెండుసార్లు బ్రోంజ్ మెడల్ గెలిచింది (హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ -2024)
  • అండర్ -17  జాతీయ స్థాయిలో రెండుసార్లు పార్టిసిపేషన్ చేసింది
  • స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ -17 గోల్డ్ మెడల్, అండర్-14 లో సిల్వర్ మెడల్ గెలుపొందినది (చిట్వేల్, రాయచోటి- 2023, 2024).
  • కడప, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు లాంటి అనేక ప్రాంతాల్లో అసోసియేషన్స్ తరపున పోటీ చేసిన అన్నీ చోట్ల అనేక బహుమతులు, ప్రశంసలు కైవసం చేసుకునింది.

రిషిత్
కబడ్డీ ఆటలో

  • రాష్ట్ర స్థాయిలో సీబీఎస్ఈ క్లస్టర్స్ లో బంగారు పతకం. (కరీంనగర్)
  • జాతీయ స్థాయిలో వెండి పతకం (బీహార్).
  • రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. (కడప)

అథ్లెటిక్స్‌లో

  • రాష్ట్ర స్థాయిలో సీబీఎస్ఈ 600 మీటర్ల లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్ (నెల్లూరు)
  • జాతీయ స్థాయిలో లాంగ్ జంప్ 600 మీటర్ల పార్టిసిపేషన్ (వారణాసి)
  • జూనియర్ స్టేట్ మీట్‌లో ట్రయాతలిన్-సీ  బ్రోంజ్ మెడల్.
  • జిల్లా స్థాయిలో అనేక అసోసియేషన్స్ తరపున ఆడి బహుమతులు, ప్రశంసలు గెలుపొందారు.

కోచ్  & పాఠశాల యాజమాన్యం ప్రోత్సహం

ఆటల్లో రాణించడానికి తమ కబడ్డీ కోచ్ శంకర్ గురించి చెబుతూ.. ఎప్పుడైనా ఆటలో ఓడిపోయినా లేదా ఏదైనా నిరాశకు లోనైనా తమని వెన్ను తట్టి ప్రోత్సహిస్తారని, మేము ఆత్మవిశ్వాసంతో దృఢంగా ఉండటానికి ఆయన చెప్పే విలువైన మాటలే కారణం అని విద్యార్థులు చెప్పుకొచ్చారు. అతను కబడ్డీ కోచ్ అయినప్పటికీ కూడా మాకు అథ్లెటిక్స్‌లో ఒకింత పట్టు ఉండటంతో అందులో కూడా ఆడమని ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. ఆయన మాతో పాటు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే గ్రౌండ్‌లో ఉండటం అనేది మాకు ప్రేరణ ఇచ్చే విషయం అన్నారు.

కోచ్‌తో పాటు మేము చదువుతున్న వెరిటాస్ సైనిక్ స్కూల్ యాజమాన్యం కూడా సపోర్ట్ చేస్తోంది. పాఠశాలలో కబడ్డీ సాధన చేయడానికి మంచి మ్యాట్ అండ్ గ్రౌండ్ ఉండడము ఎంతో మేలు చేస్తోందని, బయట ప్రాంతాలకు వెళ్లి ఆడటానికి పర్మిషన్ ఇవ్వడం, వీటి కారణంగా చదువులో ఎక్కడ వెనకపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం.. ఆటల్లో ముందుకు సాగటానికి వెసలుబాటు కల్పిస్తోందని విద్యార్థులు చెప్పారు.

ప్రతిభ ఏ ఒకరి సొంతం కాదు. ఇష్టమైన రంగంలో ముందుకు పోతే.. తప్పకుండా సక్సెస్ సాధ్యమవుతుంది. యుక్త వయసములోనే అసాధారణ ప్రతిభ కనపరుస్తున్న సనా మరియు రిషిత్ లాంటి క్రీడాకారులను ప్రోత్సహించడం మన బాధ్యత. భవిష్యత్ లక్ష్య సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని.. మరిన్ని గొప్ప అవార్డులను సైతం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్.

పాత ఫ్రెండ్‌తో నేను.. చంద్రబాబు అంబాసిడర్ కారు గురించి తెలుసా?

దశాబ్దాల క్రితం భారతదేశంలో.. సంచలనం సృష్టించిన హిందుస్తాన్ అంబాసిడర్ గురించి చాలామంది వినే ఉంటారు. అప్పట్లో అంబాసిడర్ కారుకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే కాలక్రమంలో దీనికున్న ఆదరణ క్రమంగా తగ్గిపోవడంతో.. కంపెనీ దీని ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. అయినప్పటికీ.. ఇప్పటికి కూడా ఈ కార్లు రోడ్డుపై కనిపిస్తూనే ఉంటాయి. కొంతమంది ఈ కారును మధురమైన జ్ఞాపకంగా గుర్తుంచుకుంటారు. అలా జ్ఞాపకంగా ఉంచుకున్న వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు.

చంద్రబాబు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. నారా చంద్రబాబు నాయుడు సుమారు 30 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారును ఉపయోగించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో.. ఈ కారులోనే పర్యటనలు సాగించేవారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పుడు కార్లను మార్చేసింది. ప్రస్తుతం ఆయన.. తనకు కేటాయించిన కార్లలోనే ప్రయాణిస్తున్నారు. కానీ.. తాజాగా తన పాత అంబాసిడర్ కారుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అని ట్వీట్ చేశారు.

సీఎం చంద్రబాబు షేర్ చేసిన ఫోటోలలో.. తెలుపు రంగు అంబాసిడర్ కారును చూడవచ్చు. మొన్నటి వరకు హైదరాబాద్‌లో ఉన్న ఈ కారును మంగళగిరికి తీసుకొచ్చారు. అంతే కాకుండా ఈ కారులోనే చంద్రబాబు.. టీడీపీ కార్యాలయం చుట్టూ తిరిగారు. దీన్ని బట్టి చూస్తే.. తన పాత అంబాసిడర్ కారుపై ఆయనకు ఎంత మమకారం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఫొటోలో కనిపించే కారు బాగా పాతదైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం బహుశా దీనిని చాలా రోజులుగా ఉపయోగించలేదని స్పష్టమవుతోంది.

అంబాసిడర్ కారును కలిగిన ప్రముఖులు

కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా.. చాలామంది రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కూడా హిందూస్తాన్ అంబాసిడర్ కారును కలిగి ఉన్నారు. ఇందులో రజినీ కాంత్, మోహన్ లాల్, రాజ్ కపూర్ మొదలైనవారు ఉన్నారు. ఒకప్పుడు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజపేయి, మమతా బెనర్జీ మొదలైన రాజకీయ ప్రముఖులు ఉపయోగించారు. అయితే ఇప్పుడు కూడా కొన్ని ప్రభుత్వ శాఖలలో ఈ కార్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు అంబాసిడర్ అంటే.. ప్రభుత్వ అధికారుల వాహనంగా గుర్తింపు పొందింది. కానీ నేడు ఈ కారు స్థానంలో కొత్త కార్లు చేరాయని తెలుస్తోంది.

హిందుస్తాన్ అంబాసిడర్

1958లో మొదలైన హిందుస్తాన్ అంబాసిడర్ ప్రస్థానం.. 2014వరకు సాగింది. సుమారు ఐదు దశాబ్దాలు భారతదేశంలో గొప్ప అమ్మకాలను పొందిన ఈ కారు.. కాలక్రమంలో ప్రత్యర్థుల పోటీని తట్టుకోలేకపోయింది. కొత్త కార్లు మార్కెట్లో అడుగుపెట్టిన సమయంలో అంబాసిడర్ కారును కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా తగ్గింది. దీంతో కంపెనీ ఈ కారు ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. అయితే కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కారుకు కొత్త హంగులను ప్రవేశపెట్టినప్పటికీ.. ఆశించిన స్థాయిలో అమ్మకాలను సాధించలేకపోయింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది. కానీ అప్పట్లో అంబాసిడర్ కార్లను కొనుగోలు చేసిన చాలామంది.. ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. అప్పుడప్పుడు ఈ కార్లు ప్రజా రహాదారులపై కనిపిస్తూ ఉంటాయి కూడా.

మొదలైన బుకింగ్స్: హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ లాంచ్ ఎప్పుడంటే?

సెకండ్ జనరేషన్ వెన్యూ తరువాత.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పర్ఫామెన్స్ బేస్డ్ వెన్యూ ఎన్ లైన్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. కంపెనీ ఈ కారును నవంబర్ 04న ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనుంది. అంతకంటే ముందే.. సంస్థ ఈ కారు కోసం రూ. 25,000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. డెలివరీలు లాంచ్ తరువాత ప్రారంభమవుతాయి.

డిజైన్ ఎలా ఉందంటే?

కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ చూడటానికి కొంత సాధారణ కారు మాదిరిగా అనిపించినప్పటికీ.. డిజైన్ కొంత అప్డేట్ అయి ఉంటుంది. ప్రధాన అప్డేట్ ఏమిటంటే.. అక్కడక్కగా కనిపించే రెడ్ కలర్ యాక్సెంట్స్. ముందు, వెనుక, సైడ్ ప్రొఫైల్ దగ్గర కూడా రెడ్ కలర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. 17 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ రిమ్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, వింగ్ స్టైల్ స్పాయిలర్, డ్యూయెల్ టిప్ ఎగ్జాస్ట్ సిస్టం వంటివన్నీ ఉన్నాయి.

మల్టిపుల్ కలర్ ఆప్షన్స్

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఐదు రంగులలో లభిస్తుంది. అవి అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, డ్రాగన్ రెడ్, అబిస్ బ్లాక్, హాజెల్ బ్లూ కలర్స్. ఇవి కాకుండా కంపెనీ కారును బ్లాక్ రూఫ్‌తో.. మూడు డ్యూయెల్ టోన్ ఎంపికలతో అందిస్తుంది. ఐదు రంగులలో అందుబాటులో ఉండటం వల్ల.. ఎన్ లైన్ కారును ఎక్కువమంది ఇష్టపడే అవకాశం ఉందని భావిస్తున్నాము.

లేటెస్ట్ ఫీచర్స్

హ్యుందాయ్ కొత్త ఎన్ లైన్.. విశాలమైన క్యాబిన్ పొందుతుంది. మెటల్ పెడల్స్, ఎన్-బ్రాండెడ్ వివరాలతో కూడిన బ్లాక్ అపోల్స్ట్రే ఉపయోగించారు. కాగా ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ న్యావిగేషన్ డిస్‌ప్లే, 12.3 ఇంచెస్ డిజిటల్ గేజ్ క్లస్టర్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టం వంటివి ఉన్నాయి. వీటితో పాటు 20 వెహికల్ కంట్రోల్స్ ప్రభావితం చేసే.. ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సరౌండ్ వ్యూ మానిటరింగ్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటరింగ్, అరోమా డిఫ్యూజర్ వంటివి కూడా ఉన్నాయి.

సేఫ్టీ విషయానికి వస్తే.. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కారులో ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఏడీఏఎస్ లెవల్ 2 ఫీచర్ కూడా ఉన్నాయి. అంతే కాకుండా.. 70 కంటే ఎక్కువ లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్, 41 కంటే ఎక్కువ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

ఇంజిన్ గురించి & అంచనా ధర

కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కారులో 1.0 లీటర్ టర్బోచార్డ్ పెట్రోల్ డైరెక్షన్ ఇంజక్షన్ ఇంజిన్ నుంచి శక్తిని పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్, 172 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మొత్తం మీద ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.

కంపెనీ ఈ కారు ధరలను అధికారికంగా వెల్లడించలేదు. ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది. కాగా దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 14.75 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సమాచారం. ఈ ధర కేవలం అంచనా మాత్రమే. అధికారిక ధరలు లాంచ్ చేసేటప్పుడు వెల్లడవుతాయి.

బస్సు ఛార్జీలకు డబ్బులు లేవు.. అది మా పరిస్థితి!: లుంగీ మామ టీమ్

0

ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసిన కే-ర్యాంప్ సినిమాలో కిరణ్ అబ్బవరంతో కలిసి డాన్స్ చేసిన లుంగీ మామ (వెంకటరమణ) & వాళ్ల టీమ్ (ముని, నరేంద్ర) వీడియోలే కనిపిస్తున్నాయి. అంటే.. ఆ సినిమాకు ముందు కూడా వీళ్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దీనికి కారణం లుంగీ మామ డ్యాన్స్ వీడియోలు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలలో వైరల్ కావడమే.

వీడియో అప్లోడ్ చేస్తే చాలు.. కేవలం కొద్ది నిమిషాల్లోనే దాదాపు కొన్ని లక్షల మంది చూస్తారు. అంతగా పాపులర్ అయిపోయాయి. ఒక్కసారి వీడియో చూసామంటే కళ్ళు తిప్పుకోలేమన్నంతగా వశమైపోతారు వాళ్లు చేసే డ్యాన్సుకు. ఈ విధమైన పాపులారిటీ చూసే కే-ర్యాంప్ డైరెక్టర్ పిలిచి అవకాశం ఇచ్చారు. గ్రామాల్లో డ్యాన్స్ వేసుకునే స్థాయి నుంచి.. దర్శకుడిని ఆకట్టుకునేలా ఎదిగిన ఈ లుంగీ టీమ్ ప్రస్థానం గురించి కొన్ని ఆసక్తికర అంశాల విషయానికి వస్తే..

నెల్లూరు జిల్లా..

లుంగీ మామ టీముకు చెందిన.. వీళ్లందరు నెల్లూరు జిల్లా మారుమూల ప్రాంతానికి చెందినవారు. అందరూ కష్టం చేసుకుని బతికే మత్స్యకారుల కుటుంబాల నుంచి వచ్చిన వారే. అయితే వీరి జట్టులో ఎవరు కూడా ఆ వృత్తిలో లేరు. ఎందుకంటే సముద్రంలో ఇతర రాష్ట్రాల వాళ్ల ఆధిపథ్యం పెరిగిపోవడం. పక్కనే కలుషితమైన పరిశ్రమలు వచ్చి చేరడం. చేపలు పట్టడం, దానినే వ్యాపారంగా మలుచుకుని బతకడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పరిస్థితి.

ఈ పరిస్థితుల్లో టీమ్‌లో ఒకరు ఆటో నడపడం, ఇంకో ఇద్దరు స్కూల్లో డ్యాన్స్ నేర్పించడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఇలా చేసే పనులు వల్ల వారి ఆదాయం ఏ మాత్రం బాగోలేదట. అందరికి పెళ్లిళ్లు అవ్వడం, పిల్లలు ఉండటం, ఖర్చులు కూడా అదే రీతిలో ఉంటాయి గనుక పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి.

బస్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు

ఇంటర్వ్యూకి గానీ, ఏదైనా ఛాన్స్ వస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి రావడానికి బస్సు టికెట్ కొనడానికి కూడా చేతిలో డబ్బులు లేవు. అందుకోసం ఎక్కడో ఒకచోట అప్పు చేసిమరి రావాల్సిన దుస్థితి అని లుంగీ మామ బాధపడుతూ.. ఒకరకమైన నవ్వు నవ్వినప్పుడు అతన్ని చూస్తే ఎవరికైనా సరే నిజంగా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అంతటి బాధను కూడా దిగమింగి అందరినీ అలరించడం కోసం నవ్వుతూ వీడియోలు చేయడం చాలా గొప్ప విషయం.

పేరు వచ్చింది కానీ.. ప్రతిఫలం రాలేదు

కే-ర్యాంప్ సినిమాలో అవకాశం అయితే వచ్చింది. కానీ.. దానికి తగిన ప్రతిఫలం మాత్రం వారికి దక్కలేదంట. అందులో వాళ్ళు చేసిన డ్యాన్సుకు కొరియోగ్రఫి సైతం వాళ్లే చేయడం అనేది.. అభినందించదగ్గ విషయం. వాళ్ళు డాన్స్ చేసిన ఆ పాట థియేటర్ మొత్తం ఒక ఊపు ఊపుతోంది. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసినా మామూలు క్రేజ్ కాదు. అంతలా పర్ఫామెన్స్ చేసిన వాళ్లకు కనీసం డబ్బులు కూడా ఇవ్వకపోవడం బాధాకరమైన అంశమనే చెప్పాలి. ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉంటూ ఎన్నో కష్టాలు పడి వీడియోలు చేసి అందరు గుర్తించే విధంగా ఈ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఇటువంటి ప్రతిభ కలిగిన పేద కళాకారులకు ఎంత వీలైతే అంత ప్రోత్సహం అందించాలి.